1, నవంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 140

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది
బారును సేవించి మంచి బాటను బట్టెన్.
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

 1. ధీరుండై; సత్కవితా
  పారంగతుడై చెలంగి- పండిత రాయం
  డై రాజిలి ఢిల్లీ ద
  ర్బారును సేవించి మంచి బాటను బట్టెన్!!!!

  రిప్లయితొలగించండి
 2. తెలుగుల వెలుగులు 16-17 శతాబ్దాలలో ఢిల్లీ లో ప్రకాశింపజేసిన ' జగన్నాథ పండిత రాయల ' వృత్తాంతం స్మరింపబడినది!

  రిప్లయితొలగించండి
 3. ఏరీతెపుడుదశతిరుగునొ
  ఏరికెరుక? గాదతండు నేతయె! నరసిం
  హారావుగారి జనద
  ర్బారును సేవించిమంచి బాటను బట్టెన్!

  రిప్లయితొలగించండి
 4. అజ్ఞాత గారూ,
  ఎంత చక్కని పూరణ! అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 5. ఊకదంపుడు గారూ,
  మంచి ప్రస్తావనతో సమస్యను పూరించారు. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం ఉంది.
  ఏరీ తెపుడు దశ తిరుగు
  నేరి కెరుక? ..... అంటే సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 6. తెలుగును గౌరవించుదము తెల్గున చక్కగ నూసులాడుచున్
  తెలుగుల పల్కు పోకడల తీపిదనమ్మును పంచిపెట్టుచున్
  తెలుగుల పద్య సౌరభపు తీరున యుల్లము లుల్లసిల్లగన్
  తెలుగుల సాంస్కృతీ విభవ దీధితు లెల్ల ధరిత్రి నిండగన్!

  గురువుగారికీ తోటి కవి కవయిత్రీ మిత్రులకు శుభ కామనలు.

  రిప్లయితొలగించండి
 7. శ్రీ రాముని దరి జేరగ,
  దారుల దరిదాపు గనక, దారిన జూచెన్
  చేరగ లక్ష్యము,చీమల
  బారును సేవించి మంచి బాటను బట్టెన్!

  రిప్లయితొలగించండి
 8. దారుల్గానడు,ధర్మా
  చారత శూన్యము,చదువుల సార మెఱుoగ
  న్నేరడు,ఐనన్,శ్రీద
  ర్బారును సేవించి మంచి బాటను బట్టెన్!

  రిప్లయితొలగించండి
 9. అజ్ఞాత గారూ, మీ పూరణ చాలా అద్భుతంగా వుంది. నేను ఈ రకంగా పూరించవచ్చు అనుకోన్నట్లే వచ్చింది. జగన్నాధ పండిత రాయల ధారణా శక్తి గురించి కథ అందరికీ తెలిసేవుంటుంది. సరస్వతీ పుత్రులు వారు.

  రిప్లయితొలగించండి
 10. ధీరుడు గాంధీ సత్యా
  దూరములను బల్కనంచు దొరలకుఁ జూపెన్
  సారమగు శ్రేష్ట ధర్మము
  బారును సేవించి మంచి బాటను బట్టెన్!

  రిప్లయితొలగించండి
 11. అజ్ఞాతగారి పూరణ అసామాన్యం. వారికి అభివందనాలు.
  నా పూరణ, ఒకింత చిలిపిది:
  గరళము చేరినదేమో,
  హరి కడుపునఁ? దల్లట బలమాయె! నెటులనో
  సారణమని, చివరికి సాం-
  బారును సేవించి మంచి బాటను పట్టెన్.
  (సారణము=విరేచనము)

  రిప్లయితొలగించండి
 12. వేరేల నారసింహుడు
  సారాయిలు పారుచున్న సహపంక్తులలో
  కూరలతో నన్నం సాం
  బారును సేవించి మంచి బాటను బట్టెన్ !

  రిప్లయితొలగించండి
 13. మారని యన్నను కాదని
  ఆ రఘువరు శరణు జొచ్చె, చెలిమిని కోరెన్
  మారుతి గాగల వీరుల
  బారును, సేవించి మంచి బాటను పట్టెన్.

  రిప్లయితొలగించండి
 14. చేరి కమఠమది కొంగల
  బారును సేవించి మంచి బాటను బట్టెన్
  జోరుగ నెగిరెడి వేళ
  న్నూరక నోరెత్తి దండెము విడిచి మడిసెన్.
  నీతి: వినాశకాలే విపరీత బుద్ధి: (చిన్నప్పటి తాబేలు-కొంగల కథ)

  రిప్లయితొలగించండి
 15. మిస్సన్న గారూ,
  తెలుఁగునకు గౌరవమ్మును
  గలిగించఁగ వలయునన్న కాంక్షను మాకున్
  దెలుపుచు హితులకు శుభకాం
  క్షలఁ బలికిన మేటి వీవు గద విస్సన్నా!

  రిప్లయితొలగించండి
 16. మంద పీతాంబర్ గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  నారాయణ గారూ,
  చంద్రశేఖర్ గారూ,
  మీ అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.
  హైదరాబాద్ వెళ్ళే తొందరలో మీ పూరణలను విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ చిన్న సవరణ :

  వేరేల నారసిం హుడు
  సారాయిలు పారుచున్న సహపంక్తులలో
  కూరలతో నన్నము సాం
  బారును సేవించి మంచి బాటను బట్టెన్

  రిప్లయితొలగించండి
 18. మాష్టారూ, మా గురుతుల్యులు, మిత్రులు డా.మూర్తి గారి సూచన మేరకు నాలుగవ పాదములో యతిదోషం సవరించి పంపుతున్నాను.

  చేరి కమఠమది కొంగల
  బారును సేవించి మంచి బాటను బట్టెన్
  జోరుగ నెగిరెడి వేళ
  న్నూరక నోరెత్తి దండె మొదిలి ధరజెల్లెన్.

  రిప్లయితొలగించండి
 19. కోరిన కోర్కెలు తీరగ
  పారాయణ జేసి గుడిని వరుసగ వేయౌ !
  తీరగు శివ లింగంబుల
  బారును సేవించి మంచి బాటను పట్టెన్!!

  రిప్లయితొలగించండి
 20. చారును సాంబారు పెరుగు
  బీరును బిరియాని మేక విడువగ; మేగీ
  తోరము, కేడ్బరి చాక్లెటు
  బారును, సేవించి మంచి బాటను బట్టెన్

  రిప్లయితొలగించండి
 21. బీరును త్యజించి వెలమల
  వీరుడు తెలగాణనందు వేకువ జామున్
  తీరుగ వెల్లుల్లుల సాం
  బారును సేవించి మంచి బాటను బట్టెన్

  రిప్లయితొలగించండి