14, నవంబర్ 2010, ఆదివారం

చమత్కార పద్యాలు - 49

"కాకమాని రాయ!"
ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారిని మూర్తి కవి తన కవిత్వంతో మెప్పించాడు. సంతోషించిన రాయలు అతనికి కాకమాను అనే గ్రామాన్నీ, ఇంద్రనీల మణులు పొదిగిన కుండలాలను దానంగా ఇచ్చాడు.
మూర్తి కవి ఆ కుండలాలను ధరించి వచ్చి సభలో సాటి కవుల మధ్య కూర్చునేవాడు. నల్లని రాళ్ళు పొదిగిన ఆ కుండలాల కాంతి అన్ని దిక్కుల్లో ప్రసరించి మిగిలిన కవుల ముఖాలు నల్లబడుతుండేవి. ఓకరోజు రాయలవారు నవ్వుతూ "ఏమిటీ ... అష్టదిగ్గజాల ముఖాలు నల్లబడ్డాయి?" అన్నాడట.
ఇది మిగిలిన కవులకు అవమానంగా తోచింది. ఎలాగైనా మూర్తి కవి దగ్గర ఆ కుండలాలు లేకుండా చేయాలి. కాని ఎలా? ఎవరు చేయగలరు? అందరూ చర్చించి చివరికి ఆ భారాన్ని తెనాలి రామకృష్ణునిపై పెట్టారు. అతడూ సరేనన్నాడు.
ఒక సాయంత్రం రామకృష్ణుడు మూర్తి కవి ఇంటికి వెళ్ళాడు. మూర్తి కవి ఆ సమయంలో ప్రసన్న చిత్తంతో వీథి అరుగుపై కూర్చుని ఉన్నాడు.
"మూర్తి కవిరాజుకు ప్రణామాలు" అంటూ రామకృష్ణుడు అతన్ని సమీపించాడు.
"ఓహో .. రామకృష్ణుల వారా? ప్రణమాలు. రా .. కూర్చో. ఏమిటీ ఇలా దయచేసారు?" అన్నాడు మూర్తి కవి. ప్రక్కకు జరిగి రామకృష్ణునికి అరుగుపై చోటిచ్చాడు.
రామకృష్ణుడు కూర్చుని " ఆ .. ఏమీ లేదు మూర్తి కవి గారూ, మీ మీద ఒక పద్యం వ్రాసాను. అది మీకు వినిపిద్దామనీ ..." అన్నాడు.
"ఏమిటీ? మీరు నా మీద పద్యం చెప్పడమా? సంతోషం. ఏదీ వినిపించండి" అన్నాడు మూర్తి కవి.
"చిత్తగించండి...
అల్లసాని వాని యల్లిక జిగి బిగి
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు
పాండురంగ విభుని పద గుంఫనంబును
కాకమాని రాయ! నీకె తగుర"
పద్యాన్ని వినగానే మూర్తి కవి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అంత గొప్ప కవుల కవితా విశిష్టతలు అన్నీ కలగలిసి తనలో ఉన్నాయట! అంతే కాక "కాకమాను" గ్రామానికి రాజు నని సంబోధించాడు. ఎంత గొప్ప పద్యం! మూర్తి
కవి ఆనంద పరవశుడై "ఏం కావాలో కోరుకో" అన్నాడు.
"మీ కుండలాలు ప్రసాదించండి" అని వేడుకున్నాడు వినయంగా రామకృష్ణుడు.
మూర్తి కవి సంతోషంగా కుండలాలను తీసి రామదృష్ణునికి ఇచ్చాడు.
మరునాడు సభలో రాయల వారు మూర్తి కవిని చూసి "కవి గారూ! ఈ రోజు మీరు కుండలాలు ధరించకుండా వచ్చా రేమిటి?" అని అడిగాడు.
మూర్తి కవి "మహారాజా! నిన్న రామకృష్ణ కవి నా మీద ఒక పద్యం చెప్పాడు. సంతోషించి ఆ కుండలాలను బహుమానంగా ఇచ్చాను" అన్నాడు.
"ఒక కవిని మెప్పించిన పద్యం అంటే చాల గొప్పదే అయి ఉంటుంది. ఏదీ .. వినిపించండి" అని అడిగారు రాయల వారు.
"నే నెందుకు? రామకృష్ణుడే వినిపిస్తాడు" అని మూర్తి కవి రామకృష్ణునికి సైగ చేసాడు వినిపించ మన్నట్లుగా.
రామకృష్ణుడు ఆ పద్యాన్ని ఇలా వినిపించాడు.
"అల్లసాని వాని యల్లిక జిగి బిగి
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు
పాండురంగ విభుని పద గుంఫనంబును
కాక - మాని రాయ నీకె తగుర"

వినగానే సభ మొత్తం గొల్లుమంది. రాయల వారూ ముసిముసి నవ్వులు నవ్వారు. మూర్తి కవి ముఖం నల్లబడింది.
అసలు విషయం ఏమిటంటే ... మూర్తి కవికి వీపంతా గజ్జి. అందుకని ఆయన తన ఆసనాన్ని ఒక స్తంభం (మాను) దగ్గర వేసుకొని దురద పుట్టినప్పుడల్లా తన వీపును ఆ స్తంభానికి రాస్తూ ఉండేవాడు. ఈ విషయం అందరికీ తెలుసు.
రామకృష్ణుడు మొదట "కాకమాని రాయ" అన్నప్పుడు "కాకమాను అనే గ్రామానికి రాజా!" అనే సంబోధన ఉంది. సభలో "కాక - మాని రాయ" అని విరిచి చదివినప్పుడు " పైన చెప్పిన కవుల ప్రత్యేకతలు వారివే. అవి నీకు కాకుడ పోయి కేవలం "మాని రాయడం (స్తంభానికి వీపు రాయడం) నీకే తగును" అనే అర్థం వచ్చింది.
ఆ విధంగా మూర్తి కవికి శృంగభంగం జరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి