13, నవంబర్ 2023, సోమవారం

సమస్య - 4585

14-11-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?”
(లేదా...)
“భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?”
(ఆముదాల మురళి గారికి ధన్యవాదాలతో...)

14 కామెంట్‌లు:

 1. తేటగీతి
  స్వపరి పాలనన్ బడయఁగ మాతృభూమి
  దిటవు గలిగి పోరాడెడు పటిమ మరచి
  యరసి లంచాల రాజ్యమ్ము నాంగ్లులేల
  భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?

  ఉత్పలమాల
  ధీరులు స్వేచ్ఛకై చెలఁగి దిక్కులనొక్కటి చేసి తెల్లలున్
  బారెడు వ్యూహముల్ మలచి పంతము సేకొన స్వార్థచిత్తమై
  వారల లంచముల్ మరగి వంచన మీరగ నాంగ్లపాలనన్
  భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?

  రిప్లయితొలగించండి
 2. మద్యమును ధనమును పంచి మంత్రియగుచు
  దోచుచు ప్రజాధనమ్మును దొరగ వెలుగు
  స్వార్థ పరుడైన దుర్మతి సభలలోన
  భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?  పౌరులయోటుచే గెలిచి పాలకులౌచు ప్రజా ధనమ్మునే
  భూరిగ మ్రింగు వారలగు మూర్ఖులు వేదిక లెక్కి
  నిత్యమున్
  ధారుణి యందు శ్రేష్ఠమగు ధర్మము గల్గిన నాదు దేశమీ
  భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?

  రిప్లయితొలగించండి

 3. అన్యుడు దన దేశమునుండి యరుగుదెంచి,
  వింతలన్నిటి గని కడువెరగు నొంది,
  జనులొసగిన యాతిధ్యము జవిగొనగనె
  భారతము స్వర్గమన‌, దేశభక్తుఁ డగున?

  రిప్లయితొలగించండి
 4. దేశసేవను మాటను తీసివేసి
  కాసుల పయి కోర్కె పెరుగ కానిపనుల
  కొల్లలుగచేయుచుండెడి కూళుడెపుడు
  *“భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?”*

  రిప్లయితొలగించండి
 5. భారత దేశమందునను భాగ్య
  విహీనులు లేక తిండియున్
  దారుణమైన బాధలను దాము
  సహించుచు లేకనీడయున్
  మీరిన సంకటాలుగొని మేదిని
  బ్రత్కెడు వారలన్ గనిన్
  భారతభూమిస్వర్గమని వాకొను
  వాఁడెటు దేశభక్తుఁడౌ?”

  రిప్లయితొలగించండి
 6. భారతదేశమున్ విడచి ప్రాగ్ర్యముగా పరదేశమందునన్
  కోరి వసించి సంపదల కొల్లలుగా గడియించి స్వార్థమే
  పారగ జన్మభూమి యగు భారతి యున్నతినిన్ దలంపకన్
  భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?

  రిప్లయితొలగించండి
 7. వ్యర్థమైనట్టి విద్యయు వైద్యరీతి
  పచ్చి యవినీతి మృగ్యమౌ పాపభీతి
  స్వార్థపరులైననేతల పాలనమున
  భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?

  దారుణమైనవిద్య దరిదాపున చూడని వైద్యనేమమున్
  తీరని దుఃఖమున్ మరియు తీవ్రతనొందిన నీతిబాహ్యతన్
  వారక నుండు దుష్టపరిపాలన దక్షతలేని నేతలున్
  భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?

  రిప్లయితొలగించండి
 8. స్వార్థ మవినీతి గల్గిన పాల కుండు
  సభ ల యందున ప లుకుట సరియు గాదు
  నమ్మ శక్యము గాదండ్రునటన గాని
  భారతము స్వర్గ మన దేశ భక్తుడగున?

  రిప్లయితొలగించండి
 9. దేశ సంక్షేమమును గూర్చి ధ్యాసవీడి
  స్వార్థ చింతనతో మెల్గి సంతతమ్ము
  వేదికల నూకదంపుగా బింకమడర
  భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?

  రిప్లయితొలగించండి
 10. తే॥ ఉచితముల మత్తును గరపి యోట్లు కొనుచు
  రాజకీయ నాయకులిట్లు రభసఁ జేసి
  ప్రజల భిక్షుకులుగ మార్చఁ బ్రగతి గనక
  భారతము స్వర్గమన దేశ భక్తుఁ డగున

  ఉ॥ నేర చరిత్రులే యిపుడు నీతినిఁ బాయమటంచుఁ బల్కుచున్
  జేరిరి రాజకీయమున సేవలఁ జేతుమటంచుఁ గుత్సితుల్
  భూరిగ సంపదల్ బడయఁ బుణ్యము పాపము నెంచకన్ గనన్
  భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ

  రిప్లయితొలగించండి
 11. -

  భారతము స్వర్గమన దేశభక్తుఁ డగు; న
  వతకు మారు పేరైనది; భవ్యమగు స
  నాతనమ్ము వెలయ నేటి నవతకు సరి
  యైన మార్గము చూపెడు వేదభూమి  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. ఉ.

  పారగ గంగ సస్యమను భాగ్యము మౌనుల గ్రంథ భాష్యముల్
  శారదగాఁడు పల్కుటయు సత్యము ధర్మము నిల్చు నేలగా
  శారద రాత్రులందు కవి సంబరమొందుచు దన్మయత్వమున్
  *భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?*

  రిప్లయితొలగించండి

 13. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  సేవ దేశమ్ము కోసము చేయకుండ
  త్యాగ భావమ్ము లేని చేతలను సలిపి
  స్వార్ధ పరుడైన నేతయే సభలయందు.
  మాటలను చెప్పి కోటలు దాటునట్లు
  భారతము స్వర్గమన దేశభక్తు డగున?

  రిప్లయితొలగించండి