25, జూన్ 2017, ఆదివారం

సమస్య – 2394 (తమ్ముని సతి తల్లి...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తమ్ముని సతి తల్లి యగును తత్త్వము దెలియన్"
(లేదా...)
"తమ్ముని భార్య తల్లి యగు తత్త్వవిదుల్ పరికించి చూడఁగన్"
(చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలతో...)

85 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. పొమ్ముర! నీ మరదలగును
      తమ్ముని సతి; తల్లి యగును తత్త్వము దెలియన్
      తమ్ముని తల్లియె తథ్యము;
      వమ్ముర! చాలిక వితండ వాదము కుమతీ!

      తొలగించండి
    2. సరదాగా:

      "తత్త్వమసి శ్వేతకేతో"

      నమ్ముము "తత్త్వమ్మ"నినన్
      కొమ్మయు కోతి పరమాత్మ కొండయు నీవే
      వమ్ముర వరుసలు తరసలు;
      తమ్ముని సతి తల్లి యగును
      తత్త్వము దెలియన్!

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. సమ్మతి కృత్రిమ గర్భము
    కొమ్మయు ధరియించెఁగాన కోరికదీరన్
    తొమ్మిది నెలలకు సరిగా.
    తమ్ముని సతి తల్లి యగు యదార్ధము తెలియన్

    రిప్లయితొలగించండి
  3. సత్యముదెలయన్ బదులు యదార్ధముదెలియన్ అన్నాను ధైర్యం చేశాను క్షమించండి

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. కొమ్మల కెంతయు భాగ్యము
      యిమ్ముగ పండుగ దినమున యిష్టముతోడన్
      కమ్మగ వంటల జేయగ
      తమ్ముని సతి తల్లియగును తత్వము దెలియన్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భాగ్యము+ఇమ్ముగ' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "భాగ్య। మ్మిమ్ముగ.." అలాగే "దినమున నిష్టము..." అనండి.

      తొలగించండి
    3. సీతా దేవి గారు:

      యడాగమ నుగాగమములు మారీచ సుబాహులవంటి రాక్షసులు. వీని నుండీ తప్పించుకోడానికి ఒక కిటుకు ఉన్నది. వీలైనంత వరకు హల్లులతో మొదలయ్యే పదములు వాడుట. ఉదాహరణకు:

      కొమ్మల కెంతయు భాగ్యము
      కమ్మగ పండుగ దినమున
      గంపల తోడన్
      ఘుమ్మని వంటలు జేయగ
      తమ్ముని సతి తల్లియగును తత్వము దెలియన్!


      ఘుమ్మని : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

      adv.

      sweetly

      తొలగించండి
    4. జి.పి.శాస్త్రిగారూ! మీ సూచనలకూ సవరణలకూ బహు సంతోషము! ధన్యవాదములు!🙏🙏🙏🙏

      తొలగించండి
    5. విజ్ఞాన శాస్త్రపండితోద్దండులు కవన పాక పరిపాక ప్రపూర్ణులయ్యారు!

      తొలగించండి
    6. సారూ:

      సీతా దేవి గారి సంగతి నాకు తెలియదు కానీ నేను బాగానే వంట (cooking ...కిట్టింపు) చేసి భౌతిక శాస్త్రంలో పనికిమాలిన వైద్యుడ నైతిని. ఈ కిట్టింపు నైపుణ్యం శంకరాభరణంలో కూడా పనికి వచ్చుచున్నది. మీకు తెలియనిదేమున్నది! మీ వద్దనే తొలి శిష్యరికం కదా! గత రెండు నెలలుగా శంకరాభరణం గత సంచికలన్నీ వరుసగా చదువుచున్నాను. అద్భుతం!(సమస్య 642 లో ఉన్నాను ఈ రోజు).

      నమస్సులు!

      "సుందర కాండ" చకచకా నడుస్తోందనుకొంటా... సరస్వతీ పుత్రులు మీరు. మీ పరిచయం శంకరాభరణం ద్వారా మా మహా భాగ్యం!!!

      తొలగించండి
    7. శాస్త్రి గారు నమస్సులు. ప్రస్తుతము 16 వ సర్గ లో నున్నాను. సావకాశముగా సాగు చున్నది.
      హనుమంతుడు సీతా దేవి దర్శనము తరువాత తనలో అనుకున్న మాటలు ఇప్పుడు నడుస్తున్నాయి. మచ్చునకు:

      మున్నీరు సుట్టిన పుడమిఁ
      గ్రన్ననఁ దల క్రిందు సేయ రఘు వరుఁ డడరన్
      మన్ననయ యీ తరుణి కొఱ
      కన్నను విశ్వమ్ము తోడ నాశ్చర్యంబే

      మూలము:

      యది రామః సముద్రాన్తాం మేదినీం పరివర్తయేత్.
      అస్యాః కృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మే మతిః৷৷5.16.13৷৷

      తొలగించండి
  5. ఇమ్ముగ నుమ్మ నీటిని వహించెను తమ్ముని కొమ్మ సమ్మతిన్
    చిమ్మెను సంతసమ్ము చిఱు చెమ్మగ కన్నుల వెంట నెమ్మిగన్
    తొమ్మిది మాసముల్ గడిచె తొందర తొందర తొందరించగన్
    తమ్ముని భార్య తల్లి యగు తత్త్వవిదుల్ పరికించి చూడఁగన్!!

    రిప్లయితొలగించండి
  6. ఇమ్మహి పరవనితల గని
    నెమ్మనమున జనని యంచు నిష్ఠాగరిమన్
    నమ్ముచు నుండెడి వారికి
    తమ్ముని సతి తల్లి యగును తథ్యము దెలియన్.

    అమ్మగ నన్యకాంతలను హర్షముతో గనుచుండి వారికిన్
    నెమ్మది గౌరవం బిడుచు నిష్ఠను బూని నిరంతరం బిలన్
    నమ్మిన సత్పథంబున ననామయ మెంచి చరించు వారికిన్
    తమ్ముని భార్య తల్లి యగు తత్త్వ విదుల్ పరికించి చూడగన్.

    హ. వేం. స.నా. మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు చక్కని ధారతో అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. డా.పిట్టా
    ఉమ్మడి కుటుంబములలో
    కొమ్మల గోల్పోయి మిగుల గుందెడి బావల్
    కమ్మగ దిన, భార్యల గన
    తమ్ముని సతి తల్లి యగును సత్యము దెలియన్

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    కొమ్మల కోతి జాతులకు గోరికలెక్కువ వాలి మాడ్కి నా
    తమ్ముని భార్యతో చెలిమి తప్పది తప్పని విప్పి చెప్పె వే
    దమ్మది యా మరందలొక దైవమె భార్య గతించ బావకున్
    ఇమ్ముగ నొక్క కాంతనట నేర్పడజేయగ మారు మన్వునన్
    తమ్ముని భార్య తల్లియగు తత్త్వవిదుల్ పరికించి చూడగన్

    రిప్లయితొలగించండి

  9. [6/25, 7:01 AM] DrNVNChary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    కొమ్మను రుమనే గొని పా
    పమ్మును చేసితి వనుచును వాలీ !నేను
    న్నమ్ముచు చంపితి నిన్నే
    తమ్ముని సతి తల్లి యగును తత్త్వము దెలియన్

    రిప్లయితొలగించండి
  10. కొమ్మది వేడిశరీరము
    ఇమ్ముగ సంతును గలుగగ నిబ్బందగునే
    నెమ్మది మందులు వాడిన
    తమ్ముని సతి తల్లియగును తత్వము దెలియన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శరీర। మ్మిమ్ముగ... నిబ్బంది కదా..." అనండి. (ఇబ్బంది+అగు = ఇబ్బంది యగు... అవుతుంది).

      తొలగించండి
    2. డా.పిట్టా
      శ్రీరాంగారు మందులు వాడించిందనా?

      తొలగించండి
  11. అమ్మిక తనదు దుహిత, ఆ
    బమ్మ సుతకు తాళికట్టి ప్రస్తుతి నొందన్,
    ఇమ్మహిలో సబబేగా,
    తమ్ముని సతి తల్లి యగును తత్త్వము దెలియన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      పద్యం బాగుంది. కాని భావం కొంత క్లిష్టంగా తోస్తున్నది.

      తొలగించండి
    2. భ్రహ్మ దేవతై తనకు పుట్టిన కూతురుకే (సరస్వతీ దేవికి) తాళిని కట్టగా, తమ్ముని భార్య తల్లి అనుటలో తప్పులేదు గదా అని ణా భావన

      తొలగించండి
  12. తమ్ముని తనయుని జన్మది
    నమ్మున వంకాయ కూర నద్భుత రీతిన్
    కమ్మగ వండిన దెవరట
    తమ్ముని సతి తల్లియగును తత్వము తెలియన్

    రిప్లయితొలగించండి
  13. ఇమ్ముగ వరుసకు మరదలు
    తమ్ముని సతి; తల్లియగును తత్వము దెలియ
    న్నిమ్మహిలో నన్నసతియె;
    నెమ్మిని బంచంగ నొప్పు నియమముతోడన్!



    రిప్లయితొలగించండి
  14. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్
    ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి స పండితః !!

    ఇమ్మహి పరపత్నులు మన...
    కమ్మలు ! సందేహమేల ? హైందవ మత ధ...
    ర్మమ్మిది , ఘనతరమైనది !
    తమ్ముని సతి తల్లి యగును తత్త్వము దెలియన్ !!


    ఇమ్మహి భారతావని జనించిన హైందవ సూత్రమిద్ది! శా...
    స్త్రమ్మిది! ఆర్షవాక్యమిది ! ధర్మమనంగనిదే ! పవిత్ర మం...
    త్రమ్మిది ! స్త్రీజనాళికిదె రక్ష ! పరాంగనలెల్ల తల్లులే !!
    తమ్ముని భార్య తల్లి యగు తత్త్వవిదుల్ పరికించి చూడగన్ !!

    రిప్లయితొలగించండి
  15. ఇమ్ముగ నగు బ్రియ మరదలు
    తమ్ముని సతి, తల్లి య గునుత త్త్వము దెలియ
    న్నమ్మగు గిరిజా మాతయె
    నమ్ముము రాకేందువదన !నాయీ మాటల్


    రిప్లయితొలగించండి
  16. ఇమ్మహి లోన దేహముకు నీప్సితముల్ మిగలంగ భర్త దు:
    ఖమ్మున ద్రోసి భార్య తన కన్నులు మూసి నభమ్ము చేరగా ,
    తమ్ముడు ప్రేమతో నిడెను ధర్మము గాతన గీములోన ఊ
    తమ్మును , కన్నబిడ్డవలె తమ్ముని భార్యయు కాచు చుండగా
    తమ్ముని భార్య తల్లియగు తత్త్వవిదుల్ పరికించి చూడఁగన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దేహమునకు' అనడం సాధువు. అక్కడ "దేహమున నీప్సితముల్..." అనండి.

      తొలగించండి
  17. ఇమ్ముగ సర్వలోకముల నేలు పరాత్పరు డాది పూరుషుం
    డిమ్మయి ద్వాపరంబుజని యించెనుశేషుని తోవిశేషమున్
    సమ్మతి రుక్మిణింమునులు నావుడు సాధులు మీరు రాముకుం
    తమ్ముని భార్య తల్లియగు తత్వవిదుల్ పరికించి చూడగన్
    ....
    ద్వారకలో మునులు..సాధువులతో చెపుతున్నారు..రుక్మిణి రాముకున్ తమ్ముని భార్య...జగన్మాత లక్ష్మి గావున తల్లియని చెప్పారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్వర్లు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇమ్మెయి/ఇమ్మహి... రుక్మిణిన్ మునులు... రాముడా తమ్ముని' అనండి.

      తొలగించండి
    2. మీరు ఒకసారి తిరిగి టైపు చేయగలరు.
      మునులు.. నావుడు...సాధులు మీరు తత్వవిదుల్ పరికించి చూడగన్...గా అన్వయం

      ఇంకా ...మీసూచనలు తెల్పగలరు

      తొలగించండి
  18. నమ్మిన వారి కెల్లరకు నాతడు బ్రహ్మగ నిల్చి బల్కె , నీ
    కమ్మని కాపురమ్ము గల గర్భిణి , తమ్ముని భార్య , తల్లియౌ
    తొమ్మిది మాసముల్పిదప తూర్పున భానుడు రాకముందు నా
    తమ్ముని భార్య తల్లి యగు తత్త్వవిదుల్ పరికించి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  19. ఇమ్ముగ చూచును బావను
    తమ్ముని సతి, తల్లి యగును తత్త్వము దెలియన్
    కమ్మనిభోజనమిడు వది
    నమ్మ మఱుదులకు నహరహ మవనీతలమున్

    రిప్లయితొలగించండి
  20. సమ్మతముగఁ బర వనితల
    నమ్మ వలెఁ గనవలె నన్న ననుమానంబే
    యిమ్మహి నిక్కము జనకుని
    తమ్ముని సతి తల్లి యగును తత్త్వము దెలియన్


    ఇమ్మహితంపు టాకలికి నెవ్వరి వేడెద మంచు వా రర
    ణ్యమ్మున సంచరించఁ గన నాశ్రమ మొక్కటి యంతఁ బల్కె రౌ
    తమ్ముని భార్య తల్లి యగు తత్త్వవిదుల్ పరికించి చూడఁగం
    గమ్మని భోజనమ్మిట సుఖమ్ముగఁ బెట్టును గోరినంతటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  21. అమ్మిక తనదు దుహిత, ఆ
    బమ్మ సుతకు తాళికట్టి ప్రస్తుతి నొందన్,
    ఇమ్మహి లో సబ బేగా,
    తమ్ముని సతి తల్లి యగును తత్త్వము దెలియన్"

    అమ్మిక = సరస్వతి

    దేవ లోకములోనే వారే వావి వరుసలుమరచి (బ్రహ్మ తన కూతురినే పరిణయమాడెను) అటువంటి సమయములో మనుజ లోకములో మరదలు తల్లి అగుట తప్పు లేదని naa
    భావన

    రిప్లయితొలగించండి

  22. పిన్నక నాగేశ్వరరావు.

    ఇమ్మహిలో పర సతుల

    న్నమ్మగ భావించమనెడు హైందవ శాస్త్ర

    మ్మిమ్ముగ ఘనతరమౌ గద

    తమ్ముని సతి తల్లియగును తత్త్వము
    దెలియన్.
    *****************************

    రిప్లయితొలగించండి
  23. ఇమ్మహి జ్ఞాన కోవిదులు ఎంతయు భక్తితొ తమ్ము భార్యనున్
    సమ్మతి మాతగన్ దలచి చక్కగ చూడగ వాలి వంటి వా
    జమ్మలు పత్నిగా దలచి జాయగజూతురు లోకమందునన్
    తమ్ముని భార్య తల్లియగు తత్వవిదుల్ పరికించి చూడగన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భక్తితొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "భక్తిని" అనండి.

      తొలగించండి
  24. పెద్దకుమారుడు తన తల్లితో...
    ఇమ్మగు సంసారంబున
    గ్రమ్మెను విడిపోవుదమను కలతలఁ జూడన్
    ముమ్మాటికి కారణమా
    తమ్ముని సతితల్లి యగును తత్త్వము దెలియన్!

    రిప్లయితొలగించండి
  25. కమ్మని వంటల బావకు
    నెమ్మదిగా భోజనమ్ము నిండుగ నిడుచున్
    అమ్మని మరపింపంగను
    తమ్ముని సతి తల్లియగును తత్వముదెలియన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  26. రమ్మని కోరకుండగనె లక్ష్మణుడంతట రామచంద్రు, సీ
    తమ్మల వెంట వత్తునని దారను వీడఁగ సిద్ధమైన దా
    సమ్మతి దెల్పి రాముఁడట సానువుఁ జేరుచుఁ జూడ జానకిన్,
    తమ్ముని, భార్య తల్లి యగు తత్త్వవిదుల్ పరికించి చూడఁగన్!

    రిప్లయితొలగించండి
  27. చెమ్మగిలె తండ్రి కన్నులు
    నిమ్ముగ తమ తల్లి లేని యెరగందులకున్
    రొమ్మునిడి పాలుపంచన్
    తమ్ముని సతి, తల్లియగును తత్త్వము దెలియన్!

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఇమ్మహి నొప్పెడు యతివల
    నిమ్మున జననిగ గణించ నెంచెడి పెనుపౌ
    దమ్మము నెఱిగిన వానికి
    తమ్ముని సతి తల్లి యగును తత్త్వము దెలియన్

    రిప్లయితొలగించండి
  29. తమ్ముని తనయునికిగదా
    తమ్మునిసతితల్లియగును.. తత్వముదెలియున్
    తమ్మునిసతి తనసతియును
    అమ్మయునొకయింటనుండునపుడేమనసా!

    రిప్లయితొలగించండి
  30. ఇమ్మహి నరయగ జనకుని
    తమ్ముని సతి తల్లియగును, తత్వము దెలియు
    న్నిమ్ముగ బంధుజనమ్ములు
    నుమ్మడిగాయింటనుండ నుర్వీతలమున్!!!

    రిప్లయితొలగించండి
  31. అమ్మలు పూజార్హులు వది
    నమ్మలు ముగురమ్మలునిక నమ్మమ్మలుయున్,
    అమ్మకు మగడగు నాన్నకు
    తమ్మునిసతి తల్లి యగును తత్వము దెలియన్

    రిప్లయితొలగించండి
  32. ఇమ్మహిలో పతివ్రతల నెల్లరు తల్లులరీతి నెంచ కా
    మమ్మున గూడ నెంచి హరి భంగపడెం గద వాని కెన్నగా
    నమ్ముని సంయమీంద్రుడు మహర్షి తపోబలశాలి యైన గౌ
    తమ్ముని భార్య తల్లి యగు తత్త్వవిదుల్ పరికించి చూడఁగన్!

    హరి = ఇంద్రుడు

    రిప్లయితొలగించండి
  33. కమ్మని మాటలు చెప్పును

    నమ్మించును మోసగించు నయవంచిత యా

    కుమ్మరి పురుగును గన మా

    తమ్ముని సతి తల్లి యగును, తత్వము తెలియన్

    రిప్లయితొలగించండి
  34. కమ్మని మాటలు చెప్పును

    నమ్మించును మోసగించు నయవంచిత యా

    కుమ్మరి పురుగును గన మా

    తమ్ముని సతి తల్లి యగును, తత్వము తెలియన్

    రిప్లయితొలగించండి




  35. ఇమ్ముగ మరదలగును నా

    తమ్ముని సతి తల్లియగు తత్త్వము దెలియన్

    న్నమ్ముదితయె తనసుతునకు

    కమ్మగ తినిపించుచుండు కథలను చెపుచున్.


    అమ్మకు చెల్లి మనకు పి

    న్నమ్మగుచు నెల్లరకును నాదరమొప్పన్

    న్నిమ్మహిలో గన తండిరి

    తమ్ముని సతి తల్లియగు తత్త్వము దెలియన్.

    రిప్లయితొలగించండి
  36. తమ్ముడు పోరుబెట్టగనె దారులు తెన్నులు వేల వెద్కుచున్
    గుమ్మను కోనసీమగని గుట్టుగ దెచ్చిట పెండ్లిజేయగా
    కమ్మని మర్దలాతఱిని గమ్మున గర్భము దాల్చినందునన్
    తమ్ముని భార్య తల్లి యగు,...తత్త్వవిదుల్ పరికించి చూడఁగన్!

    రిప్లయితొలగించండి