6, జులై 2022, బుధవారం

సమస్య - 4127

7-7-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె”
(లేదా...)
“పండితులెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై”

20 కామెంట్‌లు:


  1. దండిగ భావ సంపదయు
    ధాటిగ నొప్పెడి శబ్దరాశియున్
    నిండి సుధామయంబయి వి
    నిర్మిత నిస్తుల నవ్యధారలున్
    మెండుగ బూయ నా ప్రజలు
    మెచ్చి గళమ్ముల నెత్తి పాడగన్
    బండితులెల్ల మెచ్చకయె
    వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై!

    రిప్లయితొలగించండి
  2. పండితులుమెచ్చనిది రమ్యపద్యమయ్యె
    నాయనుచు సంశయంబేల తోయజాక్షి
    పండితులుపామరజనులు పరవశించి
    మెచ్చుపద్యరచనసల్పి పెచ్చరిల్లు

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    ప్రజ్ఞ నిండి శబ్దాలంకరణము మెరయ
    రాగ భరితమౌ నేకాక్షరమున బొదుగ
    సుస్వరంపు ఝరిని సాగ, చోద్యమనఁ గు
    పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె!

    ఉత్పలమాల
    నిండుచు నొక్క నక్షరమె నేర్పరి భావ సముద్ర కంజమై
    మండిత శబ్ద సోయగము మార్దవ పూర్ణ విశేష రాగమై
    మెండుగ సుస్వరంపు ఝరి మిన్నగ సాగుచు, నోర్వలేని దు
    ష్పండితులెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వృత్తము లోని మొదటి పాదము లో "నొక్క యక్షరమె" యని చదువుకొన ప్రార్థన.

      తొలగించండి
  4. భావ సంపద గలిగియు భాసుర మగు
    శబ్ద లాలిత్య ముఁగలిగి సరస మైన
    దియని మెప్పును బొందె భూ దివుజు లగుట
    పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె.

    రిప్లయితొలగించండి

  5. బూతులు విరివిన్ వ్రాసెడు మూర్ఖుడంచు
    జనులనాద రించిన నేమి చక్కనైన
    పద్యములవి చౌడప్పయె వ్రాసె నందు
    పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె.


    నిండుగ వెల్గుచుండె రజనీవిటుడా నిశి శాతపత్రకిన్
    మెండుగ రాల్చువేళ కుసుమేషువు బాణవిఘాత బాధలో
    హిండన కాంక్షయే పెరుగ నింతిని పద్యము తోడ పిల్వ గా
    పండితులెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై

    రిప్లయితొలగించండి
  6. నిండగు భావ సంపదను నేర్పుగఁ జూపుచు వ్రాయు చేతనే
    పండితులెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై
    మండిత మౌవిధం బుగను మాలలు గూర్చిన సంధి ప్రక్రియన్
    దండిగఁ జేయుచుండి యిక దామర తంపర గావెలింగె నే

    రిప్లయితొలగించండి
  7. "మేకకొకతోక మెకమేక మేకతోక"
    పదము లటునిటు మార్చుచు పలికియొక్క
    పద్యమునురామలింగడు పాడె సభను
    పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె

    రిప్లయితొలగించండి
  8. ఆటవెలది
    విశ్వదాభిరామ వినురవేమ యనుచు
    వేడ్క శతకమౌర! వేమనకవి
    పలికెను కవి*పండితులు మెచ్చ;నిదిరమ్య
    పద్యమయ్యె*గాదె పఠనఁజేయ.

    రిప్లయితొలగించండి
  9. గణములు కుదురకుండగ గవిత వ్రాయ
    పండితులు మెచ్చనిది ,
    రమ్యపద్యమయ్యె
    ప్రజలకు దాని భావము బ్రాతినొసగ
    ఛందమును మీరి మతముండు డెంద మునకు

    రిప్లయితొలగించండి
  10. నిండుసభాంతరాళమున నిల్చిన పండిత శేఖరుండు తా
    కొండొక పద్యమున్జదివి కోరగ నర్థము జెప్పుడంచు నా
    గండముదాటగా చదివె గ్రక్కున పద్యము రామలింగడే
    పండితులెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రసరమ్య పద్యమై

    రిప్లయితొలగించండి
  11. మండనమాంధ్రభారతికి మాధురి పంచెడు పంచకావ్యముల్
    పండితవర్యులుంగవులు బాగు సెబాసని మెచ్చుచుండగా
    పండిత పుత్రులున్ మఱియు పామరులక్కట! యన్యభాషలం
    *బండితులెల్ల మెచ్చకయె వాసిఁగనెన్ రసరమ్యపద్యమై.*

    రిప్లయితొలగించండి
  12. భావ మాధుర్యమున్ గాని పసయు లేని
    రచన నెవ్వరు మెచ్చ రు రమ్య మనుచు
    పండితులు మెచ్చ నిది రమ్య పద్య మయ్యె
    ననుచు బల్కుట లోకాన నబ్బుర మ్ము

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    తేటగీతి పాద తెలుగు పాట యొకటి
    స రసమయ సరసస్వర సరస ప్రాస
    యతు లిరవుగ నిలుచు పద జతలు కలియ
    చిత్ర గానమయ్యె మధుర చిత్రమందు
    రంజిలెనది నిలిచి జన రంజితముగ
    కాసులెన్నొ కురియగను వాసి గాంచి
    గీత కవికి విభూషణ గీత మయ్యె
    వాడి వాడుక పదముల వాడినంత
    సాంప్రదాయక సాహిత్య ఛాందసులగు
    పండితులు మెచ్చనిది రమ్యపద్యమయ్యె

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి
    భావ హీనమైన కవిత వాశి గున్న
    పండితులు మెచ్చనిది ,రమ్యపద్య మయ్యె
    రసముతోడ భావస్ఫుట రాజితంబు
    ఘన గణ సమన్వితంబయి కవిత వెలయ.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  15. అర్థ గాంభీర్యమునఁ దాఁక నంబరమును
    శబ్ద లాఘవ మింపుగ సంతరింప
    ధార సంతస మీయ నుదారముగను
    బండితులు మెచ్చ నిది రమ్య పద్య మయ్యె

    [మెచ్చన్ +ఇది =మెచ్చ నిది ]


    దండిగ నిచ్చి విత్తములు దండము లింపుగఁ బెట్ట నిత్యమున్
    మండల నేత లందఱిని మానుగఁ దృప్తిలఁ జేయ రక్తిమై
    ఖండము లైన భావములు క్రన్ననఁ బండిత మాని ప్రాపునం
    బండితు లెల్ల మెచ్చకయె వాసిఁ గనెన్ రస రమ్య పద్యమై

    రిప్లయితొలగించండి
  16. మెండు శతావధానములు మేలుగ వర్ణనలల్లి గొప్పగా
    దండిగ పద్య గద్యముల ధారగా జెప్పుచు మన్ననల్ గొనే
    పండితు నొక్కనందమగు పద్యము జెప్పగ తామసాధమున్
    పండితులెల్ల మెచ్చకయె వాసిగనెన్ రసరమ్య పద్యమై

    రిప్లయితొలగించండి
  17. అండనొసంగు వారు కఱవై పెను తాపము బొంద జాషువా
    యండగ నిల్చి యాదుకొన నర్యునిగా మను న్యాయవాది, తా
    దండిగ వ్రాయ ఖండికల తద్దయు ప్రీతిని, వానివాక్కదే
    పండితులెల్ల మెచ్చకయె, వాసిఁ గనెన్ రసరమ్యపద్యమై

    రిప్లయితొలగించండి


  18. పద్య విద్యను నేర్చుచు పట్టుదలగ
    కొత్థ ఛందము నందున కూర్మి తోడ
    వ్రాయ కొందరు మెచ్చక పల్కగా కు
    పండితులు మెచ్చనిది రమ్య పద్య మయ్యె

    రిప్లయితొలగించండి