27, జనవరి 2020, సోమవారం

సమస్య - 3263 (జారకళావతంసులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే"
(లేదా...)
"జారకళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్"
(చేపూరి శ్రీరామారావు గారికి ధన్యవాదాలతో...)

62 కామెంట్‌లు:

  1. బారులు తీరిన తరుణము
    కోరగ జనులంత కూడి కొసరిన వేళన్
    భారము తెలిసిన విజ్ఞులు
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      పద్యం బాగుంది. కాని అన్వయం కుదిరినట్టు లేదు. ఇక్కడ 'జారులు' అంటే మీ ఉద్దేశం?

      తొలగించండి
  2. శ్రీరామనవమి రోజున
    నారామమునందు పెద్దయరుగుల మీదన్
    శ్రీరాముని పెండ్లికి పూ
    జారులకున్ శిష్టులెల్ల స్వాగతమనిరే

    రిప్లయితొలగించండి

  3. నడిరేయి సరదా పూరణ:

    బోరును లేకయే తిరిగి ప్రొద్దున రేతిరి కార్డ్లు గీకుచున్
    తీరిక మీరగా సతులు తిండికి తోడుత మాలులందునన్
    కోరిక తీరగా కొనిన కుప్పల భూషలు హైద్రబాదు బం
    జారకళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. బంజార కళావతంసులా :) మరీ ఇంత దుష్ట మా :)



      జిలేబి

      తొలగించండి
    2. శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      ***
      జిలేబి గారూ,
      'బంజారా' శబ్దం అన్యదేశ్యం, నామవాచకం కనుక, 'సరదా' పూరణ అని వారే చెప్పుకొన్నారు కనుక ఆ సమాసాన్ని సాధువు గానే స్వీకరిద్దాం.

      తొలగించండి


  4. జారెను సర్రుమనుచు బా
    జారు లొకప్పుడకట కలుచపడి, ప్రభుతయే
    మారుచు, రాన్ మోడీ బా
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  5. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పోరుచు నెన్నికల్ మురిసి ప్రొద్దున రేతిరి నేతలెల్లరున్
    కారుకు, చేతికిమ్మనుచు, గారబు రీతిని తమ్మిగుర్తుకున్,
    కోరిక తీరగా మదిర, కుండల నీయగ; కండ్ల నీరులే
    జార;..కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్

    రిప్లయితొలగించండి


  6. పారగ దేశమందు విలువల్, మన నేతలు కొల్లకొట్టగా
    కోరి జనాళి యందల‌ము క్రొత్త దునీడుల చేయి చేర్చగా
    మారుచు నా ప్రభుత్వ మసమానముగా తడకట్టు వేయగా
    జారకళావతంసులకు, స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. కం.
    జారులు శ్రీకృష్ణాంశని
    మారుఁడివలె దిరుగుచుండ మామగ నెంచన్ !
    కోరిన కోర్కెలు దీర్చని
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      భావం కొంత అస్పష్టంగా ఉన్నది. 'అంశ+అని' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  8. గురువులకు ప్రణామములు
    అష్టవిధ నాయికల పద్యాలను పంపితె
    " ఎడ్రస్స్ తప్పు అని చేరటల్లేదు " మరి ఎలా పంపాలో తెలుపగలరు
    సెలవు . రాజేశ్వరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ashtanayika20@gmail.com
      మీరు పై చిరునామాకే పంపారా? స్పెల్లింగ్ సరిగానే టైప్ చేసారా? మరోసారి ప్రయత్నించండి. అప్పటికి సఫలం కాకుంటే నాకు పంపండి. వచ్చినవి వచ్చినట్లు వాళ్ళు నాకే పంపిస్తున్నారు.
      shankarkandi@gmail.com

      తొలగించండి
  9. (స్వర్గలోకంలో దేవేంద్రుని "సుధర్మ" సభా
    భవనానికి సంగీతకచేరి కోసం ఘంటసాల,
    భానుమతి రాగా శిష్టుల సంభ్రమం )
    మీరిన గానకౌముదిని
    మేలుగ స్వర్గమునందు పంచగా
    తీరుగ చేతులన్ గలిపి
    తీయనిపాటల ఘంటసాలయున్
    భారతిపుత్రి భానుమతి
    ప్రౌఢిమ నేగిన ; నుత్తరీయముల్
    జార ; కళావతంసులకు
    స్వాగతమిచ్చిరి శిష్టు లెల్లరున్ .
    (గానకౌముది - సంగీతమనే వెన్నెల ; శిష్టులు - సదాచారసంపన్నులు )

    రిప్లయితొలగించండి
  10. కం.
    జారులు కృష్ణుడు యొకటని
    చోరులవలె దిరుగుచుండ చోద్యము తోడన్ !
    కోరిన కోర్కెలు దీర్చని
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'కృష్ణుడు+ఒకటని' అన్నపుడు యడాగమం రాదు. "కృష్ణుం డొకటని" అనండి.

      తొలగించండి
  11. నారాయణ వ్రతమును కం
    జారమునందాచరించు సంకల్పముతో
    కోరి పిలువ జేరిన పూ
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే

    రిప్లయితొలగించండి
  12. వారలు గానకోవిదులు, వైభవయుక్తులు, విజ్ఞసత్తముల్
    వారిని బోలువారలిట వాస్తవ మియ్యది లేరటన్న న
    వ్వారు సభాస్థలంబునకు వచ్చిన వేళ వినమ్రభావముల్
    జార, కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్"

    రిప్లయితొలగించండి
  13. చోరులు పడి గుడి లోపల 
     నేరము చేయంగ పూన నిలచి,  నిలుపంగా  
    జారెడు  వారిని యా  పూ 
    జారులకున్ శిష్టులెల్ల స్వాగతమనిరే  

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణభంగం. "నిలిచి నిలుపగా" అనండి. 'వారిని+ఆ' అన్నపుడు యడాగమం రాదు. "వారని నా" అనండి.

      తొలగించండి
  14. మేరువులబోలు కవులను
    గారవమునబిరుదులిచ్చు కతమున పేర్మిన్
    కోరి యరుగు కైతలపూ
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. సారవదర్థసంఘటితశబ్దవిచిత్రసమీరితమ్ములౌఁ
      బ్రేరకకశంకరార్యసుకవీశ్వరదత్తలసత్సమస్యలన్
      బూరకభారతీపురషమూర్తిశిరోగ్రములందు పుష్పముల్
      జార, కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్.

      తొలగించండి
  16. సరిజేసితిని గురువర్యా!
    కం.
    జారులు కృష్ణుం డొకటని
    చోరులవలె దిరుగుచుండ చోద్యము తోడన్ !
    కోరిన కోర్కెలు దీర్చని
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే !!

    రిప్లయితొలగించండి
  17. నేరము లెన్నియొజేసియు
    పోరాటమ్మునగెలువగ బూరిగ గట్టన్
    నేరకపట్టము, గనరే
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే!!

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ

    ఆరని కామవాంఛనధమాధమజీవనశైలి మ్రగ్గుచున్
    ఘోరదురంతదుశ్చరితకూపనిపాతులునై చరించున...
    వ్వారలు రోగబాధఁ బరివర్తన చెందితిమంచు జేరగా
    జారకళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. గౌరుని గ్రహణమనుచు గుడి
    దారము మూయగ విడిచిన తదుపరి తెరవన్
    చేరిన దేవాలయ పూ
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే

    రిప్లయితొలగించండి
  20. ఆరయ రుద్రార్చన కై
    పేరిమి భక్తిగ బిలువగ విప్రులు రాగా
    వారల కయ్యెడ నా పూ
    జారులకున్ శిష్టు లెల్ల స్వాగత మనిరే

    రిప్లయితొలగించండి
  21. బారులు దీరిరి కోవెల
    దారుల వెంబడి బలువురు దర్శనమునకై
    తీరుగ సేవింపగ బూ
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే

    రిప్లయితొలగించండి
  22. మేరుసమానమైన పరమేశుని స్వర్ణరథోత్సవంబునన్
    బారులుదీరగా వివిధ వాద్యసమంచిత గాయనీమణుల్
    తీరుగ నాట్యకారిణులు తేరునులాగుచు తోషభాష్పముల్
    జార,కళావతంసులకు స్వాగతమిచ్చిరి శిష్టులెల్లరున్

    రిప్లయితొలగించండి
  23. ఆరఘురామభక్తులటనాగిరిదర్శనమందలేకప్రా
    కారముదాటి భక్తిమయగానముజేసిరితన్మయాత్ములై
    దారినొసంగగాజనులుదర్శనమబ్బగ వీనులన్ సుధల్
    జార కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  24. ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

    “జారులకున్ శిష్టులెల్ల స్వాగత మని రే”

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


    రాయల వారి ఆస్ధానములో అష్ట దిగ్గజములు చక్కటి కావ్యముల సృష్టి కర్తలు (బ్రహ్మలు) ఒక రోజు అల్లసాని వారికి గండ పెండేర సన్మానము రాయల వారు చేయ దలచినారు. ఆ సమయమున అల్లసాని వారు తోటి కవిబ్రహ్మ లతో సభలోకి మేళ తాళముల మధ్యవేద ఆశీస్సుల మధ్య అడుగు బెడతారు. సభలోనికి జ్ఞాన కులపు కంజారులు (కంజారుడు = బ్రహ్మ ) అడుగు బెట్ట శిష్ట్లులెల్లరు నమస్కరించి స్వాగతములు పలికినారు అను భావన


    నంది తిమ్మన కవి నాశికా కావ్యపు జలజాసనుడు గాదె సరస గతిని,
    పింగళి సూరనా విబుధుడు రాఘవ పాండవీయపు పద్మభవుడు గాదె,
    కాళహస్తీశ్వర ఘన శతక విరించి ధూర్జటి యే గాదె ధ్రువము గాను,
    రమ్యమౌ వర పాండురంగ మహాత్యము రామలింగ నలువ రచన గాదె,
    మనుచరిత్ర నలు మోమయ్య నా అల్లసాని కవివరుడు గాదె నిజముగాను,
    రాజ శేఖర చరిత్ర సృష్టి కర్త మాదయగారి మల్లనే తరచి చూడ,
    వసు చరిత్ర ఘన సారస గర్భు డా రామ రాజ భూషణ డబ్ధి రసన లోన ,
    రామాభ్యుదయ చతురానను డా రామ భద్రుడు గాదె భువనము నందు,
    మేళ తాళ రవముల్ మింటిని త్రాకన్ సభకు నడుగిడి నట్టి ప్రాజ్ఞ, జ్ఞాన,
    కులపు కంజారులకున్ శిష్టు లెల్ల స్వాగత మని రే కడు ఘనత తోడ,


    నెల్ల రు న్నమసంబుల నిడగ ,కృష్ణ
    రాయ లెదు రేగి పెద్ద నార్య కవిని గని ,
    కాళ్ళకు తొడిగె గాంగేయ గండ పెండె
    రమును వేధ ఘోషల మధ్య రమ్య గతిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరి చేసిన పద్యము

      ఈ నాటి శంకరాభరణము వారి సమస్య

      “జారులకున్ శిష్టులెల్ల స్వాగత మని రే”

      ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో


      రాయల వారి ఆస్ధానములో అష్ట దిగ్గజములు చక్కటి కావ్యముల సృష్టి కర్తలు (బ్రహ్మలు) ఒక రోజు అల్లసాని వారికి గండ పెండేర సన్మానము రాయల వారు చేయ దలచినారు. ఆ సమయమున అల్లసాని వారు తోటి కవిబ్రహ్మ లతో సభలోకి మేళ తాళముల మధ్యవేద ఆశీస్సుల మధ్య అడుగు బెడతారు. సభలోనికి జ్ఞాన కులపు కంజారులు (కంజారుడు = బ్రహ్మ ) అడుగు బెట్ట శిష్ట్లులెల్లరు నమస్కరించి స్వాగతములు పలికినారు అను భావన


      నంది తిమ్మన కవి నాసికా కావ్యపు
      జలజాసనుడు గాదె సరస గతిని

      పింగళి సూరన విబుధుడు రాఘవ
      పాండవీయపు పద్మభవుడు గాదె,

      కాళహస్తీశ్వర ఘన శతక విరించి
      ధూర్జటి యే గాదె ధ్రువము గాను,

      రమ్యమౌ వర పాండురంగ మహాత్యము
      రామలింగ నలువ రచన గాదె,

      మనుచరిత్ర నలు మోమయ్య నా అల్లసా
      ని కవివరుడు గాదె నిజముగాను,

      రాజ శేఖర చరిత్ర సరోజ యోని మా
      దయగారి మల్లనే తరచి చూడ

      వసు చరిత్ర ఘన సారస గర్భు డా రామ
      రాజ భూషణు డబ్ధి రసన లోన ,

      రామాభ్యుదయ చతురానను డా రామ
      భద్రుడు గాదె భువనము నందు

      మేళ తాళ రవముల్ మింటిని త్రాకన్ స
      భకు నడు గిడిన శిక్షకులు ప్రాజ్ఞ,

      కులపు కంజారులకున్ శిష్టు లెల్ల స్వా
      గత మని రే కడు ఘనత తోడ,


      నెల్లరు న్నమసంబుల నిడగ ,కృష్ణ
      రాయ లెదు రేగి పెద్ద నార్య కవిని గని ,
      కాళ్ళకు తొడిగె గాంగేయ గండ పెండె
      రమును వేధ ఘోషల మధ్య రమ్య గతిని



      (జలజాసనుడు, పద్మభవుడు, విరించి,నలువ,నలుమోమయ్య,సృష్టికర్త సారస గర్భుడు,చతురాననుడు, కంజారుడు = బ్రహ్మ) ధ్రువము = నిశ్చయము,అబ్ధిరసన,భువనము = భూమి,గాంగేయము = బంగారము)




      తొలగించండి
  25. పారాశ రాది సన్ముని
    వారము స్తుతియించ రాజ పర్వం బెల్లన్
    ఘోర జన దమను లీ దను
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే


    వారని నిత్య దేశ పరిపాలక వర్గ విధాయ కోత్క రా
    ధార సమేత చిత్తమునఁ దత్పరులై సతముం జరించెడిన్
    ధీర పరాక్రమ ప్రబల ధీయుత చారుత రాప్రమత్తపుం
    జార కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్

    [అప్రమత్తము + చార కళావతంసులకు = అప్రమత్తపుం జార కళావతంసులకు]

    రిప్లయితొలగించండి
  26. అందరికీ శుభోదయం 🙏🙏

    అందరికీ నమస్సులు 🙏

    *నా పూరణ*

    *కం||*

    చేరగ పూజకు జనులిట
    బారులు తీరగ భజనకు వారింపకనే
    కూరిమి తో వచ్చిన పూ
    *"జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే"*


    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏🌸🙏🌸🙏

    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే"
    "జారకళావతంసులకు స్వాగత మిచ్చిరి
    శిష్టులెల్లరున్"

    సందర్భము:
    వైదేహస్య పురే వివాహ సమయే
    కల్యాణ వేద్యంతరే
    సామోదే విమలేందు రత్నఖచితే
    పీఠే వసంతౌ శుభే..
    (శ్రీ రామ కర్ణామృతము 32)
    విజ్ఞులంటే విశేషంగా తెలిసినవారు. అంటే సీతా రాముల ప్రవరలు మొదలైన వన్నీ తెలిసివుండాలి. చేయించే విధానం బాగా తెలిసివుండాలి. ఆవిధంగా పూజారులు విజ్ఞులై వుంటే సీతారామ కళ్యాణం చేసేవారికీ చేయించే వారికీ ఉభయ తారకం.
    అలాంటి పూజారులు రాగానే గుడిలో అప్పటికే చేరి నిరీక్షిస్తున్న పురప్రముఖులైన శిష్టు లందరూ సాదరంగా స్వాగతం పలికారు. ముత్తైదువ లిలా ఆలపించారు...
    చూచు వారలకు చూడ ముచ్చ టట!
    పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట!
    భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట!
    సురలును మునులును చూడవచ్చిరట!
    కల్యాణము చూతము రారండీ..
    శ్రీ సీతారాముల
    కల్యాణము చూతము రారండీ..
    సీతారామ కళ్యాణాన్ని దర్శించడానికి సంగీత విద్వాంసులైన నారదాది మునులూ విచ్చేసిరి. వారి గీత వాద్యాలకు మైమరచిపోయి ఆనంద బాష్పాలు జారగా స్వాగతించినారు వచ్చిన వారంతా.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *సీతారామ కళ్యాణము*

    *శ్రీ* రామ నవమినన్ సీ
    తా రాముల పెండ్లిఁ జేసి తరియింప గుడిన్
    జేరిన విజ్ఞులయిన పూ
    జారులకున్ శిష్టు లెల్ల స్వాగత మనిరే! 1

    పే రగు చంద్రకాంతమణి
    పీఠికలందున సీత రాముడున్
    జేర వివాహ వేళ దరి
    సింపగ వచ్చిరి నారదాదులున్..
    వీరి సుగీత వాద్యములు
    వీనుల విందయి మోద బాష్పముల్
    జార.. కళావతంసులకు
    స్వాగత మిచ్చిరి శిష్టు లెల్లరున్ 2

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    27.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  28. ధీరులుగుణమునవారలు
    వీరులు సమరాంగణమున విశ్వవిజేతల్
    కోరిభువినివెలసిన కం
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే

    రిప్లయితొలగించండి
  29. ఉ:

    చోర శిఖామణుల్ దిరిగి చోరిన దెచ్చిన డబ్బుదస్కముల్
    నేరము దెల్వనట్టులుగ నేరుగ నేర్పడు జేయ కష్టమై
    భారము వేయనెంచి తమ బందుగు వర్గము సాయ మందగన్
    జార కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టు లెల్లరున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. ఆరామపూజసేతకు
    శ్రీరంగపుటర్చకులనుజీరన్ వారల్
    చీరినతడవుజనగబూ
    జారులకున్ శిష్టులెల్లస్వాగతమనిరే

    రిప్లయితొలగించండి
  31. కారణజన్ములంచుకలికాలములోమహనీయులంచు నా
    జారకళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్
    వారలనైజమేమెరుగువారలుకానికతంబునన్ భళా
    జారులు చోరులేయిపుడుచాలనుదాత్తులుగాచరించెడిన్

    రిప్లయితొలగించండి
  32. కందం
    కందం
    ఆ రావణు దునుమాడిన
    శ్రీరాముఁడయోధ్యఁ జేర సీతాపతిగన్
    వారికి స్వాగతమిడఁ బూ
    జారులకున్ శిష్టులెల్ల స్వాగతమనిరే

    (పూర్ణకుంభముతో స్వాగతము పలుకు నిమిత్తం)

    రిప్లయితొలగించండి
  33. మిత్రులందఱకు నమస్సులు!

    [శివపార్వతుల కళ్యాణమును కన్నులారఁ దిలకించిన యొక పిల్లి (మార్జారి), తన మగని(మార్జారుని)తో నా వివాహ విశేషముం గూర్చి ముచ్చటించు సందర్భము]

    "ఆరని బాధతోడ హరుఁ డా హిమవంతముపైఁ దపస్సునన్
    దూర; హిమాద్రినేత యుమఁ ద్రోలఁ బరీష్టికి; నింద్రు పంపునన్
    మారుఁడు పూలబాణమున మన్నికఁ గొట్ట; శివుండు బుగ్గిగన్
    మాఱుపఁ; బార్వతీ తపము మాన్యుల పెండ్లి యొనర్ప; గౌరి, మా

    ర్జార! కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టు లెల్లరున్!"

    [పరీష్టి=సేవ, కళావతంసుడు=(చంద్ర)కళను అవతంసముగా (శిరోభూషణముగా) గల శివుడు;]

    రిప్లయితొలగించండి
  34. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  35. భారతదేశ జానపద వాఙ్మయ గొప్పదనమ్ము చాటగన్
    వారలు నిశ్చయించి తగు పాటవమున్న యభిజ్ఞ వర్గమున్
    బేరిమి బిల్వఁ జేరిరట విజ్ఞులు కొందరు, వచ్చినట్టి బం
    జార కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్

    రిప్లయితొలగించండి
  36. కం.
    కూరయు యన్నము లేకన్
    వారుణి దిశకేగి తాత వరలుట చేతన్ !
    గౌరీ, శ్రీపతి, జన 'గో
    జారు'లకున్ శిష్టులెల్ల స్వాగత మనిరే !!

    రిప్లయితొలగించండి
  37. ఏరునునీయరెన్నడునునెంతటివారికినైనమన్ననన్
    జారకళావతంసులకు,స్వాగతమిచ్చిరిశిష్టులెల్లరున్
    వీరజవానుధైర్యమునుబెక్కురుజూడగసంతసంబుతో
    బౌరజనంబులెప్పుడునుబూర్వపుగౌరవమిత్తురేసుమా

    రిప్లయితొలగించండి


  38. కోరిన వరముల నిచ్చెడు
    నారాయణునకు సతతమునైవేద్యంబున్
    తీరుగ నొసండు గుడి పూ
    జారులకున్ శిష్టులెల్ల స్వాగత రేమని

    రిప్లయితొలగించండి
  39. మారపిత నంఘ్రియుగళము
    కోరి భజించగ నిరతము కూరిమి తోడన్
    చేరెడు నిస్స్వార్థపు పూ
    జారులకున్ శిష్టులెల్ల స్వాగతమనిరే

    రిప్లయితొలగించండి
  40. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "జార కళావతంసులకు స్వాగత మిచ్చిరి
    శిష్టు లెల్లరున్"

    సందర్భము: లలిత కళ లందరినీ వరించవు. ఓపిక పట్టితే అవి మనిషిని యోగిగా తీర్చిదిద్దుతాయి. లేకుంటే భోగిగాను చివరికి రోగిగాను మార్చిపారవేస్తాయి. పతనావస్థకు దారి తీస్తాయి.
    కళాకారునికి ఆనందాన్వేషణ ఎక్కువ. ఇంద్రియాలను జయించకపోవడంవల్ల అతణ్ణి మద్యపానం మగువల వ్యామోహం మొదలైన వన్నీ ఆనందప్రదంగానే భ్రమింపజేసి ఆకట్టుకొని తుదకు వ్యసనాలై సంక్రమించే అవకాశముంది. అవి ఏమరుపాటుగా వుంటే అధః పతనానికే దారి తీస్తాయి. అతి జాగ్రత్తగా వాటినుండి విడివడి శాశ్వతానంద మార్గంలో సాగిపోవలసి వుంటుంది.
    రాముడనే పేరు గలిగిన కళాకారు డొకడు కాముకుడై పూర్తిగా అతివల వలలలోనే పడిపోయి కాలక్షేపం చేస్తుండగా వాని బంధువైన ఒక శ్రేయోభిలాషి యిలా మందలిస్తున్నాడు.
    "కళ అంటే ఎవరికైనా ఇష్టమే! ఐనా గుణం లేని కళాకారుణ్ణి అసహ్యించుకుంటారు.
    ఇప్పుడు కళతోబాటు శీలం కూడా వున్న వాళ్ళను మాత్రమే శిష్టులు గొప్పగా స్వాగతించడానికి పిలిచినారు. (నీ కందులో స్థానం వుండకపోవచ్చు.)"
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *కళ..శీలము*

    "ఆరయ రాము పేరు గల
    యయ్యవె! అందరు మెచ్చు సత్కళా
    కారుడవే! అగాధ మది
    కామము.. కూరుకుపోదువే!.. ధరన్
    జీరిరి చూడవే! కళయు,
    శీలముఁ గల్గిన వారికే.. నటీ
    జార! కళావతంసులకు
    స్వాగత మిచ్చిరి శిష్టు లెల్లరున్"

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    27.01.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి

  41. ఉత్పలమాల
    పేరిమి రాజధానులుగ వేడుక నెంచఁగ ముప్పురమ్ములన్
    పారని వ్యూహమెంచ ప్రతిపక్షము శాసన మండలిన్, సదా
    చారమె గాదటంచు! కొనసాగుట రద్దన ముఖ్యమంత్రి! !చే
    జార, కళావతంసులకు స్వాగత మిచ్చిరి శిష్టులెల్లరున్

    రిప్లయితొలగించండి