26, జులై 2022, మంగళవారం

సమస్య - 4145

27-7-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బ్రహ్మచారులకే కదా బాధలెల్ల”
(లేదా...)
“బ్రహ్మచారులకే కదా ఘనబాధలెల్లను జూడఁగన్”

36 కామెంట్‌లు:

  1. తేటగీతి
    తండ్రి కోర్కెను దీర్చెడు త్యాగమొదవ
    వారసత్వము గాచుచు వగచెఁగాదె
    పెళ్లినెంచని కురువంశ భీష్ముఁ బోలు
    బ్రహ్మచారులకే కదా బాధలెల్ల!

    మత్తకోకిల
    బ్రహ్మచారిగ పెళ్లి మానుచు వాసిగాంచుచు తండ్రికై
    బ్రహ్మచర్యము తప్పకుండగ వారసత్వమునిల్పగన్
    బ్రహ్మచారిగ జిక్కెజింతల భక్త శాంతనవుం డటుల్
    బ్రహ్మచారులకే కదా ఘనబాధలెల్లను జూడఁగన్

    రిప్లయితొలగించండి
  2. జవ్వనమరుదెంచు దనుక జనని ప్రేమ
    పరిణయమయిన తరువాత పత్ని ప్రేమ
    యీడుకు తగు ప్రేమ దొరక దెన్నడు గద
    బ్రహ్మచారులకే కదా బాధలెల్ల

    రిప్లయితొలగించండి
  3. నియమనిష్ఠలపరమందునిలిపిమనసు
    నిండువైరాగ్యభావననేర్పుగనుచు
    సాధనంబుననుండంగశమములేదె
    బ్రహ్మచారులకేగదాబాధలెల్ల

    రిప్లయితొలగించండి
  4. బ్రహ్మసంగతినిష్ఠతోప్రణవంబుమానకయుండగా
    బ్రహ్మణేకరవయ్యెబ్రాహ్మణవంశబాలునికయ్యెయో
    బ్రహ్మమార్గమునీవిధంబునభారమయ్యెగచూడరో
    బ్రహ్మచారులకేగదాఘనబాధలెల్లనుజూడగా

    రిప్లయితొలగించండి


  5. పెండ్లి యైనట్టి వారికి బెదురు లేదు
    పెద్ద వాండ్రకు సంఘాన భీతి రాదు
    పిన్న వారికి కలుగదు భీరు తనము
    బ్రహ్మచారులకే కదా బాధలెల్ల

    రిప్లయితొలగించండి

  6. ఒంటరి బ్రతుకు భారమీ యుర్వియందు
    సకల కార్యముల నొకడె చక్కదిద్ది
    బయట వ్యవహారములవియె భారమవగ
    బ్రహ్మచారులకే కదా బాధలెల్ల.


    బ్రహ్మచర్యము వీడినంతనె భార్యసేవలె యందురా
    బ్రహ్మచారికి సేవజేసెడు భామయుండదు సత్యమే
    బ్రహ్మచారియె వంటచేయక బట్టలుత్కక తప్పునా
    బ్రహ్మచారులకే కదా ఘనబాధలెల్లను జూడఁగన్.

    రిప్లయితొలగించండి
  7. అలసి స్వగృహము కరిగిన నాలిలేని
    యింట నిత్యకృత్యంబులు వెంటబడును
    సేవ లందించ నెవ్వారు చెంత లేక
    బ్రహ్మచారులకే కదా బాధలెల్ల

    రిప్లయితొలగించండి
  8. పెద్ద వారిని గౌరవింతురు పిన్న వారలు రక్తితో
    పిన్న వారిని జేర్తురక్కున పెద్ద వారలుఁ బ్రేమతో
    పిన్న పెద్దల యైక్య భావము పెంపు నొందును సంపదల్
    బ్రహ్మచారులకే కదా ఘనబాధలెల్లను జూడఁగన్

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    ఉపనయనమైన పిమ్మట తపము వోలె
    చదువు సంధ్యలు నేర్చుచు శ్రద్ధగాను
    గురుని శుశ్రూషఁజేయుచు వరులు నట్టి
    *బ్రహ్మ చారులకే కదా బాధలెల్ల.

    మత్తకోకిల
    బ్రహ్మవిద్యయె వేదమందురు బాగుగా నది నేర్వగాన్
    బ్రహ్మతుల్యులునౌ గురూత్తము పజ్జఁజేరియు శ్రద్ధతో
    బ్రహ్మచారులు వేదపాఠము వల్లెవేయుటఁగాంచమే
    *బ్రహ్మచారులకే కదా ఘన బాధలన్నియుఁజూడగన్.*

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    కడుపు నింప మెస్సు లిడును కడుపు మంట
    సతియు వలయు కిరాయ వసతియు నొంద
    గ్రాసు ప్యాకేజ్ కొలత పల్కు కన్య చూడ
    బ్రహ్మచారులకే కదా బాధలెల్ల

    రిప్లయితొలగించండి
  11. భూతలమ్మున శయనమ్ము రోతపుట్టు
    శీతజలముల స్నానముల్ చేటుఁ గూర్చు
    వండుకొనకున్న నాపూట తిండి లేదు
    బ్రహ్మచారులకే కదా బాధలెల్ల

    రిప్లయితొలగించండి
  12. బ్రాహ్మణోత్తము డైన యోగ్యుడు పద్మనాభుని కోవెలన్
    బ్రాహ్మియర్మిలి నంది మించి సపర్యలందున మున్గినన్
    బ్రహ్మరూపమె యైన వానికి భార్య చిక్కుట కష్టమే
    బ్రహ్మచారులకే కదా ఘనబాధలెల్లను జూడఁగన్

    రిప్లయితొలగించండి
  13. తోడు నీడగ జీవించు తోయ జాక్షి
    కలసి మెలసియు జీవించి గాచు నట్టి
    వారు లేకు o డ నల్లాడు వారు గాదె
    బ్రహ్మ చారులకే కదాబాధ లెల్ల

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి
    శంతనుని కోర్కె దీర్పగ శాంతనవుడు
    నియమ నిష్టల తోడనె నిక్క మైన
    దీక్ష బూని ననుసరించె తిక్త జన్మ
    బ్రహ్మ చారులకే కదా బాధ లెల్ల.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దీక్ష బూని యనుసరించె" అనండి.

      తొలగించండి
  15. బ్రహ్మచర్యపు జీవనమ్మన ప్రాణసంకటమే గదా
    బ్రహ్మచారిని మర్కటమ్మని వక్రభాష్యము చేయుచున్
    బ్రహ్మచారులకద్దెకీయగ రారు ముందునకెవ్వరూ
    బ్రహ్మచారులకే కదా ఘనబాధలెల్లను జూడఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముందున కెవ్వరున్' అనండి.

      తొలగించండి
  16. పెద్ద లైన వృద్ధులు నైనఁ బిన్న లైనఁ
    గాంత లైనను గాదేనిఁ గన్య లైన
    భేద మున్నె వెతల కిది బేల పలుకు
    బ్రహ్మచారులకే కదా బాధలెల్ల


    బ్రాహ్మ ణాన్వయ మందుఁ బుట్ట నపార భక్తి సెలంగ నా
    బ్రహ్మముం బఠియించు చుండి యవారితమ్ముగ సంత తా
    జిహ్మ వర్తనమున్ వహించి యశేష నిష్ఠఁ జరింపఁగా
    బ్రహ్మచారులకే కదా ఘన బాధ లెల్లను జూడఁగన్

    రిప్లయితొలగించండి
  17. 1చదువు సంధ్యలున్న కొలువు చక్కగున్న
    పెండ్లి చేసుకొనెడిమంచి పిల్ల లేక
    వండి ప్రేమతో పెట్టె డి వారు లేని
    *“బ్రహ్మచారులకే కదా బాధలెల్ల”*

    2పెండ్లియాడిన బ్రతుకున వెతలె యనెడి
    భావనమ్ముతోడనుపెండ్లివలదటంచు
    నొంట రిగ మిగిలెనుగదా యుర్వియందు
    *“బ్రహ్మచారులకే కదా బాధలెల్ల”*

    3వచ్చె గాని వయసు గాక పరిణయమ్ము
    ఆడపిల్లలె వద్దన నార్తి నిండి
    చింతహెచ్చుచు నుండె విచిత్రముగను
    *“బ్రహ్మచారులకే కదా బాధలెల్ల”*


    మరొక పూరణ

    4.బ్రహ్మదేవుడెపంపపుట్టెనుబ్రాహ్మణుండుగభూమిలో
    బ్రహ్మ విద్యలునేర్చె నాతడు వాసిగా కడువేగమే
    బ్రాహ్మణాంగనెచిక్కదయ్యెనెవద్దటంచును పంతులున్
    *“బ్రహ్మచారులకే కదా ఘనబాధలెల్లను జూడఁగన్”*


    రిప్లయితొలగించండి
  18. కట్టడి నియమావళి రొదఁబెట్టగ
    వైరసుల బారుగదిలి సవాలు విసరె
    బయట తినమానుమని పెద్ద బాపులనిరి
    "బ్రహ్మచారులకేకదా బాధలెల్ల"

    రిప్లయితొలగించండి