23, మార్చి 2018, శుక్రవారం

సమస్య - 2631 (నా నీ పత్నికి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"
(లేదా...)
"నా నీ పత్నికి కోర్కెఁ దీర్చుమనె హన్మంతుండు గౌంతేయుతోన్"
(ఒక అవధానంలో నరాల రామారెడ్డి గారు పూరించిన సమస్య)

'హన్మంతుఁడు' శబ్దం అసాధువని జరిగిన చర్చను క్రింది వీడియోలో చూడండి. 
https://www.youtube.com/watch?v=9IY5cI8UiFM

103 కామెంట్‌లు:

 1. (కొడుకు నానీతో తల్లి )
  కాని మ్మూటీ నగరము
  గానదలచె గద ! కోడలు ; ఘనముగ దీర్పం
  బూనుము ; చూలెంతసుమీ!
  నానీ! సతికోర్కె దీర్చినన్ ముదమందున్ .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   'నానీ' అన్న ముద్దుపేరుతో (ఒక సినిమా కూడా వచ్చినట్టుంది) మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో మూడవ గణం (కోడలు) భగణం అయింది. అక్కడ జగణ, నలము లుండాలి కదా! "..గాన దలచె గోడలు గద ఘనముగ..." అంటే సరి!

   తొలగించండి
 2. నానా విధపరి మళముల
  ఏనీ సతియడిగి నేమొ యిమ్మని భీమున్
  కానిమ్ము సౌగంధి కమది
  నానీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   చక్కని అంశాన్ని ఎంచుకున్నారు పూరణకు. బాగుంది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. 'నా నీ' అన్నదానికి అన్వయం? సవరించండి.

   తొలగించండి
  2. తమ్ముడే గదా అని హనుమ భీమయ్యను ముద్దుగ ' నానీ' యని అన్నాడేమోనని అక్కయ్యగారి భావనేమో !ఆకాలంలో ఎలాంటి ముద్దు పేర్లుండేవో యేమో !

   తొలగించండి
  3. నానా విధపరి మళముల
   ఏనీ సతియడిగి నేమొ యిమ్మనె సౌగంధిన్
   కానిమ్మని బలికె వాయుసూ
   నా , నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్

   తొలగించండి
 3. ఓనీలకంధర! త్రినయ
  నా! నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్
  ఆనుము గరళము నీ వీ
  శా! నరులను కావుమయ్య శశి భూషణుడా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   'మ్రింగుమనె సర్వమంగళ' అన్న భావంతో చక్కని పూరణ చేసారు. అభినందనలు.

   తొలగించండి

 4. కం
  ( ఓ తండ్రి కొడుకుతో పలికిన మాటలివి )

  ఓ నాన్నా!మనువాడిన
  నీ నారిని తోషపఱుచు నీ ధర్మమదే
  లే!నీ నిర్లక్ష్యము తగు
  నా!నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"

  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   తగునా అన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  భీమాంజనేయమ్...

  కానన్ నా సతి గోరె పుష్పమును సౌగంధ్యాఖ్యమున్ , మారుతీ !
  దీనిన్ వాలమునడ్డు దీయుమని ప్రార్థింపన్ , దయాచిత్తుడై
  దానున్ బల్కుల ధర్మముల్ దెలిపి , భ్రాతా ! పొందుమా ! భీమసే....
  నా ! నీ పత్నికి కోర్కెఁ దీర్చుమనె హన్మంతుండు గౌంతేయుతోన్" !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నరాల రామారెడ్డి గారు పూరించిన భావంతోనే మైలవరపు వారు పూరించారు. (వారు పూరణ చేసే సమయానికి ఇంకా అష్టావధానం వీడియో లింకు ఇవ్వలేదు!) అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.

   తొలగించండి
  2. రాననెను తిరుమలకు తిరు
   చానూరును వీడి మంగ , చనుమిక నీవే
   యే నడిరేయినొ ! వెంక...
   న్నా ! నీ సతి కోర్కె దీర్చినన్ ముదమందున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. అద్భుతమైన పూరణ! అభినందన శతములు!💐💐💐

   తొలగించండి
  4. శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదాలు శ్రీ శాస్త్రి గారికి కూడా 🙏🙏

   తొలగించండి
 6. వానా కాలము వచ్చెను
  పాను మసాలా కొనమని భామయె కోరెన్
  పోనీలేయని నీవ
  న్నా! నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్

  రిప్లయితొలగించండి
 7. రెండవ పూరణ...

  నానీ! నా మాట వినుము!
  తానేదడిగిన నొసగుము ధర్మమదేలే!
  కానన్! కాదనకు సరే
  నా! నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్!

  రిప్లయితొలగించండి
 8. ఆ నరకుని తో పోరుకు
  నేనును వత్తునని బలికె నీ సతి ఘనతన్,
  కానిమ్ము కుండలీ శయ
  నా, నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్

  సత్యభామ నరకాసురినితో యుద్ధము చేయుటకు తాను కూడా వచ్చెదనని తెల్ప శ్రీకృష్ణుడు సందేహము బడుచుండ నారదుడు పలికిన సందర్భము

  రిప్లయితొలగించండి
 9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2631
  సమస్య :: *నా నీ పత్నికి కోర్కె దీర్చు మనె హన్మంతుండు కౌంతేయుతోన్.*
  మన భార్య కోరిక తీర్చు అని హనుమంతుడు కౌంతేయునితో (భీమునితో) అన్నాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: ద్రౌపది తెచ్చి యిమ్మన్న అపూర్వమైన పుష్పాలకోసం వెళ్లిన భీముడు దారిలో హనుమంతుని చూచాడు. గర్వం తొలగిపోగా నమస్కారం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఓ సోదరా!భీమా ! నీకు జయం కలుగుతుంది. నిన్ను నేను మెచ్చుకొంటున్నాను. భార్య కోరిన దానిని తెచ్చి యివ్వడం భర్తయొక్క బాధ్యతయే కదా అని భీమునితో పలికే సందర్భం.

  చానల్ కోరగ దెచ్చి యిత్తురు విభుల్, సౌగంధికా పుష్పమున్
  కానన్ గాంచగ వచ్చినాడవు సతీకార్యార్థివై, సోదరా !
  మానీ! వాయుకుమార! భీమ! జయమౌ, మన్నించి నిన్ మెచ్చుకో
  *నా, నీ పత్నికి కోర్కె దీర్చు మనె హన్మంతుండు కౌంతేయుతోన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (23-3-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోట రాజశేఖర్ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. నా పూరణకు సుప్రసిద్ధ కవి పండితులు అగు శ్రీ చక్రాల లక్ష్మీకాంత రాజారావు గారి ఆశీస్సు మరియు ప్రశంస పద్యరూపంలో
   ఆనందామృతభావనోద్భవరసాధ్యాయోపభోజ్యమ్ము మీ జ్ఞానక్షీరపయోధిసంజనితరత్నాత్మీయపద్యమ్ము శ్రీవాణీపాదసరోజనూపురరవక్వాణైకవాద్యమ్ము సుశ్రీనాదమ్మిది రాజశేఖర!యివేసేసల్ బృహత్ సన్నుతుల్ . కాంతరాజారావు 9291333880

   తొలగించండి
 10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2631
  సమస్య :: *నానీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్!"*

  నానీ అనునది ముద్దుగ కొమరుల బిలుచు పేరులు. సతి అటుల నానీ అని కొమరుని బిలిచి కోర్కె దీర్చు మని చెప్పడం ఈ సమస్య లో ఉన్న విరుద్ధమైన అర్థం.
  ఇటువంటి విరుద్ధమైన అర్థమున్న వాటిని సరి జేయుటకు మనకు అత్యావశ్యము ఒక కథ.

  వేల కొలది వత్సరముల పూర్వము మాహిష్మతి నగరమునందు చీమలు దూరని కారడవి మధ్య వనమును నమ్ముకొని ఒక కోయజాతి బతుకుచుండెను. ఆ వనమునకు రాజు ఆ సతీ మణి మగండు. వారికి ఎన్నేండ్లు గడిచిననూ సంతానము కలుగ లేకుండెను. అప్పుడు వారలిరువురు చుక్కతొలువవేల్పుగొంగను , వారి గురువులైన పండితారాధ్యులభరణీస్వామి వారి ఆన గా నలుబది యైదు దినములు పుత్రకామేష్టి ప్రార్థనలు సలుపగా వారికి ఆ మాతృనందనుడు సతీమణుల సమేతము గా గాన్పడి భక్తులారా మీ భక్తి కి మెచ్చినాము . ఏమి వరము కావలె నని కోరిరి. అప్పుడు ఆ సతీ మణి మగండు జుట్టుపిట్టతాలుపు ని వేనోళ్ళ కొనియాడుచు వేడిన ఆ ఘటన ను వివరించే సందర్భము యిది.

  చానా నాళ్ళుగ ఓ ఈ
  శానుడి కొమరుండ లేదు సంతానంబున్ !
  ఈ నాటికైన ఓ సే
  నానీ! సతి కోర్కెఁ దీర్చినన్, ముద మందున్ !

  వారికోరికను మన్నించి శాంకరి సతీమణుల సమేతము గా దీవెన లిడి వెడలెను మీకు కొమరుడు లభ్యమగును అనుచు.
  ఈ సంఘటన గడిచిన కతిపయ దినములకు, నదిలో జలకాలాటకు వెడలిన సతీ మణి కి నొక బాలుడు ఇనాని నందు తేలుచు నదిలో గాన్పడగా ఆ సతీ మణి ఆ బాలుని చూచి నదిని బారలు వేయుచు వేగము గా వెడలి ఆ బాలుని కాపాడి కొని దెచ్చు కొనెను. ఆ కొమరుడు సర్వసేనాపతి యై రాబోవు కాలమున ఆ మాహిష్మతీ నగరము నేలు నని వారికి ఎరుక లేకుండెను.

  *బుచికి* (౨౩-౩-౨౦౧౮)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   సవివరంగా నేపథ్యాన్ని తెలియజేసి "ఓ సేనానీ!" అని సంబోధిస్తూ మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.
   'చాల'ను 'చానా' అనడం గ్రామ్యం. "సంతానంబున్ ఈ" అని విసంధిగా వ్రాయరాదు. "ఏనాటిదొ కోరిక యీ। శానుడి... సంతానమ్మే। యీనాటికైన నో సే।నానీ..." అనండి.

   తొలగించండి
 11. చదువుకోవాలని కోరిన కోడలిని సమర్ధిస్తూ అత్తగారు

  ఏనాటికి తరగని గని
  యానలువకు కూర్మిరాణి యాశగ నేర్వన్
  మానిని గోరగ రామ
  న్నా! నీ సతి కోర్కె దీర్చినన్ ముదమందున్!

  రిప్లయితొలగించండి
 12. ఏ నా డే మియు కోరని
  మౌన ము గా మెలగు నీదు మది నె రి గి న దౌ

  మీనాక్షి నడి గి యిపుడయి
  నా నీ సతి కోర్కె తీర్చిన న్ ముద మందు న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   వైవిధ్యంగా పూరించాలన్న మీ ఉత్సాహం ప్రశంసనీయం. బాగుంది. అభినందనలు.
   కాని 'ఎపుడయినన్' అనడం సాధువు. 'ఎపుడయినా' అనడం వ్యావహారికం.

   తొలగించండి
 13. ఈ నా వాలము నీ బలమ్ము నిడుచున్ యీ రోజు నిద్దా సము
  త్థానమ్మున్ యొనరించినావు, ఘన భ్రాతా, నీదు ప్రోయాలు కై
  యీ నాభీల సుగంధ పుష్పమునకున్ యేతెంచె గా, భీమ సే
  నా,నీపత్నికి కోర్కెఁ దీర్చుమనె హన్మంతుండు గౌంతేయు తోన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణసూర్యకుమర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇడుచున్ + ఈ, సముత్థానమ్మున్ + ఒనరించి, పుష్పమునకున్ + ఏతెంచె' అన్నపుడు యడాగమం రాదు. 'ఈ + ఆభీల' అన్నపుడు నుగాగమం రాదు. సవరించండి.

   తొలగించండి
 14. ఆనిలి భీమునకు దెలిపె
  వానీడు సరోవరమున వర్తిలు నీకున్
  నాణెపు చెందొవలు సరే
  నా! నీ సతి కోర్కె దీర్చినన్ ముదమందున్!!!

  వానీడు= కుబేరుడు, చెందొవలు= సౌగంధికములు

  రిప్లయితొలగించండి
 15. కందం
  ఏనాడు తప్పు జేసితి?
  నీ నాటికి నొక్క బిడ్డ నీయవదేలా?
  దీనుడనై వేడెద సే
  నానీ! సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్

  రిప్లయితొలగించండి
 16. Dr H Varalakshmi
  Bangalore

  కానీ అని పనులవ్వగ
  మానీ మన వంటపనియు మది మురిపెముగా
  పోనీ అమ్మను రమ్మన
  నా, నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కానిమ్మని" అని మొదలు పెట్టండి. 'మానీ' అర్థం కాలేదు.

   తొలగించండి
 17. మిత్రులందఱకు నమస్సులు!

  [సౌగంధికాపహరణ ఘట్టమున హనుమంతుఁడు భీమునితోఁ బలికిన సందర్భము]

  మేనం జల్లని గంధ మద్దినటు సంశ్లేషమ్మునందించి, తా
  నానందమ్మున సాఁగనంపుచు వెసన్, "హర్షాన సౌగంధికా
  సూనమ్ముల్ గొనిపోయియున్నొసఁగి, సుశ్లోకుండవౌ పాండుసూ
  నా! నీ పత్నికిఁ గోర్కెఁ దీర్చు" మనె హన్మంతుండు, గౌంతేయుతోన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తానడిగినవి సమంజస
   మౌను గదా తీర్చ కుండ మౌన మదేలా?
   యేనుగులన్ గొని తెమ్మనె
   నా? నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"

   తొలగించండి
  2. మధుసూదన్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   *****
   జనార్దన రావు గారూ,
   చక్కని పూరణ. అభినందనలు.

   తొలగించండి
 18. నీ నాతి మండుటెండకు
  పోనేరక నలసి,సొలసి,పూర్తిగ నిలచెన్.
  పానీయంబులఁదెమ్మనె
  నా?నీ సతి కోర్కెఁదీర్చినన్ ముదమందున్

  రిప్లయితొలగించండి
 19. పీనాసి తనము వీడుము
  చీనాంబరములను నీదు శ్రీమతి కోరెన్
  దానిని కొన ఖర్చన తగు
  నా, నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్

  రిప్లయితొలగించండి
 20. డా.పిట్టాసత్యనారాయణ
  (కుమారుడు ప్రభుత్వోద్యోగి.అతని తండ్రి,భార్య అనగా మామ కోడలు,వీరిద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తారు.తండ్రి అంటున్నాడు:)
  పోనీ గెలుపెరుగమయా!
  రానీ కృప వేంకటేశరాట్సతి, గోదా
  ఈ నీ యెన్నికలందున
  నా, నీసతి కోర్కె దీర్చినన్ ముదమందున్(ముదము,అందును.)

  రిప్లయితొలగించండి
 21. నా,నీ,బ్రతుకుకుచదువే
  నేనియమనిధులనొసగగనిత్యసుఖంబౌ‌!
  జ్ఙానంబది,ధనమిడునౌ
  నా?నీసతికో్ర్కెదీర్చినన్ముదమమందున్,

  రిప్లయితొలగించండి
 22. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'తను' అన్నది సాధువు కాదు. "తా" (ద్రుతలోపం) అనండి.

  రిప్లయితొలగించండి
 23. *సమస్య* : -
  "నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"

  *కందము**

  నానికి బొమ్మలు కొనమని
  తానడిగిన కొనక యున్న తనతో గొడవై;
  దానికి తగవులు సబబే
  నా; నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్

  రిప్లయితొలగించండి
 24. (2)

  [శరవారధిని నిర్మించి, భంగపడిన యర్జునునితో, హనుమంతుఁడు, భావి కురుక్షేత్ర సంగ్రామ విషయమై పల్కిన సందర్భము]

  "కానీనుం దగ నొంచి, కౌరవులకున్ గర్వమ్మునున్ డుల్చి, త
  త్సేనానీక చతుర్విధాఖ్య బలముం జెండాడి, నిత్యమ్ము నీ
  లోనన్ ధర్మము వెల్గ, గెల్చియు, రథాగ్రోద్దీప్త మద్వ్యక్త చి
  హ్నా! నీ పత్నికిఁ గోర్కెఁ దీర్చు" మనె హన్మంతుండు, గౌంతేయుతోన్!

  రిప్లయితొలగించండి
 25. శార్దూలవిక్రీడితము
  ప్రాణమ్ముల్నుప పాండవుల్ విడువగన్బాధ్యుండు! యుద్ధమ్మునన్
  వానిన్ నీచుఁ గసాయి ద్రోణ సుతు నశ్వత్తామఁ జిక్కంగనే
  శ్రీనాథుండును జూచు చుండ దునుమన్ సేమమ్ముఁ గా! సిద్ధమే
  నా! నీపత్నికి కోర్కెఁ దీర్చుమనె హన్మంతుండు గౌంతేయుతోన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రాణమ్ముల్ + ఉపపాండవుల్ = ప్రాణమ్ము లుపపాండవుల్' అవుతుంది. అక్కడ నుగాగమం రాదు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

   ప్రాణాలన్నుప పాండవుల్ విడువగన్బాధ్యుండు ! యుద్ధమ్మునన్
   వానిన్ నీచుఁ గసాయి ద్రోణ సుతు నశ్వత్తామఁ జిక్కంగనే
   శ్రీనాథుండును జూచు చుండ దునుమన్ సేమమ్ముఁ గా! సిద్ధమే
   నా! నీపత్నికి కోర్కెఁ దీర్చుమనె హన్మంతుండు గౌంతేయుతోన్!

   తొలగించండి
 26. ధ్యానము, యోగ మనుదినము
  మానక సేయ సరి యౌనె, మగనాలి మదిన్
  గానక బాధించగ తగు
  నా! నీ సతి కోర్కె దీర్చినన్ ముదమందున్!

  రిప్లయితొలగించండి
 27. కానంగా నిను భీమసేన మదిలో గాఢంపు నెయ్యంబునన్
  గానన్ నీవిటు వచ్చితీవు ఘనసౌగంధీ సుమాన్వేషణన్
  సానందంబుగ దీసికొమ్ము సుమముల్ జాగేల భీభత్సుక
  న్నా! నీ పత్నికి కోర్కెదీర్చుమనె హన్మంతుండు కౌంతేయుతోన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భీభత్స! కన్నా!' అంటే బాగుంటుంది. కాని భీభత్సుడు అంటే అర్జునుడు కదా!

   తొలగించండి
  2. అవునండీ! భీభత్సునకన్నా అంటే గణభంగం అవుతుందని భీభత్సు కన్నా అన్నాను! సందేహంగానే వ్రాశాను! 🙏🙏🙏🙏

   తొలగించండి
  3. నేనే పొరపడ్డాను. 'భూభత్సునకు అన్నా' అనే అర్థంలో ప్రయోగించారా?

   తొలగించండి
  4. గురువుగారూ! “జాగేలనో వాయుసూ నా”
   అంటే సరిపోతుందనుకుంటాను! పరిశీలించగలరు!🙏🙏🙏

   తొలగించండి
  5. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!

   తొలగించండి
  6. కానంగా నిను భీమసేన మదిలో గాఢంపు నెయ్యంబునన్
   గానన్ నీవిటు వచ్చితీవు ఘనసౌగంధీ సుమాన్వేషణన్
   సానందంబుగ దీసికొమ్ము సుమముల్ జాగేలనో వాయుసూ
   నా! నీ పత్నికి కోర్కెదీర్చుమనె హన్మంతుండు కౌంతేయుతోన్!

   తొలగించండి
 28. డాపిట్టాసత్యనారాయణ
  నానీ బ్లాగుల బాధ్యు భీమ కవిని న్నౌనంచు బామాలినా
  పోనీ మా,కతడాలికైన నిడడే పొందెన్నియున్ స్థానమున్
  "కానీ"యంచట వ్రాసె లేఖ నొకటన్ గౌంతేయుకున్నందునన్
  "నానీలిద్దరి వచ్చువేసికొనుమా న్యాయంబు గాదన్నచో
  "నానీపత్ని"కి కోర్కె దీర్చుమనె హన్మంతుండు గౌంతేయునిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కవినే నౌనంచు' అనండి. కొంత అన్వయక్లిష్టత కనిపిస్తున్నది.

   తొలగించండి
  2. డాపిట్టానుండి}
   నానీపత్ని యనగా నీవు నానీల నిర్వహిచేవాడవు, నీపత్నికి ప్రచురణలో చోటివ్వ మన్నాడు. అన్నవాడు హన్మంతు అని సమస్య సూచిస్తుంది కదా.పాఠకునికి ఆమాత్రం శ్రమ యివ్వకున్నచో అరచేతిలోని అరటి పండును కవి అంతటా యివ్వడు. పోతన భాగవతంలో ఇది కనిపించింది.పిన్నలు వ్రాస్తే లోపం అనుకుంటారు.నాఈ పేర్లు భారతంలోనివి కావు,ఆర్యా

   తొలగించండి
 29. ఆనాకంబున బూయు పుష్పమది తానడ్గెన్ గదా భీమసే
  నా, నీ పత్నికి కోర్కెఁ దీర్చుమనె హన్మంతుండు, గౌంతేయు తోన్
  తానుండంగ నెంత వీరుడును యుద్ధమ్మందు నిన్ గెల్చువా
  రీనేలన్ గన రాడనంచు తెలిపెన్ శ్రీకృష్ణుగాక్రీడితో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "తానుండగనె యెంత..." అనండి. 'శ్రీకృష్ణు డా క్రీడితో' టైపాటు.

   తొలగించండి
 30. తల్లి తన తనయుడు నానితో...

  కం.
  ఈనాడుగాది పండుగ
  ఏనుగు బొమ్మగల చీరనివ్వమనెనుగా!
  కాన కొనుము కోడలికిన్
  నానీ! నీసతి కోర్కె దీర్చినన్ ముదమందున్

  రిప్లయితొలగించండి
 31. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 32. మానినుల కనిశము రజత
  నానా విధ భూషణములు నందము నొసఁగుం
  గానిమ్మిట్టు లొక పరిన్
  నానీ! సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్


  పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
  శ్రీధర్ గారు నవంబర్ 15, 2015 న యీ సమస్యను మీకు సూచించితిరి.
  "నా నీ పత్నికి కోర్కె దీర్ప మనెహన్మంతుండు కౌంతేయతో!"

  అప్పుడు పూరించి యుంచిన దీ పూరణము. ఈ వ్యాఖ్యను గూడ వ్రాసి భద్రపఱచితిని.
  “హన్మంతుండు” అసాధువు. తత్సమముల “న” ఉత్వమునకు లోపము రాదు. ఆచ్ఛికములకు మాత్రమే వచ్చును.


  భీమసేన గర్వభంగానంతరము, తను వచ్చిన కారణము నగ్రజుఁడు హనుమంతుఁడికి భీముఁడు చెబుతున్న సందర్భము:


  నేనీ కానల ధన్యుడం దవ సుసాన్నిధ్యంబు సేకూరగన్
  నానాగంధ సమేత పుష్పముల నానందంబునం గోరె నీ
  శానీ పూజకు ద్రౌప దింపుగ ననున్ సౌగంధికాంభోజముల్
  నా నీ పత్నికి కోర్కె దీర్పమనె నన్మండంత కౌంతేయుతో

  [ అనుమఁడు = హనుమంతుఁడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణ ఉత్తమంగా ఉన్నది. హన్మంతుడు శబ్దానికి చక్కని సవరణ సూచించారు. అభినందనలు.
   గతంలో ఈ సమస్యను శ్రీధర్ గారు సూచించారన్నారు. నేను వెనక్కి (15-11-2015) వెళ్ళి వెదికితే దొరకలేదు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
   పద్య రచన శీర్షికలో:

   sri dharనవంబర్ 15, 2015 12:09 PM
   ఈ సమస్య ను చూడండి గురువుగారు: '' నా నీ పత్నికి కోర్కె దీర్ప మనెహన్మంతుండు కౌంతేయతో !
   ప్రత్యుత్తరం
   ప్రత్యుత్తరాలు
   కంది శంకరయ్యనవంబర్ 15, 2015 12:23 PM
   సమస్య బాగుంది. కానీ శార్దూల వృత్తాన్ని ఎందరు పూరిస్తారో? చూద్దాం... అవకాశాన్ని బట్టి బ్లాగులో ప్రకటిస్తాను.

   తొలగించండి
 33. ఆనాడేశపథంబును
  వీనులలరనట్లుగాను భేషుగ సభలో
  మానుగ చేసినబలసే
  నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్.

  మానిని కోరిన యానగ
  లీనాడే తెమ్ము పుత్ర యిలలో నీవున్
  కానీయని దాటించక
  నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 34. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మానికమగు చేతలతో
  జానుగ నింటిని కదించు జామిని గనుచున్
  తానుగ తల్లియె పలికెను
  నానీ! సతి కోర్కె దీర్చినన్ ముదమందున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కదించు జామిని'...?

   తొలగించండి
  2. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కదించు జామిని'...?

   తొలగించండి
  3. గురువుగారు, నమస్కారములు.
   కదించు= సరితీర్చు; జామి= కోడలు;

   తొలగించండి
 35. డాపిట్టానుండి}
  ఆర్యా}
  కొడుకా. నీభార్య,నేను ఎన్నికల్లో ఇదివరకు ఓడిపోతిమి.నీవేమో ప్రభుత్వోద్యోగివి.ఈసారియైనా, వేంకటేశ్వరాలయ మూర్తి త్రయము జయమును ఇవ్వనీ.ఇచ్చేవారు 2వ పాదములో ఉటంకించ బడినారు.ఈసారినాకోర్కె &నీ సతి కోర్కెయు తీరినచో ఇదివరకులేని ముదము అందుబాటులో ఉంటుంది.ఇది తండ్రి ఆశ.సమస్యలోని అమంగళము ప్రతిహతంబగుగాక.

  రిప్లయితొలగించండి
 36. 23-3-18
  ...........సమస్య
  *"నా నీ పత్నికి కోర్కెఁ దీర్చుమనె*
  *హన్మంతుండు గౌంతేయుతోన్"*

  *హనుమంతుని హామీ*

  సందర్భము: ద్రౌపది సౌగంధికా పుష్పాలు కోరింది. భీముడు బయలుదేరినాడు. ఆతని ననుగ్రహించ దలచిన హనుమంతుడు వృద్ధుని రూపంలో తారసిల్లినాడు. తన తోక నడ్డు పెట్టినాడు. దానిని తోసివేసి వెళ్ళు మన్నాడు. భీముని కది అశక్య మయింది. ఆతని బల గర్వం నశించింది. హనుమంతుడు నిజ రూపంతో ఆశీర్వదించినాడు. కౌంతేయుడైన భీమసేనునితో ఇంకా ఇలా అన్నాడు.
  " రాబోయే కురు క్షేత్ర మహా సంగ్రామంలో పార్థుని రథంమీద కృష్ణు డుంటాడు. పార్థుని ధ్వజంమీద నే నుంటాను. తల యెత్తి చూచే శత్రువులకు గుండెలలో భయం పురికొల్పు తాను. మీకు విజయం తథ్యం."
  ~~~~~~~~
  శ్రీ నాథుం డిదె కృష్ణుడై నిలిచె రా
  శీ భూత కారుణ్యుడై

  తానై పార్థు రథమ్ముపై.. జయము త
  థ్యం బౌను.. టెక్కెంబుపై

  నే నుందున్.. తల యెత్తి చూచు రిపులన్
  బెంబే లొనర్తున్ గ ద

  న్నా! నీ పత్నికి కోర్కెఁ దీర్చు" మనె
  హన్మంతుండు గౌంతేయుతోన్..

  2 వ పూరణము:---

  *హనుమంతుని హితవు*

  సందర్భము: ద్రౌపది సౌగంధికా పుష్పాలు కోరింది. భీముడు తేవడానికి బయలు దేరినాడు. హనుమంతు డతనితో యిలా అంటున్నాడు.
  "ఆనాడు కురుసభలో ద్రౌపదిని తన తొడమీద కూర్చొను మని సైగ చేసినాడు రారాజు దుర్యోధనుడు. వాని తమ్ముడు దుశ్శాసనుడేమో వెంట్రుకలు పట్టి యీడ్చుకు వచ్చి మహా సభలో వస్త్రాపహరణానికి సిద్ధ పడ్డాడు. ఇంతటి అవాంఛనీయ సంఘటనలు జరిగిపోయాయి. అసలు ద్రౌపదికి ప్రధానంగా తీరవలసిన కోరిక లేమిటో గమనించావా! ఆ కోరికలు తీర్చు ముందుగా.. ఈ పూల కోరిక లేమిలే! ఎలాగూ తీరేవే!"
  ద్రౌపది అసలైన కోరికలను గుర్తుకు తెచ్చుకొ మ్మంటున్నాడు ఆంజనేయుడు. అందుకోసం భీముడు ఆ మహా సభలో చేసిన భీషణ ప్రతిజ్ఞలు యెప్పుడూ విస్మరించరానివి. అవి యేమి టంటే దుర్యోధనుని తొడలు విరగ్గొట్టడం. దుశ్శాసనుని రొమ్ము చీల్చి రుధిర పానం చేయడం. అవే అన్నిటికన్నా ప్రధానమైనవి. "ఈ వెంట్రుకలు పట్టి ఈడ్చిన ఆ చేయి" ఖండ ఖండాలుగా నరుకబడా లని ద్రౌపది కోరిక. దుశ్శాసనుని నెత్తుటితో ద్రౌపది కేశపాశాన్ని ముడివేస్తా నన్నాడు భీముడు. ఇవన్నీ ఆషామాషీగా నెరవేరే కోరికలు కావు. ప్రతి క్షణం గుర్తు పెట్టుకొని సమాయత్తం కావలసిన వని గుర్తుకు తెస్తున్నాడు మారుతి.
  వన విహారాలూ ప్రణయ కలాపాలూ పనికిరా విప్పుడు అని చెప్పకుండానే నర్మ గర్భంగా హెచ్చరిస్తూ భీముణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తూ అతనిలోని పరాక్రమాగ్నిని రగుల్కొలిపినాడు మారుతి.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఆనా డట్లు ని జోరు దేశమున కా
  హ్వానించె రారాజు; తా

  మానంబున్ సభలో హరింపగను దు
  ర్మార్గుండు, తమ్ముండు తా

  బూనెన్; ద్రౌపది వేమి కోరికలొ! ఈ
  పూ లేమిలే! భీమసే

  నా! నీ పత్నికి కోర్కెఁ దీర్చు మనె
  హన్మంతుండు గౌంతేయుతోన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 37. 23-3-18 సమస్య
  నా నీ సతి కోర్కెఁ దీర్చినన్
  ముద మందున్

  సందర్భము: మాయలేడిని చూడగానే ఆకర్షింపబడింది సీత. అది తనకు కావలె నని తీసుకు రమ్మన్నది రాముణ్ణి.
  "అన్నా! ఇది రాక్షస మాయ." అన్నాడు లక్ష్మణుడు.
  "మీ వదిన కండగా నీవు పర్ణశాల వద్దనే వుండు. నేను నిజంగానే బంగారు లేడి ఐతే పట్టుకొస్తాను. దానవ మాయ యైతే ఛేదించి వస్తాను." అన్నాడు రాముడు.
  అప్పుడు లక్ష్మణు డీ మాట లంటున్నాడు..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "నే నిచ్చటనే యుండెద..

  దానవ మాయ యదియైన దండించెద వ

  న్నా నీవే! కా దనఁ దగు

  నా! నీ సతి కోర్కెఁ దీర్చినన్

  ముద మందున్"

  2 వ పూరణము:--

  సందర్భము:
  నేను... ఆత్మ స్వరూపుడనైన నేను
  నీవు... దేహధారియైన జీవుడు.(నేను)
  ఆత్మ రూపుడు దేహధారికి చెబుతూ వున్నాడు. ఆత్మ రూపుడికి భార్య ఎట్లాగూ వుండదు.
  (ఇది తనకు తాను చెప్పుకునే స్వగతం..)
  "ఒరే నాన్నా! నీ పింఛనుకు కరువు భత్యం కలిపి వెంటనే నీ భార్యకు కానుక తేనా! సంతోషిస్తుంది." అని భావం.
  దీనికి మూలం శ్రీ మైనంపాటి వరప్రసాద్ గారి కింది రచన... 23.3.18 👇🏼
  ఈనెల నాపింఛెనునకు కానుకగా కలిపి నొసగు కరవను భృతికిన్ నేనొక బంగరు నగ.తే. నా,నీసతికోర్కె దీర్చినన్ ముదమందున్!

  వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఈ నెల నీ పింఛను సతి

  కానుకకై కరువు భృతికి కలిపి త్వరితమే

  నే నొక బంగరు నగ తే

  నా! నీ సతి కోర్కెఁ దీర్చినన్

  ముద మందున్"

  3 వ పూరణము

  సందర్భము: కుంతి సుతులు (ధర్మరాజు భీముడు అర్జునుడు) "నాయొక్క నీయొక్క భార్య కోరిక తీరిస్తే సంతోషిస్తుంది." అన్నారు.
  మాద్రి కొడుకులు (నకులుడు సహదేవుడు) ఆమాట విని అదే మాట అన్నారు.
  ఐదుగురూ ఐదు మాట లన్నా అందరి భార్య ఒక్కతే కాబట్టి ద్రౌపది కోరిక నెరవేరా లన్నది అందరి ఆశయము.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  మానిని కుంతి సుతు లనిరి...

  "నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"

  దాని విని, మాద్రిజు లనిరి...

  "నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"

  4 వ పూరణము:--

  సందర్భము: పంచ పాండవుల నడుమ ద్రౌపది నిలబడింది. వా రందరి మాట ఒక్కటే! "నీయొక్క నాయొక్క భార్య కోరిక తీరాలి."
  ఆ మాటే ద్రౌపదికి వీనుల విందుగా వినిపించింది.
  ~~~~~~~~~~~~~~~~
  మానిని ద్రౌపది నిలిచిన

  దా నడుమను నైదుగురికి,

  ననిరి పతు లిటుల్

  వీనుల విం దగు రీతిగ..

  "నా నీ సతి కోర్కెఁ దీర్చినన్ ముద మందున్"

  5 వ పూరణము:--

  సందర్భము: నిరీశ్వర యాగాన్ని సంకల్పించిన దక్ష ప్రజాపతి యింటికి బయలుదేరింది అతని కూతురు సతీదేవి. భర్తయైన పరమేశ్వరుడు నివారించినాడు. పుట్టింటిమీది వల్లమాలిన మమకారంతో అతని మాటను లెక్క చేయలేదు సతీదేవి. సాక్షిమాత్రుడైన పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
  ఒక మహర్షి వచ్చి చెబుతూ వున్నాడు.. "నీలకంఠా! ఏ మహిళ యైనా పుట్టింటికి ఏ నాడైనా వెళ్ళవచ్చు కదా! అభ్యంతర మే మున్నది?"
  ఇక్కడే వున్నది చిక్కంతా. మెట్టినింటికి ఒకసారి వచ్చిన తరువాత అదే తన యి ల్లౌతుంది. పుట్టిల్లు కూడ పరాయి యిల్లే ఔతుంది. ఈ విషయం చాలా మంది ఈనాటి మహిళలకు కొరుకుడు పడని విషయం. భర్త విలువా భర్త మాట విలువా తెలియకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసు కోవడానికి సతీదేవి కథే చాలు మనకు.
  ఆ జన్మ చాలించి మళ్ళీ పార్వతిగా పుట్టి ఎంతో ఘోరమైన తపస్సు చేసిన తర్వాత గాని పరమేశ్వరుని చేరుకోలేకపోయింది. ఇది కఠోర సత్యం.
  అందుకే నీలకంఠుడు నవ్వాడు.
  ~~~~~~~
  "ఓ నీలకంఠ! నవ్వకు..

  మానిని తన పుట్టినింటి మార్గమునను దా

  నే నాడేన్ జను, విం తగు

  నా! నీ సతి కోర్కెఁ దీర్చినన్

  ముద మందున్"

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 38. నేనున్ వచ్చెద కాననమ్ము కనగా నెర్జాణ, సౌమిత్రి య
  న్నా! నీ పత్నికి కోర్కెఁ దీర్చుమనె;...హన్మంతుండు గౌంతేయుతోన్
  దీనంబొల్లుచు తోకనెత్తమనగా దీర్ఘంపు శ్వాసమ్ముతో
  నానా యాతనలొంది భీముడొసగెన్ నందమ్ముతో వందనల్

  రిప్లయితొలగించండి