6, మార్చి 2020, శుక్రవారం

సమస్య - 3301 (ధనధాన్యము లెన్ని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"
(లేదా...)
"ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్"

156 కామెంట్‌లు:


 1. నడిరేయి సరదా పూరణ:

  పనికిన్ మాలిన చేష్టలన్ విడువకే ప్రారబ్ధ కర్మంబునన్
  వినకే వైద్యుల మాటలన్ విరివిగా పీల్చంగ బీడీలనున్
  తినగా నాకిట పండ్లు పోవగనయో తీర్థమ్ములన్ గ్రోలగా
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్

  రిప్లయితొలగించు
 2. తనకెంత సంపదున్నను
  తనుజులు లేనట్టి జన్మతరియించుటెలా?
  మనమున కశాంతి గొలిపెడి
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే.

  రిప్లయితొలగించు

 3. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  2019 Lok Sabha Elections:
  (దిగ్విజయ సింగ్ ఉవాచ)

  "తనివిన్ తీరని రీతినిన్ మురియుచున్ తండోప తండాలుగా
  కొనగా కాంగ్రెసు నేతలే ప్రజలనున్ కొండాడుచున్ రాహులున్
  పనికిన్ మాలిన వోటరుల్ వెధవలై పండించగన్ భాజపాన్
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్"

  రిప్లయితొలగించు


 4. అనుమానమేల! తప్పక
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే
  మనుజులకట పేర్మియు లే
  క నిమేయము లేక బతుక గాను జిలేబీ


  జిలేబి

  రిప్లయితొలగించు


 5. అనుమానమ్మదె లేదు జీవితములో నైమేయమున్ పేర్మి యిం
  కిన నిక్కమ్ముగ చెప్ప వచ్చు నరుడా కేండ్రింప నాణ్యంబికన్
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్
  కనరాదా నెఱి, మానుషాదులవలెన్ కార్కశ్యమే నెక్కొనున్!  జిలేబి  రిప్లయితొలగించు
 6. అనువగు నాకలి నిద్రయు
  ననుకూలవతియగుభార్య యాత్మజ సఖులున్
  తనకిల లేని మనుజునకు
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"

  రిప్లయితొలగించు
 7. కందం
  తిననీయదు మధుమేహము
  కునుకుండదు నడుము నొప్పి కూర్చఁగ చాపన్
  కనిపించదు వినిపించదు
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

  మత్తేభవిక్రీడితము
  అణుమాత్రంబును తీపి తిన్న మధుమేహమ్మున్ బ్రకోపించఁగన్
  గునుకే లేదొకొ వెన్ను నొప్పి పరుపున్ గూడంగ కాదన్ననే
  కనువిందుల్ వినువిందులున్ గరువునై గాఢాంధకారమ్ముతో
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్

  రిప్లయితొలగించు
 8. మునుపటి యెన్నికల పిదప
  ఘనమగునట్టి పదవులను కలిగియు కూడన్
  మన మాట నెగ్గని యపుడు
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే

  రిప్లయితొలగించు

 9. నా పూరణ. కం!!
  ** *** *****

  వినరా సోదర నుడివెద!

  తనయందున పరుల సేవ,దానగుణమ్మే

  యణుమాత్రము లేకున్నను

  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷  రిప్లయితొలగించు


 10. మునిమాణిక్యంబగునా
  ధనధాన్యము లెన్ని యున్న? దారిద్ర్యమ్మే
  ను నరులకు దక్కును తుదకు
  జనులకు చేకూర్చక వలజా ! మేలు సుమీ


  జిలేబి

  రిప్లయితొలగించు
 11. (నేటి భారతంలో అధికసంతతిని గన్న
  కుటుంబరావు కుటుంబినితో )
  అనిరే పెద్దలు సంతసం బొసగగా
  నబ్బాయి యమ్మాయి చా
  లని ; యా మాటల లెక్కసేయ ; మతిమా
  యల్ గ్రమ్మి పెన్మందనే
  కనినామే ? యిక వీరలందరకు నో
  కాంతా ! స్వదేశమ్మునన్
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహా
  దారిద్ర్యమే దిక్కగున్ .
  (అతిమాయల్ -అమితమైన మాయలు ;
  పెన్మంద - పెద్ద సమూహం )

  రిప్లయితొలగించు


 12. జనలకొదవును జిలేబీ
  ధనధాన్యము లెన్ని యున్న; దారిద్ర్యమ్మే
  మనుజులకు దూరమగనిక
  మనుగడ వైవిధ్యమగు సుమా నిజమిదియే


  జిలేబి

  రిప్లయితొలగించు
 13. తినిన పెరుగు మధుమేహమ్ము,

  తినకున్మ పెరుగును గద క్షయ, దినచర్య లకై

  తనువుకు సూదుల మందులు,

  ధన ధాన్యము లెన్ని యున్మ దారి ద్ర్యమ్మే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి, రెండవ పాదాలలో గణభంగం. "మధుమేహము । తినకున్న పెరుగు గద క్షయ..." అనండి.

   తొలగించు
 14. మనుజా! "దీపము వెల్గుచుండగనె నీమంబొప్ప గేహంబునున్
  విను, దిద్దందగు" కాదటన్న నిడుముల్ వేవేలు నీవీయెడన్
  ఘనపుణ్యంబులు గూర్చవేని పరలోకంబందు నిక్కమ్ముగా
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్.

  రిప్లయితొలగించు
 15. కనగా దారుణమియ్యది
  మనరైతులకఠినదీక్షమనసుకుశిక్షే
  వినకుంటిరి తమగోడులు
  ధనధాన్యములెన్నియున్న దారిద్ర్యమ్మే
  ***********************
  రావెలపురుషోత్తమరావు

  రిప్లయితొలగించు


 16. మనుజులు చూపక మనుజుల
  కు నెమ్మిని దురాశ తోడు కూటమిగా చే
  ర్చిన పనికిరాని భూములు,
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించు


 17. మన ముత్తాతలు తాతలు
  మనకనువుగ వలయు ధర్మ మార్గమ్మును నె
  మ్మిని నేర్పక చేర్చగనా
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించు

 18. నా పూరణ.
  ** *** *****

  వినరా సోదర సత్యమున్ దెలిపెదన్ విశ్వాంతరాళమ్మునన్

  దిన నాహారము లేని దీనజనులన్ దృష్టించుచున్... వారి వే

  దననే గాంచి... మనంబు రాదనిన దా
  దానమ్మునే సల్పగన్

  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్

  🌱 ఆకుల శాంతి భూషణ్ 🌱
  🌷 వనపర్తి 🌷  రిప్లయితొలగించు


 19. తినుటకు తిండియు ధరియిం
  పను సేలయు సిరసుపైని వాసమ్మదె చా
  లును దానిపైన‌ నొఱపని
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించు


 20. అనఘా! ధర్మార్థము వల
  యును మనుజులకు తిరము! సిరియూపిరి గా చే
  ర్చిన జనులధర్మముగ నా
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించు
 21. కనగా భావ దరిద్రులు
  వినయముతో మెలగ లేరు వివరింంపంగా
  మనమేగా నిజమౌ సిరి
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే !

  రిప్లయితొలగించు
 22. మనమున మానవతా భా
  వనలేకయె మసలుచుండు వాడొక నరుడా?
  కనగా రక్కసుడే సుమి!
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే !

  రిప్లయితొలగించు
 23. కం.
  తనకిష్టంబగు వస్తువు
  కొనకున్నను,గష్టమందు కూరిమిగల వా
  రిని రక్షింపని మనిషికి
  ధనధాన్యములెన్ని యున్న దారిద్ర్యమ్మే!

  రిప్లయితొలగించు


 24. తినుటకు రోగాలడ్డగ
  మనుజులకిక చేర్చినట్టి మాన్యమ్ములు భూ
  షణములు, గృహమ్ములకటా
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించు
 25. తనువులు శాశ్వత మనుకొని
  జనహిత కార్యములు మాని సంపాదనయే
  తన లక్ష్యంబై మెలగ గ
  ధన ధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే !

  రిప్లయితొలగించు
 26. మనసది కుచ్ఛిత మగుచును
  ధనహీనుల బాధగనడు దానమ్మిడడే
  అనుభోగింపడు, వానికి
  ధనధాన్యము లెన్నియున్న దారిద్ర్యమ్మే.

  రిప్లయితొలగించు


 27. పనిలేని విదురులనెదరు
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!
  వినకు సుమీ పిచ్చి పలుకు
  లను లౌక్యంబెరుగ లేరిలని వారలె పో!  నారదా!
  బస్ జిలేబి బస్ :)

  జిలేబి

  రిప్లయితొలగించు


 28. డమాలు మార్కెట్టాయె :)


  అనవరతము బాజారిక
  తన పట్టు విడువక క్రుంగ తరుణి జిలేబీ
  మణగి పలుకలేని ధరని,
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మార్కెట్ పడినా మీకేం లోటులేదుగా! ఒంటినిండా బంగారమే. Safe haven asset దండిగా దాచుకున్నారుగా (as per profile pic☺️)

   తొలగించు


  2. కనుకొలికి మగడు చూడక
   ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!
   మునకలు వేయంగ నగలు
   తనువంతయు పద్మ! నీదు తరుణావస్థన్!   జిలేబి

   తొలగించు
  3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 29. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"

  సందర్భము:
  తస్య త్వేవం ప్రభావస్య
  ధర్మజ్ఞస్య మహాత్మనః
  సుతార్థం తప్యమానస్య
  నాసిద్వంశకరః సుతః
  బా.కాం. 8-1
  ధర్మజ్ఞుడైన మహాత్ముడైన అటువంటి ప్రభావం కలిగిన దశరథ మహారాజుకు పుత్రులకై పరితపిస్తున్నా వంశాన్ని నిలిపే సుతుడు కలుగనే లేదు.
  పరిచయస్థు లగుపిస్తే అన్నిటికంటె ముందుగా "ఎంతమంది పిల్లలు?" అనే అడుగుతారు గాని "ఎన్ని కోట్లు సంపాదించినారు?" అని అడుగరు కదా! అందువల్ల నిజమైన సంపద అంటే సంతానమే!..
  అని భావించిన దశరథుడు ఎంత ఐశ్వర్య మున్నప్పటికీ తృప్తి చెందలేదు. ఏకాంతంలో వశిష్ఠుని దర్శించి ఈ విధంగా తన మనస్సులోని చింతను చెప్పుకున్నాడు.
  (నరులకు నిజమగు సంపద.. అనే 22.2.20 నాటి నా పద్యంలోనూ ఇదే భావం..)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *పుత్రైశ్వర్యము*

  తనుజులె నిజమగు సంపద
  లని పెద్దలు వలుక విన్న యప్పుడు నాలో
  న నెదో కలుక్కు మను గద!
  ధన ధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే! 1

  ఇనవంశము నా పిమ్మట
  కొనసాగక యాగు నేమొ! కుందుటయేనా!
  తనుజైశ్వర్యము లేదా!
  ధన ధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే! 2

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  6.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 30. అనువుగ చిన్మయ రూపుని
  తన మనమున నిలుపు కొన్న ధన్యుండౌగా
  యనయము స్మరణయె జేయక
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే !

  రిప్లయితొలగించు
 31. మైలవరపు వారి పూరణ

  శంకరాభరణం.. సమస్యాపూరణం.

  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్!

  దినభత్యమ్మును గోరి కష్టపడి సాధింపన్ ధనమ్మింత.,దా...
  నిని వెచ్చించుచు కార్మికుండు ధరలో నిత్యమ్ము హాయింగొనున్!
  జనతాధీశుడెయౌను గాక మదిలో సంతృప్తి లేకున్నచో
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు


 32. పద్మార్పిత మీమాంస :)


  మన కలయిక సుగమము కా
  క నా సఖుడ నీవు చేర్చగా "పద్మా! నీ
  కని" నీ ప్రేమ రహితమగు
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  http://padma4245.blogspot.com/2020/03/blog-post.html  జిలేబి

  రిప్లయితొలగించు
 33. ఘనమౌ సంపదలబ్బెనంచు సఖుడా!గర్వంబు జీరాడగన్
  తనువున్ బట్టెను రక్తపోటు పగతో దండించె వే చక్కెరల్
  తినగా గంజియె నాకు దక్కెనిక నా దీనత్వమున్ జెప్పగన్
  ధనదాన్యంబులు పెక్కుగల్గియు మహా దారిద్ర్యమే దిక్కగన్

  రిప్లయితొలగించు


 34. అనుకూలవతియు గాని స
  తి, నమ్మకము లేక దుర్మతియగు పతియు జీ
  వన నౌకని సాగింపగ
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  శతకంబాడుదామా :)


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   శతకమైన, ద్విశతి అయినా మీ 'వరూధిని'తో ఆడుకోండి. ఇక్కడ ఆడుకున్నా అభ్యంతరం లేదు. కాని అన్నీ చూసే ఓపిక నాకు లేదు...
   నారదా! ఎక్కడున్నావు తండ్రీ?

   తొలగించు
 35. తనయుల నూర్గురబడసియు
  ఘనమగు కురురాజపదవి గల్గినగానిన్
  కనులకు వీక్షణలేమిని
  ధనధాన్యము లెన్నియున్న దారిద్రమ్మే!

  రిప్లయితొలగించు
 36. తన నడతవలనఁ బల్కుల
  నునుపు వలన ధర్మనిష్ఠనుఁజరించుటనున్
  జనసమ్మానముఁ బొడయక
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

  రిప్లయితొలగించు


 37. కనవచ్చు పతిని వత్సర
  మునకొక పది దినములే! సముద్రము కడచం
  గను సౌదిని సద్యోగము!
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించు


 38. వినుడీ నిక్కము చెప్పెద
  ననుమానములేదు ! పగగొన నిదుర రాదం
  డి! నలతలు నలతలె సుమీ
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించు
 39. కనివిని యెఱుఁగని రీతిని
  కనిపెంచిన వారిపైన కరుణయుఁ బ్రేమల్
  మనమున లేక భవనములు,
  "ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"

  రిప్లయితొలగించు
 40. అందరికీ నమస్సులు 🙏🌹

  *"ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"*

  *|కం|*

  కని పెంచిన పుత్రులెదుట
  కనిపించక దూరమగుచు కాదని బోవన్
  కనకపు సింహా సనములు
  *"ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"*

  *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
  🙏🌷🙏🌷🙏

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నా పూరణ 🙏🌹🌹

   *|కం|*

   మనలను నమ్మిన వారికి
   ధన సంపాదన కొరకని తప్పులు జేయన్
   మనసుకు శాంతిని యొసగని
   *"ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏

   తొలగించు
  2. మరో పూరణ 🌹🌹🌹

   *|కం |*

   అనునిత్యము మోసములను
   ఘనముగ చేయుచు పదుగురి కష్టము దోచన్
   మనమున భీతిని గొలిపిన
   *"ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏🌷🙏🌷🙏

   తొలగించు
  3. పూరణ 🙏 🌷🌹🌷🌹

   *|కం |*

   మనువుకు వయస్సు దాటెను
   తనువును రోగములు జేరె ధనమిక నేలా
   ఘనముగ లేని బ్రతుకునకు
   *"ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"*

   *కళ్యాణ్ చక్రవర్తి, చక్రవర్తి*
   🙏🌸🙏🌸🙏

   తొలగించు
  4. మరో పూరణ 🌹🌹🌹🌹🌹

   *|కం|*

   మనసున చేసిన పాపము
   ఘనమగు రీతిన దహించె ఖర్మల ఫలమే
   కనుగొన నిజమిది వినుమా
   *"ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"*

   *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
   🙏

   తొలగించు
  5. మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
  6. ఆహా, ధన్యోస్మి ఆర్యా ..🙏🙏

   శతాధిక నమస్సులు 🙏🙇

   తొలగించు
 41. తనువును రుజ పీడింపగ
  తిన కూడదు కోరుకొన్న తిండిని సతమున్
  ఘన నిగ్రహము న తనకున్
  ధన ధాన్యము లెన్ని యున్న దారిద్య్ర మ్మే

  రిప్లయితొలగించు
 42. గొనిపోరెవ్వరువెంటనెద్దియును లోకుల్దాము లోభాత్ములై
  తినకన్ద్రావక వస్తుసంచయము సాధింపంగనే కాలమున్
  వినియోగించుచు సత్పథాచరణము న్వీడంగ బోవారికిన్
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్"

  రిప్లయితొలగించు
 43. కనకపు రాసులు గల్గిన
  మణులును హారమ్ములెన్ని మధురిమ లిడినన్
  మనమున దంభము వీడక
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే.

  రిప్లయితొలగించు 44. మన చీనీయుల దుస్థితి
  యునికిని కదలించుచుండె యుద్ధము వలె పో
  దునుమాడె కరోనాయే
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించు


 45. ప్రభువులె మారగ వెలతలు


  తనఖా పెట్టిరి భూముల
  మనదే అమరావతియని; మారగ ప్రభువుల్
  మనుగడకేముప్పాయెను!
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!


  జిలేబి

  రిప్లయితొలగించు


 46. పణమున్నదయ జొమేటో
  యు నగరమున కలదు పిలువ ఉప్మా దోసెల్
  మనచేతికివచ్చును ధన
  ధన! ధాన్యము లెన్ని యున్న, దారిద్ర్యమ్మే?


  జిలేబి

  రిప్లయితొలగించు

 47. ఓ మగడా పో వెంఠనే బాజారునకు :)

  కొనుమయ్యరొ వడ్డాణము
  లను కొనుమా వేయిపేటల లలంతికలన్
  కొన బేజారేల మగడ!
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే?  జిలేబి


  రిప్లయితొలగించు
 48. గణనంబేమియు లేని యాస్తులు, సదా కార్లందు జీవమ్ము, య
  వ్వనమే పొంగు విహారయాత్రలు, మహాప్రాశస్త్యమున్, రాశులై
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్
  జనులంతా యుపకారమొందునటులే సౌశీల్యమే లేనిచో౹౹

  రిప్లయితొలగించు
 49. జన హితమును మది దలపక
  తన స్వార్ధమె కోరుకొనుచు దాచిన గానిన్
  మనసుకు శాంతము నిడదది
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే

  రిప్లయితొలగించు
 50. అనుభోగింపక పేదవారికిని సాహాయమ్ము నే జేయకన్
  ధనమున్ బాతరలోన దాచి కడు మోదమ్మందెడిన్ లోభికిన్
  ఘనమౌసంపద లెన్నియున్న రసమున్ గారుణ్యమే లేనిచో
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్

  రిప్లయితొలగించు
 51. వినుమురయీవాక్యమ్మును
  వినినంతనెవేగపడకవిషయముగనుమా
  శనిదానెత్తిననుండిన
  ధనధాన్యములెన్నియున్నదారిద్య్రమ్మే

  రిప్లయితొలగించు
 52. జన హితమును మది దలపక
  జన నేతను నేనననుచు జనులను దోచున్
  జనులాతని దెగనాడగ
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే

  రిప్లయితొలగించు
 53. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  "ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహా
  దారిద్ర్యమే దిక్కగున్"

  సందర్భము:
  రజసస్తు ఫలం దుఃఖం.. అన్నారు. రజోగుణానికి ఫలితం దుఃఖ మని అర్థం. నన్ను మించిన వారు లే రని నా మాటే అందరూ వినా లని, నేను చేసేదే సరియైన దని, నా కెవరూ చెప్పేవా రుండకూడ దని అనుకునే గుణం రజోగుణం. దానికి ప్రతీక రావణుడు.
  తిండి, నిద్ర రెండే సుఖప్రదా లనీ వాటికోసమే జీవిత మని వెంపర్లాడడం దేశం, ధర్మం, దైవం ఇవన్నీ తీరిపార కూర్చున్న వారి మాట లని భావించడం తమోగుణం. ఇది బలవత్తరమైన మోహానికి కారణం. కుంభకర్ణుడు దీనికి ప్రతీక.
  దేవుడు, ధర్మం, న్యాయం మొదలైన వాటికి ప్రాధాన్య మిచ్చి తన పొరపాట్లను గుర్తించి అవసరమైతే సవరించుకుంటూ ముందడుగు వేసే లక్షణం సత్వగుణం. దీనికి ప్రతీక విభీషణుడు.
  సత్త్వ గుణానికే అంతిమ విజయం, శాశ్వత సుఖం అని విజ్ఞుల ప్రతిపాదన. దైవానుగ్రహానికి దగ్గరగా దైవ రక్షణలో సాగే జీవిత మిట్టిది.
  విభీషణుడు రావణునికి హితోపదేశం చేశాడు. అతని క్షేమం కోరాడు. అతడు వినే స్థితిలో లే డన్నది తేలిపోయింది. అప్పుడు విభీషణుడు లంకలోని వా రంతా వీరి అడుగుజాడల్లో నడిచే వారే కాబట్టి ధనధాన్య సమృద్ధితో స్వర్ణలంక అని పేరువడ్డ లంకకు భూరి ప్రమాద మేర్పడబోతోం దని... భావించాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  *లంకా ప్రమాదం*

  ఘన దుఃఖ ప్రదమైన రాజస గు ణా
  కారుండు లంకేశ్వరుం..
  డొనరన్ దిండియు, నిద్ర రెండె బ్రదుకై
  యొప్పారగాఁ దామసం
  బునకున్ రూపము కుంభకర్ణు.. డొదవున్
  భూరిప్రమాదం బయో!
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహా
  దారిద్ర్యమే దిక్కగున్

  ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
  పరమార్థ కవి
  6.03.20
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 54. జన నేతన్నిక నేనె గొప్పనుచు వాచాలత్వమున్ జూపుచున్
  జనులేమైనను లెక్క సేయక దురాశావాదియై మెల్గినన్
  తన నేరమ్ములె శాపమై కఱకు బంధంబౌచు వెన్నాడగా
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   నేతన్+ఇక... అన్నపుడు ద్విత్వనకార ప్రయోగాన్ని వర్జించండి.

   తొలగించు
 55. వినుమోశంకర!నాదుమాటయిదియెవ్విధిన్ సమీక్షీంచినన్
  శనీదానెత్తిననుండుచోబ్రజకునేఛాయన్ దగన్జూచినన్
  ధనధాన్యమ్ములుపెక్కుగల్గియుమహాదారిద్య్రమేదిక్కగున్
  ననుమానంబిసుమంతయున్గనకయయ్యాసామిబంపించుమా

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించు
  2. వినుమోశంకర!నాదుమాటయిదియేవేళన్సమీక్షీంచినన్
   శనిదానెత్తిననుండుచోబ్రజకునేఛాయన్ దగన్జూచినన్
   ధనధాన్యమ్ములుపెక్కుగల్గియుమహాదారిద్య్రమేదిక్కగున్
   ననుమానంబిసుమంతయున్గనకయయ్యాసామిబంపించుమా

   తొలగించు
 56. మనకర్షకసోదరులకు
  తినిపించుటతెలుసుగాని తిననోపరుగా
  మనికికి నిరతమునిడుముడి
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే

  రిప్లయితొలగించు
 57. అనవరత స్వార్థాలో
  చనా రత నృపులు సెలంగ సాధారణులౌ
  జనుల కకట, దేశమ్మున
  ధనధాన్యము లెన్ని యున్న, దారిద్ర్యమ్మే


  వినుమా నా వచనమ్ము లింపుగ నిఁకన్ విత్తార్థివై యిజ్జగ
  మ్మున నన్యంపుఁ బురమ్ము వే చనుము సద్బుద్ధిన్ సభార్యాసుతుల్
  పునరాలోచన మేలఁ జుట్ట మయినం బో నిర్దయా లోభికిన్
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. 68సర్గలు 2451 పద్యములతో సుందరకాండ వ్రాసితిని. ఇప్పు డేక పద్య సుందరకాండ!

   రమ్య తరమ్ము నెమ్మిని సరస్వతి సద్దయ విద్య లబ్బఁగా
   గమ్యము సేరి మారుతి సుఖమ్ముగ జానకి జాడఁ గాంచి తా
   సౌమ్య వచో విభూతిని విచారము వాపి దహించి లంక ని
   స్సామ్యము రాముఁ జేరిన లసత్కథ వ్రాసితి రామభక్తినిన్

   తొలగించు
  2. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   సుందరకాండను పూర్తి చేసి ధన్యులయ్యారు.

   తొలగించు
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   సుందర కాండ 2018 లోనే పూర్తి యయ్యినదండి.

   తొలగించు
 58. ధనమేయింధనమీజగంబుననదేదాటించు దుఃఖార్ణవం
  బునునారోగ్యముదానికన్నఘనమీభూమిన్ సదాదానిక
  న్ననువేరేదియులేదుమించినదియేనాడున్నదేలేనిచో
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్

  రిప్లయితొలగించు
 59. నేటి ధనవంతులైన అనాథలు
  ధనదాహమ్మది తీరదెంతకకటా!ధర్మంబు శూన్యంబునై
  తనయుల్ వీడుచు దల్లిదండ్రుల జనన్ దారాపథమ్మున్నహో!
  తనవారంచును నెవ్వరిన్గనకయే దైన్యస్థితిన్నిక్కమే
  ధనధాన్యంబులు పెక్కుగల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఘనమౌసంపద సాధికారతయు సౌకర్యంబులన్ గల్గియున్
   మనమున్ దీరనికాంక్షలే ముసురుచున్ మాత్సర్యమేపారగా
   కినుకన్ బూనుచు ప్రక్కవారిగని యాక్షేపించుచున్ రోయగా
   ధనధాన్యమ్ములు పెక్కుగల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్

   తొలగించు
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  3. ధన్యోస్మి గురుదేవా,నమస్సులు!

   తొలగించు
 60. కం:

  తనువున నలతలు యెడయగ
  ననువగు మార్గమ్ము వెదుకగ నయమగు రీతిన్
  తినుటకు నోచుట నెఱుఁగని
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నలతలు+ఎడయగ' అన్నపుడు యడాగమం రాదు. "నలత లెడయగా" అనండి. రెండవ పాదంలో గణభంగం. "మార్గమ్ము వెదుక/మార్గము వెదుకగ" అనండి.

   తొలగించు
 61. మత్తేభవిక్రీడితము
  మన యాచారము పేడ నిల్లలికి సాంబ్రాణిన్ దునాలించఁగన్
  దినమున్ దప్పక దీపకాంతుల నివేదిన్చంగ సంసేవలన్
  మనగన్ జాలునె ప్రాణ హారక మహామారుల్? కరోనాదితో
  ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్!

  రిప్లయితొలగించు
 62. కందం
  మనసైన భార్య తోడుగఁ
  గనువిందుగఁ గలుఁగ సంతు కాంతుని వరమై
  తనరఁగఁ జేయుఁ! గలుఁగరే?
  ధన ధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

  రిప్లయితొలగించు
 63. ఘనమగు తిండి భుజించక
  జనులకు బెట్టంగ చేయి జారక భువిలో
  మనుగడ నడిపెడు లోభికి
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!!!

  రిప్లయితొలగించు
 64. మ:

  కనుమా వైరసు కారణంబవగ లోకాలెల్ల కంపింపగా
  దునుమాడం జన వైద్య బృందములు బందోబస్తు మార్గమ్ములన్
  వినుమా ధైర్యమె యెల్ల వేళలన కాపించున్ గదా, గానిచో ,
  ధన ధాన్యంబులు పెక్కు గల్గియు మహా దారిద్ర్యమే దిక్కగున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించు
 65. కనలేకుంటిమి యెప్పుడు
  మనుగడ కష్టమ్మె గాద మహిలో బ్రతుకుల్
  వినలే కరోన కథలను
  ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

  రిప్లయితొలగించు

 66. వినుమా! యన్నము బెట్టుచు
  మనలను బ్రతికించు రైతు మనికిని జూడన్
  దనకష్ట ఫలము దక్కక
  ధన ధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే!

  రిప్లయితొలగించు
 67. ఘనముగ దానము సేయక
  మనసారగ కుడువలేక మన్ననలేకన్
  దినములుదీర్చెడు లోభికి
  ధనధాన్యములెన్నియున్న దారిద్ర్యమ్మే!

  రిప్లయితొలగించు
 68. As reported by Stanford Medical, It's indeed the ONLY reason women in this country live 10 years longer and weigh an average of 42 pounds lighter than we do.

  (And by the way, it has absolutely NOTHING to do with genetics or some hard exercise and really, EVERYTHING about "HOW" they are eating.)

  P.S, What I said is "HOW", not "WHAT"...

  CLICK on this link to find out if this easy test can help you decipher your true weight loss potential

  రిప్లయితొలగించు
 69. If you're looking to lose pounds then you certainly have to get on this totally brand new personalized keto meal plan diet.

  To design this keto diet, certified nutritionists, personal trainers, and professional cooks have united to develop keto meal plans that are productive, suitable, economically-efficient, and enjoyable.

  Since their grand opening in early 2019, hundreds of people have already transformed their body and well-being with the benefits a certified keto meal plan diet can offer.

  Speaking of benefits: in this link, you'll discover 8 scientifically-tested ones provided by the keto meal plan diet.

  రిప్లయితొలగించు