11, జూన్ 2010, శుక్రవారం

సమస్యాపూరణం - 8

కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ........
హంతకుఁడు దేవుఁడై పూజలందుకొనెను.

21 కామెంట్‌లు:

  1. సంతసముఁ గాంచ లోకమ్ము జనకజ పతి
    పంతమొప్పగ రావణు బాధ బాప
    చెంతకును చేరి సంహరించె. దశ కంఠ
    హంతకుఁడు దేవుఁడై పూజలందుకొనియె.

    ఈ క్రింది సమస్యను పూరింపగలరు.

    తమ్ముని భార్య తల్లియగు తత్వవిదుల్ పరికించిచూచినన్.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ చింతా రామకృష్ణారావు గారూ,

    అలర నాంధ్రమృతము బ్లాగు నందు సతము
    షడ్రసోపేతమైన భోజనము వోలె
    వివిధ సాహితీప్రక్రియల్ వెలయఁ జేయు
    పద్య కవితా నిధీ! నాదు బ్లాగునకును
    సఖుఁడ! రామకృష్ణారావు ! స్వాగతమ్ము.

    రిప్లయితొలగించండి
  3. నరకు డనువాడు ప్రజలను నష్ట పరచి
    భువికి భారమై పోయెను భోగి యగుచు
    ప్రజలు మనసార కోరగా వాని యంతు
    హంతకుడు దేవుడై పూజ లందు కొనెను

    రిప్లయితొలగించండి
  4. శ్రీ చింతా రామకృష్ణారావు గారూ, మీరిచ్చిన సమస్యకు నా పూరణ.

    ఇమ్ముల రామభూవరున కేమగు నూర్మిళ? పెంపుతో యశో
    దమ్మ మురారి కేమగు? నయంబుగ వస్తు గుణాది సత్య రూ
    పమ్ము గ్రహించు వారెవరు? పైన నరుంధతి యెట్లు కాంతు మెవ్విధిన్?
    తమ్ముని భార్య; తల్లి యగు; తత్త్వవిదుల్; పరికించి చూచినన్.

    (క్షమించాలి. ఇంతకంటె మరో దారి తోచలేదు)

    రిప్లయితొలగించండి
  5. హరి దోర్నాల గారూ,
    మంచి పూరణ. అభినందనలు. మూడవపాదం చివర "వానిఁ జంపు" అని ఉంటే బాగుండేదేమో ....

    రిప్లయితొలగించండి
  6. చింతా రామకృష్ణారావు గారూ, నా పూరణలో ఒక సవరణ ... "పైన నరుంధతి యెట్లు కాంతు మెవ్విధిన్" అనేదాన్ని "పైన నరుంధతిఁ గాంతు మెవ్విధిన్" అని చదవండి.

    రిప్లయితొలగించండి
  7. ఎంత సాధన చేసిననేమి? ఇలను
    శాంతిసౌఖ్యముల్ దోచేడు స్వార్థబుద్ది,
    షడ్రిపులను, శక్తిని జూపి సంహరించు
    హంతకుడు దేవుcడై పూజ లందుకొనెను

    రిప్లయితొలగించండి
  8. సుమిత్ర గారూ,

    అరిషడ్వర్గమ్ముల సం
    హరణక్రియఁ దెలిపి దివ్యమగు పూరణమున్
    సరగున నొసఁగిన నీకిదె
    చిరాభివందనములేను చేతు సుమిత్రా!

    రిప్లయితొలగించండి
  9. కంది శంకరయ్య గారు,

    సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. నమస్తే,
    నాకు పద్యాలు రాసేతంతటి పాండిత్యం లేకున్నా చదవాలని, నేర్చుకోవాలని ఆసక్తి ఉంది.
    మీరు మీ బ్లాగ్ ద్వారా మాకు ప్రతి రోజు మంచి పద్యాలు అందిస్తున్నారు. ప్రతి రోజు చూస్తున్నాను మీ బ్లాగుని.
    మీరు చేస్తున్న ఈ పనికి నిజంగా అభినందనీయులు.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. సాయి ప్రవీణ్ గారూ, నా బ్లాగు మీకు నచ్చినందుకు సంతోషం. మీవంటివారి ప్రోత్సాహమే ఏ బ్లాగైనా నిరాటంకంగా కొనసాగడానికి దోహదపడుతుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. ఆర్యులారా!
    తమ్ముని భార్య తల్లి యగు తత్వవిదుల్ పరికించి చూచినన్.
    అని నేనిచ్చిన సమస్యను చాలా చమత్కారంగా అద్భుతంగా పూరించారు చాలామంది.
    ఇక సమస్యనైతే ఇచ్చాను గాని పూరణ చేసి చూపవలసిన ధర్మం మరువరాదు కదా! అందుకని నేను చేసిన పూరన మీముందుంచుతున్నాను. పరిశీలించి మీ అభిప్రాయం తెలియఁ జేయ గలరని ఆశ.

    సమ్మతి తోడచేసితిమి చక్కగపెండిలి నాదు తమ్ముకున్.
    గమ్మునవత్సరమ్మయె.సుఖమ్ముగసాగుచునుండెనంతలో
    తమ్మునిభార్య గర్భవతి.దైవ కృపామృత వృష్టఁ జేసి నా
    తమ్మునిభార్య తల్లియగు తత్వవిదుల్పరికించి చూచినన్.

    రిప్లయితొలగించండి
  13. చింతా రామకృష్ణారావు గారు,
    చాలా అద్భుతంగా ఉందండి.

    రిప్లయితొలగించండి
  14. "వృష్టఁ జేసి.., సతము.., తత్త్వవిదుల్.., నయంబుగ వస్తు గుణాది సత్య రూపమ్ము గ్రహించు వారెవరు..? "

    పై మూడు పదాలు, & ఆ వాక్యము అర్ధం కాలేదండీ. దయచేసి అర్ధం చెప్పగలరా..

    రిప్లయితొలగించండి
  15. ప్రణీత స్వాతి గారూ,
    అది "వృష్ట" కాదు. "వృష్టి". టైపు చేయడంలో పొరపాటు. "దైవ కృపామృత వృష్టిఁ జేసి" అంటే "దేవుని దయ అనే అమృతం వర్షించడం వలన" అని అర్థం.
    "సతము" అంటే ఎల్లప్పుడు.
    "తత్త్వవిదుల్" అంటే యథార్థ రూపాన్ని, సత్యాన్ని తెలిసినవారు.

    రిప్లయితొలగించండి
  16. ప్రణీత స్వాతిగారూ! చక్కని సమయంలో నాకు చిక్కని లేఖనాపర దోషాన్ని గుర్తింపించిన మీకు ధన్యవాదములు.
    ఇక మీరు అదీగిన సందేహాలు
    "వృష్టఁ జేసి.., సతము.., తత్త్వవిదుల్.., నయంబుగ వస్తు గుణాది సత్య రూపమ్ము గ్రహించు వారెవరు..? "
    వినండి.
    వృష్టఁ జేసి అని తప్పుగా లిఖింపఁబడింది.
    వృష్టిఁ జేసి అనాది సరైనది. వృష్టి=వర్షము.
    కర్ణామృత వృష్టి= కరుణ యనెడి అమృత వర్షము.
    సతము=ఎల్లప్పుడు.తత్త్వ విదులు=గర్భిణిని గుర్తించే తత్వము నెఱిగినవారు=వైద్యులు.

    రిప్లయితొలగించండి
  17. నా సందేహాలు పిచ్చివి అనుకోకుండా తీర్చినందుకు ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  18. కమ్మని రామకావ్యమున కైకజుఁడగ్రజు లక్ష్మణార్యుకున్.
    అమ్మగు మాండవీ. ప్రతిమ యందల లక్ష్మణుడగ్రజుండవున్.
    ఎమ్మెయినెన్నగన్ వరుసలీ ధరణిం జినతమ్మునక్కుపె
    త్తమ్ముని భార్య తల్లియగు తత్వవిదుల్ పరికించిచూచినన్.

    (రామాయణంలో భరతుడు పెద్దయితే, ప్రతిమా నాటకంలో లక్ష్మణుడే పెద్దగా చిత్రించారు. వరుసేదయినా, పెదతమ్మునిభార్య వదినమ్మ, చినతమ్మునికి తల్లే. )

    రిప్లయితొలగించండి
  19. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    01)
    __________________________________

    వరములను పొంది ,వానితో - గరువ మెక్కి
    ప్రజల నెల్లర హింసించు - పాతకులను
    రావణాదుల ,జంపిన - రాము డిలను
    హంతకుడు దేవుడై పూజ - లందు కొనెను !
    __________________________________

    రిప్లయితొలగించండి
  20. పేరిమిదశావతారముల్, వెన్నుడంది
    దుష్టశిక్షణగావించె నిష్టమొసగి
    అఘములన్నియుహరియించు, హరియె, దురిత
    హంతకుడుదేవుడైపూజలందుకొనెను

    రిప్లయితొలగించండి
  21. సూర్యవంశాధిపుండును సుచరితుండు
    మాత కౌసల్యపుత్రుడు మాన్యుడతడు
    దాశరథి, రాఘవుండును, దండి దనుజ
    హంతకుడు దేవుడై పూజలందు కొనెను !!

    రిప్లయితొలగించండి