8, మార్చి 2020, ఆదివారం

సమస్య - 3303 (తలయే లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు"
(లేదా...)
"తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ"

69 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    తలపుల్ కాంచగ కుళ్ళు కాల్వలగుచున్ దంభమ్ముతో నిండుచున్
    ములికిల్ వోలెడి మాటలన్ పలుకుచున్ బొంకించుచున్ లోకులన్
    కలలన్ గానని రీతి మోడిని కడున్ గాఢంబుగా దెప్పుచున్
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "ములికి" కి బహువచనం నాకు తెలియదు. 😢

      తొలగించండి

    2. "కలిమి...కలుములు
      లేమి....లేములు
      ములికి...ములుకులు
      నిఘంటువులలో ములికి మాత్రమే ఉంటుంది.ఉకారం రావటం వ్యాకరణవిషయం"

      ...సూరం శ్రీనివాసులు

      తొలగించండి
    3. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తలపుల్ కాంచగ గంగనీరమగుచున్ ధైర్యమ్ముతో నిండుచున్
    ములికిల్ వోలెడి మాటలన్ పలుకుచున్ బోధించుచున్ లక్ష్యముల్
    కలలన్ గానని రీతి మోడిని కడున్ గాఢంబుగా మెచ్చుచున్
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ

    తల = శిరసువెండ్రుకలు (శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి
  3. (సర్కార్ అనే ఐంద్రజాలికుడు తన కార్యక్రమంలో చేసిన అత్యద్భుతాంశం )
    లలనల్ బూరుషులందరున్ గలసి య
    ల్లల్లాడుచున్ జూడగా
    గలనైనన్ స్మరియింపనేరని మహా
    ఘట్టాలనే జేయు మా
    యల మంత్రాంగు డొకం డొనర్చెగద న
    త్యంతంబు జిత్రంబునే ;
    తలయే లేని నరుం డతండు ; గన నే
    త్రంబుల్ గడున్ సౌరులే !
    ( మంత్రాంగుడు - ఐంద్రజాలికుడు ;
    అల్లల్లాడుచు - అదరిపడుచు )

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    తల లేదా! యిటులన్ననట్టులని వాదప్రౌఢిమన్ జూపెదీ...
    విలలో మంచిని జూడలేవు గద యెంతేన్ రంగుటద్దాలతో!
    నిలువౌ తాళమహీజమీవని బుధుల్ నిందింతురెవ్వానినా
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. ఛలమున్ నేర్వని బాలబాలిక లటన్ సాగించు సత్క్రీడలో
    పలుప్రశ్నంబులు వేయుచుండె నొక డవ్వానిన్ ముదంబందుచున్
    తెలుపం జూచెడి వారి దెల్పుడనె నా ధీశాలి తానీగతిన్
    "తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ"

    రిప్లయితొలగించండి


  6. ఏమీ లేదు.


    లేదు వున్నదేదియును జిలేబి; లేదు
    తలయె లేనట్టి నరుని నేత్రములు; సొబగు
    లేదు లేదాయె శూన్యము; లెస్స! నిక్క
    మేది ? . కనుగట్టు మాయయున్ మిథ్యయేను!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. సమస్య :-
    "తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు"

    *తే.గీ**

    కష్టములనునవి నరుని కమ్ముచుండు
    జీవితమ్మున కష్టాలు చేరువైన
    చిరునగవు మోమున సతము చిందిచు కల
    తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు
    ............................✍చక్రి

    రిప్లయితొలగించండి


  8. కలయా?లేదు సుమా! జిలేబి ? అసలే కాదోయి!మాయా పదిం
    తలుగా?లేదు సుమా! పరాత్పరుడకో? తప్పేను!తంత్రమ్మకో?
    ఇలలో నిక్కము గాను తేల్చతరమా? యీడేర్చ పూరించెనా
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  9. వెలయాలిం దగ మెల్లకంటిని వివిక్తంబైన సర్వాంగినిన్,
    తలపుల్ జూడ నసంగతంబులన చేతల్ మూర్ఖకృత్యంబులన్
    ఖలుడై యౌనన కాదటంచు వ్యతిరేకార్థంబులం జెప్పెడిం
    దలయే లేని నరుం డతండు గన, నేత్రంబుల్ గడున్ సౌరులౌ.

    కంజర్ల రామాచార్య
    వనస్థలిపురము

    రిప్లయితొలగించండి
  10. మంచి ప్రోత్సాహ మిచ్చె డి మగువ సతిగ
    తండ్రి మాటలు మీరని తనయులుండ
    నెట్టి కలతలు బుట్టని యింట నే వె
    తల యె లేనట్టి నరుని నేత్రములు సొబ గు

    రిప్లయితొలగించండి
  11. అందరికీ నమస్సులు 🙏🙏

    *బ్లాగ్ లోని మహిళా మణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* 💐💐

    *నా సరదా పూరణ ప్రయత్నం* 😃😃😃

    *తే గీ*

    రాయగ పరీక్ష బుర్రయు నతని కేది
    చూసి రాయగ వాడికి చూపు మేలు
    చదువు అబ్బ లే వారెవా! చదివి రాయ
    *"తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు"*

    *కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి*
    🙏😃🙏😃🙏

    రిప్లయితొలగించండి
  12. అచట ఖల్వాటుల సభలె యద్భుతముగ
    నిర్వహించుచు నుండ నా నేస్త మొకడు
    గాంచ వచ్చె నాతడె యందగాడు బట్ట
    తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు

    రిప్లయితొలగించండి
  13. ఇంటి పనులేమి చేయడు-ఏడ్పు దక్క-
    ఒంటరిగ నుండి వింతగా నోర్మి మెలగు
    తనదు లోకమె గాని-నాతనిని జూడ
    "తలయె లేనట్టివాని నేత్రములు సొబగు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేయడు+ఏడ్పు' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు కదా! "చేయలే డేడ్పు దక్క" అందామా?

      తొలగించండి
  14. లయె లేనట్టి నరుని నేత్రములు సొబగుA

    రిప్లయితొలగించండి
  15. పలుకన్ జిహ్వయె లేనివాడు స్వరమై పండించె వేదమ్ములన్
    మొలయే లేని నరుండతండు జగమున్ మోదమ్ముతోజుట్టి తా
    నలవైకుంఠ పురంబులో వెలుగడే! యాచంద్రతారార్కమున్
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. మత్సరగ్రస్త నరుదృష్టి మంచి గనదు
      మూర్ఖుడగువాని దృష్టి ముప్పు దెచ్చు
      సేరి యొరులకీడెంచెడు చెడుతలపుల
      తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు"

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. "దృష్టియే ముప్పు దెచ్చు జేరి..." అనండి.

      తొలగించండి
  17. చూచితివెభామ!యెటనైనజూలుగలిగి
    తలయెలేనట్టినరుని.నేత్రములుసొబగు
    పెదవిదొండపండునగుచుబ్రియముగొలిపె
    వానియందమేయందముభరణియందు

    రిప్లయితొలగించండి
  18. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు"

    సందర్భము:
    కపీనాం కిల లాంగూల మిష్టం భవతి భూషణమ్
    తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్ఛతు
    సుం.కాం. 53-3
    కోతులకు తోకే ప్రియమైన అలంకార మట! దానికి నిప్పంటించండి. కాలిన తోకతో ఇతడు తిరిగి వెళ్ళేట్టు చేయండి.
    అన్నాడు రావణుడు.
    అప్పు డొక రాక్షసు డన్న మాటలు, ఆంజనేయు డిచ్చిన జవాబు పద్యంలో నిబంధించబడ్డాయి.
    తల లేని నరుడు రాముడు.
    అంటే బుద్ధి లేని వా డని రాక్షసుని భావం.
    తల లేని నరుడు రాముడు..
    అంటే ముందు భాగం లేని వాడు.. ఆది లేనివాడు.
    తల తోక లేని వానరుడు ఆంజనేయుడు..
    అంటే ఆద్యంతాలు లేనివాడు..
    ఆది..అనేది లేని నరుని (రాముని) నేత్రాలు సొబగు.
    అంటే అందమైనవి. పుండరీకాయతాక్షుడు కదా!
    "రాముడు తల లేని వాడైతే దూత కూడ తల లేని వాడే ఎలాగూ..
    ఇక ఇప్పుడు తోక కూడా కాల్చివేస్తే తలా తోకా లేని వా డౌతాడు దూత." అని ఒక రాక్షసు డంటే హనుమ "రాముడు విప్పారిన అందమైన కను దమ్ములు గలవాడు" అన్నాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    *తల తోక లేని వాడు*

    "తలయె లేని నరుడు రాము డిలను.. వాని

    దూత తల తోక లేనట్టి కోతి తోకఁ

    గాల్ప.." ననె దైత్యు.. డిటు లనెఁ గపివరుండు

    "తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు.."

    ✍️~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    8.03.20
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  19. ముఖ మగు నిఁక వివర్ణము మునుఁగ దుఃఖ
    మందు హర్షమ చిత్త సౌఖ్యకరి సుమ్ము
    దుఃఖసాగర తాపము దున్ముమ యవ
    తలయె, లేనట్టి నరుని నేత్రములు సొబగు


    అలయం డాతఁడు సాధనమ్మునను నిత్యైశ్వర్య సంభావ్యుఁడే
    యిల విద్యాధన సద్గుణవ్రజుఁడు ప్రాణే శానురక్తుండునున్
    నలినాభాక్షి మనోహరాంగి మహదానందప్ర దారాళ కుం
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ

    రిప్లయితొలగించండి
  20. తలపుల్ జూడగ తామసంబులగు సత్కార్యంబులే తోచవే
    పలుకుల్ జూడగ పామరత్వమున విభ్రాంతిం గలింగించునే
    తెలివిన్ సుంతయు లేకయే మురిసి సిద్థించంగ నుద్యోగమే
    తలయేలేని నరుండతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ

    ఉద్యోగము = అధికారము
    తల = పూనిక (ఆం.భా.)
    నేత్రములు = వలువలు (ఆం.భా.)

    రిప్లయితొలగించండి
  21. కలనుగంటిని కలలోనగంటినొకని
    వింతరూపమువానిది వెడఁగుమేను
    కన్నుగవయమరెనతనికరములందు
    తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు

    రిప్లయితొలగించండి
  22. కలలో గాంచితి వింతగా మసలు యాకారమ్మదే జూడగా
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ
    వెలుగై దోచెను వాని దేహమదియే విశ్వంబు నాద్యంతమున్
    తెలిసెన్ ఆతడు లింగ రూపుడగు భూతేశుండు మత్త్రాతయే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మసలు నాకారమ్మదే..." అనండి.
      'తెలిసెన్ ఆతడు' అని విసంధిగా వ్రాయరాదు కదా!

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. సవరించానండీ 🙏

      కలలో గాంచితి వింతగా మసలు నాకారమ్మదే జూడగా
      తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ
      వెలుగై దోచెను వాని దేహమదియే విశ్వంబు నాద్యంతమున్
      తెలిసెన్ సత్యము లింగ రూపుడగు భూతేశుండు మత్త్రాతయే

      తొలగించండి

  23. కలగంటిన్ కలలోన చిత్రములనేకంబుల్ కనుంగొంటి నా
    కలలోనొక్కనరుండునశ్వముపయిన్ కాన్పించె నారూఢుడై
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ
    నిలలోనెన్నడుగాంచియుండరు జనుల్ యీరీతిగా నెవ్వరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జనుల్ + ఈరీతిగా' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  24. మిత్రులందఱకు నమస్సులు!

    [అయోధ్యానగరంలో ఒక చాకలివాడు తాగిన మైకంలో, ఇంటికి ఆలస్యంగా తిరిగివచ్చిన తన భార్యని నిందిస్తూ, ఇంట్లోకి రానీయకుండా, "ఏడాది పాటు లంకలో ఉన్న సీతను ఇంటికి రానిచ్చి, ఏలుకొంటున్న వెర్రి రాముని వంటి వాడిని తాను కా" నని చెప్పగా, విన్న నగర పౌరులు, వానిపై కోపగించి, వానికి శ్రీరాముని గుణగణాలను వివరిస్తూ, ’అయోధ్యలో రాముణ్ణి వ్రేలెత్తి చూపించే తలే లే’ దను సందర్భము]

    "ఇలలోఁ బుత్త్రుఁడటన్నఁ జూపనగు నీ శ్రీరాము! నెవ్వానికిం
    గలలో నైననుఁ గీడు సేయఁ! డెపుడున్ గాంక్షించు మేలున్! మనన్
    విలువౌ సేఁతలతోడ గెల్చు! ఖలతన్, వ్రేలెత్తి చూపించెడిన్

    దలయే లేని నరుం డతండు! గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ!"

    రిప్లయితొలగించండి
  25. అలరు పుడమిని యబలల నణచి వైచి
    కలన మొందెడి మమతల కలచి వైచి
    యలము దృష్టిలో వికటపు హాసముల వె
    తలయె; లేనట్టి నరుని నేత్రములు సొబగు!

    రిప్లయితొలగించండి
  26. తిరుమలకుఁ బోయి తిరముగా వరుసలోన
    లోకములఁ గాచు సచ్ఛీలలోలు, వేంక
    టేశు రూపమ్ము మిగుల దర్శించి నట్టి
    తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు

    రిప్లయితొలగించండి
  27. నోము ఫలమన బుట్టినా డొక్క నలుసు |
    విధియె పగబూనె మతిలేని బిడ్డ నొసగి |
    చూడచక్కని రూపంబు చోద్యమెగన |
    "తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు"

    రిప్లయితొలగించండి
  28. తలమే బ్రహ్మకు నైన నీ మగని విద్యాజ్ఞానమున్ తెల్పగన్
    పలుమారుల్ పదిలోన తప్పె ఘనుడే భారంబుగా దల్చి వి
    ద్యలు నేర్వంగను లేక మానెనతడే యాలోచనల్ చేనెడిన్
    తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ.

    రిప్లయితొలగించండి
  29. తేటగీతి
    కులము గోత్రము వేరను వెలితి మెదలి
    మతము వేరు వేరనియెడు మతులఁ జెలఁగి
    రేగఁ ప్రాంతీయ బేధాలు మూగుచు కల
    తలయె! లేనట్టి నరుని నేత్రములు సొబగు!!

    రిప్లయితొలగించండి
  30. మత్తేభవిక్రీడితము
    తలపుల్ నిండఁగ సాంప్రదాయముఁ దగాదాలన్ నివారించుచున్
    వెలుగుల్ నింపఁగ దేశమందు తన ప్రావీణ్యమ్ము లింపారగన్
    బలిమిన్ బొంది విదేశ వేదికలపై! వైరించుచో వంచెడున్
    దలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ

    రిప్లయితొలగించండి
  31. మ:

    పలుకన్ జాలడు నేమియున్ మగడు నప్పన్జెప్పుటన్ మాత్రమే
    బలుసాకున్ దిని సాగదా బ్రతుకు నింపాదిన్ వినన్ భార్యకున్
    తలపే లేక చలించు జీవనము నంతంజేయు విద్వేషముల్
    తలయే లేని నరుండతండు గన నేత్రంబుల్ గడున్ సౌరలౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  32. డా.బల్లూరి ఉమాదేవి.
    కమ్మనైన రూపసి నట గాంచి బట్ట
    తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు"
    మనమునాకట్టుకొనినంత మౌనముగను
    సమ్మతి నడుచు ముందుకు సాగె నతివ

    రిప్లయితొలగించండి
  33. As stated by Stanford Medical, It's in fact the ONLY reason this country's women live 10 years longer and weigh on average 42 pounds less than we do.

    (By the way, it has absolutely NOTHING to do with genetics or some secret exercise and EVERYTHING about "how" they are eating.)

    BTW, What I said is "HOW", not "what"...

    Click this link to reveal if this brief questionnaire can help you find out your real weight loss possibilities

    రిప్లయితొలగించండి