జైశ్రీరామ్.
ఆర్యులారా! శంకరాభరణం బ్లాగును అవిరళముగా నిర్వహించుచు ఎందరో పద్యాభిమానులను కవులుగా చేయుచు ఆదర్శ జీవితం గడుపుచున్న మన సాహితీ బంధువు శ్రీమాన్ కంది శంకరయ్య. అట్టి మహనీయుని కృషిని గుర్తించిన జగద్విఖ్యాత విద్వద్వేత్త శ్రీమాన్ ఏల్చూరి మురళీధర రావు గారు తమ హృదయాకాశమున మెఱుపు వలె మెఱిసి అమృతపు జల్లువలె వెల్వడిన పద్యములలో వ్యక్తము చేసినారు. “విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్” అన్న మాట ఎంతటి యథార్థము! ఈ అపురూప పద్యసత్కారమునకు నోచుకొన్న శ్రీమాన్ కంది సంకరయ్య మహనీయుని మనసారా అభినందిస్తున్నాను.
ఇక చూడండి.
ప్రాచార్య శ్రీ ఏల్చూరి మురళీధరరావు వారినుండి
శంకరాభరణ నిర్వాహకులు, శ్రీ కంది శంకరయ్య వారు అందుకున్న
బహు అరుదైన పురస్కారం.
శ్రీ కంది శంకరయ్య.
Recalling all those who
had inspired me ...
సీ.
“భారతీసేవకప్రథుఁ” డన్న మా కంది
శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“పద్యవిద్యాకృతవ్రతుఁ” డన్న మా కంది
శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“గురుకవీంద్రాచార్యవరుఁ” డన్న మా కంది
శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
“దయమీఱు ప్రియసహృదయుఁ” డన్న మా కంది
శంకరయ్య బుధేంద్రు వంకఁ జూతు!
తే.గీ.
“శంకరయ్య బుధేంద్రుని వంకఁ జూచి
సర్వసుఖములు గూర్పు మా స్వామి!” యనుచుఁ
గళలు తళుకొత్త, మోము వెన్నెలలు విరియ
శంకరయ్య నడుగ - నెలవంకఁ జూతు!
కం.
మీ ప్రేమాతిశయముఁ బ
ద్యప్రణయనదీక్ష నన్నుఁ దావకవాత్స
ల్యప్రశ్రితుఁ గావించె సు
ధాప్రేక్షణ శంకరార్య! ధన్యతఁ జెందన్.
ఇట్లు
శ్రీ ఏల్చూరి మురళీధరరావు
('ఆంధ్రామృతం' బ్లాగు నిర్వాహకులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)