29, జనవరి 2024, సోమవారం

సమస్య - 4660

30-1-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పబ్బు కల్గించు సుఖము కైవల్యమన్న”
(లేదా...)
“వారాంతంబున పబ్బు కేగవలె కైవల్యంబు సిద్ధించగన్”
(డా॥ వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో)

23 కామెంట్‌లు:

  1. సాగవలెనన్న జీవితశాంతియాత్ర
    రక్తిరాజిల్లరసరమ్యరాముగలసి
    ముక్తిధామంబునందునమోకరిలగ
    పబ్బుగలిగించు సుఖముకైవల్యమన్న

    రిప్లయితొలగించండి
  2. మానసిక పరిపక్వత లేని వారలే సుమా!

    తేటగీతి
    ఐదురోజుల వత్తిడి నన నరకము
    బిగిసి సాఫ్ట్వేరు యుద్యోగి విడుపు గనుచు
    పూనిక పునరుత్తేజము వొందవెడలు
    పబ్బు కల్గించు సుఖము కైవల్యమన్న!

    శార్దూలవిక్రీడితము
    భారీ జీతము యాజమాన్యమిడి సంపాదింప సాఫ్ట్వేరులో
    స్వారీ చేయ దినమ్ము లైదు నరకంబంచెంచి యుద్యోగులున్
    హోరాహోరిగ పోరి యాటవిడుపై యోదార్పునొందంగనే
    వారాంతంబున పబ్బు కేగవలె కైవల్యంబు సిద్ధించగన్!

    రిప్లయితొలగించండి
  3. పోరాటంబదిజీవయాత్రగనగా భోజ్యంబులేసౌఖ్యముల్
    కూరాకుల్వలెదేహముల్వడలెగా ఘోరంపుయుద్ధంబులో
    భారంబైనదిమానసంబునికనేభావింప, దైవంబు తో
    వారాంతంబునపబ్బుకేగవలెకైవల్యంబుసిద్ధింపగన్

    రిప్లయితొలగించండి
  4. లాపు టాపు న పని తో నలసి సొలసియు పొంద గా వినోదం బులు పోదు రు గద
    పబ్బు కల్గించు సుఖము కై వల్య మన్న
    నాశ తో పరుగులు దీయు నాధు నికులు

    రిప్లయితొలగించండి
  5. శా.

    కోరిందేదియు దక్కదే వెదుకగా గోపంబునుద్యోగమున్
    శూరత్వమ్మును జూప నోటమి లభించున్ నాయకావేశమున్
    గారమ్మింతయు లేదు దూషణములే కార్యాలయమ్మందునన్
    *వారాంతంబున పబ్బు కేగవలె కైవల్యంబు సిద్ధించగన్.*

    రిప్లయితొలగించండి
  6. ఆదమరచి త్రాగుచునాటలాడు చుండి
    కుల మతములను వేర్మి లేకుండు మత్తు
    కతమున నచట నెల్లరు కలసిపోవ
    పబ్బు కల్గించు సుఖము కైవల్యమన్న

    రిప్లయితొలగించండి
  7. శార్దూలము:
    వారంబందుననైదు రోజులొక నిర్వక్రంపు యంత్రంబుగా
    హోరాహోరిగ నుద్యమించి తనదౌ యుద్యోగ బాధ్యత్వమున్
    నేరంబెంచక నాచరించి మదిలో నిర్వేదమున్ బాపుచున్
    వారాంతంబున పబ్బు కేగవలె కైవల్యంబు సిద్ధించగన్

    రిప్లయితొలగించండి
  8. శ్రీరామాన్విత చిక్కుడుల్ పెరటిలో చిక్కంగ నేపారెనే,
    మీరుద్యోగము జేయుటన్ బ్రియసఖా మీరింక రానందురా?
    రారా!పోదము మందవారముననే రవ్వంత విశ్రాంతతన్,
    వారాంతంబున పబ్బు కేగవలె కైవల్యంబు సిద్ధించగన్.

    శ్రీరామాన్విత చిక్కుడు- ఒక రకమైన చిక్కుడు (శ్రీరామ చిక్కుడు)
    పబ్బు-తీగలకు ఆధారమైన కొయ్య

    రిప్లయితొలగించండి

  9. రంగుల ప్రపంచము గనుచు లొంగి యువత
    వ్యసనముల పాల్పడిరి గాదె వాసిగాను
    ప్రత్య గాత్మను స్మరియింప వదులు కొనుచు
    పబ్బు, కల్గించు సుఖము కైవల్యమన్న”*


    ఔరా రాముని మందిరమ్మచట నా యయ్యొధ్యలో గట్టగా
    భారంబెంచక సాగుచుండిరట సద్భావమ్ముతో నీవునున్
    సారాయిన్ జవిగొంచు గెంతుతునిటన్ జాలంటినే వద్దికన్
    వారాంతంబున పబ్బు , కేగవలె కైవల్యంబు సిద్ధించగన్.

    రిప్లయితొలగించండి
  10. భార్య పనిచేయు నొకచోట భర్త మిగులు
    వేరొక నెలవు ప్రతితోజు వెతలు పడుచు
    సెలవు లభియించి నంతట చేరుకొనగ
    పబ్బు కల్గించు సుఖము కైవల్యమన్న

    ఏరోజైనను చిక్కవచ్చును గదా యేకాంత సందర్భమే
    వేరేమార్గము లేక చేయు పనిలో వేసారు సంభావ్యతన్
    ఘోరంబౌ పనులందునన్ మునిగినన్ గోరంత విశ్రాంతికై
    వారాంతంబున పబ్బు కేగవలె కైవల్యంబు సిద్ధించగన్

    రిప్లయితొలగించండి
  11. తే.గీ. ॥
    నిత్య జీవనమందున నియతితోడ
    బాధ్యతలుమోసి యలసిన ప్రాణమునకు
    సుంత విశ్రాంతినిచ్చి వారాంతమందు
    పబ్బు కల్గించు సుఖముకైవల్యమన్న

    రిప్లయితొలగించండి
  12. డబ్బు ఇబ్బడి ముబ్బడి నుబ్బటిల్ల
    గబ్బు పట్టిన యలవాట్ల నబ్బి జనులు
    మబ్బు వీడక యనుచుండు మత్తులోన
    పబ్బు కల్గించు సుఖము కైవల్యమన్న

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:డబ్బు కలిగించు దర్పమ్ము,డాబు నాకు
    గబ్బు గా తోచు పెద్దల జ్ఞానబోధ
    పబ్బు కలిగించు సుఖము కైవల్య మన్న
    జబ్బు రాగ ఇన్సూరెన్సు డబ్బు వచ్చు.
    (అని ఒక డబ్బున్న జల్సా యువకుని స్టైలు.)

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. తే॥ జబ్బుగా మారెనీ విదేశానుకరణ
      పనుల యొత్తిడి సైఁచఁగ జనులు గనిరి
      విరతి నొసఁగు వారాంతపు నిరతి నిపుడు
      పబ్బు కల్గించు సుఖము కైవల్యమన్న

      శా॥ ధారా పాతముగా విదేశ విధముల్ దావానలమ్మై చనన్
      భారంబాయె స్వదేశ సంస్కృతుల సౌభాగ్యంపు మాధుర్యమున్
      సారాంశంబిది భారతా వనిని సంస్కారంబు క్షీణించఁగన్
      వారాంతంబున పబ్బు కేగవలె కైవల్యంబు సిద్ధించఁగన్

      తొలగించండి
  15. శా:చేరెన్ నా మది బాల్య మందుననె నిశ్చింతన్ సుఖ మ్మొందుచున్
    సారాయున్,సఖి చాలు నంచను ఖయాం సాహిత్య మద్దాని నిం
    పారన్ బట్టితి కర్మ గాలి యికనే నా దారికే దాసుడన్
    వారాంతమ్మున పబ్బు కేగ వలె కైవల్యమ్ము సిద్ధింపగన్
    (తెలిసీ తెలియని వయస్సు లో ఉమర్ ఖయాం ని చదివి ఆ దారిలో పడి తానే పశ్చాత్తాపం చెందుతున్నాడు.)

    రిప్లయితొలగించండి
  16. శా:వారం బంతయు నెంత కష్ట మగు,సంపాదించు స్థానమ్ములో
    వారల్,వీరలు చుట్టు ముట్టెదరు నిర్వ్యాపారిగా నొక్కనిన్
    దూర మ్ముండగ నీరు కాదె ! మది నీ దుగ్ధన్ నివారింపగా
    వారాంతమ్మున పబ్బు కేగ వలె కైవల్యమ్ము ప్రాప్తింపగన్.
    (కైవల్యము అంటే ముక్తి కి పర్యాయపదం గా వాడుక. కానీ కేవలం గా అనగా ఒంటరి గా ఉండటం అనేది వ్యుత్పత్యర్థం.కాసేపు వంటరి గా వదలరు కనుక పబ్ కి వస్తున్నాడు.)

    రిప్లయితొలగించండి
  17. పబ్బు కల్గించు సుఖము కైవల్యమన్న
    యబ్బురంబుగ నుండెను నార్య! యదియ
    పబ్బు జీవిత మెప్పుఁడు వగల నిచ్చు
    దాని జోలికి పోకుమ దశలు మారు

    రిప్లయితొలగించండి
  18. పద్మ నాభుని పయిన విశ్వాస ముంచి
    యంతరంగమున స భక్తి నర్చ లొసఁగ
    బ్రతుకు మొక్కకుఁ జేకూర్చి పన్నుగ నొక
    పబ్బు కల్గించు సుఖము కైవల్య మన్న

    [పబ్బు = నిలువు కొయ్య]


    ధారాళమ్ముగ వారి ధారలను నిత్యం బింపుగాఁ బోయుచున్
    నారీ రత్నము లట్ల సంతతము సంతానమ్ము వోలెం దగన్
    గారాబమ్ముగఁ దీఁగలం గన నగుం గల్పించి బోటింపుగన్
    వారాంతంబునఁ బబ్బు కేఁగ వలెఁ గైవల్యంబు సిద్ధింపఁగన్

    [పబ్బు = నిలువు కొయ్య; తీఁగలు ఫలించుటయే వానికిఁ గైవల్యము. ]

    రిప్లయితొలగించండి
  19. వారాంతంబున పబ్బు కేగవలె కైవల్యంబు సిద్ధించగన్
    నౌరా యేమనిఁజెప్పు చుంటివి భళా యాదాద్రి కింబోవుమా
    పారావారము దాటి మోక్షము దగన్ బ్రాప్తించు నీకుంగదే
    యారామున్ మదిఁ జింతఁజేసిన నిడున్ నానంద సౌభాగ్యముల్

    రిప్లయితొలగించండి
  20. -
    హోరాహోరిగ నీదు జీవితములో పోరాడి శోషిల్లగా
    వారాంతంబున పబ్బు కేగవలె? కైవల్యంబు సిద్ధించగన్
    సారంబొప్పెడు భారతాదుల కెడన్ సాంగత్య మేదక్కు; రా
    రా! రాజిల్ల విచార మెల్ల మరువన్ రామా యనన్ సర్వదా!


    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఐదు రోజులు పనిచేసి యలసిపోయి
    వెదకి కొనుచు మార్గమ్ముల విడుపు కొఱకు
    పూని మనసుకు నుత్తేజ మొనరజేయు
    పబ్బు కలిగించు సుఖము కైవల్యమన్న.

    రిప్లయితొలగించండి