22, నవంబర్ 2023, బుధవారం

సమస్య - 4593

23-11-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చావే మనుజుల కొసంగు శాశ్వతసుఖమున్”
(లేదా...)
“చావే యిచ్చును మానవాళికిఁ బ్రశస్తంబైన సౌఖ్యమ్మునున్”

15 కామెంట్‌లు:

  1. కందం
    రావలసినదందదనుచు
    కావలసినదెదురు చూడఁ గాలేదనుచున్
    నీవెంచ నాత్మహత్యను,
    చా వే మనుజుల కొసంగు శాశ్వతసుఖమున్?

    (చావు + ఏ మనుజులకొసంగు..)

    శార్దూలవిక్రీడితము
    రావాలంచును దల్చినట్టిదదియే రాలేదటంచున్ వగన్
    కావాలంచును దల్చినట్టిదదియే కాలేదటంచున్ రొదన్
    నీవెంచంగనె యాత్మహత్య తగునా నిక్కమ్ముగా నెట్టు లా
    చావే యిచ్చును మానవాళికిఁ బ్రశస్తంబైన సౌఖ్యమ్మునున్?

    రిప్లయితొలగించండి
  2. చావు సహజము మనుజులకు,
    జీవన పోరాట మందు చెదరిన కలలే
    చావే మేలనిపించిన
    చావే మనుజుల కొసంగు శాశ్వతసుఖమున్.

    రిప్లయితొలగించండి
  3. శా॥
    కావాలీయని వెండియున్ బసిడి సంకల్పించికూర్పన్ సఖీ!
    కావాలీయనిభూములున్ భవనముల్ కష్టించియార్జించుచున్
    పోవన్ క్లేశమెగుండెలన్ మిగిలె!తృప్తుల్ పొందుచుండన్ గ్రహిం
    చావే! యిచ్చును మానవాళికిఁ బ్రశస్తంబైన సౌఖ్యమ్మునున్”

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి

  4. *(ఏకచక్రపురంలో పాండవులకాశ్రయ మిచ్చిన బ్రాహ్మణుడు కుంతితో తమ బాధను చెప్పునట్లుగా నూహించి)*

    ఏవిధి తెలుపను బాధల
    భావిని! మమ్మారగించు ప్రాదయ్యమిటన్
    దా వసియింపంగ బకుని
    చావే మనుజుల కొసంగు శాశ్వతసుఖమున్.



    చేవన్ గల్గిన వాడు లేడిచట, మాక్షేమంబు యోచించుచున్
    గావన్ రాడెవడంచు కుళ్ళుకొనుచున్ గన్నీటితో విప్రుడే
    తా వాచించెను గొంతితోడ ఖలు దైత్యుండెయౌ యా బకున్
    జావే యిచ్చును మానవాళికిఁ బ్రశస్తంబైన సౌఖ్యమ్మునున్.

    రిప్లయితొలగించండి
  5. ఆ వీడునందున కసవు
    లావుగ నుండిన కతమున రాతిరి వేళన్
    నావాసమున మశకముల
    చావే మనుజుల కొసంగు శాశ్వతసుఖమున్

    రిప్లయితొలగించండి
  6. జీవాత్మకు పరమావధి
    సేవే తుదకు పరమాత్మ చెంతకు చేర్చున్
    గైవల్యసిద్ధి మార్గము
    చావే మనుజుల కొసంగు శాశ్వతసుఖమున్

    భావావేశముతో గదాకవులు సంభావింత్రు కావ్యాదులన్
    సేవాతత్పరతే మహోన్నతముగా జీవాత్మ సంభూతమౌ
    కావా పుణ్యకృతుల్ ధరాతలమునన్ గైవల్య గమ్యంబుగా
    చావే యిచ్చును మానవాళికిఁ బ్రశస్తంబైన సౌఖ్యమ్మునున్

    రిప్లయితొలగించండి
  7. భావన జేయగ మనుజుఁడు
    జీవన సాఫల్యమొందు సేవలవలనన్
    చేవగ దీనావనమున
    చావే మనుజుల కొసంగు శాశ్వతసుఖమున్

    రిప్లయితొలగించండి
  8. భావింపన్ పరసేవనంబు వలనన్ ప్రాప్తించు సంతృప్తి యా
    భావంబే మనుజాళి నున్నతులుగా భాసిల్ల జేయున్ భువిన్
    చేవన్ దీనుల నుద్ధరించుటకునై జీవించి యా సేవలో
    చావే యిచ్చును మానవాళికిఁ బ్రశస్తంబైన సౌఖ్యమ్మునున్

    రిప్లయితొలగించండి
  9. జీవిత మున కలతల తో
    భావము నందున విరక్తి బాధలు హెచ్చన్
    కేవల మొకటే మార్గము
    చావే మనుజుల కొసంగు శాశ్వత సుఖ మున్

    రిప్లయితొలగించండి
  10. కం॥ జీవన పోరాటమునన్
    భావన మీరఁగను నిల్చి బాధల సైఁచిన్
    దైవమును గోరఁగ నొసఁగు
    చావే మనుజుల కొసంగు శాశ్వత సుఖమున్

    శా॥ కావేషమ్ములుఁ గ్రమ్ముచున్ ధరణిలో కారుణ్యమే లేనిచో
    భావావేశము హెచ్చఁగన్ జనులు సంభావించఁగన్ దుష్టతన్
    సేవాభావము సన్నగిల్లి మనుజుల్ చిమ్మంగ ద్వేషమ్మునే
    చావే యిచ్చును మానవాళికిఁ బ్రసస్తంబైన సౌఖ్యమ్మునున్

    రిప్లయితొలగించండి
  11. కం:చావుకు భయపడ నిత్యము
    చావే మనుజుల , కొసంగు శాశ్వతసుఖమున్
    చావున పుట్టుకలో గల
    యా వివరము దెలుపు నట్టి యద్వైతమ్మే

    రిప్లయితొలగించండి
  12. శా:ఈ వేదమ్ములు,తత్త్వశాస్త్రములు నా కే మిచ్చు లే !భౌతిక
    మ్మౌ విద్యల్ సుఖ మిచ్చు నందు వకటా అజ్ఞానివై,చక్కగా
    నీ వేదమ్ము పఠించి చూడ మిక నీవే మెచ్చవే?పిల్ల రే
    చా !వే యిచ్చును మానవాళికి బ్రశస్తమ్మైన సౌఖ్యమ్ములన్
    (పిల్ల రేచా!=హుషా రైన పిల్లలని "రేచు" అంటాము.వేయి+ఇచ్చును=వే యిచ్చును.మానవాళికి వేయి సుఖాలని ఇస్తుంది అనే భావం.)

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    జీవన గమనము నందున
    దేవా! దీర్ఘంపు రుజలు తీవ్రంబయ్యెన్
    ఈ వేదన కన్నను భువి
    చావే మనుజుల కొసంగు శాశ్వత సుఖమున్.

    రిప్లయితొలగించండి