23, నవంబర్ 2024, శనివారం

సమస్య - 4951

24-11-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసె”
(లేదా...)
“శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై”

15 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
దశనెరుగక విద్యార్థిగ
నిశితఁపు దృష్టి గురుసతియె నీమము దప్పన్
వశపడ సైగలు సేయు శ
శి శిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్

BMahalakshmi చెప్పారు...

వశమై విషయములకుతా
నాశన్ తారయుగురునకు నంతేవాసిన్
కృశయైకలిసెను గాదే
శిశిరమునకుతాళలేక శిష్యునికలసెన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మత్తేభవిక్రీడితము
దశనేమాత్రము లెక్కఁ జేయకయె విద్యార్థుండునై మోహమై
నిశితంబౌ మరు తూపులట్లు గురుపత్నిన్ జూడఁగన్ జంద్రుఁడే
వశమై తార విచక్షనన్ మఱచి లేవన్ గన్గిలంగన్ నివే
శి శిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై!

విరించి చెప్పారు...

కశిపువు లకొనంగ దలచి
ప్రశస్తి నందిన వణిజుడు ప్రశితుండనుచున్
యశమును గలిగిన గురువిక
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్.
. .

యశము గలిగిన గురువతడు
ప్రశస్తి నందిన వణిజుడు ప్రశితుండనుచున్
కశిపువు లకొనంగ దలచి
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్.
.. .

యశమున్ గన్న సురేజ్యుకున్ శిశువుగా నంభోజుడే చేరగా
దశవాజిన్ గని తార వాని ముఖ సౌందర్యమ్ము నే మెచ్చుచున్
వశమయ్యెన్ గురుపత్ని, చందురుడు సంవాసమ్మునే గోరగా
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై.

Sitharamayya Solasa చెప్పారు...

నిశసమయమందు గలిగెడు
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్
నిశాంతమున గల గురువు ,
కుశలముగ శయించుట కొక గుడ్డను గోరన్

జిగురు సత్యనారాయణ చెప్పారు...

శశి సౌందర్యము చంచలాక్షుల మనోచాంచల్య మూలంబు!తాన్
వశమున్ దప్పెను తార! దేవగురుడే వారింప నిల్వంగ కా
ము శరమ్ముల్ మరి బాధఁ బెట్ట ప్రియమై ముద్దాడు నందాల రా
శి శిరమ్మున్! భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై!!

M.B.G.TILAK చెప్పారు...

శశి తాఁ జేరెను సురగురు
ని శాస్త్ర విజ్ఞానమరయ నిశ్చలమతియై
విశదముగద తారకయే
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్

విశదంబయ్యె రసానుభూతి నిడునా ప్రేమైక కావ్యంబులో
శశితానభ్యసమొంద దేవగురువున్ శ్రద్ధాళువైకొల్వగా
శశిపైతారకుఁ బుట్టె సంతమము నిస్సందేహ కామాంధతన్
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

శశి తాఁజేరె బృహస్పతిఁ
విశదమ్ముగ నేర్చుకొనఁగ విద్యలు, మారున్
విశిఖము తారకు నాటగ
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

శశి తాఁ జేరె బృహస్పతిన్ దెలియగా శాస్త్రంబులన్, మారునిన్
నిశితమ్మౌ విశిఖమ్ములేగురుని పత్నిందాక గాటంబుగా
శశినింగోరెను మానసమ్మున మరుల్ సమ్మూర్ఛముం గాగఁ దా
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ వశమా యవ్వన తాపపు
దిశను మరల్చి చలి సైఁచి దీటుగ వరలన్
విశదముగఁ దెలిపె తారయె
శిశిరమునకుఁ దాళలేక శిష్యనిఁ గలిసెన్

మ॥ విశదమ్ము కద తార త్రమ్మటయు నావేశంపు వృత్తాంతమున్
వశమే యవ్వన తాపరంతు చలిలో బాధించఁగా సైఁచుచున్
దిశమళ్ళించ జనాళికెల్లరకునున్ దెల్పంగ దౌర్లభ్యమై
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై

త్రమ్మట ప్రవర్తన రంతు సందడి
దౌర్లభ్యము అసాధ్యము నిఘంటువు సహాయమండి

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

వశమును దప్పిన గురువై
నిశలో శీతముకు వణ కి నీరస పడుచున్
కుశలత కొఱ కై వెడలియు
శిశి రమునకు దాళ లేక శిష్యుని గలి సెన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:కృశియింపగ సంపదలున్
నశింప స్వాస్థ్యమ్ము గురుడు నమ్ముచు తనకున్
వశుడని యవసానమ్మను
శిశిరమునకుఁ దాళలేక శిష్యునిఁ గలిసెన్
(తన జీవితం లో అవసానదశ బాధలనే శిశిరాన్ని తట్టుకో లేక గురువు శిష్యుణ్ని కలిసాడు.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

నిశలందు వాడుట కయి య
నిశమ్ము కంబళ మడుగఁగ నిశ్చింతగ, స్వీ
య శరీర రక్షణమునకు
శిశిరమునకుఁ దాళ లేక, శిష్యునిఁ గలిసెన్


వశమై పైఁడికి వేఁడఁ గాంచనము సంభావించి శిష్యుండు వే
భృశ మిచ్చెన్ గురు దక్షిణం దలపయిం బెట్టంగ మొత్తమ్ము నా
వశయే భార నివారణార్థము వెసం బ్రార్థింప, గాంగేయ రా
శి శిరమ్మున్ భరియింప లేక, కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:వశమం దుండెను శిష్య యంచు భ్రమలో పాటింపకే నీమముల్
శిశువుల్ వారని యెంచ సద్గురువు తా శీలమ్ము గోల్పోయి కా
ముశరమ్మున్ భరియింప లేకయు ముగింపున్ లేని శైత్యాన నా
శిశిరమ్మున్ భరియింపలేక కలిసెన్ శిష్యున్ మదోన్మత్తయై
(అది శిశిరమే ఐనా ఇంకా హేమంతపు చలి తగ్గ లేదు. ఆ గురువు యొక్క ఒక శిష్యురాలు ఒక శిష్యుని తో కలిసింది.)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

నశియింపగ నాస్తులిలను
శిశువుల పోషించ నెంచ చేతుల యందున్
పస యేదియు లేక గురువు
శిశిరమునకు తాళలేక శిష్యుని గలిసెన్