13, నవంబర్ 2024, బుధవారం

సమస్య - 4942

14-11-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విభవనాశమునకు విష్ణుపూజ”
(లేదా...)
“విభవధ్వంస మొనర్పఁగా మురహరున్ వేడన్ వలెన్ మానవుల్”

12 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

స్థిరముచిత్త మందు జేయుచు జపమును
మనసులొంగనీక మానవుండు
తమసుజీల్చివెలుగు తపన విషయముల
విభవ నాశమునకు విష్ణుపూజ

Sitharamayya Solasa చెప్పారు...

అక్రమమగు గడన యడరుట గని యట్టి
విభవనాశమునకు , విష్ణుపూజ
జేసి నంతనె యది చెంగకుండు , తగిన
దండన నిడినపుడె తగ్గ గలదు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు:

ఆటవెలది
వామనుండనంగ వైరి విష్ణువె బలి!
మూడడగుల నేల ముంచనడిగె!
చెప్పిన వినకుండఁ జేయనెంచెదవేల?
విభవనాశమునకు విష్ణుపూజ!


మాయా జూదంలో ధర్మరాజు ఓటమిపై సామాన్యుల భావన:

మత్తేభవిక్రీడితము
అభయమ్మున్నది కృష్ణమూర్తి దరి! నిత్యంబుండ గానండయే
శుభముల్ గూర్చును పాండవేయుల కనన్ జూపించి కారుణ్యమే
సభలో ధర్మజుఁడోడు వేళ నిలుపన్ సాయంబుగా లేడనన్?
విభవధ్వంస మొనర్పఁగా మురహరున్ వేడన్ వలెన్ మానవుల్!

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
M.B.G.TILAK చెప్పారు...

విశ్వ కద్రువులను విరియించు తలపున
ప్రేమ నింపగోరి విశ్వ మెల్ల
మనసుపెట్టి జనులు తనరింత్రు రాక్షస
విభవ నాశ మునకు విష్ణుపూజ

శుభసంకల్పములే ప్రధానముగదా శోకంబు కేండ్రించగా
ప్రభవించున్ గద దుష్టబుద్ధి మదిలో పాపంపు కార్యంబులే
ప్రభువా రక్షణ గూర్చమంచు రయమున్ వ్యాపించు రేద్రిమ్మరీ
విభవధ్వంస మొనర్పఁగా మురహరున్ వేడన్ వలెన్ మానవుల్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

బాధ పడె డి వాని వాత్సల్య భావాన
నాదు కొనుట మాని హరి హరి యని
విభవ నాశ మునకు విష్ణు పూజ ల వేల
యనుచు ప్రశ్న వేసె నాధు నికుడు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సాధు జనుల నెపుఁడు సంకటపెట్టెడు
దుష్ట రక్కసులను దునుము కొఱకు
సలుప వలయు భక్తులెల్లరు రాక్షస
విభవనాశమునకు విష్ణుపూజ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అభయంబిచ్చెడు దైవరాయడగు కంసారిన్ సదా భక్తితో
శుభముల్ గూర్చఁగ వేడుకొందు మదిలో క్షోభమ్ము పోకార్చగన్
విభుడౌ శౌరియె దిక్కు యెల్లరకు, నిర్వేదంబు బాపంగ జీ
వి భవధ్వంస మొనర్పఁగా మురహరున్ వేడన్ వలెన్ మానవుల్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఆ.వె:విఘ్ననాశమునకు విఘ్నేశు పూజయు
శత్రు నాశమునకు శక్తి పూజ
జేయు చుండ వచ్చు చిన్న లక్ష్యమ్ము ల
వి, భవనాశమునకు విష్ణుపూజ

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:అభయ మ్మిచ్చునె శాస్త్ర పాండితియు,భార్యాపుత్ర బంధుత్వముల్
విభవ మ్మెంతయు నైన కాలుడు సమీపించంగ ,కాంతాళి పై
నభిమానమ్మును గాచునే తుద కనిత్యమ్మే కదా నిల్చు నే
వి?భవధ్వంస మొనర్పఁగా మురహరున్ వేడన్ వలెన్ మానవుల్”
(భజగోవింద శ్లోకాల లో విషయం.సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్ కరణే మొదలైనవి.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అన్య దేవతలను నర్చింప నిత్తురు
భోగములను గాని ముక్తి నిడరు
విన్మ కోరితేని జన్మరాహిత్యము
విభవ నాశమునకు విష్ణుపూజ


లభియించెన్ స్వ పురాకృ తాత్యధిక కర్మవ్రాత సంజాత దు
ర్లభ మర్త్యోన్నత జన్మ సత్ఫలము లీలాలోలు సద్భక్తితో
నభ యార్థం బిల సాధు రక్షణకు దైత్యాటోప రాజన్మహా
విభవ ధ్వంస మొనర్పఁగా మురహరున్ వేఁడన్ వలెన్ మానవుల్

విరించి చెప్పారు...


సంకటముల నాడు స్మరియించు స్కంభుని
తోలగనేమి వాడు దూరమవడె
పరమును మరిపించు భాగ్యములవియేల
విభవనాశమునకు విష్ణుపూజ.



విభవంబందిన ధర్మజుంగనగ తావెన్నుండనే మర్చుచున్
విభుడన్ నేనని జూదమొడ్డి పలు నాభీలమ్ములన్ బొందెనే
నభయున్ దూరము జేయు బుద్బుతపు తుల్యంబైన భోగాలనే
విభవధ్వంస మొనర్పఁగా మురహరున్ వేడన్ వలెన్ మానవుల్.