5, నవంబర్ 2024, మంగళవారం

సమస్య - 4934

6-11-2024 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె”

(లేదా...)

“రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో”

19 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
'పేడి' వాడైన రచనలో వాడి చూపి
జంట శృంగార కేళిని సరసమొప్ప
మీరి వ్రాయగ 'వాస్తవమెరుఁగదనఁగ
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె!

చంపకమాల
పసగల భావమున్ మిగుల భాషణమద్దుచు వ్రాయు 'పేడి'యే
ముసిరిన రాగమై సతిని పుల్కలముంచిన సన్నివేశమున్
గుసగుసలాడు పోకడల గూర్చఁగ, 'వాస్తవమెర్గదంచనన్'
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో!

Sitharamayya Solasa చెప్పారు...

ఇంట నొంటరిగ సమయమెటుల గడచు
ననుచు చింతించుచుండగ ననువుగ దన
మందల జేరి సలుపుచుండు మాటలందు
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె

BMahalakshmi చెప్పారు...

విషమనేత్రంబులయ్యవి విందు గనవు
భూతియుండినదేహంబు పొసగదెందు
వల్లకాడునవానికిపడకయుండు
రసికుడనిమెచ్చె షండుని రామయొకతె

విరించి చెప్పారు...


పరమ దుర్మార్గుడైనట్టి పాలకుడను
సద్గుణాభిరాముడటంచు శ్లాఘనమ్ము
జేయ గాంచినట్టి కవియె చెప్పెనిట్లు
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె.



అసురుని మించి లోకులకు హాని యొనర్చెడు కూళ్ళమారి గె
ల్చి సువిదుడైన చాలునిక చెంతన జేరిన వందిమాగధుల్
ధిషణను జేయ గాంచి నొక ధీరవరుండు వచించె నిట్టులన్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ఉబుసు పోకకు మాటాడ యువతి కడకు
వచ్చి ముచ్చట లాడుచు వనిత తోడ
మరులు గొలుపుచు భాషించు మాట లందు
రసికుడని మె చ్చె షండుని రామ యొ క తె

జిగురు సత్యనారాయణ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
M.B.G.TILAK చెప్పారు...

మిసిమి గలజాణ చదివిన మేటి రచన
రసభరితము కడుంగడు రమ్యమనుచు
గుసగుసలను కవి లిఖించె కసినిబెంచ
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె

మిసమిసలాడు పద్మముఖి మీసరమీ కవనమ్మటంచు చా
టి సరసమైన శబ్దముల టిప్పణి వెల్వడ జేసి తత్కవిన్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో
గుసగుసలాడు రీతి నహ! గొప్పగ పేర్కొనె నంచు తెల్పుచున్

జిగురు సత్యనారాయణ చెప్పారు...

పసితనమద్ది పోక మరి బాలకవృత్తి చరించు వానికిన్
మిసమిసలాడు కన్యకను మేలును గోరుచుఁ జేయ పెండిలిన్
త్రసనమునొంద భార్యయన ధైర్యము నింప తలంచి వానినిన్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో!!

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

షండుఁడైనను మిక్కిలి సరసుఁడతఁడు
నాట్య శాస్త్రము నెరిగిన నర్తకుండు
భరతమునివోలె జూపించు భంగిమలను
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పసగల నాట్యకోవిదుడు భంగిమలందున సిద్ధహస్తుడే
ధిషణను జూపి నృత్యమును దీరుగ నేర్పెడు నొజ్జయాతఁడ
భ్యసనమునందు సంతమము నద్భుతరీతిని వెల్వరించు బల్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:మంద భాగ్యుడై రతిసుఖ మ్మొంద లేని
షండు డయ్యు పత్రికలందు సరసకథల
నూహ తో చక్కగా వ్రాసె నాహ! కథల
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె”
(శారీరకం గా నపుంసకుడు కానీ ఊహలలో రసికుడు అని ఒక రచయితని ఒక స్త్రీ మెచ్చుకున్నది.అతను సరసమైన కథలు బాగా రాస్తాడు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

చం:రసికత గోరునే గణిక ? రాల్చెడు కాసుల గాంచి మెచ్చు ,తా
విసుగు భరించియున్ ,తనను బిల్చిన వాడు రమింప లేకయున్,
నసగక హెచ్చు సొమ్మిడగ, నచ్చగ నాతని తోడి బేరమే
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో”
(ఒక పేద వేశ్య కోరుకునేది విటుడి రసికతని కాదు.సొమ్ము మాత్రమే.అనుభవించటం చేత కాకున్నా ఆశపడి సొమ్ము వదిలించుకు పోయే వాడే ఆమెకి మంచి బేరం.వాణ్ని నువ్వే రసికుడి వని మెచ్చుకుంటే వాడు మళ్ళీ మళ్లీ వస్తా డని ఆమె వ్యాపారసూత్రం.)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ అందమున మిన్న సరసమునందు ఘనుని
రసికుఁడని మెచ్చె షండుని రామ యొకతె
వైద్యులు చికిత్స నొనరించ భవిత విరిసె
పురుషుఁడుగ మార బ్రదుకున మోదమలర

చం॥ మిసమిసలాడు యవ్వనము మేలిమి సాధు గుణమ్ముఁ జూడఁగన్
రసికుఁడటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ, గంతుకేళిలో
మసలఁ జికిత్స వైద్యులటు మానకఁ జేయఁగఁ బూరుషుండునై
వసతిగఁ బొంద జీవనము భవ్యము రమ్యమునై చెలంగెనే!

మి ని వి అనుకున్నానండి.

నేటి శాస్త్ర విద్య చాలా లోపాలు సరిచేయగలదండి.
శాస్త్రమును నేటి స్థితిగతులను పరిగణలోకి తీసుకొనవలయునని నా విన్నపము

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సుస్వర గళుండు సకల జన స్వభావ
వేత్త సంగీత విద్యా వియత్తలైక
భాసమానుఁడు నాట్య క ళాసమాన
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె


పస గల కారణమ్ములను బల్కుచు నెల్లరు విశ్వసింపఁగాఁ
గొసరుచు వేఁడుఁ గాలమును గోరినఁ గుందక తీర్పు మప్పు నా
విసువక రేపు రే పనుచు వేఁడును నిత్యము రమ్య మర్మ వా
గ్రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో

[కంతు= గడువు]

Subbarao Pochiraju చెప్పారు...

పేడి రూపము కలిగిన పేరిశాస్త్రి
కాముకులగూర్చి చక్కని కధలు వ్రాయ
చదివి వాటిని పూర్తిగా సంతసమున
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె

Subbarao Pochiraju చెప్పారు...

కసిగలుగంగచూపులను గాంచిన తోడనె మానసంబునన్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో
రసికులనంగవారుపరివ్రాజకులౌదురు కేళిలేనిచో
రసికత యంత గొప్పదిలరాజుల రాజ్యములేగతించెనే

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.


అందమైనవాడు చదువులందు మేటి
సద్గుణమ్ములు కలిగిన సజ్జనుండు
సరస సంభాషణమ్ములు జరుపుచుండ
రసికుడని మెచ్చె షండుని రామ యొకతె.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

చదువు సంధ్యలు కలవని చక్కనైన
సరస సంభాషణములందు చతురుడంచు
సకల సుగుణాభిరాముడౌ సన్నిహితుని
రసికుడని మెచ్చె షండుని రామయొకతె