15, మార్చి 2025, శనివారం

సమస్య - 5063

16-3-2015 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తలిదండ్రులఁ జంపినట్టి తనయులకు నతుల్”
(లేదా...)
“అన్ననుఁ దండ్రినిన్ జనని నంత మొనర్చినవారె వంద్యులౌ”

17 కామెంట్‌లు:

  1. బలవంతముగ‌ కొమరులకు
    పలుభావముల దమ నాడుపై పగ పెంచన్
    ఇలపైని జీడ క్రిములని
    తలిదండ్రులఁ జంపినట్టి తనయులకు నతుల్

    రిప్లయితొలగించండి
  2. కందం
    చెలఁగుచు మధురకుఁ జేరియుఁ
    గలఁచిన తమ మేనమామ కంసుని యెదపై
    కొలువై గ్రుద్దియుఁ, దలచుచుఁ
    దలిదండ్రులఁ, జంపినట్టి తనయులకు నతుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      వెన్నలు మీగడల్ గుడిచి వేడ్కను బంచియు గోకులమ్మునన్
      దిన్నగఁ జేరియున్ మధుర తీరులెరుంగుచు కంసమామపై
      మున్ను చెలంగియయ్యెదను మోది, తలంచుచు, వెంటనంటి తా
      నన్ననుఁ, దండ్రినిన్ జనని, నంతమొనర్చిన వారె వంద్యులౌ

      తొలగించండి
  3. సమస్య:
    “అన్ననుఁ దండ్రినిన్ జనని నంత మొనర్చినవారె వంద్యులౌ”

    ఉత్పలమాల:

    తన్నుకు చావనేలనయ తండ్రియు వ్రాసిన పత్రముండగన్
    దన్నుగ నిల్చిరే సుతకు దక్కగ మొత్తము నత్తమామలే
    మిన్నక యూరకుండెదవు మీరిన లోకపు నీతెఱుంగవే
    “అన్ననుఁ దండ్రినిన్ జనని నంత మొనర్చినవారె వంద్యులౌ”
    పన్నగ వేల దారులను, పాపమ నెంచకు కల్కి కాలమున్

    రిప్లయితొలగించండి
  4. కం॥ చెలఁగుచు క్రూరత నుగ్రత
    వలచి భువిని దుష్టులుగను బ్రదుకుచు నుండన్
    దలఁపకఁ బాపము పుణ్యము
    తలిదండ్రులఁ జంపినట్టి తనయులకు నుతుల్

    ఉ॥ మిన్నగు నుగ్రవాదులుగ మేదిని దుష్టత నొంది క్రూరులై
    యెన్నియొ పాప కార్యముల నెన్నఁడు హీనమటంచుఁ దల్చకన్
    గ్రన్నన చేయు చుండఁగను గాదిలి మీరఁగ విశ్వరక్షకై
    యన్ననుఁ దండ్రినిన్ జనని నంతమొనర్చిన వారె వంద్యులౌ

    పద్యపూరణకు సరే నండి. ఇంట్లో అందరూ ఉగ్రవాదులు లేక ఉగ్రవాదానికి కొమ్ము కాసే వారైన ఘటనలే చదివినామండి.

    రిప్లయితొలగించండి
  5. తలపక నెగ్గును సిగ్గును
    గరితల మానముల దోచు కఠినహృదయులౌ
    తులువల, తలచుచు మదిలో
    తలిదండ్రులఁ, జంపినట్టి తనయులకు నతుల్

    రిప్లయితొలగించండి
  6. అన్నెము పున్నెమేమెరుఁగనట్టి యమాయక కోమలాంగులన్
    పన్నుగ గాలమేసి బలవంతము జేయుచు ప్రాణ మానముల్
    క్రన్ననఁ దోచు యుక్కివుల క్రౌర్యమడంచఁగఁ, దల్చుకొంచు రా
    మన్ననుఁ, దండ్రినిన్, జనని, నంత మొనర్చినవారె వంద్యులౌ

    రిప్లయితొలగించండి

  7. తలదాల్చి తండ్రి యానతి
    లలితాంగిని జంపె నొకడు ప్లవుడని హరినే
    తలవకు మన నొకపుత్రుడు
    తలిదండ్రులఁ జంపినట్టి తనయులకు నతుల్.


    ఎన్నగ రామభక్తుడయి యింతియయోనిజ కోసమొక్కడున్
    మన్నన జేయనేల యరి మాధవు డంచు వచింప నొక్కడే
    యెన్నక మంచిచెడ్డలను హ్రీకుని యానతి యంచు నొక్కడా
    యన్ననుఁ, దండ్రినిన్, జనని, నంత మొనర్చినవారె వంద్యులౌ.

    (విభీషణుడన్నను, ప్రహ్లాదుడు తండ్రిని భార్గవుడు తల్లిని అంతమొనర్చినవారు)

    రిప్లయితొలగించండి
  8. ఎన్నగఁ దండ్రి కామమగు నెప్పుడు క్రోధగుణాఖ్యవైరికిన్
    పన్నుగ మోహమూర్తికిని భ్రాతగ క్రోధము నిల్చు, భావనా
    సన్నుతదేహ తల్లియగు, జాగ్రత మోహవిరోధి నట్లె వా
    నన్ననుఁ దండ్రినిన్ జనని నంత మొనర్చినవారె వంద్యులౌ

    రిప్లయితొలగించండి
  9. గెలుపే మారెను జగతిని
    బలురకముల హీనగుణుల పరమావధిగా
    కలికాలపు నేతలమని
    తలిదండ్రులఁ జంపినట్టి తనయులకు నతుల్

    మన్నన మృగ్యమైనదిట మానవరాక్షస తీరు స్పష్టమే
    తన్నుల బాటయే కడకు తారక మంత్రము వారిదృష్టిలో
    ఎన్నిక లందుకాననగు హీనుల నేతల దుచ్చరిత్రలే
    అన్ననుఁ దండ్రినిన్ జనని నంత మొనర్చినవారె వంద్యులౌ

    రిప్లయితొలగించండి
  10. రేణుకా జమదగ్నుల సంవాదము:-

    ఉన్నతుడెవ్వడిందు మన యౌరసులందను భార్య మాటకున్
    దన్నుగఁ బల్కె మౌని జమదగ్ని విశేష సుధీర్ఘ దృష్టితో
    మన్ననఁ జూపి తండ్రికిని మాతను గొడ్డలి తోడఁ జంపరా
    యన్ననుఁ దండ్రి, నిన్ జనని నంత మొనర్చినవారె వంద్యులౌ!!

    రిప్లయితొలగించండి
  11. వలచిన వారలు కాదని
    బలవంతపు పెండ్లి చేయ వరదక్షిణకై
    నలుగురు ననుకొను చుండిరి
    "తలిదండ్రులఁ జంపినట్టి తనయులకు నతుల్"

    రిప్లయితొలగించండి
  12. తలి దండ్రులు దైవ సములు
    పలువురు పూజించు చుండ పాలసు లగు చున్
    పలుకగ రా దది యె ట్టు la మ్
    తలి దండ్రుల చంపి నట్టి తనయుల కు నతు ల్?

    రిప్లయితొలగించండి
  13. కం:తెలివెక్కు వైన వారలు
    తలతిక్కగ ఛత్రపతిని తలచరు, మొగలా
    యిలు ఘనులని యర్పింతురు
    తలిదండ్రులఁ జంపినట్టి తనయులకు నతుల్”
    (శివాజీ లో తప్పులు వెతికి,అమ్మ, నాన్నలని చావగొట్టే మహమ్మదీయ చక్రవర్తుల కి భజన చేసే వాళ్ల గూర్చి.తెలివెక్కువైన వారలు=అతితెలివి అనేది వాడుక పదం కానీ వ్యాకరణ బద్ధం కాదు కనుక.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:ఎన్నగ దొంగ లౌకికమునే జపియించెడు వారి బుర్రలం
    దున్నది యేమొ కాని మన యోధుల త్యాగము లెంచ రేలనో
    మన్నన జేతు రా మొగలు మారణకర్తల,వీరి దృష్టిలో
    నన్ననుఁ దండ్రినిన్ జనని నంత మొనర్చినవారె వంద్యులౌ”

    రిప్లయితొలగించండి
  15. అల విత్తమె ముఖ్యం బని
    కలకాలం బుండు నంచుఁ గాఠిన్యమునం
    గలి కాలపు మాహాత్మ్యము
    తలిదండ్రులఁ జంపినట్టి తనయులకు నతుల్


    ఛిన్నము కాక మున్న వెసఁ జింతల మున్గక మున్న నేర్పునం
    గ్రన్నన నేరి తత్క్షణమ కష్టము లన్నిటిఁ, గాచి భక్తిమై
    యన్ననుఁ దండ్రినిన్ జనని, నంత మొనర్చిన వారె వంద్యు లౌ
    నన్నను లేక కా దనిన నాత్మ జనౌఘము సంతతమ్మునున్

    రిప్లయితొలగించండి