31, జులై 2022, ఆదివారం

సమస్య - 4149

1-8-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అభయమిడి చంపుటయె ధర్మ మగును గనఁగ”
(లేదా...)
“అభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ”

17 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మకరి పాదమ్ము బట్టగ మదముహెచ్చి,
    గజము చేవజాలదనుచున్ గావమనఁగ
    నండనేనంచు శౌరి వేదండమునకు
    నభయమిడి, చంపుటయె ధర్మ మగును గనఁగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      ఇభము సరస్సునన్ మకరి కేర్పడఁ జిక్కుచు మ్లానమౌచుఁ దా,
      విభుడని శౌరినిన్ శరణు వేడ వికుంఠ పురాధినాథుఁడున్
      రభసమునందుఁ దన్మకరి రాజసమొంచి, గజేంద్రుగావఁగా
      నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ!

      తొలగించండి
  2. పరమ శత్రువు నైనఁ గాపాడ వలెను
    నభయమిడి ,చంపుటయె ధర్మ మగును గనఁగ
    బరుల హింసించు మూర్ఖుని పాప మనక
    మూర్ఖ జనమును రక్షించ మొఱకుఁ దనము

    రిప్లయితొలగించండి
  3. కావు మని వేడు వారిని గావ వలయు
    నభయ మిడి : చంపుట యె ధర్మ మగును గనగ
    సుజన రక్షణ కొఱకునై కుజన తతుల
    శక్తి యుక్తులు జూపింప యుక్త ముగను

    రిప్లయితొలగించండి
  4. దిగులు నొందిన హితునికి ధీమసమిడ
    భుజగము కరవకుండగ బ్రోచెదనని
    యభయమిడి ; చంపుటయె ధర్మ మగును గనఁగ
    నంచు దుడ్డుతో దానిపై యడుపు వేసె

    రిప్లయితొలగించండి
  5. చంపకమాల.
    రభసను సృష్టిజేయుచును రక్కసి తానయి సూక్ష్మజీవిగన్
    బ్రభవమునంద భూమిపయి, ప్రార్థన జేసెడి మానవాళికిన్
    విభవము దీర్చిదిద్దుటకు వేగమె వేంకట నాథుడేగగా
    *నభయమొసంగి,చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ*

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    విడిచి యన్ననే రాగ విభీషణునకు
    *నభయమిడి;చంపుటయెధర్మమగును,గనగ*శిష్ట రక్షణఁజేసియు దుష్ట శిక్ష ణంబుఁజేసెరాముండు లోకంబు మెచ్చ.

    చంపకమాల
    విభుఁడగు రావణున్ విడిచి వేగమె మంత్రులఁగూడి వచ్చియున్
    నభమున నిల్చియున్ శరణు నాకిడుమంచు విభీషణుండనన్
    *అభయమొసంగి;చంపుటయె యన్నిటి కంటెను మేటి ధర్మమౌ*
    ప్రభువులకంచు దుష్టుఁడగు రావణుఁజంపడె రామచంద్రుఁడున్.

    రిప్లయితొలగించండి
  7. ఘోర తపము పరిఘటించి కోర విభుడొ
    సగె వరములు హిరణ్య కశపవిభునకు
    ధర్మ రక్షణ కార్యపు మర్మమెరిగి
    అభయమిడి చంపుటయె ధర్మ మగును గనఁగ

    రిప్లయితొలగించండి
  8. ఇభమది మూర్ఖ భావమున నేరునఁ గ్రుంగగఁ గుంభి పట్టగా
    విభుఁడగు నారసింహుని కివేగమె మ్రొక్కగఁ విష్ఞుఁ డంతటన్
    నభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
    ప్రభులను వారలెప్పుడును బాధితు పక్షము నుండ గావలెన్

    రిప్లయితొలగించండి
  9. కరకుహృదయుఁడు కామంబు కనుల గప్పి
    కన్నె పిల్లను బలిమిని గవయ బోవ
    నభయమిడి చంపుటయె ధర్మ మగును గనఁగ
    నాత్మ రక్షణ కొరకునా యబల కొరకు

    రిప్లయితొలగించండి

  10. భైరి బారిన పడినట్టి భార్గవమది
    శరణమంచు వేడిన యంత చక్రధరుడు
    వార్భటమునుండి కాపాడ వారణముకు
    నభయమిడి, చంపుటయె ధర్మ మగును గనఁగ.


    విభుడవు నీవె కావుమని భీకర గ్రాహము చేతజిక్కి యా
    యిభమది ప్రాణగొడ్డమున నేడ్చుచు బిల్చెనంచు భూరియే
    రభసము నందు జేరుచు పలాంగము నుండి గజేంద్రు బ్రోవగా
    నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ

    రిప్లయితొలగించండి
  11. విభవముఁ గోలుపోయి యరి వీర భయంకర పాండునందనుల్
    అభగులుగా విరాటు సభ నాశ్రయ మొందగ సాధ్వి ద్రౌపదిన్
    రభసముఁజేయు కీచకుని రమ్మని నర్తనశాల యందుతా
    నభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    ఏక చక్రపురప్రజ లిడుము బాప
    అభయమిడి ,చంపుటయె ధర్మ మగును గనగ!
    లోక భీకర లీలన లోక కంట
    కు బకుని వృకోదరుడు జంపె క్రోధ మొంది
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  13. ఇభము, కరేణువుల్ గొలను నింపుగ కేళికలాడుచుండగా
    రభసముతోడఁ గ్రోలుచు శరమ్ముల, పట్టెపదమ్ము నక్ర మం
    ది భయము నాకరీంద్రుడు రతీశుని తండ్రిని వేడ, శౌరితా
    నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ

    రిప్లయితొలగించండి
  14. శుభమగునే దలంప మతి శూన్యుడవైతివి నీచ కార్యమౌ
    నభయ మొసంగి చంపుటయె; యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ
    ప్రభువుకు సత్య వాక్య పరిపాలనమే గనుమా శిబీంద్రు దా
    నభయమొసంగి పారువము నాదుకొనంగ నిజాంగమిచ్చెనే

    రిప్లయితొలగించండి
  15. రాజ ధర్మము పాటించు రాడ్వరులకు
    భూత దయ మెండుగా నున్న పూరుషులకు
    సతము సత్య నిష్ఠా ధర్మ రతుల కెట్టు
    లభయ మిడి చంపుటయె ధర్మ మగును గనఁగ


    ఉభయ జగమ్ము లందుఁ గొన నుత్తమ మైన పదమ్ము కావలెన్
    విభవము లున్న వ్యర్థములు పృథ్వి దయా గుణ మింత నిత్య మా
    హ భయము నింక దుస్సహపు టార్తినిఁ, దా శరణార్థి కింపుగా
    నభయ మొసంగి, చంపుటయె యన్నిఁటి కంటెను మేటి ధర్మమౌ

    రిప్లయితొలగించండి
  16. కష్టసమయమ్మునందున కావగవలె
    నభయమిడి,చంపుటయె ధర్మమగును గనగ
    దండనమ్మువిధించుట తప్పుచేయ
    నదియె సత్కార్యమగునందు రార్యులిలను

    మరొక పూరణ

    వైరి సోదరుండే వేడ వచ్చినంత
    *"అభయమిడి, చంపుటయ ధర్మ మగును గనగ"*
    సతి నపహరించిన ఖలుని జాలి వీడి
    ననుచు తెలిపె రామాయణ మవని యందు

    అభయముగోరుచున్ వడిగ నాదర మొప్పగవచ్చినంతనే
    *“అభయ మొసంగి ,చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ”*
    ప్రభువగు వానికెప్పుడని వాసిగ చూపుచు రామ చంద్రుడున్
    శుభమును గూర్చి రావణు నిసోదరునిన్ మరిచేసె రాజుగా

    రిప్లయితొలగించండి