10, జనవరి 2024, బుధవారం

సమస్య - 4642

11-1-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు”
(లేదా...)
“హర పాదద్వయ చింతనామృతముఁ బ్రహ్లాదుండు గ్రోలెన్ దమిన్”

17 కామెంట్‌లు:

  1. తల్లి దండ్రియు గురుడును దైవమెల్ల
    హరియనుచు నమ్మి అత్యంత అరితి తోడ
    హరిహరియను సంకీర్తనలమరగ ముర
    హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు

    రిప్లయితొలగించండి
  2. మనసునేకాగ్రదృష్టిని మరల జేసి
    భారమైననువేళలపరము దలచి
    విమలవిజ్ఞానవేద్యుని విష్ణుదురిత
    హరునిపదములనమ్మెప్రహ్లాదుడెపుడు

    రిప్లయితొలగించండి
  3. లంకను పరిపాలించిన రావణుండు
    హరుని పదముల నమ్మెఁ ; బ్రహ్లాదుఁ డెపుడు
    హరి పయిననె తన మనసునప్పగించె
    జనకుడు పలు సంకటముల సంతరించ

    రిప్లయితొలగించండి

  4. ఏడు లోకాల నేలెడు వాడెవడన
    విష్ణువొక్కడే యనుచును విశ్వసించి
    యసుర బాలకుడైన శ్రీ హరిని పాప
    హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు


    కరుణంజూపుము కేశవా యనుచునా కాళింగమే వేడగా
    త్వరితమ్మందుననేగి గోముఖమునే పాలార్చి భక్తుండనే
    పరిరక్షించిన దేవదేవుని చతుర్భాహుండు లక్ష్మీ మనో
    హర పాదద్వయ చింతనామృతముఁ బ్రహ్లాదుండు గ్రోలెన్ దమిన్.

    రిప్లయితొలగించండి
  5. భక్తి పరవశ చిత్తు డై బాల్య మందు
    హరి యె సర్వస్వ మనుకొని స్మరణ జేసి
    పూజ సల్పు చు నుండెను ముదమున ముర
    హరుని పదములు నమ్మె బ్ర హ్లా దు డెపుడు

    రిప్లయితొలగించండి
  6. సకల లోక సంరక్షుని చక్రధరుని
    దైత్య సంహారిని ధరణీధరుని విధిని
    హరిని శౌరిని సిరిమనోహరుని పాప
    హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు

    హరితో వైరముఁ గోరు వాని సుతుడే హర్షాతిరేకంబుతో
    స్థిరచిత్తంబునఁ శ్రీహరిన్ నిలిపి యా శ్రీనాథ భక్తుండునై
    పరమాత్మా దయఁ గావుమంచు సతమున్ బ్రార్థించుచున్ శ్రీమనో
    హర పాదద్వయ చింతనామృతముఁ బ్రహ్లాదుండు గ్రోలెన్ దమిన్

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తగదు హరిభజనలనుచు తండ్రిజెప్ప
    సకల జగముల కధిపతి శౌరియనుచు
    తండ్రికి దెలియజెప్పుచు దనుజమూక
    హరుని పదములనమ్మె బ్రహ్లాదు డెపుడు.

    హరిసంకీర్తనలాపుమంచు పితయే నత్యంత కోపమ్ముతో
    పరివాదమ్ములనాడువేళ హరి విశ్వమ్మంత పాలించునౌ
    దొరయంచున్ ప్రకటించి తానమితమౌ తూగొంది లక్ష్మీమనో
    హర పాదద్వయ చింతనామృతము బ్రహ్లాదుండుగ్రోలెన్ దమిన్.

    రిప్లయితొలగించండి
  8. ఎల్లవేళల హరినామమే జపించు
    తన్మయత్వము నొందును తలచుకొనుచు
    జనకుడు విధింప శిక్షల జంకక ముర
    హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు

    రిప్లయితొలగించండి
  9. నిరతమ్మా హరినామ కీర్తనమునన్ నీమంబుగా వెన్నునిన్
    నిరపేక్షన్ మదినిల్పి శోధనల నెన్నేనిన్ తమాయించి శ్రీ
    హరి సర్వోపగతుండటంచు ధృతినాహ్లాదంబుగా శ్రీమనో
    “హర పాదద్వయ చింతనామృతముఁ బ్రహ్లాదుండు గ్రోలెన్ దమిన్”

    రిప్లయితొలగించండి
  10. తే॥ అంజలి ఘటించి మనమున ననవరతము
    భక్తి నిలిపి స్తుతించుచుఁ బరమ విభుఁడు
    విష్ణవని తలచి వలచి ప్రియముగ భవ
    హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు

    మ॥ కరుణాత్ముండని నమ్ముచున్ జనుచు సాక్షాత్కార మర్థించుచున్
    బరమాత్ముండని సర్వ రక్షకుఁడనిన్ భక్తాళి బంధుండనిన్
    నరజన్మంబును బాపి భక్తులను సన్మానించు లక్ష్మీ మనో
    హర పాదద్యయ చింతనా మృతముఁ బ్రహ్లాదుండు గ్రోలెన్ దమిన్

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:హరుని పదముల నమ్మె బ్రహ్లాదుడెపుడు
    ననుచు నొక సమస్యను శంకరార్యు లిడిరి
    హరి పదమ్ముల నమ్మె ప్రహ్లాదు డెపుడు
    హరుని పదముల నమ్మె ప్రహ్లాదు డెపుడు?

    రిప్లయితొలగించండి
  12. మ:హరధాతాదిసమస్తదేవసముదాయారాథ్యమౌ,గర్వ సం
    హరమౌచున్ బలి పైన వెల్గినది యౌ,యా లక్ష్మికిన్ పూజ్య మౌ,
    హరణన్ జేయగ భూనభమ్ముల ననంతాకారమౌ,దుఃఖసం
    హరపాదద్వయచింతనామృతము బ్రహ్లాదుండు కోరెన్ దమిన్

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    తల్లిగర్భమ్మునందున తనరు నాడు
    గురులు చదువు బోధించెడు తరుణమందు
    తండ్రి వేదింపగాను శ్రీధరునిఁ బాప
    హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు

    మత్తేభవిక్రీడితము
    సురమౌనీకృత బోధనన్ దనరి విష్ణున్ మాతృగర్భమ్మునన్,
    గురువుల్ పాఠము సెప్పువేళమది వైకుంఠున్ విలోకించుచున్,
    దరుసీమన్ కరవాలమున్ గళముపై తాకింప, లక్ష్మీ మనో
    హర పాదద్వయ చింతనామృతముఁ బ్రహ్లాదుండు గ్రోలెన్ దమిన్

    రిప్లయితొలగించండి
  14. పుట్టి రక్షోగణ పతికిఁ బుడమి సంత
    త హరి విద్వేషి కయిన నేమి హరి నెడఁదఁ
    బద్మ నాభు నిరంతర భక్త దుఃఖ
    హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు


    అరిషడ్వర్గము నుత్తరించి తగ నిత్యానంద చిత్తుండునై
    పరివేష్టింపఁగ రాక్షసార్భకులు సంభావించి ప్రీతాత్ములై
    హరి నామస్మరణవ్రతస్థితుఁడు కోపాటోప దైత్యాలి సం
    హర పాదద్వయ చింతనామృతముఁ బ్రహ్లాదుండు గ్రోలెన్దమిన్

    రిప్లయితొలగించండి
  15. విష్ణు భజనవలదుమాటవినుమటంచు
    సుతునితోతండ్రియుపలుకుచుండ చెవులు
    మూసుకొనుచుకరములనుమోడ్చిదనుజ
    *"హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు”*

    గురువుల్ చెప్పిన మాటలన్ వినక తాగోవిందునే కొల్చుచున్
    నిరతమ్మాతని నామమున్ తలచి తానెల్లప్పుడున్ ధారుణిన్
    కరుణాశీలియుభక్తవత్సలుడు శ్రీకాంతుండులక్ష్మీమనో
    *“హర పాదద్వయ చింతనామృతముఁ బ్రహ్లాదుండు గ్రోలెన్ దమిన్”*

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    హరిని స్మరియించ తగదని యతని తండ్రి
    మానుమని హెచ్చరించినగాని వినక
    నిరతము భజన యందు మునింగి యసుర
    హరుని పదముల నమ్మెఁ బ్రహ్లాదుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి