9, జూన్ 2019, ఆదివారం

సమస్య - 3042 (జారిణి పంచిపెట్టిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్"
(లేదా...)
"జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో అక్కెర సదానందాచారి గారి సమస్య)

88 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    దారిని తప్పిరాగనట ధైర్యము పోవగ నాపసోపలన్
    మీరిన యాకలిన్ కలిగి మెండుగ దప్పియు త్రాడు తెంపగా
    చేరుచు నాలయమ్మునను చెన్నుగ పన్నుగ చేసినట్టి పూ
    జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజారి (పుంలింగము)
      పూజారిణి (స్త్రీలింగము)

      క్రొత్త పదము కావచ్చు సార్!

      తొలగించండి
    2. డాక్టర్ మునిగోటి సుందరరామ శర్మ:

      ఔనౌను... ఎవరూ కనిపెట్టక పోతే పదములు ఎలా పుడతాయి? చిన్నమయా! వేయండి 2 *వీరతాళ్ళు*...
      అంతేగా...అంతేగా..💐🌹🙏👏🌹💐 (సరదాగా శాస్త్రిగారూ)🙏🙏🙏🙂🤝

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పూజారిణి' పదం నిఘంటువులలో లేదు. కాని జనబాహుళ్యంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్నది. మొన్న శతావధానంలో అవధాని గారు కూడా "పూజారిణి" అనే పూరించారు.

      తొలగించండి
    4. అందుకే యంటిని యిట్లు.
      ... గాఱియ పెట్టు వ్యాపకమ కాలవృథాగతి కారణమ్మునం
      బాఱెద రోరుగల్ నగరవాసులయో యవధాన మన్నచో

      తొలగించండి
  2. గు రు మూ ర్తి ఆ చా రి

    """""""""""""""""""""""""""""""""""""

    గురుభ్యోనమః నిన్నటిపూరణ స్వీకరింప మనవి


    ( ఆకారపుష్టి నైవేద్యనష్టి అన్నట్లుండిన శ్రీరామమూర్తి

    అనే అష్టావధానిని నిందించు చున్న కవులు )


    తొడిగెన్ గాలికి బెండమున్ , భుజముపై దుశ్శాలువ న్దాల్చుచున్ |

    దొడిగెన్ జేతికి గంకణమ్మును , మెడన్ బూదండల‌ న్మోయుచున్ |

    నుడువంజాలడు భావయుక్తముగ ఛందోబద్ధపద్యం బొగిన్ |

    గడకున్ వాక్శుచి లేదు | కేవలము సన్మానంబునే దొంగిలిం

    చెడువాడీత డటంచు పల్కెద రయా ‌ శ్రీరామమూర్తిన్ గవుల్


    ( పెండము = పెండేరము )


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    నేరము నీది కాదు తరుణీ ! నిను వేశ్యగ మార్చినట్టిదీ
    దారుణమౌ సమాజము , వ్యథల్ భరియించితివిన్నినాళ్లికన్
    జేరగ మంచిమార్గమును జేరుమ దేవుని మందిరమ్మిటన్
    జారిణి ! పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. శ్రీరామ దేవళంబున
    హారంబులపూజసేసి హారతు లిడగన్
    కోరిక లీడేరట పూ
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యజ్ఞేశ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కోరిక లీడేరగ' అనండి.

      తొలగించండి


  5. పోరాడెను బాహుబలియె,
    వారాహి విచిత్రమది సెబాసో యనగా
    పోరు తరువాయి యా పూ
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. (భగవంతుడు-భక్తురాలు)
    ఆరని యారతిచ్చి యెద
    యందలి భక్తిసుధాస్రవంతులే
    జోరుగ కన్నులన్ వెడలి
    చుక్కలధారగ జారుచుండగా
    శ్రీరఘురామచంద్రునకు
    సేవల జేసెడి స్వామివారి పూ
    జారిణి పంచిపెట్టిన ప్ర
    సాదము దిన్న మహోదయంబగున్.

    రిప్లయితొలగించండి


  7. అలుకగ శంకరాభరణ మందున, దిద్దగ దిద్దగాను తా
    మలుకయు లేక పూజ్యులు సమస్యల పూరణ దీటుతేలగా
    కులికెడు కన్నె పిల్ల మది క్రోడపు టెత్తుల రేగు కైపులన్
    పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూరణ బాగున్నది.
      కాని 'శంకరాభరణ' ప్రసక్తి వల్ల రేడియోలో ప్రసారం చేయరేమో?
      "అలుకగ పూజ్యులౌ గురుల ప్రాంగణమందున దిద్దగాను...." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  8. బారులు తీరిరి భక్తులు
    కోరికలను దీర్చమనుచు కోవెల యందున్,
    హారతులనుగైకొని, పూ
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్..��

    రిప్లయితొలగించండి
  9. ఉ.
    భారత దేశమందునను బాధలనేకము గల్గు వృత్తులన్

    దారుణమైన వృత్తియది దైన్యము నిండును జీవితంబులన్

    గౌరవమిచ్చి యామెనొక కాంతగ చూడగనాలయంబునన్ .

    జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్"

    రిప్లయితొలగించండి


  10. సోరణి దివ్వెల కాంతిని
    జారిణి పంచఁగఁ, దినిరి ప్రసాదము భక్తిన్
    హేరాళముగా నెల్లరు!
    ధారాళము విభుని లీల ధరణిని రమణీ


    జిలేబి

    రిప్లయితొలగించండి


  11. హల్లెలూయా!


    జారభరా యటంచు త్రప, స్వైరిణి, కామగ యంచు తిట్టినా
    రో? రమణీయమైనది సరోజిని నాదు విధాత ప్రేమ! ఓ
    జారిణి, పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్,
    కోరగ ముక్తి నివ్వ, యెదకోయిల పాడగ నేసు నామమున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. శ్రీరామ భక్తులు వివిధ
    హారంబులపూజసేసి హారతు లిడగన్
    కోరిక లీడేరగ పూ
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్

    రిప్లయితొలగించండి
  13. వారాంగనలొ మార్పది
    పేరిమి గా గల్గ భక్తి విస్థ్రుత మయ్యె న్
    కోరిక తో పూజ సలిపి
    జారిణి బం చ గ దిని రి ప్రసాదము భక్తి న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు!
      వారాంగనలో టైపాటు కాబోలును...
      విస్తృత...టైపాటు...

      తొలగించండి
  14. చేరగభక్తులు గుడిలో
    హారతితో దేవిపూజ లందరియెదుటే
    పూరణ జేసిన యాపూ
    జారిణి పంచగదినిరి ప్రసాదము భక్తిన్!

    రిప్లయితొలగించండి
  15. చారుమతుల్ స్త్రీలే పూ
    జారుల స్థానమ్ముఁ బొంది జరుపగఁ బూజల్
    తీరున, నాలయమున పూ
    "జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్"

    రిప్లయితొలగించండి

  16. కందము
    ధారుణి భద్రాచల సీ
    తారా ముల పరిణయ శుభ తరుణము నందున్
    నోరూరగ భక్తులు పూ
    జారిణి పంచగ దినిరి ప్రసాదము భక్తిన్.
    ఆకుల శివరాజలింగం వనపర్తి

    రిప్లయితొలగించండి
  17. జోరుగ ద్రాగిరి మద్యము
    జారిణి పంచగ;దినిరి ప్రసాదము భక్తిన్
    నేరములన్నియు బోవగ
    నీరజనాభుని బొగడుచు నేర్పరితనమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జోరుగ ద్రాగుచున్ మదిర జోగుచు మత్తున నుచ్ఛనీచముల్
      నేరక,మాంసఖండముల నెమ్మిని జీకుచు జీల్చుచుందురే
      జారిణి పంచిపెట్టిన; ప్రసాదముదిన్న మహోదయంబగున్
      తారకరామునిన్ మదిని తన్మయులై సతమాదరించినన్

      తొలగించండి
    2. సీతాదేవి గారూ...
      విరుపుతో మీ రెండు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు!
      మొదటి పూరణలో...చివర...
      నే ర్పెసగంగన్...అనండి.

      తొలగించండి
    3. ధన్యవాదములు మధురకవిగారూ! మీ సవరణ చాల బాగున్నది!నమస్సులు!
      గురువుగారు లేనప్పుడల్లా మీవంటి పెద్దలు సవరణలు సూచిస్తే బాగుంటుంది!

      తొలగించండి
  18. కారే అర్చన కర్హులు
    నారీమణులనుచు చెప్పె నాడా ప్రజలున్
    మారే రోజులిపుడు పూ
    జారిణి పంచగ దినిరి ప్రసాదము భక్తిన్.

    రిప్లయితొలగించండి
  19. కారణము తెలియ కుండగ
    నేరము లెంచం గవలదు నిందలు మోపన్
    భారము మంచిని పెంచుట
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందఱకు నమస్సులు!

    [సకలసద్గుణసంపన్నయైన యొక పూజారిణి చేతి ప్రసాదమును దిన్నచో మహోదయ మగు ననుట]

    స్వైరవిహారదూర వరభామిని సాధ్వి సభర్తృగామి క
    ల్హారలలంతికాంచితవిలాసవిశేషసమర్చ్యదేవసం
    భార మహోన్నతప్రకటభక్తివికాస శశాంకమౌళిపూ

    జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి పుంగవులు మధుసూదన్ గారు “పూజారిణి” పదము నొక సారి పరిశీలించండి.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు కామేశ్వరరావు గారూ!
      ఈ పదము విషయమై ఉదయమే నేను శ్రీ శంకరయ్యగారితో చర్చించినాను. పదిమంది నడచినదే బాటగదా! చాలామంది కవులు పూజారిణి అని వాడుతున్నారు కాబట్టి నిరాక్షేపణీయమే అన్నారు. అవధాని మద్దూరివారు కూడా పూజారిణి అనే ప్రయోగించారు. నేనూ వారినే అనుసరించాను.
      పూౙ + అరి - పూౙరి, పూౙారి
      దీనికి స్త్రీలింగం ణి చేర్చి పూౙారిణి అనడం సబబు కాదు. కానీ, పూౙారిణి పదాన్ని పూజారిణి అని పండిత కవులే వాడుతున్నారు. కాబట్టి నేనూ వాడక తప్పలేదు.

      తొలగించండి
  21. డా.పిట్టా సత్యనారాయణ
    (పారే నీటికి పరమ భక్తునికి కలలషిత ముండదు...T.S.లోని సామెత)
    పారెడి నీటికిభక్తిని
    పారాడెడి వానికేమి భంగము లేమిన్
    ఊరను దొరికిన జవ్వని
    జారిణి పంచంగ దినిరిప్ర సాదము భక్తిన్

    రిప్లయితొలగించండి
  22. డా.పిట్టా నుండి
    ()లో కలుషితము ఉండాలి.టైపాటు old age factor.

    రిప్లయితొలగించండి
  23. ఊరి కుపకారి యగు పూ
    జారియె దేవాలయమున సలుపగ పూజల్
    చేరిన భక్త జనులు పూ
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జారిణి యైన నేమి దన సజ్జన రక్షణ దీక్ష బూనికన్
      వారికి దోడుగా మధురవాణియె నిల్చెను వెన్ను దన్నుగా
      నేర విముక్తులై యపుడు నిండు మనమ్మున దల్చి రందరున్
      జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు!

      తొలగించండి
  24. డా.పిట్టా సత్యనారాయణ
    పూరణమైన పుష్పముల బోతురు రాశిగ పూజనార్థమై
    కూరిమి నెన్ని చిన్నదగు గుచ్ఛమునుం గన రెవ్వరైన నా
    చారమదైన నా కుసుమ జాలము ఖిన్న మనస్కగాదె, వే
    గోరిన మాంస మమ్ముకొన గూర్చొను వానిదె ధర్మమంచనన్(ధర్మవ్యాధుని ఉపదేశమును కోరినారు గదా)
    జారిణి పంచి పెట్టిన ప్రసాదము దిన్న మహోదయంబగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టావారూ...
      మీ పూరణ బాగున్నది. అభినందనలు!

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా, కాకతీయ పద్య వేదికకు నాకు స్వాగతము పలికితిరి.దూరవాణి ద్వారా టైపుచేయలేక మాత్రమే స్పందించలేదు.ట్యాబ్ లో చేసే అవకాశము కల్పించ గలరా?ధన్యవాదాలు.

      తొలగించండి
  25. వారము నకొక్కసారి గ
    వారస్త్రీలు పరమేశు బారవ కొరకై
    యేరుపరచు కొనగ నపుడు
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్

    రిప్లయితొలగించండి
  26. దూరము చేసి వ్యసనములు
    తీరుగ జీవించు నా యతివ సద్గుణ సం
    చారిణి హృత్పరి వర్తిత
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్


    వారని నమ్మకమ్మున శుభమ్ములు గోరుచు మానవాళిలో
    నేర ప్రవృత్తి మాన్ప నను నిత్యము వేఁడ వలెం బరాత్పరుం
    దోరపు భక్తి పెం పెసఁగ ధూర్జటి దేవ గృహాళి నిత్యపుం
    జారిణి పంచి పెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్

    [నిత్యపు +చారిణి = నిత్యపుం జారిణి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ...
      మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు!
      నిత్యపుంజారిణి...ఈ ఆలోచన నాకూ వచ్చింది. కానీ ఆచరణలో పెట్టలేదు.
      చారిణిని జారిణిగ మార్చి రాయడం చాలా బాగున్నది.

      తొలగించండి
    2. కవిపుంగవులు మధుసూదన్ గారు నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బారుల బీరునమ్ముచును బాధలు పెట్టగ త్రాగుబోతులున్
    నేరపు కార్యముల్ సలిపి నీరస మొందుచు మానసమ్మునన్
    ఘోరపు వృత్తినిన్ విడిచి కూడిన నాలయ ప్రాంగణమ్ము నా
    జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్

    రిప్లయితొలగించండి
  28. ఆరమణుబూజజేయగ
    హారములమెఱపులతోడనచ్చపుభక్తిన్
    హారతిపిదపనునాపూ
    జారిణిపంచగదినిరిప్రసాదముభక్తిన్

    రిప్లయితొలగించండి
  29. నేరములెన్నదు నిరతము
    ధారాధరనీలదేహుదాశరథిన్ సొం
    పారభజించునతిథులా
    *"జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్"*

    రిప్లయితొలగించండి
  30. జారిణినేరమేమి వనజాక్షిసమాజపు చీదరింపుకు
    న్నారిననారిదీపము ననాధులజేయకనాదరించకన్
    బేరిమిబెండిలిన్ సలిపె బెద్దమనంబున కందుకూరి యా
    *"జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!
      చీదరింపునన్, ననాథుల, అనాదరించకే అనండి.

      తొలగించండి
  31. హారములెన్నియోనునిచియాశివపార్వతికంఠమందునన్
    నారనిభక్తితోడముదమారగబూజనుజేసినట్టిపూ
    జారిణిపంచిపెట్టినప్రసాదముదిన్నమహోదయంబగున్
    బారమునొందుటేపరమభక్తికిగారణమిధ్ధరన్ సూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు!
      చివరి పాదాంతాన గణభంగం. సూ తొలగించి, గదా...అనండి.

      తొలగించండి
  32. ఉ.గారెలు పాయసమ్ముసహ కమ్మని పొంగలి నొండి తెచ్చుచున్
    బారులు తీర్చి స్త్రీ పురుష భక్తులు నిల్బడి చేయి చాచ నె
    వ్వారకు కాదు లేదనక భారపు పాత్రను చేతబట్టి పూ
    జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్"

    కం. చేరుచు భక్తులు దేముని
    పేరున కోవెల గడపకు వేళకు సరిగా
    క్షీరాన్నము చక్కగ పూ
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు!
      మొదటి పూరణలో...సహ అనకుండా..లును...అనండి. ఒండి అసాధువు. వండి అనండి.

      తొలగించండి
  33. కోరగ కోర్కెలుభక్తిన్
    మీరగ మిన్నంటెభక్త మేళములవిగో
    కూరగ భక్తజనము,పూ
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్!!

    రిప్లయితొలగించండి
  34. తద్భవమైన (ఆచ్ఛికము) పూజ కు మతుబర్థమున “అరి” తద్ధితము చేరగా వచ్చినవి పూజారి, పూజరి. . తద్భవము కనుకనే జ దంత్య మయినది. అరి వర్ణకము నాచ్ఛికములకే వచ్చును.
    దీనికి స్త్రీ లింగమున ని/ ణి లు న కారాంత పుంలింగ సంస్కృత పదములలో రావచ్చు గాని యాచ్ఛికముల రాఁ దగ వని నా యభిప్రాయము.
    పూజారి సాని / పూజరిసాని లు స్త్రీ వాచకములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ తత్సమముగా తీసికొనిన
      పూజా + ఆరి = పూజారి : పూజకు శత్రుయినది. అరి ఇ కారాంతము కనుక పూజారీ కి తద్భవముగా పూజారి యే యగును.
      అరిన్ (చక్రము) పదమును తీసికొనిన పూజారిణి కానీ యిక్కడ యన్వయము క్లిష్టము.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు పోచిరాజువారూ...
      మీ సూక్ష్మపరిశీలనకు జోహారులు. చక్కని వివరణ నిచ్చారు. అభినందనలు.

      తొలగించండి
  35. కందం
    మారుచ వెలదియె వేమనఁ
    గూరిచె నీతిశతకమ్ము గొప్పగ నేర్వన్
    ధారుణిఁ బ్రజ, ప్రేరణయై
    జారిణి, పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్

    రిప్లయితొలగించండి
  36. ఉత్పలమాల
    దారిని వీడి వేమన యధార్థము నొప్పక చేర విశ్వదన్
    మాఱిచె నోగిగా నతని, మన్నన లందిన నీతిపద్యముల్
    బేరిచె నిత్యసత్యమన వేమన గూరిచి ప్రేరణంబుగా
    జారిణి, పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్

    రిప్లయితొలగించండి


  37. ఓరోరీ పిల్లల్లా
    రా! రాకాసుల కొమరుల రాభసు లారా!
    మీరెల్లరు పాపులు రా!
    జారిణి పంచఁగఁ దినిరి ప్రసాదము భక్తిన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  38. నేరరు జారిణీమణులు నిత్యసుమంగళులన్న నానుడిన్
    నేరరు వారకాంతలె మనీషుల కామ వికార సూదనుల్
    నేరరు దర్షకారిణులె నృత్య విశారదులాలయాల శ్రీ
    *"జారిణి పంచిపెట్టిన ప్రసాదముఁ దిన్న మహోదయం బగున్"*

    రిప్లయితొలగించండి


  39. తీరని వ్యథతో చని పూ
    జారిణి పంచగ తినిరి ప్రసాదము భక్తిన్
    బారగ రుజలన్నియు తమ
    యారోగ్యముకుదుట పడగ హర్షించిరిలన్

    రిప్లయితొలగించండి