21, జూన్ 2019, శుక్రవారం

సమస్య - 3054 (శునకమ్మున్ గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శునకమ్ముఁ గని పరుగిడె నసురపతి భీతిన్"
(లేదా...)
"శునకమ్మున్ గని భీతుఁడై పరచె రక్షోనాథుఁ డాలమ్మునన్"
(ఈ సమస్యను పంపిన పి. మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు)

34 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    కనకమ్మున్నది నాకటంచు మదిలో గాఢంబుగా నమ్ముచున్
    కునుకున్ దీసి యమేథినిన్ విబుధుడే క్రూరంబుగా నోడెనే!
    వినుమా సోదర శంకరార్య! నగుచున్ వీక్షింపగా తోచెనే:
    శునకమ్మున్ గని భీతుఁడై పరచె రక్షోనాథుఁ డాలమ్మునన్

    రిప్లయితొలగించండి
  2. త్రిపురాసుర సంహార వర్ణనం:-

    ఇనుడున్ చంద్రుడు రెండు చక్రములుగా నేతెంచ గాఁదేరుకున్
    సనతుండే రథచోదకుండయెనుగా స్వర్ణాద్రియే విల్లయెన్
    ఘనమౌ నారి యనంతుడై హరియె సూకమ్మైన నాధీరు నీ
    శునకమ్మున్ గని భీతుఁడై పరచె రక్షోనాథుఁ డాలమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కనకపు మృగమై జానకి
      మనమున విష బీజమయ్యె మారీచుండే!
      వెనుకన వచ్చు భువిసుతే
      శు నకమ్ముఁ గని పరుగిడె నసురపతి భీతిన్

      తొలగించండి
  3. (అర్థం తెలుసుకోకుండా క్రొత్తపేర్ల మోజుతో కుమారునికి "రక్షోనాథ్"
    అని పేరుపెడితే వాడు కుక్కను చూచి పరుగెత్తే పిరికివాడైనాడు)
    ఘనమౌ నామముగా దలంచి యిక వా
    గర్థంబు లేమాత్రమున్
    మనమందుంపక తల్లిదండ్రు లిరువుర్
    మౌర్ఖ్యంపు నూత్నత్వతన్
    దనయున్ వింతగు పేరుతో బిలచి తా
    దాదాత్మ్యమున్ బొందగా
    శునకమ్మున్ గని భీతుడై పరచె ర
    క్షోనాథు డాలమ్మునన్.
    (రక్షోనాథుడు-రాక్షసరాజు;ఆలమ్మునన్-ఉపేక్షతో)

    రిప్లయితొలగించండి
  4. మత్తేభవిక్రీడితము
    కనులన్ కానిన దెల్ల సత్యమగునే! కామర్లు కాచున్గదా
    జనులాత్రమ్మును చూపగా మతులఁ పైశాచుల్ ప్రబోధించరే
    అనినార్భాటము చేయు! వాడటన సింహంబంటి రూపమ్ములో
    శునకమ్మున్ గని భీతుఁడై పరచె రక్షోనాథుఁ డాలమ్మునన్!

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    ననవిల్తున్ మసి జేయ, భస్మమది భణ్డాకారమున్ పొంద ,వా...
    నిని నిర్జింపగనమ్మ శ్రీలలితయై నేత్రోత్సవంబొప్పనం...
    తనె సంధింపగ దివ్యశస్త్రమది వే దాకంగనద్దానవే
    శునకమ్మున్ గని భీతుఁడై పరచె రక్షోనాథుఁ డాలమ్మునన్" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  6. అనుమానమె నెపుడున్ పద
    విని నెవరెప్పుడు హరింప విద్రోహముచే
    యునకో యటంచు ! వెన్కన్
    శునకమ్ముఁ గని పరుగిడె నసురపతి భీతిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  7. అనుమానంబును వీడడాతడు సునాయాసంబుగా నమ్మడె
    వ్వని, భోగమ్ములు బోవు నోయని సదా పాదాగ్రమున్ చాపియుం
    చును వేగమ్ముగ పారిబోయి తలదాచున్ మూలలన్జూచి! హా!
    శునకమ్మున్ గని భీతుఁడై పరచె రక్షోనాథుఁ డాలమ్మునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. శ్రీ గురుభ్యోన్నమః🙏
    రాక్షసులు స్వర్గం మీదికి దండెత్తి రాగా, విశ్వామిత్రుని వంశమునకు చెందిన రజి ని ఇంద్రుడు వేడెను. మహాబలశాలి అయిన రజి అనేక రాక్షసుల తరిమి చంపెను.అప్పుడు ఇంద్రుడు రజికి పాలనాధికారమును ఇచ్చెను.
    ఆ మునిని జూచి ఆసురులు పారిపోయినరని నా పూరణము.

    తను గాపాడమని రజిని
    వినుటెంకి* విభుఁడు పదములు వేడిన తడవన్
    మనలేమని దలపుచు నా
    శునకమ్ముఁ^ గని పరుగిడె నసురపతి భీతిన్.

    *స్వర్గం, ^ఒకానొక ముని.

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    ధ్వనికగు నక్షర రూపము
    చన భీకర *శునకము*నకు సరి నిరు కొమ్ముల్
    విను *సురపతి*కొక కొమ్మయి
    శునకమ్ము గని పరుగిడె నసురపతి భీతిన్

    రిప్లయితొలగించండి
  10. జనులకు వినోద మొసగగ
    మునుకొని వేషమును దాల్చిపోవుచు నుండన్
    కనుగొని వెంటన్బడెనొక
    శునకమ్ము గనిపరుగిడె నసురపతి భీతిన్

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా సత్యనారాయణ
    జనమే గొప్పది విజ్ఞుకన్న నిలలో జాజ్జ్వల్యమానంబుగా
    ఘన పార్టీలను మట్టిగర్ప గడగెన్ గాండ్రించి నీ యెన్నికన్
    సునసూయన్ మదినెంచి కింకరులుగా జూడంగ, మార్చేయదే?!
    శునకమ్మున్ గని భీతుడై పరచె రక్షోనాథు డాలమ్మునన్

    రిప్లయితొలగించండి
  12. మునులను బాధలు పెట్టెడి
    దనుజుని గూల్చగ సరగున దైవము దాల్చెన్
    ఘన భైరవ రూపమునా
    శునకమ్ముఁ గని పరుగిడె నసురపతి భీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనులన్ బాధలు పెట్టెనా కుమతి విశ్వమ్మెల్ల క్షోభించగా
      దునుమన్ వానిని శంకరుండపుడు రుద్రుండౌచు వెన్నాడగా
      వెనుకన్ పర్విడు భైరవాకృతి మహాభీతావహంబైనదౌ
      శునకమ్మున్ గని భీతుఁడై పరచె రక్షోనాథుఁ డాలమ్మునన్

      తొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. జనపద మందున రామా
    యణకథ నొక నాటకముగ సలుపుచు నుండన్
    పొనుపున వేదిక నెక్కిన
    శునకమ్ముఁ గని పరుగిడె నసురపతి భీతిన్

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందఱకు నమస్సులు!

    [త్ర్యంబకుఁడు ధనుర్బాణ కవచములను ధరించి, ఛత్ర కేతన యుత రథారూఢుఁడై, దివ్యసైన్యముతోఁ ద్రిపురాసురులతోడి యుద్ధమునకు వెడలి, హరిని స్మరించి, నారాయణాస్త్రము వేయ, నా రాక్షసేశ్వరుఁ డా శివుని యమ్మును జూచి, భయపడి యుద్ధరంగాన్ని వీడి పాఱిపోయె నను సందర్భము]

    ధనురారాముఖుఁడై నిచోళకుఁడునై తత్స్యందనారూఢుఁడై
    చన యుద్ధంబున దివ్యసైన్యయుతుఁడై సచ్ఛత్ర సత్కేతుఁడై
    యనలాక్షుండు హరిన్ స్మరించి యటఁ దా నస్త్రమ్ము వేయంగ నీ
    శున కమ్మున్ గని భీతుఁడై పఱచె రక్షోనాథుఁ డాలమ్మునన్!

    [ధనుః+ఆరాముఖుఁడు+ఐ=ధనుర్బాణములు కలవాఁడై; నిచోళకుఁడునై=కవచమును కలవాఁడై; ఈశునకు + అమ్మున్ + కని = శివునకు అమ్ముగా ఒనర్పఁబడిన నారాయణాస్త్రాన్ని జూచి;]

    రిప్లయితొలగించండి
  16. కనలుచు నుఱుకు బలారిం
    గని వజ్రాయుధ మలరఁగఁ గరమందు భయ
    మ్మునఁ బాఱు పిల్లి వలె నా
    శునకమ్ముఁ గని, పరుగిడె నసురపతి భీతిన్


    ఇన వంశోద్భవ రత్నదీపము ధరిత్రీశుండు చెండాడుచుం
    గని రక్షోబల సంహిత త్రిశిరు ధిక్కారున్ జనస్థాన స
    న్ముని రక్షా రత చిత్త ధార్మికుఁడు ధానుష్కుండు కాకుత్స్థుఁ డా
    శున కమ్ముం, గని భీతుఁడై పఱచె రక్షోనాథుఁ డాలమ్మునన్

    [ఆశు ను +అ = ఆశున = వేగమ; కమ్ము = కవియు, వ్యాపించు; పఱచు = పాటుపడఁజేయు (బలమును)]

    రిప్లయితొలగించండి
  17. ఘనభూషాన్వితుఁ రావణు
    డననుచు పలుకుచు నొకండు డ్రామా వేయన్
    జనుచుండగ వెంట పడిన
    శునకమ్ముఁ గని పరుగిడె నసురపతి భీతిన్

    రిప్లయితొలగించండి
  18. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    దినమున్ రాతిరి మాంసమున్ నరులదౌ తిట్టంగ బోరంచు తాన్
    పుణుకుల్ బజ్జిలు మిర్చివిన్ కుడుములున్ పూర్ణంపు బూరెల్ నహా
    తినగన్ కోరుచు హైద్రబాదు చనగన్ తీవ్రమ్ముగా పిచ్చిదౌ
    శునకమ్మున్ గని భీతుఁడై పరచె రక్షోనాథుఁ డాలమ్మునన్

    రిప్లయితొలగించండి
  19. అనిలుడుతనతోవచ్చెడు
    శునకమ్ముగనిపరుగిడె,నసురపతిభీతిన్
    జనియెనుగదనముజేయక
    వినువీధినిమ్రోగునట్లువింతరవముతోన్

    రిప్లయితొలగించండి
  20. తనవాడట్లుగ దినుచును
    మనుగడలోమోసబరచు మనుజుడుకుక్కే
    గనబడి కలలోనమ్మని
    శునకమ్మును గనిపరుగిడె"నసురపతి"భీతిన్ (అసురపతిఅనువ్యక్తి)

    రిప్లయితొలగించండి
  21. ఘనముగ సీతాపహరణ
    మను నాటచ మందు రావణాసుర వేశ
    మ్మును గాంచి వెంబడించిన
    శునకమ్ముఁ గని పరుగిడె నసురపతి భీతిన్.

    రిప్లయితొలగించండి
  22. ఆనయము హరిధ్యాసనున్న అంబరీషు కావగ
    వచ్చిన చక్రమ్ము చూసి, పరువిడె కర్మంది


    తపము చేసినదే తడవుగా వరములిచ్చి నెత్తికి
    దెచ్చికొన్న హరుడు పారె, భస్మహస్తము జూచి


    ఎనలేని భుజబలశాలి యా మర్కటరాజు వాలిని
    జూచి, పారె తోక ముడిచి లంకాధిపతి

    శునకమ్ము గని పరువిడె నసురపతి భీతిన్ యను
    ఘనుడెవ్వడో సర్వజ్ఞుడా హరి యెరుగున్!

    రిప్లయితొలగించండి
  23. సినిమాలో వేషమనగ
    చనవేగమె రావణునిగ శౌర్యముజూపన్
    పెనుకోరల జూపి యరచు
    శునకమ్ముగని పరుగిడె యసురపతి భీతిన్

    సినిమాయందున రావణుండుగను రాశీభూతశౌర్యమ్మున
    న్ననిలో రాముని శస్త్రసంతతిని సునాయాసంబుగా గూల్చి తా
    చనువేళన్ యెదురవ్వగా మిగుల భీష్మంబౌచు గర్జించెడిన్
    శునకమ్మున్ గని భీతుడై పరచె రక్షోనాథు డాలమ్మునన్
    ఆలమ్మునన్ =శ్రేష్ఠమైన రీతిలో

    రిప్లయితొలగించండి
  24. కనకాచార్యులుదారినిన్జనుచుదాకామాఖ్యజూడన్నటన్
    శునకమ్మున్గనిభీతుడైపరచె,రక్షోనాధుడాలమ్మునన్
    గనగారామునిభీతుడైచనియెనేకాంతంబుగానుంటకై
    ననుచున్వచ్చెనునాకునొక్కకలయార్యామీకువాక్రుచ్చితిన్

    రిప్లయితొలగించండి
  25. వెనుకంజ వేసెనరుడా
    శునకమును గని ,పరుగిడెనసురపతి భీతిన్
    తనయూపిరి దీసెడి యీ
    శునకమ్మును గని భయమున శుండాలముపై

    రిప్లయితొలగించండి
  26. One should store their Jaxx data and information as a backup. If you want to back up your data but failing to do so then, you can directly speak up to the professionals by dialing Jaxx support phone number which is always accessible and you don’t have to pay any charges to get connected with them. The professionals are there to handle all your queries and errors in the best possible way. You can connect them at any point without worrying about the time issues. The customer experts immediately frame resolutions and methods on fingertips.

    రిప్లయితొలగించండి