19, ఆగస్టు 2018, ఆదివారం

సర్ప ప్రార్ధన

                                నాగ బంధ  చిత్ర తేట గీతి    
                        


ఖలమును తలపై నిడె నొక గనప నగము,
గారవముగ పెంచి వటముగ కలిలమును
చలమునకు చుట్టి మురడించి జయమిడిన వ
ర  నగ  మొకటి, దేవర  రూప మనుచు సీద
రమునకు   నమసము ననవరతము నిడుదు
అర్ధములు
ఖలము =  భూమి ,     గనప  = పెద్ద   ,  నగము   =  పాము ,గారవముగ  =  బాగుగా  , వటము=  త్రాడు,    కలిలము  =  దేహము  ,  చలము =  కొండ   ,మురడించి  =  రాణింఛి ,వర =  శ్రేష్ఠ ,  సీదరము =  పాము    నమసము   =  నమస్కారము      అనవరతము  = ఎల్లప్పుడూ
 తాత్పర్యము
భూమిని తన పడగలపై  ఉంచి కాపాడు చుండె నొక  పెద్ద పాము  (ఆదిశేషుడు)తన శరీరమును బాగుగా పెంచి  త్రాడు లాగా  అయ్యి మందర పర్వతమును చిలుకుటకు సాయపడినది   ఒక  ఘనమైన పాము   (వాసుకి ) అట్టి పాములు దేవత స్వరూపములు కాబట్టి వాటికి నమస్కారములు చేసెదను
 చిత్రములో పద్యము చదువు పద్ధతి :
ఈ పద్యము తలనుంచి మొదలు బెట్టి చదువు కోవాలి  పాము చుట్టుకుంటు  తోక దాక రావాలి.   అంటే  ఖలమును  దగ్గిర మొదలు పెట్టి   మునిడుదు తో  ముగిoచాలి   
 దీనిలో విశేషము   చదరములలో ఉన్న  అక్షరములు రెండు సార్లు ముందర ఒక పదమునకు మరల ఇంకొక పదమునకు అమరునట్లుగా  బంధించుట   

                                     బంధ కవి  పూసపాటి కృష్ణ సూర్య కుమార్

1 కామెంట్‌: