10, నవంబర్ 2010, బుధవారం

సమస్యా పూరణం - 147

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్.

14 కామెంట్‌లు:

 1. ధర వాక్కు కున్నపదునది
  చుర కత్తికి లేదు, మాట చొరబడు మనసున్
  మరి రాయలా చవి మరగి
  కరవాలము విడిచిపెట్టి, కలమును బట్టెన్.

  రిప్లయితొలగించండి
 2. పరిమార్చగ కరవాలము,
  పరివర్తనలకు కలమని,పరిణిత మతితో,
  శిరముల దురుముట తగదని,
  కరవాలము విడిచి పెట్టి,కలమును బట్టెన్!

  రిప్లయితొలగించండి
 3. ధరణిన్ నేరము లెన్నియొ
  పరివారముతోడజేసి పాపాత్ముండే
  చెరబడకుండుట నేతై
  కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్.

  రిప్లయితొలగించండి
 4. మర పరికరముల కిరవై
  త్వరగా పనులాయె నేటి తరుణుల కింటన్
  దరహాస వదన 'కాంతా-
  కరవాలము' విడిచిపెట్టి కలమును బట్టెన్.

  రిప్లయితొలగించండి
 5. నరసింహ కృష్ణ రాయలు
  అరివీరుల నణచి, నుడువ హరి లీలలనున్
  వర గోదాదేవి చరిత
  కరవాలము విడిచి పెట్టి కలమును బట్టెన్.

  రిప్లయితొలగించండి
 6. ఈ పద్యములో పరపీడన ఆలోచన లేశమంతయు లేదు !

  శిరములు దునుమగ దునుమగ
  కరవాలము పదును త్రగ్గి ఖరవాలమయెన్
  పరపీడనకై కవియై
  కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్

  రిప్లయితొలగించండి
 7. శిరములు నరుకుట తగదని
  తరతమ బేధములు లేక దనుజుల రీతిన్ !
  పరహితము గోరి యైనను
  కరవాలము విడిచి బెట్టి కలమును బట్టెన్ ! "

  రిప్లయితొలగించండి
 8. చంద్రశేఖర్ గారూ,
  మంద పీతాంబర్ గారూ,
  ఊకదంపుడు గారూ,
  మిస్సన్న గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  రాజేశ్వరి నేదునూరి గారూ,
  మీ అందరి పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  మా అబ్బాయి పెళ్ళి పనుల్లో వ్యస్తుణ్ణై ఉండడంవల్ల బ్లాగు నిర్వహణలో అనివార్యమైన ఆలస్యం, ఆటంకం తప్పడం లేదు. ఈ పది రోజులూ నేను ప్రహేళికలు సిద్ధం చేసి ప్రకటించడం, క్రమంగా సమస్యలు ఇవ్వడం జరుగక పోవచ్చు. సమయం చిక్కి సమస్యలు ఇచ్చినా అందరి పూరణలను విడి విడిగా వ్యాఖ్యనించలేక పోవచ్చు. ఎలాగూ ప్రస్తుతానికి ప్రహేళిక, గళ్ళ నుడికట్టులు లేవు గనుక ఈ రోజునుండి వ్యాఖ్యల మాడరేషన్ తొలగిస్తాను. ఈ పది రోజులూ పూరణల గుణదోషాలను మీరే చర్చించుకోండి. కవి మిత్రులు అర్థం చేసికొని నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 9. గురువుగారూ
  మీరు వివాహ సందడిని, బంధు మిత్రులతో హడావిడిని సంపూర్ణంగా అనుభవించండి. ఆనందించండి. మాకివి శలవుదినములు. మీ వేడుక ఆనందదాయకంగాను,జయప్రదముగాను సాగించాలని భగవంతునకు మా ప్రార్ధనలు.

  రిప్లయితొలగించండి
 10. మాష్టారు గారు, మీరు పెళ్లి పనులలో బిజీగా వుంటూ కూడా బ్లాగు నిర్వహించటాని వీలైనంతగా ప్రయత్నించటము నచ్చింది. మీ సహృదయానికి వినయపూర్వకంగా, మీ తరగతి విద్యార్ధి వ్రాశాడనుకొని తేలిక పాటి హృదయంతో ఈ మాలిక చదవండి. ఇది మా అందరి తరఫునుంచి:

  శంకరయ్య పంతులుగారు చక్కనయ్య
  కొడుకు పెళ్ళని బడికిని కొంత శెలవు
  నిచ్చె, గాని వదలలేకనిచ్చె రోజు
  కొక సమస్య, పూరించి తీసుకొని రండు
  పూర్తి మార్కులుండవనియు పూస గుచ్చి
  చెప్పె, మామంచి మాష్టారు! తప్ప కుండ
  వంద మార్కులిచ్చుతిరిగి వచ్చి నాక,
  మంచి మాష్టారు, వారిది మల్లె మనసు !
  శుభమస్తు, కల్యాణమస్తు, సమస్త సన్మంగళాని భవంతు!
  మీ,
  చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 11. అరయగనా శ్రీహర్షుడు
  నరవరుడై యలరుచుండి నాగానందమ్
  మురిపెమ్ముగ వ్రాయుటకై
  కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్

  రిప్లయితొలగించండి
 12. తరుగుట పనసలు కిచెనున
  దరిద్రపు పనియని తలచి దండన యాత్రన్
  వరపుత్రి రంగనాయకి
  కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్

  రిప్లయితొలగించండి