11, జనవరి 2024, గురువారం

సమస్య - 4643

12-1-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలు సేవించిన లభించుఁ గైవల్యంబే”
(లేదా...)
“కలు సేవింపుఁడు పుణ్యకార్యమదియే కైవల్యసంప్రాప్తికిన్”

17 కామెంట్‌లు:

 1. తలచుచురామరసంబును
  పిలచుచురామాయనుచును ప్రీతినిరండీ
  ఇలలోమధురమునగు నా
  కలు సేవించిన లభించుకైవల్యంబే

  రిప్లయితొలగించండి
 2. పలుకన్జాలిన నామమే నరుడు తాపారంబునంటున్గదా
  చిలుకల్జెప్పగ జాలునీపలుకునేచేతస్సు పెంపొందగా

  మలుపున్ద్రిప్పును రామనామమధువే మద్యంబుబోలంగ నీ
  కలుసేవింపుడుపుణ్యకార్యమదియే కైవల్య సంప్రాప్తికై

  రిప్లయితొలగించండి
 3. ఖలుడైన గూడ జియ్యను
  తలచుచు స్తోత్రమును జేయు తరుణము నందున్
  కలిగిన కరుణరసపు గుళి
  కలు సేవించిన లభించుఁ గైవల్యంబే

  రిప్లయితొలగించండి
 4. గలగల పారుచు నవియె బ
  హుళముగను జనులకిలను ప్రయోజన కరమై
  వెలసినవవి వాగులు వం
  కలు, సేవించిన లభించుఁ గైవల్యంబే.  జలధారమ్ములు విశ్వమేఖలపయిన్ సంప్రీతితో రాల్చెడిన్
  జలమే కాంచ ప్రయోజనమ్ములవి విస్తారమ్మె కాదందురే
  యిలలో ప్రాణుల ప్రాణముల్ నిలిపెడిన్ హేమంబుతో బారు వం
  కలు, సేవింపుఁడు పుణ్యకార్యమదియే కైవల్యసంప్రాప్తికిన్.

  రిప్లయితొలగించండి
 5. తలచుచు శివ నామమ్మును
  పలు మారులు గుడికి వెళ్లి ప్రార్థన జేతన్ జెలగుచు భక్తి రస మ నె డి
  కలు సే వించిన లభించు కైవల్య o బే!

  రిప్లయితొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పొలుపగు గుణముల నొసగుచు
  విలువగు బ్రదుకున స్థిరతయె బెంచెడి హరి లీ
  లలదెల్పెడి మంత్రపు గుళి
  కలుసేవించిన లభించు కైవల్యంబే!

  పొలుపౌ జీవితమప్పగించి సుఖసమ్మోదమ్ములన్ బెంచుచున్
  కలుషమ్మైన గుణమ్ములన్ మడపి నిష్కామంపు భక్తిన్ సదా
  నిలుపన్ జేసెడి శౌరి శోభనముతో నిర్మాణమైనట్టిదౌ
  కలు సేవింపుడు పుణ్యకార్యమదియే కైవల్య సంప్రాప్తికిన్.

  రిప్లయితొలగించండి
 7. కలిలో తిరుమల గిరిపై
  వెలసిన శ్రీవేంకటేశు విశ్వాసముతో
  గొలిచిన దొలగు జనుల క
  ల్కలు, సేవించిన లభించుఁ గైవల్యంబే

  రిప్లయితొలగించండి
 8. కలిలో వేంకటనాయకుండు తనభక్తాళిన్ దయాపూర్ణుడై
  పలురీతుల్ పరితోషణమ్ము గలుగన్ పాలించి కాపాడునా
  యిలవేల్పున్ మదినమ్మి గొల్వనిడు తానిష్టార్థముల్, బోవుక
  ల్కలు, సేవింపుఁడు పుణ్యకార్యమదియే కైవల్య సంప్రాప్తికిన్

  రిప్లయితొలగించండి
 9. కం॥ ఖలులే పలకుదురిట్టుల
  “కలు సేవించిన లభించుఁ గైవల్యంబే”
  యెలమిని హరి నామ జపముఁ
  గలుష రహిత నడవడియును గైవల్య మొసఁగున్

  మ॥ “కలు సేవింపుఁడు పుణ్యకార్య మదియే కైవల్య సంప్రాప్తికిన్”
  ఖలులే పల్కుదు రీవిధంబుగ నహంకారమ్ముతో నంధులై
  యెలమిన్ శ్రీహరి నామ కీర్తనముతో నెవ్వాండ్రు సేవింతురో
  నెలవున్ గైవల్వ మంచు వారికిఁ గనన్ నిష్కర్షగా నబ్బదా!

  రిప్లయితొలగించండి
 10. మ.

  ఇలలో క్షేత్రము తీర్థముల్ కలవు మాహేంద్రమ్మయోగ్యమ్మగున్
  బలభద్రుండు సుభద్ర కృష్ణుడు పురిన్ వైకుంఠలోకంబుగన్
  శిలలౌ రూపము గాక చిత్రముగ వైశిష్ట్యమ్ము దృశ్యంబు చె
  *క్కలు సేవింపుఁడు పుణ్యకార్యమదియే కైవల్యసంప్రాప్తికిన్.*

  రిప్లయితొలగించండి
 11. కందం
  పలుమారు భాగవతమునఁ
  బులకించి సుమధురమనఁగఁ బోతన హరి లీ
  లలొలికె నా తియ్యని తర
  కలు సేవించిన లభించుఁ గైవల్యంబే!

  మత్తేభవిక్రీడితము
  పలుమారుల్ హరి నొప్పి భాగవత దివ్యమ్మైన సత్గాథలన్
  బులకింతన్ తనువూగ వీడ మది నిర్మోహమ్ము భక్త్యామృత
  మ్మొలకన్ బోతన శ్రీహరిన్ దలఁచి సద్యోగాన నా తీపి చు
  క్కలు సేవింపుఁడు పుణ్యకార్యమదియే కైవల్యసంప్రాప్తికిన్

  రిప్లయితొలగించండి
 12. ఇల లోన మాని దురిత
  మ్ములు నిశ్చల మైన భక్తిఁ బురుషోత్తమునిన్
  నలినాక్షుఁ బోక చెడు పో
  కలు సేవించిన లభించుఁ గైవల్యంబే


  అల వైకుంఠ నివాసు మాధవుని భక్తాధీనునిన్ దీన వ
  త్సలు రక్షో గణ భంజనప్రవరునిన్ దాక్షిణ్య చూడామణిన్
  బలభద్రానుజు నంద నందనుని సద్భక్తిన్ సమర్పించి కా
  న్కలు సేవింపుఁడు పుణ్య కార్య మదియే కైవల్య సంప్రాప్తికిన్

  రిప్లయితొలగించండి
 13. అలుపెరుగని మది తోడను
  కలియుగపుం దైవమైన కాళియ మర్దున్
  లలిత ములౌ పద రసగుళి
  "కలు సేవించిన లభించుఁ గైవల్యంబే

  రిప్లయితొలగించండి
 14. కలలోనైననుదైవరూపుఁడగు కామారిజూటంబువం కలు సేవింపుఁడుపుణ్యకార్యమదియే కైవల్యసంప్రాప్తికిన్
  బలుమారుల్ శివనామమే పలుక పాయంగ వచ్చున్ సుమా
  యలయా మోక్షము జీవులందరును యాధ్యాత్మికాభూతితోన్

  రిప్లయితొలగించండి
 15. కం:కలుషత్వము,నజ్ఞానము
  దొలగింపగ జేయు , మాయ దూరము జేయన్
  గల యుపనిష దమృతపు గుళి
  కలు సేవించిన లభించు కైవల్యంబుల్

  రిప్లయితొలగించండి

 16. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  ఇల నాలయమున భక్తిగ
  తలచుచు భగవంతుఁ సన్నిధానము నందున్
  నిలిచి, మదిని వీడుచు శం
  కలు, సేవించిన లభించుఁ గైవల్యంబే.

  రిప్లయితొలగించండి
 17. ఇలలో సతతము వదలక
  కొలుచుచుమందిరమునందుకూరిమితోడన్
  తలచుచు హరినామామృత
  *“కలు సేవించిన లభించుఁ గైవల్యంబే”*

  రిప్లయితొలగించండి