5, జూన్ 2019, బుధవారం

సమస్య - 3038 (హరుఁడె లోకవిత్త...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము"
(లేదా...)
"హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో చిటితోటి విజయకుమార్ గారి సమస్య)

73 కామెంట్‌లు:

  1. వరముల్ కోరెడి మానవా గ్రజుల సంభావిం పగావే డుకన్
    పరమే శుండట సంతసం బునను తాపంబుల్ తొలంగించ గా
    నరమే ధంబులు పొంచియుం డగను తానానా టినుండే శిలై
    హరుడే సంతత లోకవిత్త హరుడై యన్యాయముం జేసెడిన్

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    హరి కంఠాభరణమ్ము చేసినను , భార్యాకంకణమ్మైన , సో...
    దరి మాంగళ్యము చేసినన్ , కనకమున్ దగ్గించి రవ్వంతయేన్
    మురియున్ , సంపదయందె దృష్టి , ధరలో మోసమ్మిదే ! పశ్యతో...
    హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి.

    రిప్లయితొలగించండి
  3. ప్రాతః కాలపు సరదా పూరణ:

    "చౌకీదార్ చోర్ హై!"

    కరముల్ మోడ్చుచు నన్ను కావుమనగా గారాబు మిత్రుండటన్
    కరముల్ త్రిప్పుచు బిందెలోన భళిగా కాపాడ నంబానినిన్
    వరముల్ నిచ్చుచు రాఫెలందు వసిగా పండంటి హిందూత్వపున్
    హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్

    రిప్లయితొలగించండి
  4. వరము లిచ్చి జనుల సరసపు రీతిని
    బ్రతుక నేర్పు నంట భవుడు మెచ్చి
    లంచ మిచ్చి మ్రొక్కి రాసులు కురిపించ
    హరుఁడె లోక విత్త హరుఁడు సుమ్ము

    రిప్లయితొలగించండి


  5. చపల లచ్చి వచ్చు చక్కగ కొల్వగ
    నెమ్మి బోవ విడుచు నెప్ప్డు తెలియ
    నెవరి తరము ?వెన్క నీకు హరుడె దిక్కు!
    హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చపల లచ్చి' దుష్టసమాసం."చపల లక్ష్మి" అనండి.

      తొలగించండి
  6. కరుణన్ గాచునుకామితార్థములతో కంసారియెల్లప్పుడున్
    సిరులన్ గూర్చును చింతదీర్చు నెదసంసేవింపగాభక్తితో
    ధరణిన్ దుర్మతులైనవారియెడనిర్దాక్షిణ్యతన్ శ్రీహరౌ
    హరుఁడే, సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శ్రీహరి + ఔ' అన్నపుడు యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. 'శౌరియౌ' అనిమారిస్తే సరిపోతుందిగదండీ

      తొలగించండి
  7. ఆలయాలలోన ఆర్జిత సేవల
    పేరు జెప్పి ధనము పిండు కొనగ
    భక్తు డొకడు పలికె బాధతో లోకాన
    హరుఁడె లోకవిత్త హరుఁడు సుమ్ము

    రిప్లయితొలగించండి
  8. జరగన్ దుష్కృతి నెందుగాని క్షణమున్ సాధించి చెండాడు శ్రీ
    హరుఁడే ! సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్
    నరులే! భీకర రాక్షసేంద్రులయి యత్నమ్మున్ ప్రహారింపఁ వా
    రలనుద్దేశముఁజంపబూను నవతారమ్ముల్ ప్రదర్శించుచున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హరుడే... నరులే..' వచనదోషం.

      తొలగించండి
  9. (దుర్వ్యసనలోలుడై బంధుత్వాలు మరచి ఇంటాబయటా దొంగతనాలకు దిగిన నిగమశర్మ)
    కరుణామూర్తులు తల్లిదండ్రులను,స
    త్కార్యోజ్వలన్ భార్యనున్,
    వరమౌ సోదరసోదరీమణుల,స
    ద్భావోన్నతుల్ బిడ్డలన్,
    నిరయంబౌ పథగామియై మొరకుడై,
    నిత్యంపు బాంధవ్యతా
    హరుడే-సంతతలోకవిత్తహరుడై
    యన్యాయముం జేసెడిన్.
    (నిరయంబు-చెడ్డదైన;మొరకుడు-మూర్ఖుడు)

    రిప్లయితొలగించండి
  10. 🙏
    ధర్మయుక్త మౌచు ధనము నార్జించిన
    దేవదేవుఁ డంతఁ దెగడ డెపుడు
    అతిగ సంచయింపఁ నానంద దూరుడౌ
    హరుడె లోక విత్త హరుడు సుమ్ము!

    తెగడు-కోపము
    అతిసంచయము-అవసరానికి మించి ఆర్జించుట.

    రిప్లయితొలగించండి
  11. హరిని హరుని దలచి యార్భాటమున్ జేసి
    గురువుగాను బరగి గుంపుజేర్చి
    దొంగ సాధువేషి తోయజాక్షుల మాన
    హరుడె లోకవిత్తహరుడు సుమ్ము

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    ధనము చెంత నున్న దలపడు నన్నని
    ఈషణాత్రయంబు నీడ్చివేయు
    చిల్లి గవ్వ జిక్క జిల్కడు మోక్షంబు
    హరుడె లోక విత్త హరుడు సుమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఈషణత్రయంబు' అనండి.

      తొలగించండి
  13. కోట్ల కోట్ల ధనము కోరిన మాత్రాన
    రుణము పొంది పిదప రొక్కమసలు
    బదులు తీర్చకుండు పబ్లికు బ్యాంకుల
    "హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము

    కోరిన వెంటనే పబ్లిక్ రంగ బ్యాంకింగ్ సంస్థల నుంచి కోటానుకోట్ల రూపాయలు రుణాలు పొంది, ఏమాత్రం తిరిగి చెల్లించకుండా ఎగవేసే బ్యాంకు దొంగలు లోకంలో ధనాన్ని దొంగిలించే వారు.

    రిప్లయితొలగించండి
  14. డాపిట్టా సత్యనారాయణ
    (Unless ye born of water ,ye have no salvation..The Bible)
    చరణాబ్జంబులనమ్మి యోగమున నా సర్వేషు నందన్ పురే!
    కరముల్ కాళ్ళును నాడకున్న సరి నీ గర్వంబునున్నాస్తులున్
    కరువౌ పూర్తి విరాగివై తుదకు నీ కాంక్షల్ నశించే దిశన్
    హరుడే సంతత లోక విత్త హరుడై యన్యాయమున్ జేసెడిన్

    రిప్లయితొలగించండి
  15. కోట్ల కొలది ధనము గొల్ల జేసినవారు
    నేల విడిచిబోవ నెరవుజేయ ,
    లక్షణముగ నున్న రాజ్యాంగపు నియతి
    హరుఁడె , లోకవిత్తహరుఁడు సుమ్ము

    రిప్లయితొలగించండి
  16. జాలి సుంత లేక జనుల ను పీడించి
    లంచ గొండి యగుచు రాణ కెక్కి
    కోట్ల క ధిప తి యగు కుటిలు డు నీతి సం
    హరుడె లోక విత్త హరుడు సు మ్ము

    రిప్లయితొలగించండి
  17. చిత్తమందు దాగు చింతలె విత్తమ్ము
    నరుఁడు యాశలందు నలుగుచుండు
    చిత్త శుద్ధి తోడ శివుని ధ్యానింపుమా
    హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము 🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నరుడు + ఆశలందు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "నరుడె యాశలందు.." అనండి.

      తొలగించండి
  18. మితియె లేక తాను మితిగట్టు మిషతోడ
    ధనము దండు చుండె దండి గాను
    లలన ముద్దు గుమ్మ లక్ష్మిదేవీ చిత్త
    "హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లక్ష్మీదేవీ చిత్త' మనడం సాధువు.

      తొలగించండి
  19. నాడి బట్టి జూసి నయముగా దొంగిలు
    మందులిచ్చు వాడె మాయకాఁడు
    నమ్మదగును మీరు నామాట రోగ సం
    హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నాడి బట్టి చూసి' అనండి.

      తొలగించండి
  20. అసలుకంటెమిన్నయాయకారపువడ్డి
    జమగ గట్టుచుండెసత్యవిభుడు
    సార్ధకంబునయ్యెశంకరుపలుకులు
    హరుడెలోకవిత్తహరుడుసుమ్ము

    రిప్లయితొలగించండి
  21. ఎల్ల సృష్టిఁ జేయు నిచ్చతురాస్యుండు
    వెలయఁ జేయు దాని వెన్నుఁ డెలమి
    జీవుల యసువుల నశేష విధిం దీయు
    హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్ము

    [లోక విత్త హరుఁడు = లోకము చేతఁ దెలియఁబడిన శివుఁడు]

    వరమై యొప్పఁ బ్రజా దురాశ యతి విశ్వాసమ్ము మూర్ఖత్వమున్
    నరులం దుందురు మోసగాండ్రు విను మన్నా చూతు మిద్ధాత్రిఁ బె
    క్కుర భాషా నిపుణత్వ ధీర తతి ముక్కోటిం జలత్పశ్యతో
    హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్

    [పశ్యతో హరుఁడు = చూచు చుండగనే దొంగిలించువాఁడు; లోక విత్త హరుఁడు = లోకము చేతఁ దెలియఁబడిన దొంగ]

    రిప్లయితొలగించండి
  22. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    వరముల్ నిచ్చుచు మూఢ భక్తులకు తా బైరాగియై పారుటన్
    సరియౌ వాహన మబ్బకుండ తనువున్ సారించు గంగెద్దునన్...
    కురులన్ దాల్చుచు గంగనున్ విరివిగా గుప్పించు నీరమ్ము;...నీ
    హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్?

    రిప్లయితొలగించండి
  23. . *శ్రీ గురుభ్యో నమః*
    శంకరాభరణం-సమస్యాపూరణం
    సమస్య :: హరుఁడే సంతత లోక విత్త హరుఁడై యన్యాయముం జేసెడిన్.
    సందర్భం :: “ఓ శ్రీహరీ! జగత్త్రయైక రాజ్యము నిచ్చెన్ నా దయితు కట్ట నేటికి” అని బలి చక్రవర్తి భార్య వామనమూర్తిని అడిగింది.
    “తన సొమ్ము సకలంబుఁ దప్పక నీ కిచ్చె ... బలికిఁ దగునయ్య దృఢపాశ బంధనమ్ము”. (పోతన భాగవతం - అష్టమస్కంధము - పద్యం 659) అని బ్రహ్మదేవుడు వామనమూర్తిని అడిగినాడు.
    అప్పుడు విష్ణుమూర్తి సమాధానం చెబుతూ “ ఎవ్వనిఁ గరుణింప నిచ్ఛయించితి వాని యఖిల విత్తంబు నే నపహరింతు” అని అన్నాడు. (పద్యం-661)
    కాబట్టి శ్రీహరుడే అనగా విష్ణువే బలిచక్రవర్తి వంటి భక్తునియొక్క లోకవిత్తహరుడై ముల్లోకములను అపహరించి అన్యాయం చేసినాడు అని అక్కడ ఉన్న పౌరులు అనుకొంటూ ఉన్నారన్న ఊహతో సమస్యను పూరించిన సందర్భం.
    పూరణ ::
    హరుఁడే పల్కును భక్తపాపహరుడే యంచున్ హరిన్, మామనో
    హరుఁడే వీడు త్రివిక్రముం డగుచు నే డాశించె ముల్లోకముల్,
    హరుఁడే యన్నటు విక్రమించె, బలి నాహా దాతగా మార్చె, శ్రీ
    హరుఁడే సంతత లోక విత్త హరుఁడై యన్యాయమున్ జేసెడిన్.
    కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరు.
    తేది :: 5-6-2019.

    రిప్లయితొలగించండి
  24. వరమై లోకములన్ని గాచు వెలుగై పాపంబులన్ బాపునా
    హరుఁడే; సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్
    నరుఁడే నేడిటు నాయకుండగుచు నానా యాతనల్ బెట్టగా
    హరుఁడే తామస ధ్వాంత నాశకరుడై యా దుష్టునిన్ గూల్చునే

    రిప్లయితొలగించండి
  25. విరుల రంగువేసి విజ్ఞానమునుబంచి
    రవిసుధాకరులు సరైనవేళ
    కాంతినింపజేసి గల నవినీతిసం
    హరుడె!లోకవిత్త హరుడుసుమ్ము!

    రిప్లయితొలగించండి
  26. నాడిపట్టకుండ నలభై పరీక్షలు
    చేసిరోగికున్న జేబుగుంజు
    వైద్యుడనెడివాడు వింతగారోగాల
    హరుడెలోక విత్త హరుడుసుమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరుడేసంతతలోకవిత్తహరుడైయన్యాయముంజేసెడిన్
      సరిగాజెప్పిరిసాధుపుంగవులెయాజంభాసురవైరియే
      భరణంబేరునవేంకటేశుడిలదాభక్తాళిబీడించిసూ
      కరమున్భక్తులవిత్తమున్బొదిలియేకాకిన్సదాజేయుగా

      తొలగించండి
  27. తాను కరుణ చూప దలచు నా సిరి చిత్త
    హరుడు లోక విత్తహరుడు సుమ్మి
    పలు పరీక్షలకును పలువిధాలుగ గురి
    చేయుచు తుదకు తన చెంత చేర్చు.

    రిప్లయితొలగించండి
  28. పెరిగెన్ రోగము లెన్నియో నటులె వైవిధ్యంపు వైద్యుల్ కనన్
    బరువై పోయెను మోయు వారలకిలన్ వైద్యమ్ము దౌర్భాగ్యమై
    తరిగెన్ కొందరి వైద్యవృత్తి విలువల్ దైవమ్మ!యస్వస్థపున్
    హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్

    రిప్లయితొలగించండి
  29. పరమోత్క్రుష్ట పథంబునందుటకునై పల్మారు దర్శించుచున్
    కరముల్ మోడ్చుచు నీలకంఠ!యనుచున్ గౌరిపతిన్గొల్వగా
    నిరతంబిచ్చిన కాన్కలందుకొనంచున్ నిల్చుండునోశిల్పమై
    హరుడే సంతతలోకవిత్తహరుడై యన్యాయముంజేసెడిన్

    రిప్లయితొలగించండి
  30. మత్తేభవిక్రీడితము
    పరిశోధించఁగ భారతావని ప్రజాస్వామ్యమ్ము నన్ నేతయే
    నెరవేరంగను గద్దెనెక్కుకలలున్ నీచాతి నీచమ్ముగన్
    సిరులన్ జల్లుచు నెన్నికల్ గెలిచుచున్ సేవించెడున్ సాకునన్
    హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్

    రిప్లయితొలగించండి
  31. నిన్నటి సమస్యకు పూరణ

    సమస్యః-

    *"చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"*

    కాముకుడైన కీచకుని కామిని రమ్మని పిల్చినంత నా
    భామనుఁ బొందగోరి చని ప్రాణము వీడెనటంచు తెల్యగా
    చీమ పరాకుగన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్
    సామజమున్ వధించెనొక జాగిలమంచు జనాళి పల్కెనే.

    రిప్లయితొలగించండి
  32. సమస్యః -

    *"హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్"*

    ధరలే పెర్గిననేమిరా పసిడినే తాఁ గోర నే కొంటినే
    మురిపమ్మందుచు, నేడు వారపు నగల్ ముత్యాల హారమ్ము ము
    క్కెరలే జేయుచు తస్కరించెగద గాంగేయమ్మునే పశ్యతో
    హరుఁడే సంతత లోకవిత్తహరుడై యన్యాయముం జేసెడిన్.

    రిప్లయితొలగించండి
  33. హరుడే మారుని నుగ్గుజేసి మహిపై యాకారముంద్రోసెనో*
    హరుడే దక్షుని యాగమున్ జెఱచి నాహంకారముంసైచెనో*
    హరుడే సోముని మౌళినిన్ నిలిపి ఆహార్యంబుగామార్చెనో*
    హరుడే సంతత లోక విత్త హరుడై యాన్యాయమున్ జేసెడిన్*

    ***నాగమంజరి గుమ్మా***

    అందమైన మన్మధుని మసిచేసి భూమిపై ఆనవాలు లేకుండా చేసి, దక్షుని యాగము నాశనం చేసి అహంకారము కూల్చి, చంద్రుని తన తలపై ఆభరణంగా ధరించి (కామ, క్రోధ, మోహములను మూడింటిని అణచి) లోకాల సంపదలను హరిస్తున్నాడే... ఆ శివుడు ఎంత అన్యాయం చేస్తున్నాడో కదా...

    రిప్లయితొలగించండి
  34. సమస్యా పూరణ

    ("హరుఁడే సంతత లోక విత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్")

    *అరెరే యెన్నిక తీరు చూడనది మాయాజాలమన్నట్టులే
    *కరువాయే విలువున్న నాయకులు చీకట్లై ప్రజాస్వామ్యమే
    *పరువూ గౌరవమన్నియూ విడచి పాపాల్లో ఘనుండైనయా
    *హరుడే సంతత లోక విత్తహరుడై యన్యాయముం జేసెడిన్.

    రిప్లయితొలగించండి