1, నవంబర్ 2013, శుక్రవారం

సమస్యాపూరణం - 1222 (క్రోధమే మేలుగద)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
క్రోధమే మేలుగద సర్వగుణములందు.

28 కామెంట్‌లు:

  1. రామ నామము ప్రాణమై రామ దాసు
    శక్తి మీరగ గొలిచిన భక్తి మునిగి
    వెతల పాలిట బడ వైచె వేలు పనుచు
    కసిగ దూషించె రాముని పసిడి తొడిగి
    క్రోధమే మేలుగద సర్వ గుణము లందు

    రిప్లయితొలగించండి

  2. అదిమి పెట్టిన క్రోధమ్ము మతిని గాల్చు
    తొక్కి బెట్టిన క్రోధమ్ము బీపీ ని పెంచు
    మనసున ముళ్ళు గుచ్చిన వెలిగక్కిన
    క్రోధమే మేలుగద సర్వ గుణము లందు !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. కలికి రోటను బంధించె యలుక బూని
    చెవిని మెలిబెట్టి దండించె దైవ మనక
    భక్తి సామ్రాజ్య మందున ముక్తి నొంద
    క్రోధమే మేలుగద సర్వ గుణము లందు

    రిప్లయితొలగించండి
  4. భువి ననర్థములకు నెల్ల మూల మగును
    క్రోధమే, మేలుగద సర్వ గుణము లందు
    వినయ మయ్యదె సమకూర్చు విజయములను
    శాంతి సౌఖ్యము లొసగు యశమ్ము బెంచు

    రిప్లయితొలగించండి
  5. శిష్టజనులను బాధించ చేరివచ్చు
    దుష్టజనులను శిక్షించ దోషమేమి
    లేదు, వారిని వారించ, మీద జూపు
    క్రోధమే మేలుగద సర్వగుణములందు.

    రిప్లయితొలగించండి
  6. కష్టములు గలుగుటకును గార ణంబు
    క్రోధమే, మేలు గద సర్వ గుణము లందు
    దాన మయ్యది గలిగించు ధర్మ పధ ము
    దాన ధర్మము లీ రెండు మాన వలదు

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమానిగారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    క్రోధము గుణము కాదు శత్రువని తెలియ
    విశ్వ శాంతిని గోరుచు విడువ వలయు
    క్రోధమే ; మేలు గద! సర్వ గుణము లందు
    సత్త్వ గుణ మొక్కటే యిది సత్యమనగ

    రిప్లయితొలగించండి
  8. కలహముల కెల్ల మూల మీ ఖలము పైన
    క్రోధమే, మేలుగద సర్వ గుణము లందు
    శాంతమే, నరునకు మన శ్శాంతి నిచ్చు
    శాంతి సంతోషముల కంటె సౌఖ్యమేది.?

    రిప్లయితొలగించండి
  9. కలుగు కష్టనష్టములకుకారణమ్ము
    క్రోధమే, మేలుగద సర్వ గుణములందు
    శాంత మయ్యదె సాధించు సౌఖ్యములను
    సహన శీలము శాంతికి సాక్షి యగును

    రిప్లయితొలగించండి
  10. జిలేభి గారి భావము నచ్చి ...ఈ పద్యము..


    అదిమి పెట్టిన కోపము హానికరము
    మట్టు బెట్టగ క్రోధము మహికి శాంతి
    బయట బెట్టగ క్రోధము భాధ తీరు
    క్రోధమే మేలుగద సర్వ గుణములందు

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజే మా అబ్బాయిని ఆసుపత్రినుండి డిస్చార్జ్ చేశారు. ఇంతకు ముందే ఇల్లు చేరుకున్నాము. బాగున్నాడు. కాకుంటే దాదాపు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలి.
    ఈ పదిరోజులూ నాకు నిద్రాహారాలు సరిగా లేవు. శారీరక శ్రమకు, మానసిన ఒత్తిడికి లోనయ్యాను.
    మా అబ్బాయి యోగక్షేమాల గిరించి పరామర్శించిన మిత్రులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. పండిత నేమని వారికి నమస్కారములు
    మీ సూచన మేరకు చందోబద్ధ రచన చేసే ప్రయత్నం చేయుచున్నాను.
    శంకరయ్యగారు, మీ అబ్బాయి త్వరగా కోలుకోవాలి అని ఆశిస్తున్నాను
    -------------
    కరుణ మనస్సున్నా దానము చెయ్యలేదెందు,
    విచక్షణ విరివిగున్నా ఎన్నడూ సాయపడలేదు,
    నాది నేను అనే పరుగులో శాంతి దొరకనే దొరకదు,
    అట్టి జీవితముపై, క్రోధమే మేలుగద సర్వగుణములందు.

    రిప్లయితొలగించండి
  13. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణలో ‘బంధించె నలుక బూని’ అనండి.
    *
    జిలేబీ గారూ,
    మీ భావాన్ని శైలజ గారు ఛందోబద్ధం చేశారు చూడండి.
    *
    పండిత నేమాని వారూ,
    వినయము సర్వగుణప్రధానమంటూ విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    దుష్టులపై చూపే క్రోధం మేలైనదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    క్రోధం గుణం కాదనీ, అరిషడ్వర్గాల్లో ఒకటని, సత్త్వగుణమే మేలని మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    శాంతము మేలంటూ మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    జిలేబీ గారి భావానికి మీరిచ్చిన పద్యరూపం బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. మద్దూరి ఆదిత్య గారూ,
    సంతోషం. మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. మీకు అన్ని విధాల సహకరించడానికి నేను, బ్లాగు మిత్రులు ఎప్పుడూ సిద్ధమే.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    మీ అబ్బాయి ఆసుపత్రి నుండి యింటికి వచ్చినందులకు సంతోషము. వానికి మా శుభాశెస్సులు - భగవంతుని కృపతో త్వరలోనే పూర్తిగా కోలుకోగలడు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. ధన్యవాదములు గురువుగారు,వచ్చేశారా.. ఎన్నో రోజులయినట్లుంది,.మీ సూచనలు చదివి..మీ అబ్బాయిగారికి బాగుంది కదా..చాలా సంతోషం..మీరు ఇప్పుడయినా తగిన విశ్రాంతి తీసుకోండి...కృతజ్ఞతలతో...

    రిప్లయితొలగించండి
  17. గురువులకు ధన్య వాదములు
    చిరం జీవికి స్వస్థత చేకూరి నందులకు చాలా సంతోషం గాఉంది. అందరికీ దీపావళి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి




  18. ఏ గుణమ్మైన సందర్భమెంచి చూప
    సత్ఫలిత మిచ్చునే కాని స్వయముగాను,
    దుర్గుణము కాదు సవ్యమౌ దృష్టి జూడ,
    పాపకృత్యమ్ములందు జూపంగ నట్టి
    క్రోధమే మేలుగద సర్వ గుణములందు.

    రిప్లయితొలగించండి
  19. కమనీయం గారూ,
    సందర్భాన్ని బట్టి క్రోధమూ సద్గుణమే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ నేమానిగారికి ధన్యవాదములు.

    మాస్టరు గారూ ! మీ అబ్బాయికి స్వస్థత చేకూరిందన్నారు. సంతోషము.
    మీరు మానసికంగా, శారీరకంగా బాగా అలసిపోయి ఉన్నారు. కొంతకాలము విశ్రాంతి తీసుకోండి.

    రిప్లయితొలగించండి
  21. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    తప్పుదారిన తిరిగే కొడుకును మార్చాలంటే :

    01)
    ______________________________

    తల్లిదండ్రుల మాటల - తాలు జేసి
    తాళిగట్టిన భార్యను - తక్కరించి
    దారి తప్పి చరించెడి - తనయు మార్చ
    క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  22. బాలురైనా , లవకుశులపై క్రోధము న్యాయమే గదా :

    02)
    ______________________________

    యాగ హయమును బంధించి - హద్దు మీఱి
    యాహవమ్మును నాపు , క - ట్టాయితముల
    నాహవమ్మున నిర్జించి - యాగ రక్ష
    సేయ సమకట్టు శ్రీరాము - న్యాయమైన
    క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
    ______________________________
    ఆహవము = యాగము = యుద్ధము
    కట్టాయితము = సంసిద్ధము

    రిప్లయితొలగించండి
  23. మానభంగ సమయంలో భీముని క్రోధము మేలే గదా :

    03)
    ______________________________

    మానవతిని, మదవతిని - మామ యెదుట
    నిండు పేరోలగంబున - నేర మనక
    వలువ లూడ్చగ సమకట్టు - వారి పైన
    క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  24. ఐదూళ్ళైనా యివ్వని దుర్యోధనాదులపై పాండవులకు :

    04)
    ______________________________

    వరుస వనవాస , యఙ్ఞాత - వాసములను
    పూర్తి గావించి రాజ్యమ్ము - బొందు కొఱకు
    రాయబారము విఫలము - సేయ , తుదకు
    క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  25. దొంగతనముగా భార్య నెత్తుక పోయిన వానిపై :

    05)
    ______________________________

    భర్త లేనట్టి సమయమ్ము - వనము జొచ్చి
    పర్ణశాలను నుండంగ - పట్టి నెట్టి
    పడతి గొనిపోయి బంధించు - వాని పైన
    క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  26. భారతీయుల పీడించే వారిపై నేతాజీకి :

    06)
    ______________________________

    వర్తకమ్మును సేయంగ - వచ్చి యిటకు
    వరుస రాజ్యమ్ము స్థాపించి - మరియు మరియు
    భారతీయుల పీడించు - వారి పైన
    క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  27. అదుపు తప్పిన భార్యపై భర్తకు :

    07)
    ______________________________

    అత్తమామల నెదిరించి - యదుపు లేక
    నాడ పడుచుల నవహేళ - నలను జేసి
    భర్త మాటను జవదాటు - భార్యపైన
    క్రోధమే మేలుగద సర్వ - గుణములందు !
    ______________________________

    రిప్లయితొలగించండి
  28. ఆరు శత్రువులందున నమిత సులభ
    రీతి పోగొట్ట గలిగిన లెస్సయయిన
    దిదియె నమ్ము బాలక! విని యెఱుగ వేమి?
    క్రోధమే మేలుగద సర్వగుణములందు.

    రిప్లయితొలగించండి