9, జనవరి 2025, గురువారం

సమస్య - 4998

10-1-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీవనితను బూజ సేసె శితికంఠుండే”
(లేదా...)
“శ్రీవనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే”
(అష్టావధాని బండకాడి అంజయ్య గౌడ్ గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

విరించి చెప్పారు...


భావను డెదలో నిల్పిన
దేవి యెవతె, యేమి చేయు దేవద్ర్యక్కుల్
కోవెలలో భవుడెవ్వడు
శ్రీవనితను, బూజ సేసె ,శితికంఠుండే.


కోవెలగా హృదిన్ మలచి గోమిని నిల్పెను విష్ణువెందుకో?
కావుమటంచు రావణుడు కల్మషకంఠుని కేమి సల్పె హై
మావతి భర్తయైన మహిమాన్వితు డెవ్వడు చెప్పమంటినే
శ్రీవనితానురక్తుఁడయి, చేసెను బూజల, ఫాలనేత్రుఁడే.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
కావించి త్రిమూర్తులనే
పావని యనసూయ మహిమ బాలకులుగనే
తావడ్డించ తిని యశ
శ్రీ వనితను బూజ సేసె శితికంఠుండే!

ఉత్పలమాల
పావనికిన్ పరీక్షయన వచ్చి త్రిమూర్తులు, నగ్నమూర్తిగన్
సేవగ వడ్డనన్ సలుపఁ జీరఁగ నా యనసూయ వారలన్
దీవెన జేసి బాలకుల తీరుగ మార్చ, పతివ్రతన్, యశ
శ్రీ వనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే

Sitharamayya Solasa చెప్పారు...

(భస్మాసుర కథా సందర్భం)

ఆ వేల్పుదాయ కోరగ
తీవరముగ వరమునొసగి తెక్కలినొందన్
కావలి నామె మగడిడగ
శ్రీవనితను బూజ సేసె శితికంఠుండే

M.B.G.TILAK చెప్పారు...

జీవము నిండు సమస్యలు
భావన జేయు చతురుడవు పండితవర్యా!
ఏవిధిఁ బూరించెదవో
'శ్రీవనితను బూజ సేసె శితికంఠుండే'

పావననామధేయుడవు పండితులందు ఘనుండవేకదా
చేవను జూపుచుంటివిట జీవము నింపి సమస్యలందునన్
గావున నాసమస్యనిక కమ్మని రీతిఁ బరిష్కరింపుమా
'శ్రీవనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే'

కవుతా రామకృష్ణ చెప్పారు...

ఏ వలపున్ వెలార్చడు మహేశుడు జీవుల దేనిపైనిఁ, దా
నే విషయానుకాంక్ష మది నేర్పడ నీయడు, నిర్వికారుడై
పావన శీతశైలమునఁ బాయని దీక్ష సతంబు చిచ్ఛమ
శ్రీవనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

దేవ గణంబులు శివునికి
పావన జిత్తంబు తోడ ప్రణ మిల్లి మహా
దేవు డని పొగడనెప్పుడు
శ్రీ వనిత ను బూజ సే సె శితి కంఠు o డే?

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:సేవా భావము నేర్పగ
నావంతయు నేర్వకుంట నా భక్తులు సం
సేవించు విధమునన్ దిగి
శ్రీవనితను బూజ సేసె శితికంఠుండే”
(రామ కృషణ మఠం లో స్వామీజీ పేరు స్వామీ శితికంఠానంద.సేవ గొప్పది అంటే అది నేర్వకండా జనం పూజలు చేస్తుంటే స్వామీజీ యే వాళ్ల సంతోషానికి పూజ చేసారు.)

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ భవమున బాధలఁ దీర్చును
నవనీత హృదినిఁ బరఁగును నవరాత్రులలో
భువినిఁగొలువఁ బడెడి మహా
శ్రీవనితను బూజసేసె శశికంఠుండే

ఉ॥ ఏవనితా ముదంబు సతు లెల్లరి కుంకుమ శోభఁ దాల్చునో
యే వనితా మణిన్ గనుచు నెల్లరు మాతగ నాదరింతురో
యేవనితన్ శుభంబులకు నీధర వేల్పనిఁ గొల్తురా మహా
శ్రీ వనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే

మహాశ్రీః వనితః రెండు సంస్కృత పదాలు కావున మహాశ్రీ వనిత గాతీసుకున్నానండి.


కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పావని లక్ష్మీ దేవిని
శ్రీ వనితను బెండ్లి యాడ శితి దేహుండే
పావని నుమ నేకాంతము
శ్రీ వనితను బూజ సేసె శితికంఠుండే

[శ్రీ వనిత = శ్రీదేవి చే సేవంపఁ బడినది]


గ్రీవమునన్ హలాహలము కీడొనరింపక నుంటకై సుసం
భావన సేసి సంతతము వారక నిత్యము దల్చు చుండి వి
శ్వావన దక్షఁ బ్రాణి నిచయాంబను నాదిమ శక్తి మంగళ
శ్రీవని తానురక్తుఁ డయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే

Dhanikonda Ravi Prasad చెప్పారు...


ఉ:శ్రీవనితానురక్తుఁడయి చేసెను బూజల ఫాలనేత్రుఁడే
భావము నందు కేశవుని పత్నిగ దల్చి సమస్వభావి యై
ఓ విషమా!గళమ్ముననె యుంచె నినున్ ,నిను గూడ "పేరునన్
శ్రీ" వని తాను సేవనము జేసెనొ మ్రింగి ప్రసాదభావనన్
(లక్ష్మి నైతే శంకరుడు సమభావం తో విష్ణువు భార్య కదా అని పూజించాడు.ఓ హాలాహలమా! నిన్ను కూడా కంఠం లో దేనికి పెట్టుకున్నాడు? నువ్వు కూడా శ్రీ అనే పేరు కల దానివి కనుక నేమో! విషానికి కూడా శ్రీ అనే నామాంతరం ఉంది.)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

దేవతలను హింసించగ
కావగరమ్మనుచువేడకాళికయగుచున్
జీవులనిలరక్షించిన
శ్రీవనితనుబూజచేసె శితికంఠుండే