15, జూన్ 2010, మంగళవారం

సమస్యాపూరణం - 12

కవి మిత్రులకు వందనం. ఈ రోజు పూరించవలసిన సమస్య .....................
శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె.

22 కామెంట్‌లు:

  1. కలసి యున్న నేమి? తొలగి యున్నను నేమి?
    అంత యొకటె జూడ అంచు తెలుప
    చక్రి యెద్దు నెక్కి చేరె తెలంగాణ
    శివుడు గరుడు నెక్కి సీమ కేగె.

    రిప్లయితొలగించండి
  2. వరదు విష్ణు జేరి వైకుంఠమున నుండ
    స్వర్గ సీమ యందు సభకు పిలుపు
    నందు కొనగ నంది యందుబాటున లేక
    శివుడు గరుడునెక్కి సీమ కేగె

    రిప్లయితొలగించండి
  3. మురళీ మోహన్ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మంచి పూరణతో నా బ్లాగులోకి అడుగుపెట్టారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. ఫణిప్రసన్న కుమార్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఆ.వె.
    శివుఁడనెడి తెరువరి సీమకేగఁదలచె
    వెంకటాద్రి రైలు వెళ్లి పోవ
    కాన వచ్చెనంత గరుడనెడొక బస్సు
    శివుఁడు గరుడు నెక్కి సీమ కేగె!!

    (వివరణ: శివుడు అనే పేరు గల ఒక ప్రయాణికుడు సీమకు వెళ్లాలనుకొని వస్తే వెంకటాద్రి ట్రైను మిస్సయ్యింది. దానితో RTC వారి గరుడ బస్సు ఎక్కి సీమకు వెళ్లాడు.)

    రిప్లయితొలగించండి
  6. సత్యనారాయణ గారూ,

    మంచి పూరణమ్ము మంచి ఛలోక్తితో
    పద్యరత్న మొకటి వ్రాసినావు
    సంతసమయె జిగురు సత్యనారాయణా!
    అందుకొను మిదె యభినందనములు.

    రిప్లయితొలగించండి
  7. @కోడిహళ్ళి వారు: మూడవపాదం యతి చూడాలనుకుంటాను.

    @జిగురు సత్యనారాయణ గారు: నేను మొన్నే ’గరుడు’ నెక్కి సీమకెళ్ళి వచ్చానండి. భలే తట్టింది మీకు.

    భావం కుదరకపోయినా నా వంతు కిట్టింపు.శంకరయ్య గారు, భారం మీదే.

    అనగ అనగ సీమ. అందు రాకొమరి. ఆ
    కొమరి వలచె నొకఁడు. కొయ్య గరుడుఁ
    జేసె. విష్ణు వేస మేసి జిత్తు
    శివుఁడు,గరుడు నెక్కి సీమ కేగె.

    (కథాసరిత్సాగరంలోనో, పంచతంత్రంలోనో ఓ కథ. ఒక వడ్రంగి రాకుమారిని ప్రేమిస్తాడు. ఆమెకోసం కొయ్యతో గరుడుని చేసి, విష్ణువు వేషంలో ఆమె వద్దకు వెళ్ళి వంచిస్తాడు.)

    శివుడు - నక్క
    జిత్తు శివుడు - జిత్తులమారి నక్క.

    రిప్లయితొలగించండి
  8. @కంది శంకరయ్య గారు :
    పని ఒత్తిడి వలన మీకు సమాధానం చెప్పడం ఆలస్యం అయింది. అక్షర దోషాలున్నాయని నేనే వ్యాఖ్యను తొలగించితిని. క్షంతవ్యుడను.


    లోకులెల్ల గొలిచె లోకోత్తరముగా
    శివుడు కేశవుoడు ఏకమనుచు,
    హరియు నంది నెక్కె, ఆనందముప్పొంగ
    శివుడు గరుడు నెక్కి సీమకేగె.

    (నేను, మా సుబ్బుమావ సరదాగా బయటకు ఎక్కడికైనా వెళ్ళినపుడు ఒకరి బండి ఒకరు మార్చుకుంటూ ఉంటాము. ఆ భావంతో ఈ పూరణ)

    రిప్లయితొలగించండి
  9. @రవి: చక్రి లో రెండవ అక్షరం 'రి' కి, చేరె లో రెండవ అక్షరం 'రె' కి ప్రాస యతి కుదురుతుందని అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  10. అర్ధాలు చూడకుండానే అర్ధమయ్యాయి ఇవాల్టి ఈ పద్యాలు. ఒక్క రవి గారి పద్యం మాత్రం ఇబ్బంది పెట్టింది. కానీ ఆయన చక్కగా ప్రతి పదానికి అర్ధం రాసి నా ఇబ్బంది ని పోగొట్టారు.

    రిప్లయితొలగించండి
  11. జిగురు సత్యనారాయణ గారు రాసిన పద్యం చాలా సరదాగా వుంది.

    రిప్లయితొలగించండి
  12. విశ్వగతినిగూర్చి విపులచర్చనుజేయ
    శంభుడేగుదెంచె చక్రిచెంత
    ఆంధ్రదేశమందు ఆలయములగోడు
    ఆలకించిరపుడె హరియు హరుడు

    సహజగుణముచేత ’సంరంభియై’హరి
    బసవునెక్కిచనియె వాయుగతిన
    ఆర్త త్రాణయందు అద్వితీయుడయిన
    శివుడు గరుడు నెక్కి సీమ కేగె

    రిప్లయితొలగించండి
  13. @ కంది శంకరయ్యగారు, మీ ప్రోత్సాహంతో నేనూ ఒక సమస్య సృష్టించి బ్లాగులో పెట్టానండి.. చూసి పూరించగలరు.

    @ మిత్రులారా, అందరూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  14. రవి గారూ,
    మీ పూరణలో మూడవపాదంలో గణదోషం ఉంది. మూడవ పాదంలో చివర రెండు ఇంద్రగణాలకు బదులు సూర్యగణాలే వేసారు. అలాగే "విష్ణు వేసమేసి" అన్నచోట వేసము+ఏసి అని పదవిభాగం. వేసి సరియైన రూపం. ఆ పాదాన్ని ఇలా సవరించాను.
    "జేసె విష్ణు రూపుఁ జేకొని యా జిత్తు"

    రిప్లయితొలగించండి
  15. సుమిత్ర గారూ,
    మంచి భావంతో సమస్యను పూరించారు. అయితే రెండవ పాదంలో యతిదోషం ఉంది. దానిని ఇలా సవరించాను.
    "శివుఁడు కేశవుండు చెలిమిఁ జేయ"

    రిప్లయితొలగించండి
  16. మురళీమోహన్ గారూ,
    క్షమించాలి. ప్రాసమైత్రి అలా కుదరదు. ప్రాసస్థానంలో రెండు చోట్లా సంయుక్తాక్షరమే ఉండాలి. గమనించగలరు.

    రిప్లయితొలగించండి
  17. చదువరి గారూ,
    స్వాగతం. సమస్యాపూరణకు రెండు పద్యాలను వ్రాయడమనే క్రొత్త సంప్రదాయానికి తెర లేపారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  18. కలసి యున్న నేమి? తొలగి యున్నను నేమి?
    అంత యొకటె జూడ అంచు తెలుప
    చక్రి యెద్దు నెక్కి చనెను తెలంగాణ
    శివుడు గరుడు నెక్కి సీమ కేగె.

    ఇప్పుడు సరిపోయింది అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  19. మురళీ మోహన్ గారూ, ఇప్పుడు సరిపోయింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    01)
    ____________________________________

    విష్ణు మూర్తి వద్ద - వేడిమి కన్ దొర
    ఎరువు పుచ్చు కొనెను - గరుడి నంత !
    వివిధ లోకములను - వేగంబుగా జూడ
    శివుఁడు గరుడు నెక్కి - సీమ కేగె !
    ____________________________________

    వేడిమి కన్ దొర = శివుఁడు

    రిప్లయితొలగించండి
  21. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. ఆ.వె.
    నగజవెంటరాగ నారాయణునిజూడ
    ప్రీతినరిగినారు ప్రేమధనులు
    విహగమచటగాంచి వేడుకమీరగ
    శివుడుగరుడునెక్కి సీమకేగె

    రిప్లయితొలగించండి