18, నవంబర్ 2023, శనివారం

సమస్య - 4589

19-11-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాధన సేయంగవలదు ఛాత్రులు విద్యన్”
(లేదా...)
“సాధన సేయఁగా వలదు ఛాత్రులు విద్య గడించువేళలో”

14 కామెంట్‌లు:

 1. ఆధునిక మోసపు నెరిని
  సాధన సేయంగవలదు ఛాత్రులు ; విద్యన్
  బోధకుడు జెప్పిన దెసనె
  .సాధన జేయుచు విజయము సాధించ దగున్

  రిప్లయితొలగించండి

 2. కందం
  శోధనఁ జేయఁగ గురువులు
  బోధింపఁ బునశ్చరణము పూనగ మేలౌ
  గాదని గుడ్డిగఁ బడయఁగ
  సాధన సేయంగవలదు ఛాత్రులు విద్యన్

  ఉత్పలమాల
  శోధనఁ జేయఁగన్ గురులు సూక్ష్మములన్దగ నేర్ప మీదటన్
  బోధనమున్ పునశ్చరణఁ బూనిన గొప్పఁగ విద్యలబ్బెడున్
  గాదని వారు సొంతముగ గైకొని గుడ్డిగ నేర్వఁ జూచుచున్
  సాధన సేయఁగా వలదు ఛాత్రులు విద్య గడించువేళలో

  రిప్లయితొలగించండి
 3. ఉ.

  *సాధన సేయఁగా వలదు ఛాత్రులు విద్య గడించువేళలో*
  బోధన సేయు పాఠమిడు భుక్తిని మాత్రమె, పుణ్య లబ్ధికై
  రాధగ దల్చి ప్రేమ మయ రమ్యపు కీర్తన భక్తి భావనన్
  మాధురి కృష్ణ నామమను మంత్రము విష్ణు సహస్రనామముల్.

  రిప్లయితొలగించండి

 4. సాధకుడ ననుచు ధనమును
  సాధించుటె లక్ష్యమంచు సజ్జన శ్రేణిన్
  బాధించుచు నక్రమ పథ
  సాధన సేయంగవలదు ఛాత్రులు విద్యన్.  బోధన సేసెడొజ్జలగు పూజ్యుల మాటలు వీడి ధాత్రిలో
  బాధల దీర్చునొక్కటదె వాజజ మంచును నమ్ము వారలై
  యా ధన మార్జనమ్ముకయి యక్రమ మార్గపు శోధనమ్మునే
  సాధన సేయఁగా వలదు ఛాత్రులు విద్య గడించువేళలో.

  రిప్లయితొలగించండి
 5. బోధన జక్కగ సల్పుచు
  బాదింపక నేర్పు నట్టి పంతుల వలనన్
  శోధ న కై యెక్కు వ గా
  సాధన సేయంగ వలదు ఛా త్రులు విద్యన్

  రిప్లయితొలగించండి
 6. బోధనపై మదినిలిపిన
  సాధన విద్యకు పరిణతి సమకూర్చు గదా
  బోధిత పాఠము లెరుగక
  సాధన సేయంగవలదు ఛాత్రులు విద్యన్

  సాధన సేయఁగా వలయు చక్కని విద్యకు సార్థకంబుగా
  శోధన కోరుకొన్న గురుసూక్తము నందున దృష్టికావలెన్
  బోధన సల్పుచున్నతఱి పూర్తిగ పాఠము నాలకించకే
  సాధన సేయఁగా వలదు ఛాత్రులు విద్య గడించువేళలో

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు (క్యాంపు: అమెరికా)

  బోధకులగు సద్గురువులు
  బోధించు విషయములన్ని బుద్ధిగ తెలివిన్
  సాధించవలయు గుడ్డిగ
  సాధన సేయంగవలదు ఛాత్రులు విద్యన్.

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు

  బోధకులౌ గురూత్తములు పొందుగ నేర్పెడి లౌకికార్థముల్
  స్వాదువునైన తీరున ప్రసన్నమనమ్మున మూలముట్టుగన్
  శోధన జేయగావలయు స్ఫూర్తియెలేని విధమ్ము గుడ్డిగన్
  సాధన సేయగా వలదు ఛాత్రులు విద్య గడించు వేళలో.

  రిప్లయితొలగించండి
 10. బోధన సలిపెడు యొజ్జల
  నాదరమున గాంచక తగు నణకువ లేకన్
  శోధనలకు గురిచేయుచు
  సాధన సేయంగవలదు ఛాత్రులు విద్యన్

  రిప్లయితొలగించండి
 11. బోధనసల్పు నొజ్జలను పూజ్యులుగా తలపోసి వారికిన్
  బాధనుగూర్చకెన్నడును భక్తిఁ సపర్యల నాచరించుచున్
  సాధన సేయగా నెలమి, సద్గురు బోధన లాలకింపకన్
  సాధన సేయఁగా వలదు ఛాత్రులు విద్య గడించు వేళలో

  రిప్లయితొలగించండి
 12. కం॥ బోధనల వినుచు నిరతము
  సాధన సేయంగ వలయు ఛాత్రులు విద్యన్
  బోధనలు వినకఁ దప్పుగ
  సాధన సేయంగ వలదు ఛాత్రులు విద్యన్

  ఉ॥ “సాధన సేయఁగా వలదు ఛాత్రులు విద్య గడించువేళలో”
  బోధనలిట్లు సేయఁగను బుద్ధిని వీడి చరించరాదొకో
  సాధన సేయ లభ్యమగుఁ జక్కఁగ విద్యలు శంక యేలొకో
  సాధన శోధనల్ గనఁగ సాధ్యము నేర్వఁగ విద్యలెన్నియో

  రిప్లయితొలగించండి
 13. శోధన చేయచు చక్కగ
  భోధనమొనరించునట్టిపూజ్యులమాటల్
  సాధకుడెప్పుడు గుడ్డిగ
  సాధనచేయంగవలదుఛాత్రుల్ విద్యన్

  రిప్లయితొలగించండి

 14. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  మేధకు పదునే పెట్టుచు
  బోధలు చేయు సమయాన బుద్ధిగ వినుచున్
  శోధన చేయక, గ్రుడ్డిగ
  సాధన సేయంగ వలదు ఛాత్రులు విద్యన్.

  రిప్లయితొలగించండి