26, మార్చి 2021, శుక్రవారం

సమస్య - 3674

27-3-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్”
(లేదా...)
“వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్”

66 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  రాసులు రాసులౌ ధనము రమ్యపు రీతిని పోసి చేరగన్
  వాసిగ హైద్రబాదునను బంజరు హిల్సున సౌధమందునన్
  దోసెడు నీరు గానకయె దుఃఖము జెందక కాగితంబుదౌ
  వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్

  రిప్లయితొలగించండి
 2. కాసులు లేనట్టి బతుకు

  వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్

  ఈశుని కొలిచిన వేళల

  రాశులుగను వాని దయ విరాజిల్లంగన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 3. కాసులు దొరకని పనులును
  మోసము జేయుచు పరులను ముంచెడు వారల్
  దాసోహము కాని జనులు
  వాసన లేనట్టి పువ్వు వాసిని గాంచెన్

  రిప్లయితొలగించండి
 4. ఆ సంక్రందన సూతుని
  తో సమరమ్మున నిలిచిన ద్రుపదుని సుతుడౌ
  యా షండునిగూర్చి వినిన
  వాసన లేనట్టి పూవు వాసినిఁ గాంచెన్

  రిప్లయితొలగించండి
 5. సమస్య :
  వాసన లేని పువ్వు బుధ
  వర్గము మెప్పును బొందె వింతగన్

  (సినిమాలోకి కావలసినసౌగంధికపుష్పం కృత్రిమంగా తయారు చేసి టెక్నీషియన్లు తీసుకొని వస్తే కవి , దర్శకుడు నాయకుడు , నాయిక మొదలైనవారి సంతోషం )

  ఉత్పలమాల
  ------------

  మీసము ద్రిప్పుకొంచు గడు
  మెచ్చుగ జూచెనుభీమవేషుడున్ ;
  మోసులువారు మోదమది
  మోమున జిందెను యాజ్ఞసేనికిన్ ;
  కాసులె యంచు నాటకపు
  గర్తయు దర్శకవర్యులెంచిరే !
  వాసన లేని పువ్వు బుధ
  వర్గము మెప్పును బొందె వింతగన్ .

  రిప్లయితొలగించండి
 6. వీసముపాపముఁజేయక
  వాసిగతనతోడురానివాసనవలనన్
  దోషముజీవునినంటదు
  వాసనలేనట్టిపూవువాసినిగాంచెన్

  రిప్లయితొలగించండి
 7. భాసురుడైన భీష్ముడనిఁ బాటవ మెంతయొ చూప వృద్ధుడౌ
  మాసటినడ్డగింపగను మాధవు డంతట దెచ్చె షండునిన్
  ద్రాసమెఱుంగనట్టి కలిఁ దందడిలో నరికట్టినట్టి యా
  వాసనలేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్.

  రిప్లయితొలగించండి
 8. భాసముగపుత్తడి సుమము
  చేసెను కంసాలి లక్ష్మి సిగను ధరింపన్
  చూసినవారెల్లరనిరి
  వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్

  రిప్లయితొలగించండి
 9. మాసినబట్టల తోడుగ
  మూసీనది తీరమందు మురికగువాడన్
  పాసవ నైయేయస్ నొక
  వాసనలేనట్టి పువ్వు వాసిని బొందెన్

  పాసిన నోగిరంబుదిని పాకలలో నివసించు వారలై
  కాసుల యూసులేక బహుకాలము విద్యకు దూరమైన వి
  శ్వాసము గోలుపోక తగు పద్ధతి నెన్నికగాగ మంత్రులై
  వాసనలేని పూలు బుధవర్గము మెప్పునుబొందె వింతగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మూడవ పాదమున నేతలై గా చదువ ప్రార్ధన!🙏🙏🙏

   తొలగించండి
  2. ఆశగ వ్రాలెను భ్రమరము
   పూసిన మరుమల్లెపైన పూదేనియకై
   వేసరిలె చిత్తరువుగని
   వాసనలేనట్టి పువ్వు వాసిని బొందెన్


   తొలగించండి
  3. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. ధన్యాస్మి గురుదేవా! నమోనమః!🙏🙏🙏

   తొలగించండి
 10. కందం
  ధ్యాస మరలించి, వేమన
  దోసమెఱిఁగి యాటవెలది దూయఁగ నసిగా,
  బాసటగ నిలువ 'విశ్వద'
  'వాసన లేనట్టి పువ్వు' వాసినిఁ గాంచెన్!

  ఉత్పలమాల
  బోసి మొలన్ గనన్ వదిన బుద్ధివికాసము సెంది 'వేముడే'
  వ్రాసెను నీతి వంతముగ భాసిల నాటవెలంది పద్యముల్
  దోసమెఱుంగ 'విశ్వద' యె తోడ్పడఁగన్ మకుటాయమానమై
  ' వాసన లేని పువ్వు' బుధవర్గము మెప్పును బొందె వింతగన్!

  రిప్లయితొలగించండి
 11. మీసము దువ్వి రోషముతొ మేలగు పుష్పము తెచ్చె భీముడున్
  కాసులు గూర్చు నాటక నికాయము నందున నవ్యతేజుడై
  తా సుమ హస్తుడై నిలువ తన్మయ మొందిరి ప్రేక్షకాళి యా
  వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రోషముతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "రోషమున" అనండి.

   తొలగించండి
 12. మోసముజేసిరైతులను,మోదమునందెడునేతలుండగా
  గ్రాసమునిచ్చు కర్షకుల,గాఢముగానిటబాధబెట్టినన్
  భాసురమైనరీతిగను బాగుగగెల్వగ యెన్నికందునన్
  వాసనలేనిపూలు బుధవర్గముమెప్పును,బొందె వింతగా
  +++++++++++++++++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "బాగుగ నెన్నికలందు గెల్వగన్" అనండి.

   తొలగించండి
 13. అందరికి నమస్సులు🙏

  కాసుల దేవళమందున
  భాసురముగ సిరిని గూర్చె బంగరు దమ్మిన్
  పేసలమౌ శ్రీపురమున
  వాసన లేనట్టి పువ్వు వాసిని గాంచెన్

  *వాణిశ్రీ నైనాల*

  రిప్లయితొలగించండి
 14. వాసనలేనిపువ్వు బుధవర్గము లేని పురంబులాది మున్
  వాసిగ జక్కనాఖ్యుడనె వర్జన యోగ్యమటంచు పద్యమున్
  దా సిగపూవు పుత్తడిది ధారణ సేయగ పంకజాక్షి యా
  వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్

  రిప్లయితొలగించండి
 15. ఉ:

  దాసుడ నంచు మంత్రి దరి దాపున దిర్గుచు నెల్ల వేళలన్
  కాసులు గూర్చుచుండు మరి కాదను వారల నొప్ప జేయుచున్
  మోసము సేయ నేరడను ముద్రను బొందగ కార్య సాధనై
  వాసన లేని పువ్వు బుధ వర్గము మెప్పును బొందె వింతగన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 16. ఉత్పలమాల:
  ------------
  మీసముద్రిప్పగాబ్రజలు, మీనము మేషములెంచకుండగా!
  వేసిరివోట్లనన్నిటిని,వేలకువేలునుడబ్బుబంచగా!
  మోసముబోయినారమని,మొత్తుకుజచ్చిన లాభమేమికన్
  వాసనలేనిపూలు, బుధవర్గము, మెప్పునుబొందె వింతగన్
  ----------------------------------

  రిప్లయితొలగించండి
 17. ఉత్పలమాల:
  ------------
  త్రాసునదూచనెగ్గగల,ధర్మపుకార్యములేమిజేయకన్
  వీసమునైన బీదలకు,విత్తమునివ్వగజూడమెప్పుడున్
  పాశముద్రెంచు బంధముల,ప్రాణము బెట్టెడు వారునేతలై
  వాసనలేనిపూలు, బుధవర్గము, మెప్పునుబొందె వింతగన్
  ----------------------------------

  రిప్లయితొలగించండి


 18. జై శంకరాభరణం ! జై జై కందివర! జైజైజై ఈ సభాసదులకు సెల్ఫ్ డబ్బా :)


  కూసింతైనను తెలియదు!
  వ్రాసెను పద్యములను కవి వరుల వరుసలోన్
  లేసాయిది? కంది చలువ!
  వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. కాసులు లేని వాడు తిరకాసును నేర్వని ఉబ్బు లింగడున్

  కాశికి విశ్వ నాధుడును కాళము భక్తిగ పుష్ప రత్నమున్

  చేసిన పూజకున్ మురిసి చేర్చెను పుర్వును శైవ సన్నిధిన్

  వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి


 20. అనుమానమేల నో చ
  ప్పున వాసన లేని పువ్వు బుధవర్గము మె
  ప్పును బొందె వింతగన్! వ్రా
  సెను కైతల సుదతి కవుల చెంతయు చేరన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. శ్రీ గురుభ్యోనమః

  కాసులు జల్లుచు, చదువులు
  వీసము లేకున్నగాని పెక్కురు మూర్ఖుల్
  శాసన కర్తలు కాగా
  వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్

  రిప్లయితొలగించండి
 22. దోసిలినిండ ముత్యములు దుగ్ధ పయోధి వసించు దేవి ప
  ద్మాసన మూర్తి, భాసిలగ దంతియుగమ్ము విశేష కాంతులన్
  భూసురు డర్చనన్ కనక పుష్పముతో నలరించు వేళలన్
  *వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 23. శ్వాస విడిచిన మనుజు వలె
  వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్
  మోసపు మాటలి నుడువ
  రోసము కలిగిం చుచుండు లోకులకెపుడున్

  రిప్లయితొలగించండి
 24. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

  *వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్*

  నా పూరణ

  ఉత్పలమాల

  పూసిన పుష్పమై వెలిగె పూర్ణిమ యంబకు భక్తురాలిగా
  కాసుల కోసమై ముదిమికానికి తండ్రియె పెండ్లి చేయగా
  నాసను వీడి దేవి సుపదాబ్జముఁ జేరగ సాహసించెనే
  వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పునుబొందె వింతగా

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 25. మైలవరపు వారి పూరణ

  వ్రాసితినెన్నొ పద్యముల వాసిగ., పెక్కు వధానసత్క్రియల్
  చేసితి., విద్యనేర్చుటకు చేసినదేమియు లేదు, కాని యా
  వాసరవాసినీకృప ప్రవర్తిలితిన్ కవిచక్రవర్తిగా,
  వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్.

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 26. చేసెను దేవ దేవుడొక చిత్తము నందిన బొమ్మ స్త్రీ యనన్
  వాసిని బెంచి పూరుషుని వాకిలి దీర్చగ రేపు మాపులన్
  భాసిలుచుండు తల్లిగను భార్యగ మంత్రిగ తోడు నిచ్చు యీ
  వాసన లేని పూవు బుధ వర్గము మెప్పును పొందె వింతగన్

  రిప్లయితొలగించండి
 27. కలిప్రభావముతో కలియుగంలో ఎలా నీచము ఉత్కృష్టమైందంటే


  దోసము నెంచ రాసలును దోవలు దప్పెను బాస యాసయున్
  మోసము నయ్యె వేసమును మోదము గూర్చె విమత్సరంబునన్
  దాసిరి మంచి ముత్తెము నుదారత నీరస మద్వితీయమై
  *వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్”*

  రిప్లయితొలగించండి
 28. భాసురకావ్యసంపదలపావనులయ్యిరినాటిసత్కవుల్
  ఆసురభావజాలమునహంగులునేడునుదాపురించెగా
  వీసముపాండితీగరిమవేదికనిల్చిరివేషగాండ్రునై
  వాసనలేనిపువ్వుబుధవర్గముమెప్పునుపోందెవింతగా

  రిప్లయితొలగించండి
 29. వాసనఁ జల్లు నన్ని సుమబాలలుఁ గాని జలేరుహంబులే
  వాసనలీన వైనఁ గవివర్యులు నెంచు సరోజనమ్మునే
  హాసముకైన మోముకయి నక్షులకైనఁ బదంబులైన నా
  వాసన లేని పువ్వు బుధ వర్గము మెప్పును బొందె వింతగన్

  రిప్లయితొలగించండి
 30. కాసులు గొరవడి యైనను
  వీసమునున్ జంకకుండ పేదలకొఱకై
  పైసలు పంపుట గనగను
  వాసన లేనట్టి పువ్వు వాసినిగాంచెన్

  రిప్లయితొలగించండి
 31. కాసులను గుమ్మరించుచు
  మోసము మీఱంగ నెగ్గి పుడమిని నేలన్
  వాసికి నెక్కుటఁ గనమే
  వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్


  వాసిగ వేయ దండను బ్రపన్నుఁడు భక్తిని విష్ణుమూర్తికిన్
  వాసన రాక యున్నఁ గని పండితు లచ్చెరు వంది నిల్వఁగాఁ
  దా సరి తూఁగఁ గుబ్జకముఁ దద్దయు కృత్రిమ హార మందు నా
  వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్

  [కుబ్జకము = చేమంతి]

  రిప్లయితొలగించండి
 32. పైసలు లేకపోయినను పామరు వోలెను నుండకుండగా
  వీసము మాత్రమున్ జలము వీడక ధైర్యము తోడనుండుచున్
  మాసము మాసమున్ ధనము మందులు,బీదలకున్ నియోగించుటన్
  వాసన లేనిపువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్

  రిప్లయితొలగించండి
 33. ఆ సరసాంగి దాల్చి సకలాభరణంబుల వేడ్క వేదికన్
  జేసె ప్రదర్శనంబతి విశిష్ట సువర్ణ విభూషణాకృతుల్
  వాసిగ పద్మమై మెరయ వజ్రపు ముక్కెర గాంతులీనుచున్
  వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్

  రిప్లయితొలగించండి
 34. మిత్రులందఱకు నమస్సులు!

  చేసియుఁ బుణ్యముల్; విమత జీవుల దౌష్ట్యము స్వాంతమందునన్
  వాసిగ లక్ష్యపెట్టకయె, బాసటగాఁ జని, మేలుఁ గూర్చియున్;
  దోసము లేవి సేయకయె, తోషము మన్నన లిచ్చు, జన్మపున్

  వాసన లేని పువ్వు, బుధవర్గపు మెప్పును బొందె వింతగన్!

  రిప్లయితొలగించండి
 35. మఱొక పూరణము:

  వాసరవాసి పల్కుఁజెలి భారతికిం గరమం దలంకృతిం
  జేసిన స్వర్ణపుష్పమది చేసెను కాంతుల వింతశోభలన్!
  బూసిన సత్స్వరూపమున భూషగ నుండినయట్టి పైఁడిదౌ

  వాసన లేని పువ్వు, బుధవర్గపు మెప్పును బొందె వింతగన్!

  రిప్లయితొలగించండి
 36. వాసన తో కూడిన విరి
  వాసుకిశయనున కిడంగ వరముల నొసగున్
  వాసిగ హరి,సతతము దు
  ర్వాసను లేనట్టి పువ్వు వాసినిగాంచెన్

  రిప్లయితొలగించండి