6, నవంబర్ 2016, ఆదివారం

దత్తపది - 102 (సరి-గమ-పద-నిస)

సరి - గమ - పద - నిస
పై పదాలను ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

88 కామెంట్‌లు:

  1. గడుసరియగు దాసి గమనించి కైకమ్మ
    పదము లొత్తుచుండి పలికె నిటుల:
    "బానిసత్వ మౌను భరతునకును నీకు
    రాముడవగ రాజు రాజ్య మునకు!"

    రిప్లయితొలగించండి
  2. హనుమంతుడు రావణునితో:
    సరిరారెవ్వరు రామచంద్రునకునున్ సంగ్రామమందున్ ధరన్
    శరణమ్మొందగ మంగళంబగును నీ సామ్రాజ్యమందెప్పుడున్
    నిరసింపన్ హరిమాటగా తెలుపగన్ నీవాపదల్ గోరుటౌ
    చరితంబెన్నక సాగినంత చ్యుతి నిస్సందేహమౌ నీకనిన్

    రిప్లయితొలగించండి
  3. డా.పిట్టా
    సరిరారెవ్వరు నిన్ను బోల్చ గమ కాత్సౌ జన్యశీలంబులన్
    నెరి మూటన్ సిరిగట్టి బంచితివితన్నీమాలు నీ‌సన్నలున్
    నర జన్మం గను వేదమంత్రపు పదాల్ నారాయణుండౌటకే
    వర విద్యార్థములయ్య పుణ్యఫలమున్ వాసిన్గనన్ రాఘవా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా వారు మీపూరణ బాగుంది. "పోల్చగమకాత్సౌజన్యశీలంబులన్" అర్థము కాలేదండి.
      తన్నీమాలు: నీమము తెలుగు మాట కదా.

      తొలగించండి
  4. రామా! నీసరి రక్షకుల్ గనమిలన్ రమ్యాతిరమ్యంబు నీ
    నామంబే గమనించినాడ పలుకన్ నాకిమ్ము సామర్ధ్య మో
    స్వామీ! నీపదసన్నిధిం నిలుచు సద్భాగ్యమ్ము ప్రాప్తించినన్
    నీమంబూని సదా చరింతు ననియెన్ నిష్ఠంగపీంద్రుడటన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారు మీ పూరణ చాలా బాగుంది. "నిష్ఠంగపీంద్రుండటన్" అనుకుంటా.

      తొలగించండి
    2. అవునండీ. సున్నా పడలేదు. ధన్యవాదాలు.

      తొలగించండి


  5. సరిలేరెవ్వరు రాముని
    శరవేగపు గమకములకు, చంపెను నొక బా
    ణరవమున వాలిని పరా
    త్పర పదములవి గొని సఖుని తత్వము గనవే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. కొసరి తినిపించె ముచ్చటఁ గొరికి చూచి
    పళ్ల తీపిని గమనించి పడతి శబరి
    పదమునంటెడు భాగ్యమ్ము ముదము నీయ
    నవని సద్గుణ రాముండు నాదరమున

    రిప్లయితొలగించండి
  7. సరి యేడు తాళము లవే
    వరుసగ మరి చూడు మొక్క వాడిశరమునన్
    నరుకుము పద వానిని నీ
    యురవడి గని సంతసింతు నో రఘురామా.

    రిప్లయితొలగించండి
  8. కొసరి కొసరి వినదగు గద
    విసుగన్నది లేక ముదము వెస గమకింప
    న్నసమమగు జ్ఞాన సంపద
    నిసర్గముగ రామ కథయె నిరతము మనకున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారు మీ పూరణ చాలా బాగుంది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు కామేశ్వర రావు గారూ !
      మీ పదసంపదలో ఓ పది శాతం మాకివ్వరా ?

      తొలగించండి
    3. జనార్దన రావు గారు ధన్యవాదములు. ఆంధ్ర వాఙ్మయము మహా సముద్రము వంటిది. అది యందరికి నందుబాటులోనే యుంటుంది. ఎవరి యిష్టానుసారము వారు తోడు కోవచ్చునండి.

      తొలగించండి
  9. కొసరి కొసరి యా పండ్లను కొరికి చూచి
    శబరి యందించగ మధుర శాకమనియె!
    గుహుడు కోరిన పదసేవ బహుమతిచ్చె!
    యట్టి రాముని సన్నిధి నందె నుడుత!

    రిప్లయితొలగించండి
  10. జిత ఘన కేసరి గమ నాం
    చిత పద పంకజ నిసర్గ చిత్తానందాం
    కిత సత్య ధర్మ పాలన
    ధృత విక్రమ యాతుధాన ధృతి హర! రామా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్యాఖ్యానించే అర్హత లేకున్నా ఆస్వాదించే మనసున్నది కాబట్టి చెబుతున్నాను. అద్భుతం!

      తొలగించండి
    2. జనార్దన రావు గారు ధన్యవాదములు. ఎవరి దోషములు వారికి తెలియక పోవచ్చును. నా పూరణను మీరు సమీక్షింప సమర్థులే.

      తొలగించండి
  11. రిప్లయిలు
    1. సరి గమ పద నిస లందున
      స్వర మేళనమొంది రమ్య సారస్వతమై
      వరమయె లవకుశుల గళా
      ధ్వరమై రామాయణంబు పరమాద్భుతమై!

      తొలగించండి
    2. శర్మ గారు కళాధ్వరమనా లేక గళాధ్వరమానా మీ భావము?

      తొలగించండి
    3. గళాధ్వరమని నా అభిప్రాయం .... ఒప్పునా?!(గాత్ర యజ్ఞమని నా ఉద్దేశ్యం)

      తొలగించండి
    4. శర్మగారు మీ పూరణ మనోహరముగానున్నది.
      గాత్రమును యజ్ఞమనడము సరికాదేమో? యజ్ఞమొక క్రియ కదా. సంగీతకళను యజ్ఞముగా భావించ వచ్చును. అప్పుడు "లవకుశుల కళా" అనాలి.
      ఆయెను, అయ్యెను లు సాధువులు. అయె వ్యావహారికము. "వరమయ్యె లవకుశ కళా / ధ్వరమై" యన్న నొప్పును.

      తొలగించండి
    5. ధన్యవాదములు... కామేశ్వర రావు‌గారూ....మీ సవరణకు కృతజ్ఞతలు ..... పద్యాన్ని సవరిస్తాను..... నమస్సులు.

      తొలగించండి
    6. సవరించినది:

      సరి గమ పద నిస లందున
      స్వర మేళనమొంది రమ్య సారస్వతమై
      వరమయ్యె లవకుశ కళా
      ధ్వరమై రామాయణంబు పరమాద్భుతమై!

      తొలగించండి
  12. కొసరి రమ్మని పలుమార్లు గోరుచుండి
    రాముని సహోదరు డానాడు రామచంద్రుఁ
    పదములను బట్టె ; గమనించి పాదరక్ష
    లను, గొని మరలె భక్తకి లక్ష్యమనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణా రావు గారు మీ పూరణ బాగుంది. రెండవ పాదములో గణ దోషము. "రామచంద్రు పదము" అన్నప్పుడు "ద్రు" మీద నర్థానుస్వార మక్కర లేదు. రామచంద్రుని యొక్క పదములని కదా మీ భావన.

      తొలగించండి
  13. రాముని పదసేవను జేయు బ్రేమ గలిగి
    నాతని సమీప మునజేరి యాశతో డ
    కొసరి కొసరియారా మునకు శబ రియట
    యంది యీయగమధురమైన ట్టి పండ్ల
    నార గించెను బ్రియమున నాత డపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నయ్య నీ పూరణ చాలా బాగుంది. "యట / నంది యీయగ" అనాలి కద. అచ్చట యను నర్థమున ద్రుతాంతము.

      తొలగించండి
  14. రావణునకు విభీషణుడు హితవాక్కులు చెబుతున్నట్టుగా నూహించి

    గమనింపుము రాముని తో
    సమరము సరికాదని, సతి సద్గుణ వతియౌ
    ప్రమదను రాఘవు జేర్చి ప
    దముల శరణువేడినంత దయజూపుగదే

    రిప్లయితొలగించండి
  15. సరిలేని శస్త్రాస్త్ర చాపయుద్ధోద్ధతిన్
    .......... ఋషియజ్ఞమును గాచె రిపులజంపి
    కఠినశాపమున నిర్గమనయైన యహల్య
    .......... కును నిజరూపంబు కోరి యిచ్చె
    శివధనుర్భంగ విశేష కార్యము సల్పి
    .......... జానకీప్రేమకాస్పదము జూపె
    తండ్రియాజ్ఞానిబద్ధతజేత వనవాస
    .......... మున ముని సన్నిభ మూర్తి యయ్యె

    కపులుతో గూడి రాక్షస రిపుల జంపె
    నిగమ వందిత భూజాత వగపు దీర్చె
    పరమపదమైన భక్తిభావమ్ము నిచ్చె
    మదిని సతతమ్ము నెలకొని ముదము గూర్చె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారు మీ సీసపద్య వర్ణన మనోహరము. పూరణముత్తమము.
      పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము వేసినట్లు యీ చిన్ని నాలుగు మాటలకు నంత పెద్ద పద్యము!
      దత్త పదముల నెంత చిన్న పద్యము లో కూర్చితే యంత ప్రజ్ఞ!
      రాక్షసరిపు లంటే సుర లనుకొనే ప్రమాదము కూడ నున్నది.


      తొలగించండి
    2. గురువులు శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారికి వందనములు. మీ సూచన శిరోధార్యము.
      ధన్యోస్మి.

      తొలగించండి
  16. సమర కేసరి వాలిని సంహరించె
    సచ్ఛరాసన నిర్గమ శరము తోడ
    నల రుమా పతి యాపద తొలగి పోవ
    ధరణిజా పతి, వాని సదా స్మరింతు

    రిప్లయితొలగించండి
  17. గడుసరి యగు నగ్రజుతో
    తడబడక విభీషణుండు తద్యత్నంబున్
    విడువగ మన్ననలందుచు
    నొడయని సత్పదము లోన నుండగ బలికెన్.

    సరియగు సీతను బంపుట
    సురవైరీ!మోక్షపదము సుగమము చేయున్
    గురుముని సమ్మత మిది నీ
    కరయంగా రామచంద్రు డతి హర్షమునన్.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారు మీ రెండు పూరణలు చాలా బాగున్నాయి. దడబడక అంటే బాగుంటుంది. ద్రుతసంధి నిత్యము.

      తొలగించండి
  18. సరి యెవరు జగ మందలి జనపదముల
    గజగమన ధరణిజకు చక్కదనమందు
    రాఘవుని సహధర్మిణి కడు రమణకెక్కె
    కష్టములఁగొని పతితోడ కానలందు

    రిప్లయితొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హరియె రాము డనెడి సరిసత్తు గమనించి
    రామ పదముల దరి గోము గలిగి
    భక్తి దోడ రామ బానిస యౌచును
    భక్తులందు హనుమ భవ్యు డయ్యె.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు మీ పూరణ బాగుంది.
      రామ బానిస సమాసము సరి కాదు. కేవల సంస్కృత శబ్దము వికృతి శబ్దముతోడ సమసింపదు. రాముబానిస అనవచ్చు.

      తొలగించండి
    2. పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్కారములు. మీసూచనను తప్పక పాటిస్తాను. కృతజ్ఞతలు.

      తొలగించండి
  20. రావణవధానంతరం విభీషణుడు తోడ్కొని వచ్చిన సీతను చూడుమని హనుమంతుడు రాముని వేడుకుంటున్నాను.

    త్రిదివౌకస రిపు మర్దన!
    మదనాగ మణి ప్రకాశ మకుట ధరా! యా
    పద గడచి వచ్చె సీతమ
    సదయా! మునిసన్నుత పద! సరగునఁ గనుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అద్భుతమైన పూరణ. శ్రీరామచంద్రుని దయ వలన మీ కష్టములు శ్రీఘ్రమె కడతేరాలని మా యాకాంక్ష.

      తొలగించండి
  21. కవిమిత్రులారా!
    మా అబ్బాయికి రేపు కాని ఎల్లుండి కాని శస్త్రచికిత్స జరుగుతుంది. ఇంటికీ హాస్పిటల్‍కు తిరగడం తోనే సరిపోతున్నది. మీ పూరణలను చదువుతున్నాను కాని, స్పందించలేకపోతున్నాను. మన్నించండి.
    మరొక మూడు రోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను.
    ********
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    నా పరిస్థితిని సానుభూతితో అర్థం చేసికొని మిత్రుల పూరణలపై స్పందిస్తున్నందుకు ధన్యవాదాలు! మీ సహకారం ఇలాగే కోనసాగించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యభీష్టము మేర నా శక్తి కొలది ప్రయత్నిస్తాను.

      తొలగించండి
    2. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
      నమస్కారములతో,

      ఇప్పుడే శ్రీ వూలపల్లి సాంబశివరావు గారి ద్వారా వార్త తెలిసి ఈ మీ సందేశాన్ని చూశాను. ఈశ్వరానుగ్రహం వల్ల సర్వం సానుకూలమై బాబు సత్వరం కోలుకోవాలని, మీకు చిత్తస్థైర్యం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాము.

      శం భవతు.

      తొలగించండి
  22. కందము:సొగసరి రఘుకులతిలకుదు,
    నిగమముల కెరుకపడవతని పదకమలముల్
    తగులగ శిల మగువగునని
    సగుణుని బొగడగ దొరకును శమము నెలమినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు మీ లఘుతమ కంద పూరణ మత్యంత మనోహరముగా నున్నది.

      తొలగించండి
    2. శ్రీ కామేశ్వరరావు గారికి ధన్యవాదములు

      తొలగించండి
  23. భక్తుడైనను సరి గాని రక్తి గోరి
    నిగమ రూపుని చేతిలో నిహతు డయ్యె
    దశముఖుడు, పౌరుల నాపదలు తొలగగ
    రమ్యరీతిని సత్కీర్తి రామ విభుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామా రావు గారు మీ పూరణ బాగుంది. మూడవ పాదములో యతిగణ దోషములు.
      "దశముఖుండు,ముని గణాపదలను తీర్చె" అన్న సరి పోవును.

      తొలగించండి
  24. శ్రీగురుభ్యోనమః

    కేసరినందనుండు జయగీతము బాడుచు నార్ద్రనేత్రుడై
    కోసల రాజనందనుని కోమలమున్ గమనించి మ్రొక్కుచున్
    బాసల జేసి రామపదపద్మములన్ మదినిల్పి ధీరతన్
    భూసుత జాడ గన్ గొనగ పూని సముద్రము దాటె నత్తరిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీపతి శాస్త్రి గారు మీ పూరణ ప్రశస్తముగానున్నది.

      తొలగించండి
    2. గురువర్యులు శ్రీ కామేశ్వరరావు గారికి నమస్సులు, ధన్యవాదములు.

      తొలగించండి
  25. రామ పదమంటి ప్రణమిల్లి రయము తోడ
    నాతని సతి జాడ నెఱంగ నలసటనక
    గడసరి పవన సుతుడంత కడలి దాట
    కదలె వాయువేగ మనోవే గాన కపియు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారు మీ పూరణ బాగుంది. నాల్గవ పాదములో గణ దోషము. గడుసరి సాధువు.

      తొలగించండి
  26. రిప్లయిలు
    1. మూర్తి గారు దత్త పదములన్ని చక్కగా కుదిరినవి.
      పద్యము మధ్యలో నచ్చులను బ్రయోగించ దగదు. నాగమ, నాపద అనిన సాధువు.
      ఆపదల నుపదల (కానుకలు) సేయు పదప్రయోగము సముచితముగా లేదనిపించు చున్నది.

      తొలగించండి
  27. మిత్రులందఱకు నమస్సులు!

    [అశోకవనంలో హనుమంతునితో సీత పలికిన సందర్భము]

    "కేసరి సుత! శ్రీరామున
    కీ సంగతి సుగమముగను నెఱుకపఱచియున్,
    వాసిగఁ బతిపదయుగళిని
    నీ సీతయె నమ్మె ననుమ నెమ్మిని సదయన్!"

    స్వస్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తే.గీ.

      [2]
      కేసరి సుతుండు సని జానకిఁ గని యంగు
      ళీయక మ్మిడ, గమనించి, "యోయి హనుమ!
      వేగ నా యాపదను మాన్ప వేడెద! నిఁక,
      రావణుని సమయింపఁగ రమ్మను"మనె!

      తొలగించండి
    2. కవి పుంగవులు మధుసూదన్ గారు మీ రెండు పూరణలందు నిస్పక్షపాతముగా నాలుగు పదములను నాల్గు పాదములలో కూర్చినారు.

      తొలగించండి
  28. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { శూర్పనఖ రామునితో అన్న మాటలు }


    సరి లేరెవ్వరు నీకు | వేగమ పరిష్వ౦గమ్ము

    ………… లోనన్ ననున్

    గరగి౦పన్ వడి రమ్ము | శూర్పనఖ

    ……… యాగ౦ జాల | దో రామ ! నీ

    పురుషత్వ౦బున కేను బానిస | నికన్

    ………… బోనాడు మా జానకిన్ |

    దరికిన్ జేరుమ , జా గదేల | పద ! --

    …………… దివిద్వారాన నిన్ జేర్చెదన్ |

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారు మీ పూరణ చాలా బాగుంది.
      శూర్పణఖ మీద కోపమును చేటనఖను (శూర్పనఖ) చేసి తీర్చుకున్నారా!
      నాల్గవ పాదములో గణ దోషము.

      తొలగించండి
  29. ఇలను కే'సరి'సుతు 'సరి' యెవ్వరనుచు
    నా 'గమ'ని'గమ' నిపుణుడు నాతడనుచు
    నా'పద'లఁ బా'ప ద'గునీత డాఢ్యు డనుచు
    రాముడిత'ని స'ఖుడ'ని స'రసన జేర్చె
    కామేశ్వరరావుగారూ, ఔనండీ, మీరన్న తరువాత నాకునూ ఔచిత్యంగా లేదనిపించింది.మార్చి వ్రాశాను. చిత్తగించండి

    రిప్లయితొలగించండి

  30. కొసరి కొసరి పెట్టె కోమలి శబరి తా
    నిగమవేద్యుడైన నీరజాక్షు
    పదకమలము నంటి భక్తితో ఫలములు
    తనిసతండు మెచ్చె ధరణి యందు.


    కేసరి తనయుడప్పుడా సముద్రము దాటి
    నిగమములకు దొరకు నేత దలచి
    ధరణిజ పద ములకు తలవంచు మ్రొక్కుచు
    గాంచె నవనినిసరిగాను కపుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమా దేవి గారు మీ మొదటి పద్యములో తనిసి_అతండు= తనిసియతండు అవుతుంది. యడాగమము. క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు.అప్పుడు నిస పదము మరుగవుతుంది.

      రెండవ పద్యము మొదటి పాదములో "తనయుడపుడా" అనండి లేకున్నగణదోషము. అవనిని గాంచుట: భావము కూడా సంతృప్తికరముగా నున్నట్లు లేదు.

      తొలగించండి
  31. ముక్త సరిగమ హిజబల్కె మూర్ఖుఁజూచి
    "నీ పదనిస ర్గముదెలిసె, నీకు మృత్యు
    దర్శన సమయము మిగుల దగ్గరయ్యె
    శఠము వీడి రామచరణ శరణు గొనుమ

    రిప్లయితొలగించండి
  32. నీ సరి సాటి లేరు మహి నిక్కము జూడగ మర్త్యసింహమా
    బాసను సేయుచుంటి నిక భక్తిగ మ్రొక్కుచు నీ పదంబులన్
    వేసట లేకనేనిచట వేడుక నుండెద నీదురాకకై
    వాసిగ నంది గ్రామమున బానిస రీతిగ వేచియుండెదన్

    రిప్లయితొలగించండి
  33. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి చరణారవిందములకు నమస్సులు. ఆర్యా మీ కుమారునకు శ్రీపరమేశ్వరుని అనుగ్రహమున శస్త్ర చికిత్స విజయవంతమై ఆయురారోగ్యములు కలుగవలెనని పరమేశ్వరుని ప్రాథించుచున్నాను.

    రిప్లయితొలగించండి