21, నవంబర్ 2023, మంగళవారం

సమస్య - 4592

22-11-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భాగవతమును పోతన వ్రాయలేదు"
(లేదా...)
"భాగవతమ్మునున్ సుకవి వర్యుఁడు పోతన వ్రాయలేదు పో"

20 కామెంట్‌లు:

 1. ధనము నాశింప లేదు పోతన యెపుడును,
  రాజులైనను గొప్ప వారైన నెవరి
  మెప్పు గోరడసలు స్వంత మేలు గోరి
  భాగవతమును పోతన వ్రాయలేదు

  రిప్లయితొలగించండి

 2. సహజ కవియంచు మేటి ప్రశస్తి నంది
  నట్టి సాటిలేని కవియె యతడు, తెలుగు
  జాతి గర్వించు విభుడైన సంస్కృతమున
  భాగవతమును పోతన వ్రాయలేదు.

  రిప్లయితొలగించండి
 3. తేటగీతి
  త్ర్యక్షుఁ గొలువ రాఘవుఁడు పత్యక్షమౌచు
  విష్ణుభక్తుల గాథల విశదమొనర
  నంచితముగ వ్రాయఁగఁ బలికించ వినక
  భాగవతమును పోతన వ్రాయలేదు


  ఉత్పలమాల
  ఆ గిరిజాపతిన్ గొలువ నద్భుత రీతిని రామచంద్రుఁడున్
  వేగమె ముందునిల్చి కన వేడ్కగ విష్ణు కథామృతమ్మునే
  రాగిల భక్తులున్ గృతిని వ్రాయదగన్ బలికించకుండ శ్రీ
  భాగవతమ్మునున్ సుకవి వర్యుఁడు పోతన వ్రాయలేదు పో

  రిప్లయితొలగించండి
 4. భారతమువలె సంస్కృతభాష లోన
  భాగవతమును పోతన వ్రాయలేదు,
  తెలుగు వారు చదువగల్గు తెలుగు నందె
  వ్రాసె పాఠకులకు మనోరంజకముగ

  రిప్లయితొలగించండి

 5. నాగలి పట్టినట్టి కవినాథుడతండిల మోక్షగామియై
  భోగము లన్ త్యజించి కడు పూజ్యునిగా వెలు గొందినట్టి యా
  త్యాగి రచించెతెన్గు కృతినద్భుత రీతిని సంస్కృతమ్మునన్
  భాగవతమ్మునున్ సుకవి వర్యుఁడు పోతన వ్రాయలేదు పో.

  రిప్లయితొలగించండి
 6. పలికినదితానె పలికించె భాగవతము
  రామభద్రుఁడేనని కడు దీమసముగ
  ననెను పోతన స్వయముగా నందు వలన
  భాగవతమును పోతన వ్రాయలేదు

  రిప్లయితొలగించండి
 7. భక్తిపరవశుడయితాళపత్రములను
  ఘంటమునుపట్టెకరములుకదిలె నటుల
  నావహించెనుశ్రీరాముడాత్మయందు
  భాగవతమును పోతన వ్రాయలేదు

  గాదిరాజు మధుసూదన రాజు

  రిప్లయితొలగించండి
 8. డా. బల్లూరి ఉమాదేవి

  భక్తితో వ్రాసె తెలుగున వాసి గాను
  *భాగవతమును పోతన; వ్రాయలేదు*
  తాను వ్రాయించె దయతోడ దాశరథియె
  ననుచు మదిని నమ్మి రచించె నాదరమున

  రిప్లయితొలగించండి
 9. పరగ సంస్కృతాంధ్రములపై పట్టులేక
  రామభద్రుని యానతి లభ్యమవక
  కూళులకు విక్రయమొనర్చి కూడబెట్ట
  భాగవతమును పోతన వ్రాయలేదు

  బాగుగ సంస్కృతాంధ్రముల పైన నధిక్రియ నొందకుండగా
  భోగములందునన్ బ్రతుకు పూర్తిగ సౌఖ్యత నోలలాడగన్
  వేగమె కావ్యమమ్మి తగు విత్తము గైకొనుమానసంబుతో
  భాగవతమ్మునున్ సుకవి వర్యుఁడు పోతన వ్రాయలేదు పో


  రిప్లయితొలగించండి
 10. బాల కృష్ణుని రచనము వేళ యందు
  భావ ఆవృత ధారలన్ పరవశించి
  తన్ను మైమరచి సుకవి కొన్ని సార్లు
  భాగవతమును పోతన వ్రాయలేదు

  రిప్లయితొలగించండి
 11. హాలికుడనైన నేమని దలచి మదిని
  రామ నామామృతముననురక్తి గల్గి
  రాజభోగములును ధనరాశులకును
  భాగవతమును పోతన వ్రాయలేదు

  రిప్లయితొలగించండి
 12. పరవ శించిన భక్తి తో వరలి తాను
  రామ భద్రుడు పలికించ వ్రాసె కాని
  గొప్ప కొ ఱ కైన రాజుల మెప్పు కైన
  భాగ వతము ను పోతన వ్రాయ లేదు

  రిప్లయితొలగించండి
 13. భాగవతమ్ము భక్తిరస పావన గ్రంథము రామభద్రుఁడే
  మేగలిఁ పోతనాఖ్య కవి మేద్యముగా రచియింప జేయ నా
  భాగవతోత్తముండు తన భావనఁ దెల్లమొనర్చె నిట్టులన్
  "భాగవతమ్మునున్ సుకవి వర్యుఁడు పోతన వ్రాయలేదు పో"

  రిప్లయితొలగించండి
 14. తే॥ భక్తి భావము బోధించు భాగవతము
  భవహరమగును జదువఁగ భక్తి నిలిపి
  పరముఁ గనుచును గీర్వాణ భాషయందు
  భాగవతమును పోతన వ్రాయలేదు

  ఉ॥ సాగును భక్తి భావమును జక్కఁగ బోధను సేయుచున్ మహిన్
  వేగమ ముక్తిఁ బొందఁగను వేడఁగ తారక మంత్రమై చనున్
  బాగుగ విష్ణు తత్వమును వర్ణన సేయుచు సంస్కృతంబునన్
  భాగవతమ్మునున్ సుకవి వర్యుఁడు పోతన వ్రాయలేదుపో

  రిప్లయితొలగించండి
 15. తే.గీ:వ్యాసభాగవతమ్మునే యాంధ్ర మందు
  మథువు లొలికెడు రీతుల మలచి వ్రాసె
  బాలకా విను మయ్య గీర్వాణ మందు
  భాగవతమును పోతన వ్రాయ లేదు.

  రిప్లయితొలగించండి
 16. ఉ:"ఏగతి నాయుధమ్ము గ్రహియించక వెన్నుడు పోయె?" నంచు నీ
  వీగతి బ్రశ్న వేయ బదు లిచ్చెద మామ!గజేంద్రు గావ శీ
  ఘ్రాగమనాభిలాషియైన పరమాత్ముని యాత్రత దెల్పె, నజ్ఞుడై
  భాగవతమ్మునున్ సుకవివర్యుడు పోతన వ్రాయలేదు పో
  ("ఏ ఆయుధాన్నీ తీసుకోకుండా విష్ణువు ఏమి చేద్దామని వెళ్లాడు?"అనే శ్రీనాథ కవిసార్వభౌముని విమర్శకి మేనల్లు డైన మల్లన ఇలా బదు లిచ్చిన విషయం ప్రసిద్ధమే కదా!)

  రిప్లయితొలగించండి

 17. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  సహజ కవిగాను పలు ప్రశంసలను పొంది
  రాముని కృపతో వ్రాసిన రచన, భాగ
  వతము నంకితమిడె రామ పాదములకు
  నంకితంబిడి రాజుల నాశ్రయించ
  భాగవతమును పోతన వ్రాయలేదు.

  రిప్లయితొలగించండి


 18. భక్తిభావముతోడను వ్రాసె గాని
  భోగభాగ్యములనుకోరి పుడమి యందు
  పరుల ప్రాపును కోరుచు పదవుల కయి
  భాగవతమును పోతన వ్రాయలేదు

  రిప్లయితొలగించండి