16, జులై 2020, గురువారం

సమస్య - 3428

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భారతము సంస్కృతిభ్రష్టమై రహించు"
(లేదా...)
"భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై"

39 కామెంట్‌లు:


  1. నడిరేయి సరదా పూరణ:

    పరువే పోయెడు నోటమిన్ సయిచకే భ్రష్టుండునై దిల్లినిన్
    ధరణిన్ గానని దూషణమ్ము లిడుచున్ ధారాళమౌ బూతులన్
    వరలన్ రాహులు పిక్కటిల్లగనయో; వైనంపు మోడీశుతో
    భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై...

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కరవై పోవగ యుద్ధనీతులకటా గాఢంపు శౌర్యమ్ముతో
    మరువన్ జాలని దేశభక్తిగొనుచున్ మర్యాదలన్ వీడుచున్
    మొరటౌ చీనుల నెత్తి మొత్తుచునహో మోదంపు నాదమ్ములన్
    భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై....

    రిప్లయితొలగించండి
  3. మత మౌఢ్యాలు,కుల వివక్షతలు, మొ.నవి నశించినపుడే పురోగతి సాధ్యమని నా భావం

    చిరకాలంబుగ నున్న మూఢ గతులున్ ఛిద్ర ప్రమాణంబులున్
    దరి రానివ్వని శాస్త్ర వాక్యములు విస్తారంపు దుర్మార్గముల్
    చొరరానివ్వనినాడు విశ్వ జనతా శుభ్రప్రమోదంబునై
    భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్ సంస్క్రతి భ్రష్టమై.

    రిప్లయితొలగించండి
  4. వర దుర్వార బలోద్ధతిన్ రిపుల దూవాళించుచున్ దర్పమున్
    భరతక్షోణి పురోగమించునఁట; భాస్వత్సంస్కృతిభ్రష్టమై
    పరదాస్యమ్మున మ్రగ్గి నాశమగు దౌర్భాగ్యమ్ము బోనాడగా
    స్థిర చిత్తంబున దేశ సైనికులు రక్షింపంగ నల్దిక్కులన్

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    A-1)
    సంస్కృతి భ్రష్టమైన, మానవుడు మళ్ళీ దానవుడే :
    __________________________

    నాగరికత హెచ్చిన గాదె - నరుడు హెచ్చు
    దుష్ట సంస్కృతి పెరిగిన- నష్టి గలుగు
    భ్రష్టమగును సమాజమే - స్పష్టముగను
    కష్ట పడుదురు ప్రజలదే - పిష్ట వలెను
    భారతము సంస్కృతిభ్రష్ట - మై నశించు !
    యెటుల నమ్ముదు మీమాట - నెవ్వరనిన
    "భారతము సంస్కృతిభ్రష్ట - మై రహించు"
    __________________________

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    B-1)
    రైతు రాజైతేనే సుభిక్షం :
    __________________________

    కురియన్ వానలు మూడు పంటలను చి- క్కుల్ లేక పండించినన్
    అరకాళ్ళందరు విందుభోజనమునే - యందించి పెంపొందినన్
    వరలున్ దేశము భోగభాగ్యముల కా - వాసంబు కాగా నిలన్
    భరతక్షోణి పురోగమించునఁట ! భా - స్వత్సంస్కృతిభ్రష్టమై
    భరతక్షోణి తిరోగమించుననుటే - బ్రహ్మంబు చింతించినన్
    __________________________
    అరకాడు = రైతు, బ్రహ్మము = సత్యము

    వసంత కిశోర్ (కవులూరు రమేష్)

    రిప్లయితొలగించండి


  7. మాట వినవె విడవలె నమ్మ త్వరితమ్ము
    వలదు ముసిమి పాశ్చాత్యపు వర్తనముల
    పై జిలేబి మనకు సరిపడవు సూవె
    భారతము సంస్కృతిభ్రష్టమై రహించు


    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. లెస్సయగు పురాతన నాగరికత గలది
    భారతము , సంస్కృతిభ్రష్టమై రహించు
    పశ్చి మము నందుగల జనపదములందు
    మొక్కబోయిన యభివృద్ధి ముసుగు నందు

    రిప్లయితొలగించండి


  9. వరలన్ మీరలు సూవె గ్రోలవలెనా పాశ్చాత్యమాధుర్యముల్
    వరమై పెంపును చేర్చు చెప్పెదరయా భాసిల్లి శీఘ్రమ్ముగా
    భరతక్షోణి పురోగమించునఁట! భాస్వత్సంస్కృతిభ్రష్టమై
    చిరకాలమ్మిక బానిసత్వము కదా చెండాడు దేశమ్మునే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. పరమఖ్యాతిపరాశరర్షికథితప్రాచుర్యధుర్యోక్తు లా
    చరణమ్ముల్ మటుమాయమాయె నవదుస్సాంగత్య మేపార దు
    ష్ప రిణామమ్ములు సంభవించె నయయో ప్రాగ్ధర్మముల్ మృగ్యమై
    భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  11. సమ్ప్రదాయము మరచిన జాతి యైన
    భాష పట్లను మమతను మరచియున్న
    ప్రగతి యన్నది శూన్యమై వరలుచు౦డి
    భారతము సంస్కృతిభ్రష్టమై రహించు

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    బ్రిటీష్ దొరల దుర్మార్గమైన మనోగతం... ఆదేశం..

    చరితన్ మార్చుడి., యాగ్లవిద్యనిట ప్రోత్సాహించి సద్ధర్మమున్
    మఱవంజేయుడి., భేదపాలనము దుర్మార్గమ్ముగా నేర్పుడీ.,
    కఱఁపన్ జూడుడు మాంసపున్ రుచిని., లోకంబందునింకెట్టులీ
    భరతక్షోణి పురోగమించునఁట ? భాస్వత్సంస్కృతిభ్రష్టమై!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అనుబంధపద్యం..

      *దశ.. దిశ*

      భారతదేశసంస్కృతిని బ్రద్దలు సేయగ మీ తరమ్మె.? గం... భీరమహాసముద్రమది.,వేదనిధానము , దివ్యశాస్త్రవా...
      గ్ధీరత మా బలమ్ము., ఋషితేజము మా కవచమ్ము., శాంతి యోం
      కారములే నినాదములు., గౌరవభావమె యూతకఱ్ర., సం...
      భారములెన్న సత్కళలె., భాగ్యములిచ్చెడి నేల తల్లిగాన్
      శూరులు దానకర్ణులును సూరులు పుట్టిన భాగ్యసీమ., యె...
      న్నో రమణీయకావ్యసుధలొప్పెడి దేశము మాది., దీనితో
      నేరిచి వైరమూన దగునే? యెవరెన్ని విధాల జేసినన్
      పారవు పాచికల్.! జగతి భవ్యము గమ్యము నిత్యమౌను మా
      భారతదేశమే! ఘనము! పావనమౌ! ననుమానమేలరా ?!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.

    వేద వేదాంగ సారముల్ వెల్లివిరియ
    ధర్మ మార్గానువర్తియై తనరగాను
    సంప్రదాయాల నిలయమౌ జాతి యెటుల
    భారతము సంస్కృతి భ్రష్టమై రహించు?

    రిప్లయితొలగించండి
  14. భక్తి భావము నందను రక్తి దొలగి
    వేద సారపు వనమున విరుల ద్రుంచి
    వేష భాషల నేమార్చి విషము జిమ్మ
    భారతము సంస్కృతిభ్రష్టమై రహించు

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  15. క్రమాలంకారం లో ---
    భరతు పేర నే దేశము పరగు చుండె?
    సత్య ధర్మాలు విడనాడ జరుగు నెద్ది?
    ఏ కతను మెల్గ దేశమ్ము నేమి యౌను?
    భారతము : సంస్కృతి భ్రష్ట మై : రహించు

    రిప్లయితొలగించండి
  16. 16.07.2020
    అందరికీ నమస్సులు🙏

    నా పూరణ...
    *తే గీ*

    పరుల జాఢ్యము నంతయు బట్టి తెచ్చి
    భారతీయపు విలువలు వదిలి బెట్టి
    మనది యనెడి భావములను మానుచుండ
    *"భారతము సంస్కృతిభ్రష్టమై రహించు"*

    *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
    🙏

    రిప్లయితొలగించండి
  17. సంప్రదాయముల ను వీడి జగతి యందు
    సంచరించుచు సతతము సాగుచుండ
    కొత్త రుజలవి వ్యాపించి క్రుంగదీయ
    భారతము సంస్కృతీ భ్రష్టమై రహించు.

    మరొక పూరణ

    జాతి ధర్మములను వీడి స్వయము గాను
    పాడు వ్యసనము లకు లొంగ వసుధ యందు
    వచ్చి చేర రోగములవి వపువు నిండ
    భారతము సంస్కృతీ భ్రష్టమై రహించు

    రిప్లయితొలగించండి
  18. ఏ భువి గిరులపై ఈశుండు తపసును చేసి హైమావతిన్ చేత బట్టె,

    యే మహీతలమును యిక్ష్వాకు వంశజుల్ ప్రీతిగా పాలించి ప్రేమ బడెసె,

    యే దక్షపై గీత మోదము గాపుట్టి జనులకు నిచ్చెనో సత్య గుణము,

    యే గందవతి పైన యీలువుటాలులు పుట్టిచూపించెనో పుణ్యపధము,


    నట్టి చోట క్రూరత్వము చుట్టుముట్టె

    మానవత్వమున్ కరువాయె హీన మౌవి

    దేశ పోకడల్ ముసుగులో దీప్తి తప్పి

    భారతము సంస్కృతి భ్రష్టమై రహించు


    రిప్లయితొలగించండి
  19. ఇతరదేశపువ్యామోహమినుమడింప
    భారతముసంస్కృతిభ్రష్టమైరహించు
    దేశకాలానుగుణముగదేశప్రజలు
    నడచుకొనదగుసంస్కృతివిడువకుండ

    రిప్లయితొలగించండి
  20. రాముమూర్తిఁదలచిరంజిల్లుమనసంత
    భారతమ్ముజనమునకుభావిబ్రతుకు
    పరగపాశ్చాత్యభావనపాదుకోన్న
    భారతముసంస్క్తుతిభ్రష్టమైరహించు

    రిప్లయితొలగించండి
  21. ఆంగ్లసంస్కృతిన్ మరిగిన యాధునికుడ
    వేద సంస్కృతి యనినంత వెగటటంచు
    భారతము సంస్కృతి భ్రష్టమై రహించు
    ననుచు పలుకట భావ్యమా యర్భకుండ.

    రిప్లయితొలగించండి
  22. మ:

    సరళంబౌనగు యమ్మనాన్న లన యిచ్ఛంగించరే నేర్పగన్
    సరిరా రంచని నాంగ్ల మాధ్యమున వాచాలింప నెక్కొల్పరే
    మరినీరీతిని బాల్యమున్నెదిగి నేమార్చంగ నింకెట్టులౌ
    భరతక్షోణి పురోగమించు నట భాస్వత్సంస్కృతిభ్రష్టమై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  23. విశ్వమునఁ జూడఁ జూడఁగ వెఱ్ఱి తలలు
    వేయ నాగరికత నేడు వేయి గతుల
    దుస్సహంబై విబుధులకు దుష్టజన స
    భా రతము సంస్కృతి భ్రష్టమై రహించు


    ధర దుర్నీతి మహోజ్వ లాకృతి జనత్రాసంబుగా నూనఁగాఁ
    గరుణా సంభృత వీక్షణ ప్రచురతా గంభీర చిత్తుండునౌ
    హరి సంకల్ప సుధా రసార్ద్ర యయి ఘోరాప్రాచ్య దేశస్థమౌ,
    భరతక్షోణి పురోగమించు నఁట, భాస్వ త్సంస్కృతి భ్రష్టమై

    రిప్లయితొలగించండి
  24. గరిమమ్మైనది వేదసంస్కృతి యదే కల్పమ్ములో మేటియై
    పరిభాసిల్లుచు విశ్వమంతట గనన్ బ్రఖ్యాతమై వెల్గగన్
    భరతక్షోణి పురోగమించునట, భాస్వత్సంస్కృతి భ్రష్టమై
    జరఠమ్మౌనట జాతి యెల్ల నపహాస్యమ్మౌచు క్షీణింపదే.

    రిప్లయితొలగించండి
  25. భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై

    మత్తేభము

    కరొనారోగపుభీతిచేచరమసంస్కారంబులన్ మానుచున్
    సురపూజక్రతుకార్యముల్ విడుచు శాస్త్రోక్తాదులన్ వీడుచున్
    చరియింపన్ ప్రజమందచిత్తతఁమనశ్శాంతంబుకోల్పోవుచున్
    భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై

    (కష్టసాధ్యమని భావము)

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  26. భరతా!యేమనిజెప్పనోపుదునునీభామామహారాణులే
    పరదేశంబులబోకడల్మఱగియవ్వారిన్నుటంకించగా
    భరతక్షోణిపురోగమించునటభాస్వత్సంస్కృతిభ్రష్టమై
    పరదేశంబులపద్ధతిన్ నికనునెవ్వారైనమానంగదే

    రిప్లయితొలగించండి
  27. గతఁపుఘనకీర్తినేడవగతముగాక
    భారతము సంస్కృతిభ్రష్టమై రహించు
    చున్నదనిపలుకతగునేయుమ్మలించి
    జీవనదివంటి సంస్కృతి చావుగనునె?

    రిప్లయితొలగించండి

  28. మత్తేభవిక్రీడితము
    సరిపోలందగవన్య దేశముల నిస్సారమ్మునౌ సంస్కృతుల్
    ధరపై నోర్వఁగలేని కుట్రలకు నూతమ్మౌచు దేశస్తులున్
    వెరపున్ జెందక యక్రమాలబలియౌ నిర్వీర్యతన్ గల్లయే
    భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై!

    రిప్లయితొలగించండి
  29. తేటగీతి
    సభ్యతన్ సంస్కృతిన్ విడి సాగినంతఁ
    బ్రజలు, దేశంపు గుర్తింపు భంగమౌచు
    వైరులకభీష్టముల్ తీరు వంత నెటుల
    భారతము సంస్కృతిభ్రష్టమై రహించు?

    రిప్లయితొలగించండి
  30. స్థిరమౌప్రజ్ఞఘటిల్లగా వెలుగుల్ చిందించి పూర్వమ్మునన్
    ధరణిన్ భారత జాతి పొందె తన సిద్దాంతమ్ముతో ఖ్యాతి తా
    పెరవారల్ కొనివచ్చి నూత్నవిధముల్ ప్రేరింపగా నెవ్విదిన్
    భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై ?

    రిప్లయితొలగించండి

  31. పిన్నక నాగేశ్వరరావు.
    ( సవరణతో )

    వేద వేదాంగ సారముల్ వెల్లివిరియు
    ధర్మ మార్గానువర్తియై తనరునెపుడు
    సంప్రదాయాల నిలయమౌ జాతి, యెటుల
    భారతము సంస్కృతి భ్రష్టమై రహించు?

    రిప్లయితొలగించండి
  32. రాజకీయము రాణించ రాజ్యమందు
    నేతలెందరో సమకూర నెయ్యమలర
    వర్గ వైషమ్య మలరారి వరలుచుండ
    భారతము సంస్కృతి భ్రష్టమై రహించు!

    రిప్లయితొలగించండి
  33. సోకులకుబోయి తగుశుచి శుభ్రతనక
    సొంతకట్టడి మాటయు సుంతవినక
    కరొనకారక పోకిరి గాళ్ళ చేత
    భారతము సంస్కృతి భ్రష్టమైరహించు!

    రిప్లయితొలగించండి
  34. అపర దుర్యోధనాదులై అహరహంబు
    జనులు ధర్మహానికిబూని మనుగడంత
    కలహ కారకులైరేని కాలగతిని
    భారతము సంస్కృతి భ్రష్టమైరహించు!

    రిప్లయితొలగించండి
  35. పుట్టినరోజుశుభాకాంక్షలండిగురువుగారు

    రిప్లయితొలగించండి
  36. సంప్రదాయముల ను వీడి జగతి యందు
    సంచరించుచు సతతము సాగుచుండ
    కొత్త రుజలవి వ్యాపించి క్రుంగదీయ
    *భారతము సంస్కృతీ భ్రష్టమై రహించు*.

    మరొక పూరణ

    జాతి ధర్మములను వీడి స్వయము గాను
    పాడు వ్యసనము లకు లొంగ వసుధ యందు
    వచ్చి చేర రోగములవి వపువు నిండ
    *భారతము సంస్కృతీ భ్రష్టమై రహించు*

    రిప్లయితొలగించండి