26, మార్చి 2018, సోమవారం

పుష్పక విమాన బంధ సీసము

శ్రీరామ స్తుతి 

పద్యము చిత్రములో చదువు విధానము 
          పైన 'శ్రీ'తో మొదలు బెట్టాలి. 'శ్రీ దశరథ సుత' అని చదువుకొని తిరిగి 'శ్రీ'తో ఎడమ ప్రక్క ఏనుగు దగ్గిర గల 'రా' తో కలిపి 'తాటకాoతక ఘన రఘురామ'తో కొనసాగించి ప్రక్కన 'శ' దాని తర్వాత 'మ' దాని తర్వాత 'దాత' తో  కొనసాగించాలి.  క్రింద 'మే' కలిపి పై దాకా వెళ్లి 'చోరా' చదివి ప్రక్కన 'సంహార' ఆపి ప్రక్కన 'రా'తో మొదలిడి  మధ్య గడిలో  'వణ'తో చదివి 'వహ' అని పక్షి కన్ను దగ్గిర ఉన్న 'తి' తో కలిపి  ఎడమ ప్రక్క మొదటి రెక్కలో 'హరా' అని క్రింద రెక్కలోకి దిగి 'హర్ష' చివర ఉన్న 'నిర్వ' అన్న పదము తోటి   మరల కన్ను దగ్గిర 'తి' కలుపుకొని కుడి రెక్కలో 'వితరణ' అని కొనసాగించాలి. క్రిందకు దిగి 'విహారా' అని ప్రక్కన 'స' కలిపి పైన కన్నుదగ్గిర 'తి' కలిపి క్రిందకు దిగి 'సహిత మహిపాలక రామ వందనము నీకు' అని ముగించాలలి.
దీనిలో విశేషము 'శ్రీ రామ రామ రామేతి' అన్న శ్లోకం మొదటి పాదము బంధించ బడినది.   

సీ :
శ్రీ దశరథ సుత! శ్రీరామ! తాటకాం 
          తక! ఘన రఘురామ! తాపసి వర!
సతి యహల్యా శాప శమదాత! పిత వాక్య 
          పాలకా!  జానకీ ప్రాణ నాధ!
మేరు మహీధర సార వీరా! హను
          మ మది చోరా!  క్రూర మర్కట మద
సంహార! రావణ సహిత దానవ గణ
          వహతి   హరా!  రఘువర! మహీజ
తే :
హర్ష కారక! లక్షణ, హనుమ, నిర్వృ
తి వితరణ! విభీషణ సుమతి పచరిత వ
రా! అనంజ శకట విహారా! సతిసహి
త మహి పాలక రామ! వందనము నీకు.

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి