28, నవంబర్ 2024, గురువారం

సమస్య - 4956

29-11-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామునితో వైరమది పరమ్మును జేర్చున్”
(లేదా...)
“రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్”
(వాడ్రేవు వేంకట సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

16 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

కోమలిసీతనుదెచ్చెను
కామనరావణుడునంతకాంచగ వారిని
సేమమునెంచెనుతనకును
రామునితోవైరమది పరమ్మునుజేర్చున్

BMahalakshmi చెప్పారు...

వైరిన్

రామోక్తం చెప్పారు...

పామరమున జయ విజయులు
కౌమార మునీంద్ర శాపకారణులై ఈ
భూమిని జనించ వారికి
రామునితో వైరమది పరమ్మును జేర్చున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ప్రవచనకర్త భాష్యము:

కందం
ఆ మాధవి సీతఁ గొనుట
దామోదరుఁడిడిన వరము, ద్వారి విజయుఁడే
కామి దశాస్యుడు హరియగు
రామునితో వైరమది పరమ్మును జేర్చున్

ఉత్పలమాల
భామిని సీత మాధవిగ భావనఁ జేయకె రావణాసురుం
డామెను దెచ్చు ద్వారి విజయాఖ్యుఁడె! శౌరి వరంపు మర్మమే!
కామిగ సేమమున్ మఱచి గర్వము మీరగ పద్మనాభుఁడౌ
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్

Sitharamayya Solasa చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
జిగురు సత్యనారాయణ చెప్పారు...

కుంభకర్ణుడితో రావణుడు పల్కుట:-

భీమము గాగ శాపమది ప్రీతిగ జన్మలు జేసె మూడుగన్
క్షేమముఁ గూర్చఁ జంపె తొలి జీవితమందు వరాహ సింహమై
భామను దొంగిలించితిని బద్ద విరోధులమైతిమిచ్చటన్
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్!!

విరించి చెప్పారు...

పామరు డవైన యట్టి య
సామాన్యుని చేత బడుచు శరఘాతముతో
నామమడుగ పుణ్యమె శ్రీ
రామునితో వైరమది పరమ్మును జేర్చున్.


శ్యామను బుట్టు ప్రాణులిట శాశ్వతులై మనలేరు గాదుటే
యా మహితాత్ము నంబకము లంతము జేయ విముక్తి దక్కదే
తామరకంటియే యిలను ధర్మము నిల్పగ పుట్టినట్టి శ్రీ
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్.


తామరకంటి నాడచట తాపసి శాపమెఱంగి జాలితో
మీ మరణంబు గోరుచును మృత్యువు ద్వారవిముక్తి నివ్వగా
భూమిని పుట్టెనిప్పుడు ప్రమోదము గూడును మీకు నింక శ్రీ
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్.

Sitharamayya Solasa చెప్పారు...

ఏమని జెప్పమనెదవో
నీమమువిడి నటననైన నెగులును నెరపన్
నా మాన్యుడైన తారక
రామునితో వైరమది పరమ్మును జేర్చున్

M.B.G.TILAK చెప్పారు...

దోమటిగా సీతను గొని
ధీమతినే బ్రహరణమున డీకొనియున్నన్
గాముకుని గమ్యమొకటే
రామునితో వైరమది పరమ్మును జేర్చున్

దోమటిగా నయోనిజను దొంగిలి లంకను దాచి యుంచినన్
ధీమతి యైన రాఘవుని దీటుగ డీకొని బోరుసల్పినన్
గాముకుడైన రావణుని గమ్యము మోక్షము సంతరించుటే
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్

[ధీమతి = బుద్ధిశాలి]

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తామరసాక్షుఁడైన హరి తా జనియించెను రామభద్రుగా
భూమిజ సీతనెత్తుకొని పోవఁగ లంకకు రావణుండు శ్రీ
రాముఁడు వారిధిన్ గడఁచి రావణుఁ ద్రుంచెను స్వర్ణలంకలో
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తామరసాక్షుఁడు శ్రీహరి
రామునిగా నవతరించి రావణుఁ ద్రుంచెన్
రాముడు పరమాత్ముండే
రామునితో వైరమది పరమ్మును జేర్చున్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ నేమము భక్తిశ్రద్ధలు
ధామముఁ జేర్చఁగ రిపులుగఁ దలచుచును సదా
స్వామియె వధించఁ జేరరె
రామునితో వైరమది పరమ్మును జేర్చున్

ఉ॥ స్వామినిఁ జేరు దారులవి సాదర భావము భక్తినిష్ఠలున్
ధామముఁ జేర్చ వైరిగను దల్చుచు నిత్యము సజ్జనాళికిన్
నేమము దప్పి హంసనిడ నేతయె త్రుంచఁగఁ బొందవచ్చునే
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్

నేత విష్ణువు నిఘంటువు సహాయమండి.
విరోధులుగా వారు చేసిన పాప కార్యములు సజ్జనులను భక్తులను హింసుచుటే కదండి!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

రామ విరోధిని నింద్రుం
డా ముక్కంటి మఱి బ్రహ్మ యైనను గట్టా
నీ మహిఁ గావ నశక్యులె
రామునితో వైర మది పరమ్మును జేర్చున్

[ బ్రహ్మా స్వయమ్భూశ్చతురాననో వా
రుద్రస్త్రిణేత్రస్త్రిపురాన్తకో వా.
ఇన్ద్రో మహేన్ద్రస్సురనాయకో వా
త్రాతుం న శక్తా యుధి రామవధ్యమ్৷৷ వా.రా. 5.51.45]



రాముఁడు విష్ణువే ధర నరప్రవరుండు వికుంఠవాసుఁడే
ధామ సురక్షకుల్ పతిత ధర్ములు రావణ కుంభకర్ణులే
నీమము తప్పఁ బుట్టి రిట నేల గణింపఁగ శాపముక్తికై
రామునితో విరోధము పరమ్మునుఁ జేరఁగ సాధనమ్మగున్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

తామస హరుని త లంచుచు
నీమము నన్ భక్తి తోడ నిర్మల మతు లై
ధీమతి వ్యాజ స్తు తి గా
రాముని తో వైర మది పర మ్ము ను జేర్చున్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

(రావణుడికి విభీషణుని ఉద్బోధ)
నీమమును దప్పి సీతను
తామసమున దెచ్చినావు తంటాలెదురౌ
సామాన్యుడు కాదట శ్రీ
రామునితో వైరమది పరమ్మును జేర్చున్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

నేమము తప్పుచు నసురుడు
తా ముని వలె వేగమెచని తరుణీ మణినే
పామరుడై బంధించగ
రాముని తో వైరమది పరమ్మున చేర్చున్