21, మే 2023, ఆదివారం

సమస్య - 4427

22-5-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాహు కేతువులన్ మ్రింగె రాత్రికరుఁడు”
(లేదా...)
“చంద్రుఁడు రాహుకేతువుల సాంతము మ్రింగె నభోలిహంబుగన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

11 కామెంట్‌లు:

 1. రాజకీయంపురంగులురహినివెలుగ
  హిందువనుచునుముస్లిమ్ముహెచ్చుజేయ
  వాదులాడంగపొరుగులువచ్చిచేర
  రాహుకేతువులన్మ్రింగెరాత్రికరుడు

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి
  తెలిసినట్టి వాని సలహాల్ వలయుమనకు
  తెలియనట్టి వానికి నిజాల్ దెలుప దగును
  తెలిసి తెలియని వారల పలుకులగును
  "రాహు కేతువులన్ మ్రింగె రాత్రికరుఁడు"

  ఉత్పలమాల
  ఇంద్రుఁడు చంద్రుడంచనఁగ నెందరొ నమ్మితినిన్నినాళ్లు మ
  మ్మాంధ్రుల మూర్ఖులంచనుచు నంచన వైచె ప్రసంగకారుడున్
  సాంద్ర పురాణ గాథల కుశాగ్రపు బుద్ధియె లేని వాగుడై
  "చంద్రుఁడు రాహుకేతువుల సాంతము మ్రింగె నభోలిహంబుగన్"

  రిప్లయితొలగించండి
 3. తిన్న సాదము వికటించి తిక్కముదిరి
  వదర దొడఁగెను వెంగలి పైత్యమడర
  రాహు కేతువులన్ మ్రింగె రాత్రికరుఁడు
  వేవెలుంగును కబళించె ప్రేతరాజు

  రిప్లయితొలగించండి

 4. కపట చిత్తమ్ము గలిగిన గాధిపట్టి
  నృపుని పాలిట రాహువే నిజము సుమ్ము
  సత్యమును వీడ నని సత్య సాంద్రుడేను
  రాహు కేతువులన్ మ్రింగె రాత్రికరుఁడు


  ఇంద్ర సభాంతరమ్మున మహేంద్రుని తో శపథమ్ము జేసి రా
  జేంద్రుని కక్కసించిరట చీకటి గాముడు కేతువట్లుగా
  సాంద్రయశోధనుండయిన సంయమి యాతని శిష్యుడున్, హరి
  శ్చంద్రుడు రాహుకేతువుల సాంతము మ్రింగె నభోలిహంబుగన్.

  రిప్లయితొలగించండి
 5. క్రొత్త వగురీతి మాటలఁ గూర్చి వ్రాయ
  క్రొత్తదనమని తలతురు కొందరిలను
  క్రొత్త దనమను పేరిట చెత్త నింప
  “రాహు కేతువులన్ మ్రింగె రాత్రికరుఁడు“

  రిప్లయితొలగించండి
 6. వింఠ కల గంటి ననుచు దా వివర ములను
  కనులు నులు ముచు దెలి పెను కాంత కొకడు
  "రాహు కేతు లన్ మ్రింగె రాత్రి కరుడు
  వలదు వల దంచు. నరచి నా వదల డ య్యె "😂

  రిప్లయితొలగించండి
 7. ఇంద్రుడు తానటంచు నొకడెక్కుడు మద్యపు మత్తునన్ హరి
  శ్చంద్రుడబద్ధమాడెనని సాత్యకి సీరికి మామయౌను తా
  సాంద్రయశోధనుండనుచు సత్యమిదేనని బల్కె నిట్టులన్
  "చంద్రుఁడు రాహుకేతువుల సాంతము మ్రింగె నభోలిహంబుగన్"

  రిప్లయితొలగించండి
 8. తే॥ చంద్రుఁడొక రక్షక భటుఁడు సర్వ మెఱిఁగి
  రాహు కేతువులన్ బోలు రాజకీయ
  నాయకుల ఖైదు చేయఁగ నలుగు రనిరి
  రాహు కేతువులన్ మ్రింగె రాత్రికరుఁడు

  ఉ॥ ఇంద్రియ నిగ్రహమ్ముఁ గన కెవ్వఁడొ మద్యము బుద్ధి హీనతన్
  సాంద్రము గాను ద్రావి కన సాధ్యము కానివి శుష్క వాదముల్
  సంద్రపు ఘోష వోలె బలు చక్కఁగఁ బ్రేలుచు పల్కెనిట్టులన్
  చంద్రుఁడు రాహు కేతువుల సాంతము మ్రింగె నభోలిహంబుగన్

  రిప్లయితొలగించండి
 9. క్షీరసాగరమునువేగ చిలుకువేళ
  సురలసురుల పుట్ట సుధయు చూరగొనిది
  రాహు కేతువులన్ మ్రింగె రాత్రి కరుడు
  బాపుచు తమినలుదెసల పంచెవెలుగు

  రిప్లయితొలగించండి
 10. గాఢ‌ నిదురలో‌ వింతైన‌ కలలు కంటి‌
  లేడి‌ సింహాన్ని‌ భక్షించె‌ లీలగాను‌
  పులులు‌ గ్రాసం‌బు‌ మేసేను‌ బుద్ధిగాను‌
  రాహు కేతువులన్ మ్రింగె రాత్రికరుఁడు”

  రిప్లయితొలగించండి