9, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3658

10-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కల సహింపవలయుఁ గాపురమున”
(లేదా...)
“కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

59 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కులుకుచు భార్య భర్తలహ కూరిమి మీరగ కాపురమ్మునన్
  నలువురు ముగ్గురన్ దలచి నందము నొందుచు నాపివేయకే
  చిలుకల బోలుచున్ తనరు చిన్నరి పిల్లల నాటపాట మూ
  కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్

  రిప్లయితొలగించండి
 2. స్నేహబంధమంతచివురించుగ్రుహమందు
  ఆలుమగలమధ్యనలుకలేమి
  ఓకరుభోగిగాగనోకరునుత్యాగియే
  కలసహింపవలయుకాపురమున

  రిప్లయితొలగించండి
 3. చెవులు హోరులెత్తు చెడ్డమాట పలుకు

  పలుక రాని మాట పలుకునయ్య

  తిట్టు కవితలందు గట్టివారలనెన్ని
  కల

  సహింపవలయుఁగా పురమున

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 4. ఇలఁ గన సంఘజీవి నరుఁ డెల్లరతో సహజీవనంబునన్
  కలతలు లేని తీరున సుఖంబుగ నుండుటె మేలు గాన నె
  చ్చెలి యగు భార్య పక్షపు విశిష్టుల బంధుల యొక్క రాకపో
  కలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్.

  రిప్లయితొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  చాకచక్యముగల చక్కని పిల్లలు
  తనదు బ్రతుకునంత తనియ జేసి
  మురువు గూర్చు ననెడి ముచ్చటైనట్టిదౌ
  కల సహింపవలయు కావురమున.

  రిప్లయితొలగించండి

 6. కల గనుమోయి జీవన వి
  కాస తరంగ శ్రుతీ విభావరిన్!
  కల గనువారె కోరికల
  గాంచి వరించి విహార మందు, నా
  కలయె నిజంబొ గాదొ! యొక
  కల్పనయై నడయాడు నట్టిదో!
  కలను సహింపగా వలయుఁ
  గాపురమం దభివృద్ధిఁ గోరినన్!

  రిప్లయితొలగించండి
 7. కలికి చూడ పరమ గయ్యాళి యగుచును
  తరచు భర్తపైన నరవనేమి
  యామె తత్వ మెరగి యర్థాంగి వేయు కే
  కల సహింప వలయు గాపురమున .
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 8. సమస్య :
  కలను సహింపగావలయు
  గాపురమం దభివృద్ధి గోరినన్

  ( మగవాని జీవితానికి మహత్తరవరమైన మగువను మణిలా చూచుకొంటూవంకరవంకలు మానుకొంటే సంసారం సారవంతమే కదా !)

  చంపకమాల
  ....................

  అలికులవేణియై, సుమధు
  రాధరనిర్గతమంజువాణియై,
  చెలుముల బెంచు బ్రేముడిని
  చెంతనె వెల్గెడి భూషణంబునై,
  కలుముల లేములన్ విడని
  కాంతకు మోదము బంచి, యల్పశం
  కలను సహింపగావలయు
  గాపురమం దభివృద్ధి గోరినన్ .

  రిప్లయితొలగించండి
 9. కలగుటసాజమేయగునుకామితముల్నెరవేరకుండినన్
  విలువలనేర్చెనావిభుఁడువిష్ణుఁడుక్రిష్ణుఁడుసత్యముంగిటన్
  చలువలపందిరేయగునుచాలగనోర్చినబాధలయ్యెడన్
  కలనుసహింపగావలయుఁగాపురమందభివ్రుద్ధిఁగోరినన్

  రిప్లయితొలగించండి
 10. భార్య చూడ లేదు, భర్త నడువ లేడు,

  వినగ లేడు సుతుడు, వెతలు కలవు

  వారి జీవితమున కూరిమి నంగవి

  కల‌ సహింప వలయు కాపు రమున

  రిప్లయితొలగించండి
 11. శిలలను తెచ్చి శిల్పముగ చెక్కితి ముద్దుల భార్య బొమ్మయున్

  సలలితమైన మౌనము ప్రశాంతపు మోమున చిందె వేడుకల్

  ములకలు వేసె భ్రాంతినను ముద్దుగ నిద్దుర వీడి కాంచనా

  కలను , సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 12. జీవితమ్ము నందు చీకు చింతలు వచ్చుఁ
  బెదరి పోక నిలిచి విజయమంది
  సాగ దలచి యట్టి జగతి కష్టముల రా
  కల సహింప వలయు కాపు రమున

  రిప్లయితొలగించండి
 13. కలతలేని కుటుంబము గావలెనన
  గృహిణి సంతోషపడుటయె కిటుకు గాన
  పతికి వలను గాకున్నను పత్నియడుగు
  కౌతుకల సహింపవలయుఁ గాపురమున

  రిప్లయితొలగించండి
 14. కొత్తగా పెండ్లియైన జంటకు ఆత్మీయుల సలహాలు!😃

  కలికి! సమాదరించవలె కాంతుడు యాడ వినోదమెంచి పే
  కలు, పతి! నీవు కూర్చవలె కాంతకు కోరిన పట్టువైన
  కో
  కలను, చిరాకునన్ గలుగు కాదను యౌనను
  చిన్న చిన్న కా
  కలను సహింపగా వలెను కాపురమందభివృద్ధి గోరినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వలపుల ధర్మపత్నికిని భాగ్యవశమ్మున వత్సరమ్మునే
   తొలితొలి గర్భమాయెనని తోషమునందగ కాంతు
   డంతలో
   పిలుచుకు పోవగా దనదు పెద్దలు కాన్పునకై
   వియోగ తం
   కలను సహింపగా వలెను కాపురమందభివృద్ధి గోరినన్

   తొలగించండి
  2. సవరించిన మొదటి పూరణ

   కొత్తగా పెండ్లియైన జంటకు ఆత్మీయుల సలహాలు!😃

   కలికి! సమాదరించవలె కాంతుడు వేడుక నెంచి యాడ పే
   కలు, పతి! నీవు కూర్చవలె కాంతకు కోరిన పట్టువైన
   కో
   కలను, చిరాకునన్ దొరలు ఘాటగు మాటల
   చిన్న చిన్న కా
   కలను సహింపగా వలెను కాపురమందభివృద్ధి గోరినన్

   తొలగించండి
 15. అందరికీ నమస్సులు🙏

  పిలిచిన బల్కుచూ విమల ప్రేమను బంచగ సేవచేసినన్,
  వలచి వరించెనం దలచి వైభవ మొప్పగ నోర్మిచూపినన్,
  వెలితిని జూపుచున్ బురుష వీరము నిండిన భర్త పెట్టు వం
  *“కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”*

  *వాణిశ్రీ నైనాల*

  రిప్లయితొలగించండి
 16. క్రొవ్విడి వెంకట రాజారావు:

  తెలివియు నోర్పు గల్గి సరితీరు కుటుంబము నంతటిన్ సదా
  కలతలు లేని చందమున కాంతిల జేసెడి ధర్మ మెంచుచున్
  పొలుపును గూర్చి గాఢమగు పొంగు నొసంగెడి మేటి పిల్లమూ
  కలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్.

  రిప్లయితొలగించండి
 17. పలువురు కూడదంచనిన పంతముతో నెదురించి ప్రేమతో
  వలచి వివాహమాడిన శుభాంగియె నచ్చని కార్యమున్ గనన్
  గలతయె చెంది కోపమున కాంతుని దూరుచు నామె వేయు కే
  కలను సహింపగా వలయుఁ గాపురమందభివృద్ధి గోరినన్ .
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 18. విలయము సృష్టి జేయగలవీరులు వేషము లెన్నియో యిటన్
  యెలమిన వేయుచుందురల యీతరమందున తోషమందుచున్ సదా
  ప్రళయము నేల గోరుదురు బ్రాతల మధ్యన తెల్యరాని మూ
  కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్!!

  రిప్లయితొలగించండి
 19. రిప్లయిలు
  1. చం:

   పలుచన చేయరాదు కడుపారగ బెంచిన తల్లిదండ్రులన్
   కలతలు లేపి, భారమని కానక చేర్చగరాదు సత్రమున్
   బలమును గూర్చరే బ్రతుకు, వంచన బాపగ, కూడి యుండి వం
   కలను సహింపగా వలయు గాపురమందభివృద్ధి గోరినన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి


 20. అటు పెనిమిటి తరపువారిటు తమ వారు
  వెనుక దెప్పి పోటు వెతల యశ్రు
  కల సహింపవలయుఁ గాపురమునగదా
  పడతు లెల్లపుడు సవాలు వోలె!  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. సలలిత రాగ బంధములు సంతులు పల్కెడి ముద్దుపల్కులున్
  కులమున గొప్ప గౌరవము కూరిమి గల్గిన భార్యయుండినన్
  కలతలు లేక సాగుచును
  కష్టసుఖాలను వీని రాక పో
  కలను సహింపగా వలయు గాపురమం దభివృద్ధి గోరినన్

  రిప్లయితొలగించండి
 22. కె.వి.యస్. లక్ష్మి:

  పెండ్లియైన నాటి ప్రేమాభిమానమ్ము
  కాల మనుసరించి కట్టు దప్పి
  వలపు మాసిపోవ వల్లభు జూపు వం
  కల సహింప వలయు కాపురమున.

  రిప్లయితొలగించండి
 23. క్రొవ్విడి వెంకట రాజారావు:

  జూద మాడు చుండి సొత్తు పోగొట్టుచు
  నాలి మాట వినక ననవరతము
  నాగ్ర హించు నట్టి నార్యుని పొలికే
  కల సహింప వలయు కాపురమున.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జూద మాడు చుండి సొత్తు పోగొట్టుచు
   నాలి మాట వినక ననవరతము
   నాగ్ర హించు నట్టి యార్యునిది పొలికే
   కల సహింప వలయు కాపురమున

   తొలగించండి
 24. సమస్య:

  *కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్*

  ప్రయత్నం:
  చం.
  చిలిపిగ మాటలాడి తెగఁజేరువ యైన నవీనయుగ్మమున్
  వలపులవింటివాడు వసి వాడిగ బాణము వేసినంతనే,
  కలుపుచు పెండ్లి జేసి, తమ గారపు పట్టికి సెప్పిరిట్లు, "వం
  కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్."

  నవీనయుగ్మము-కొత్తజంట,
  వలపులవింటివాడు-మన్మథుడు,
  తెగ,వసి-మిక్కిలి.

  రిప్లయితొలగించండి
 25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 26. సొలుపును గూర్చనట్టిదగు జూదము నాడుచు సొమ్ములందెడిన్
  మెలకువలేక నష్టములె మీఱగ కోపమునొంది భార్యపై
  యలుగుచు నింద జేయుచు నహంతను భర్త వేయునట్టి కే
  కలను సహింపగా వలయు గాపురమం దభివృద్ధి గోరినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సొలుపును గూర్చనట్టిదగు జూదము నాడుచు సొమ్ములందెడిన్
   మెలకువలేక నష్టములె మీఱగ కోపమునొంది భార్యపై
   యలుగుచు నింద జేయుచు నహంతను భర్తయె వేయునట్టి కే
   కలను సహింపగా వలయు గాపురమం దభివృద్ధి గోరినన్

   తొలగించండి
 27. కోరు కొనము కాని, కొన్నికలహములు
  కాపురమున వచ్చు కలతలు గను
  తప్పదెవరికైన, దంపతులెపుడల
  కల సహింపవలయుఁ గాపురమున

  రిప్లయితొలగించండి
 28. ఆ.వె.
  సంతు లేనివారి సంగతి యేమందు
  మందుమాకులన్ని మాయలాయె
  కలసి వచ్చినపుడు పిల్లలు వేయు కే
  కల సహింపవలయుఁ గాపురమున

  రిప్లయితొలగించండి
 29. అలఘుతరాచ్ఛభావమున, హర్షమునిండినమానసంబునన్
  సలలితవాక్సుధారసము సవ్యవిధంబున బంచుకొంచు తా
  మలిగిననైన నొండొరులు నాలుమగల్ తమయందు గల్గు శం
  కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”

  రిప్లయితొలగించండి
 30. రిప్లయిలు
  1. సరదాగా...

   చంపకమాల
   వలచిన భామ ప్రేమఁ గని భార్యగ కోరగ కంచి పట్టు కో
   కలను సహింపగా వలయుఁ, గ్రన్నన మగ్గపు నేతఁ గోర రై
   కలను సహింపగా వలయుఁ, గాంచన భూషల, చిన్ని చిన్ని కా
   న్కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్

   ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

   తొలగించండి
  2. ఆటవెలది
   కలతఁ జెంది సత్య కలహమ్ములాడఁగఁ
   బంకజాక్షుఁడపుడు పాదమంటె
   చీరలు నగలంచుఁ గోరెడు పత్ని కి
   న్కల సహింపవలయుఁ గాపురమున

   చంపకమాల
   చులకనఁ జేయఁ బోకు నిను సొంతముగాఁ గొన భర్త, నత్త మా
   మలఁ దగు సేవలన్ దనర మన్నన జూడుము పుత్రికామణీ!
   మెలకువ తోడ మర్దులను మేళములాడక నాడబిడ్డ కి
   న్కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్

   తొలగించండి
 31. రిప్లయిలు
  1. పొలతుక లల్గుచోఁ దనరుఁ పొందు లెసంగు బ్రసన్నులౌ తరిన్,
   చెలియల మోము నందు నల చిర్నగవుల్ బ్రసరించు మేలి వె
   న్నెల బువి సోకినట్లుఁ, దగ నీవిధి నాగ్రహనిగ్రహప్రతీ
   కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 32. కాపురంబునందు కలతలు సహజము
  యెప్పుడైన వచ్చు తప్పు కాదు
  పతికి సతికి నడుమ వచ్చెడునా యల
  కల సహింపవలయుఁ గాపురమున

  రిప్లయితొలగించండి
 33. అలుకను బూని కోపమున నాలిని బంపక పుట్టినింటికిన్
  కలతల పాలు జేయ నిక కాపురమెట్టుల సాగు చక్కగా
  పొలుపుగ నామె కోర్కెరిగి పుట్టిన వారిని జూడ రాకపో
  కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్

  రిప్లయితొలగించండి
 34. సతి పతులును కూర్మి సంసారమున పెక్కు
  బరువు బాధ్యతలెల్ల పైబడంగ
  నోర్మి సాగ వలయు నొద్దిక తోడ,శం
  కల సహింప వలయు గాపురమున.

  రిప్లయితొలగించండి
 35. సూటిపోటు లుగల మాటల,శత్రుమూ
  కలసహింపవలయు గాపురమున
  చేయిచేయి గలుప చేటుగలుగుగద
  మౌనమయది మేలు మౌని వలెను

  రిప్లయితొలగించండి
 36. అలిగిన సతులు గతు లరయరు నాథులు
  లలనలకుఁ దొడవుల వలువల రతి
  కట్టిన వసనమ్ము గట్టరె యిట్టి పో
  కల సహింపవలయుఁ గాపురమున


  విలవిల లాడ నేల గత భీతి మనోరధ పూర్ణ సిద్ధికై
  నిలువుమ వేచి వత్సరము నీ పుర మౌ నమరావతీ గతిన్
  సలలిత తుంగ శైల నిభ సౌధ వరావళిఁ గట్టఁ గూల్పఁ బా
  కలను సహింపఁగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్

  [కాపురము = చెడ్డ పురము]

  రిప్లయితొలగించండి
 37. కోమలి యలుకలకు కోపించుట తగదు.
  అలుగని సతి గలదె అవని లోన?
  చెలియ మనసు నెరిగి చెలిమితో తన నలు
  కల సహింప వలయు గాపురమున.

  రిప్లయితొలగించండి
 38. కలతలురేపు దుష్టులను,గాపురుషాదుల చేష్ట,శత్రుమూ
  కలను,సహింపగావలయు గాపురమందభివృద్ధి,గోరినన్
  గలతలులేని గాపురము గాంచును వృద్ధిని నెల్లవేళలన్
  గలనున సైతమున్ వలదు కర్కశరూపము మానవాళికిన్

  రిప్లయితొలగించండి
 39. కలలు కనండి గుండియల కశ్మలమెల్లను నూడ్చివేయగా
  కలలుమనోవికాసమునకండయుదండయుకాపురంబునన్
  కలతలచిచ్చునార్పగనుకాంతలచింతలమాన్పరంగుకో
  *“కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”*

  రిప్లయితొలగించండి
 40. ములుకులె యత్తమామలహొ పూరుషుడక్కట బండరాయి కు
  క్కలు మరదళ్ళు బావలు ప్రకాండులు రామ!పరాన్నభుక్కులా!
  నలకలు దున్నపోతులు వినమ్రతలేని కుటుంబమందు *తి*
  *క్కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 41. వలపుల పంటలీనగను భార్యవిధేయుడు భర్తగావలెన్
  కలహము కాలుదువ్వినను కాన్కలు వే కురిపించగా వలెన్
  నిలువుగ దోపిడీలు సతి నిర్దయజేయ వరించు *రైకకో*
  *కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి