6, జనవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1285 (నారికేళజలమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
నారికేళజలమ్ము ప్రాణమ్ముఁ దీయు.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

 1. విశ్వహితముకై త్రాగిన విషముగూడ
  క్షేమకరమగును; పరుల కీడుతలుప
  నాపదలుగల్గు తుదకు దాహమున త్రాగు
  నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు ॥

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ఈ మధ్య ప్రతీ అడ్డమైన, చచ్చిన , జంతు కళేబరాలతో నూనెలు తయారు చేసి
  అసలు నూనెల కంటె అతి తక్కువ ధరలకే విక్రయిస్తున్నారట !
  ఆ నికృష్టమైన నూనెలతో తయారు చేసిన పదార్థాలు తింటే అంతేగా మరి :

  01)
  _________________________________

  నరులకా దేవు డిచ్చిన - నాణ్యమైన
  నమ్మకంబైన నౌషధం - బమ్మ తోడు
  నారికేళ జలమ్ము ! ప్రా - ణంబు దీయు
  నాణ్యతే లేని,దారిపై - నమ్ముచున్న
  నాసి రకమైన తైలపు - గ్రాసము లవె !
  _________________________________
  గ్రాసము = ఆహారము

  రిప్లయితొలగించండి
 3. సీలు జేసిన సలిలమ్ము మేలు యనుచు
  ధరను వెచ్చించి సేవించ తలకు మించి
  నిలువ జేయగ కలిపిన కలుషి తముల ]
  నారి కేళ జలమ్ముప్రాణమ్ము దీయు

  రిప్లయితొలగించండి
 4. సతము బర్గర్లు నూడిల్సు చాల దినుచు
  థమ్సపాదులె హితమని త్రాగుచుండు
  భూజనంబుల తలపున పుచ్చకాయ,
  నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు.

  రిప్లయితొలగించండి
 5. ‘న’ ’ణ’ ల కుయతి మైత్రి కలియు ననెడి మాట
  “నారికేళజలమ్ము ప్రాణమ్ముఁ దీయు”
  పాదమందున చూడ౦గ వచ్చు మిత్రు
  లార! శంకరయ్య గురువుల సమయోచి
  తమ్ము కానవచ్చె గదరా తనివిఁ దీర!

  రిప్లయితొలగించండి
 6. నిఖిలజగముల భాగ్యమ్ము నిర్ణయించు
  గ్రహము లటుపైని యోగంబు లహరహమ్ము
  సహకరించని కాలమ్ము సాగెనేని
  నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు.

  రిప్లయితొలగించండి
 7. దేవుని తీర్థమైతే మాత్రం మునిగితే చీమ బ్రతుకుతుందా...


  నీటిలోన బడిన చీమ నిగుడుగాద
  ప్రకృతి ధర్మంబు, చూడగా ప్రాకిప్రాకి
  తీర్థమేమియు గాదని దిగిన గాని
  నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు.

  రిప్లయితొలగించండి
 8. పూజ్యులు శంకరయ్య గురువు గారికి, పండిత నేమాని గురువు గారికి నమస్సులు.
  నాకు ప్రేరణాస్త్రోతమైన శ్రీ వసంత కిశోర్ గారికి నమస్సులు.
  అయ్యా, వసంత కిశోర్ గారూ, షుమారుగా రెండున్నర సంవత్సరాలక్రితం,ఒకానొక రోజు ఇదే బ్లాగులో మీరు వ్రాసిన వ్యాకరణ పాఠాల ద్వారా చాలా విషయాలు నేర్చుకొని, సమయం దొరికినప్పుడల్లా పద్య రచన చేస్తూ ఉన్నాను. అదే రోజు, మీరు వ్రాసిన వ్యాకరణ పాఠాల గురించి రెండు సంవత్సరాలు పట్టే వ్యాకరణ పాఠాలు ఒకే పోస్ట్ లో నేర్పినందుకు ధన్యవాదములు తెల్పుతూ మిత్రులు కూడా మీ పాఠాన్ని ప్రశంసించారు.
  అలాగే, పండిత నేమాని వారి ఛందస్సు పాఠాలు కూడా నాకు చాలా జ్ఞానాన్ని ఇచ్చాయి. వారికి కూడా ధన్యవాదములు.
  అదే విధంగా యడాగమం నుగాగమం గురించి కూడా ఒకసారి వివరించ వలసిందిగా శ్రీ వసంత కిశోర్ గారిని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 9. శుభ్ర పఱచును రక్తమున్ శుద్ధి గాను
  నారికేళ జలమ్ము , ప్రాణమ్ము దీయు
  క్రుళ్ళి పోయిన వాటిని కుడువ ధరను
  సందియంబును నిసుమంత జెంద వలదు

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  కర్నాటకలో నారికేళ జలము "నీరా " ఎక్కువగా త్రాగుదురు.మన రాష్ట్ర మందు తాటి కల్లు వలెను.
  ============*============
  మరులు గొనుచు ద్రాగ జనులు మంచి దనుచు
  ముందు వెనుక జూడక నేడు,పందుల వలె
  మూడు కాలము లందున ముచ్చట గను
  నారికేళ జలమ్ము ప్రాణమ్ము దీయు!

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులకు వందనములు.
  నేను వృద్ధాశ్రమాన్ని వదిలి మళ్ళీ ఇల్లు చేరుకున్నానని తెలుపుటకు సంతోషిస్తున్నాను. ఈ రెండు నెలలుగా నాకు అన్ని విధాల ధైర్యాన్ని, బ్లాగుకు సహకారాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 12. గూడ రఘురామ్ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘హితముకై’ అనరాదు. ఆ పాదాన్ని ‘విశ్వహితమునకై త్రాగు విషము గూడ’ అందామా?
  *
  వసంత కిశోర్ గారూ,
  అమ్మతోడు!... మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  నేను నెలక్రితం ఒక వృద్ధాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడి వంటలు ఒక రకమైన వెగటు వాసవ వచ్చేవి. బహుశా వాళ్ళు మీరు చెప్పిన నూనెలే వాడేవారేమో! అక్కడ భోజనం నచ్చక మరొక ఆశ్రమానికి మారాను. అక్కడ భోజనం చాలా బాగుంది. అంతమంచి భోజనాన్ని వదులుకొని వచ్చినందుకు ఇప్పుడు కొద్దిగా విచారమూ ఉంది.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘మేలు + అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘మేలటంచు’ అందాం.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  సందర్భోచితమైన పూరణ. బాగుంది. అభినందనలు.
  (తద్భవవ్యాజ యతి : సంస్కృత శబ్దాలలోని ‘జ్ఞ’ తద్భవాలలో నణలుగ రూపొందుతాయి. ఈ వ్యాజం చేత ‘జ్ఞ’తో నణలకు యతిమైత్రి కూర్పబడింది. అనునాసికాలైన న-ణలు సన్నిహితోత్పత్తి స్థానాలను, సమానోచ్చారణ ప్రయత్నాలను కలిగి ఉన్నాయి. గుణము - గొనము మొదలైన చోట్ల నణలు సవర్ణాలు. రామ + అయన - రామాయణ, ప్ర + అన - ప్రాణ మొదలగుచోట్ల నకారం నకారరూపాన్ని పొందుతున్నది. ఈ హేతువు వలన న,ణల మైత్రి యుక్తమని చెప్పవచ్చు.)
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  యడాగమ, నుగాగమాల గురించి పాఠాలు పెట్టాలని చాలారోజులుగా అనుకుంటూనే ఉన్నాను. కాని కొన్ని చీకాకులవల్ల తీరిక దొరకక అవకాశం దొరకలేదు. సాధ్యమైనంత తొందరలో ఆ పాఠాలు పెట్టే ప్రయత్నం చేస్తాను.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. నారికేళ జలమ్ము ప్రాణమ్ము దీయు
  నొక్కొ? చాలించుమయ్య! హాస్యోక్తులింక
  అమృత సమములౌనవి మధురాతి మధుర
  రసమయ కవిత్వ ధార వెల్వడగ జేయు

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

  గురువుగారు ఈ ఉదయం మీ వద్ద నుండి మంచి మాటను వింటిమి.చాలా సంతోషము.

  శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  గురువుగారు నిజముగా యిది హాస్యోక్తే!

  రిప్లయితొలగించండి
 15. గురువు గారు,
  మీరు సంతోషముతో తెలిపిన వార్త శుభవార్త.

  రిప్లయితొలగించండి
 16. వామనకుమార్ గారు,

  వసంత కిశోర్ గారు రెండేళ్ళక్రితం వ్రాసిన వ్యాకరణ పాఠాల సూచిక (link) మరల ఇక్కడ పెట్టగలరా? నా లాంటి ఔత్సాహికులకు అది ఉపయోగపడటమే కాకుండా దానిని వెదికే శ్రమకూడా తగ్గిస్తుందని నా అభిప్రాయం.

  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 17. ఔషధమువలె పని జేయు నను దినంబు
  త్రాగుమని చెప్పు వైద్యుడు తప్పకుండ
  నారికేళ జలమ్ము; ప్రాణమ్ము దీయు
  కల్లు త్రాగిన నొళ్ళుకే గలుగు ముప్పు.

  రిప్లయితొలగించండి

 18. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  కైపు కలిగించు విషములు కలిసినపుడు
  నారికేళ జలమ్ము ప్రాణమ్ము దీయు
  వేదవిదులైనపండితుల్ వెర్రి తలల
  కాపురుష సంగడి జేరి గాము లవరె

  రిప్లయితొలగించండి
 19. ప్రణామములు గురువుగారు,ముందుగా ..మీకు, శ్రీ నేమాని గురువుగారికి, మరియు సాహితీ మిత్రులందరికీ పేరుపేరునా నూతన సంవత్యర శుభాకాంక్షలు..
  నెట్ కి అందుబాటులోలేక చాలా ఆలస్యంగా తెలియజేస్తున్నాను..
  గురువుగారు..మీరు చెప్పిన మంచివార్త సంతోషాన్ని కల్గించింది..ఆ భగవంతునికి చాలాకృతజ్ఞతలు...



  కలుష మంటని జలముగ ఘనత కెక్కి
  మంచి చేయును జనులకు మందు వోలె
  నారికేళజలమ్ము, ప్రాణమ్ము దీయు
  కల్తి సారాయి త్రాగిన కలియుగాన

  రిప్లయితొలగించండి
 20. జలము కన్న మేలును జేయు జనుల కెల్ల
  నారికేళ జలమ్ము,ప్రాణమ్ము దీయు!
  శుద్ధ మనెడి జలమ్ములు సొగసు గాను
  తెలుసు కొనుము మంచిగ నేడు తెలుగు వాడ
  తెలుపు నలుపు గాదు నలుపు తెలుపు గాదు!

  (శుద్ధ మనెడి జలమ్ములు = ప్యాకింగ్ వాటర్ )

  రిప్లయితొలగించండి
 21. ఆర్యా!
  శుభవార్త.
  శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 22. పండిత నేమాని వారూ,
  నేటి సమస్య మీనుండి మధుర రసమయ కవిత్వధారను వెలువరించింది. చక్కని పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  పుష్యం గారూ,
  అవన్నీ ప్రత్యేక పాఠాలుగా కాక వ్యాఖ్యలరూపంలో ఉన్నాయి. వాటిని వెదకడం కాస్త శ్రమతో కూడిన పనే.. అయినా ప్రయత్నిస్తాను.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘కాపురుష సంగడి’ని ‘కాపురుష సంగతి’ అనండి.
  *
  శైలజ గారూ,
  ధన్యవాదాలు!
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. (కొబ్బరి బోండాలలో జిన్ను కలుపుకొని త్రాగే వాళ్ళను విశాఖ బీచిలో చూశాను.)
  మిత్రబృందమ్ముతోఁ జేరి చిత్రమైన
  గతుల సేవింపఁగా ‘జిన్ను’ కలిసినట్టి
  నారికేళజలమ్ము ప్రాణమ్ముఁ దీయుఁ
  గ్రమముగా మన స్వాస్థ్యమున్ సమయఁజేసి.

  రిప్లయితొలగించండి
 24. గురుదేవులు శ్రీ కంది శంకరయ్య గారు నూతన సంవత్సరంలో తిరిగి ఇల్లు చేరుకోవడం ముదావహం.

  రిప్లయితొలగించండి
 25. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  మరియొక పూరణ: మ్రింగవచ్చును హాయిగా మేలు ద్రాక్ష
  కష్ట పడకుండ తినవచ్చు కదళి ఫలము
  తాట పీచులు చీల్చుచు త్రాగ వలెను
  నారికేళ జలమ్ము. ప్రాణమ్ము దీయు
  ననగ సందియ మెందుకు?ననఘులార

  రిప్లయితొలగించండి
 26. శంకరయ్య గురువు గారికి నమస్సులు మరియు అభినందనలు.
  అప్పట్లో శ్రీ వసంత కిశోర్ గారు పోస్ట్ చేసిన వ్యాకరణ పాఠాన్ని ఇక్కడ మరలా పోస్ట్ చేస్తున్నాను.
  page-1
  వసంత కిశోర్ చెప్పారు...
  యతి అనగా పద్యం లోని ప్రతి పాదం లోని మొదటి పదం.
  యతి మరియు యతి మైత్రి :
  పద్య పాదంలో మొదటి అక్షరానికి ఆ పద్యం లక్షణములలో చెప్పబడిన యతి స్థానంలో మైత్రి గల అక్షరాన్ని వాడటాన్నే "యతి మైత్రి" అంటారు.
  యతి అంటే విరామం అని అర్థం.
  లయబద్ధమైన పద్య నడకలో సహజంగా వచ్చే విరామాన్ని యతి స్థానం అంటారు.
  సంస్కృతంలో యతి విరామాన్ని సూచిస్తుంది.
  కానీ తెలుగు పద్యాలలో ఇది అక్షర సామ్యాన్ని నియమిస్తుంది.
  అంటే ఈ యతి స్థానంలో ఉండే అక్షరం పాదం మొదటి అక్షరంతో "యతి మైత్రి" లో ఉండాలనేది నియమం.
  ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం యతి మైత్రిలో ఉంటాయి.
  1.అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
  2.ఇ, ఈ, ఎ, ఏ, ఋ
  3.ఉ, ఊ, ఒ, ఓ
  4.క, ఖ, గ, ఘ, క్ష
  5.చ, ఛ, జ, ఝ, శ, ష, స
  6.ట, ఠ, డ, ఢ
  7.త, థ, ద, ధ
  8.ప, ఫ, బ, భ, వ
  9.ణ, న
  10.ర, ఱ, ల, ళ
  11.పు, ఫు, బు, భు, ము, పొ, ఫొ, బొ, భొ, మొ
  ఇతర నియమములు :
  హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి మైత్రి పాటించాలి.
  అంటే: "చ", "జ" ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా "చ" కి "జి" తో మైత్రి కుదరదు.
  హల్లులకి యతి మైత్రి లేకపోయినా, అవి రెండూ ఋ అచ్చుతో కలిస్తే వాటి మధ్య యతి చెల్లుతుంది.
  ఉదాహరణకు, "ద" కు "గ" యతిమైత్రి లేకపోయినా, "దృ" కు "గృ" కు యతి కుదురుతుంది.
  సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు.
  ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ" గా గానీ "రొ" గా గానీ భావించ వచ్చు.
  ప్రతి వర్గములో చివర ఉన్న అనునాసిక అక్షరానికి (ఙ, ఞ, ణ, న, మ),
  ఆ వర్గంలో ముందు ఉన్న నాలుగక్షరాలతో అవి బిందు పూర్వకములైతే యతి చెల్లుతుంది.
  Page-2
  ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన "న" కు "కంద" లోని "ద" కు యతి చెల్లుతుంది.
  ఉచ్చారణ పరంగా "కంద" ని "కన్ద" అని పలుకుతాం. అందువలన "న్ద"లోని "న"తో యతి కుదురుతుంది.
  "మ" కు పూర్ణబిందుపూర్వకమైన య, ర, ల, వ, శ, ష, స, హ లతో యతి కుదురుతుంది.
  ఇదే విధంగా, ఒక అక్షరం ముందున్న అక్షరం పొల్లుతో అంతమైతే,
  ఆ పొల్లుతో కూడా యతిమైత్రి జరుగుతుంది.
  ఉదాహరణకి యీ కింద పద్యంలో చివరి పాదం చూడండి:
  "జ"ననీస్తన్యము గ్రోలుచున్ జరణ కం"జా"తంబునన్ గింకిణీ
  స్వన మింపారగ దల్లి మేన మృదుల "స్ప"ర్శంబుగా దొండ మ
  ల్లన యాడించుచు జొక్కు విఘ్నపతి యు"ల్లా"సంబుతో మంత్రి వె
  "న్న"నికిన్ మన్నపు పొంపుమీర నొసగు"న్ భ"ద్రంబు లెల్లెప్పుడున్ !
  చివరి పాదంలో మొదటి అక్షరం "న". యతిస్థానంలోని అక్షరం "భ".
  ఈ రెండు హల్లులకీ యతి చెల్లదు.
  కానీ, "భ"ముందు పదం "నొసగున్"లో "న్" ఉంది కాబట్టి, దానికి "న"తో యతి చెల్లుతుంది.
  యతిస్థానంలో సంధి జరిగినప్పుడు, సాధారణంగా సంధి జరగకముందు ఉన్న అక్షరంతోనే యతిమైత్రి జరుగుతుంది.
  ఉదాహరణకు, ఈ కింద పద్యంలో రెండు, నాలుగు పాదాలు గమనించండి:
  "అం"కము జేరి శైలతన"యా" స్తనదుగ్ధములాను వేళ బా
  "ల్యాం"క విచేష్ట దొండమున "న"వ్వలి చన్ గబళింపబోయి యా
  "వం"క గుచంబు గాన కహి "వ"ల్లభ హారము గాంచి వే మృణా
  "ళాం"కుర శంక నంటెడి గ"జా"స్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్ !
  రెండవ పాదంలో, మొదటి అక్షరంలో సంధి జరిగింది, "బాల్య + అంక".
  అలాగే యతిస్థానంలో (10వ అక్షరం) కూడా సంధి జరిగింది, "తొండమునన్ + అవ్వలి".
  సంధి జరగక ముందున్న అక్షరాలు "అం"కు, "అ"కు యతిమైత్రి జరిగింది.
  అలాగే నాల్గవ పాదంలో, "మృణాళ + అంకుర", "గజ + ఆస్య". అక్కడ "అం"కు "ఆ"కు యతిమైత్రి.
  యతి అక్షరాలలో ఒకటి అచ్చు అక్షరం మరొకటి హల్లు అక్షరం అయితే, వాటి మధ్య యతి కుదరదు.
  ఉదాహరణకి పాదంలో మొదటి అక్షరం "అ" అయితే, యతిస్థానంలో "క" అనే అక్షరం ఉండాలంటే, యతిమైత్రి కుదరదు.
  అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది.
  సంబోధనలో చివరి అక్షరం హల్లయినా, దానికి అచ్చుతో యతిమైత్రి కుదురుతుంది.

  రిప్లయితొలగించండి
 27. Page-3
  ఉదాహరణకి మొదటి అక్షరం "అ" అయినప్పుడు,
  "అక్కా!", "ఔరా!" వంటి పదాలలోని "క్కా", "రా" అక్షరాలు యతిస్థానంలో ఊండవచ్చు,
  వాటికి "అ"తో యతిమైత్రి చెల్లుతుంది.
  పై చెప్పినవి కాక మరికొన్ని ప్రత్యేక యతి మైత్రులు ఉన్నాయి. కాని అవి అరుదు.
  ప్రాస నియమములు:
  ప్రధమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును. అనగా అదే గుణింతము నుండి ఉండవలెను.
  ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.
  ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.
  ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.
  ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు మాత్రమే ప్రాస కుదురును.
  మిగిలిన హల్లులకు కుదరదు . అనగా క-ఖ, గ-ఘ మొదలైన వాటికి ప్రాస కుదరదు !
  గురు, లఘువులు :
  మాత్రయన నొక్క లఘువగు
  మాత్రలు రెండైన గురువు - మఱి యెన్న బడున్ !
  ధాత్రిని నఱువది నాలుగు
  మాత్రలుగా గందమునకు - మాత్రలు వెలసెన్ !
  వివరణ-మాత్ర యనగా ఒక చిటిక వేయునంత కాలము !
  ఒక్క మాత్రా కాలములో నుచ్ఛరింపబడు అక్షరము లఘువు !
  అ-ఇ-ఉ- క- చ- ట- య- మొదలగునవి !
  రెండు మాత్రల కాలములో నుచ్ఛరింపబడు అక్షరము గురువు !
  ఆ-ఈ- ఊ- ఐ-ఔ- కా-శ్రీ-పే-మౌ- సీ- మొదలగునవి !
  కందపద్యమునకు అఱువది నాలుగు మాత్రలుండును!
  page-4
  దీర్ఘాచ్చులును, దీర్ఘాచ్చులతో గూడిన హల్లులును గురువు లగును !
  సంయుక్తాక్షరమునకు పూర్వాక్షరము గురువు !
  అమ్మ-లో -అ- గురువు -మ్మ-లఘువు
  కన్య-లో -క- గురువు -న్య-లఘువు
  చక్రము-లో -చ- గురువు -క్ర-లఘువు -ము- లఘువు
  పొల్లుకు , సున్నకు, విసర్గకూ ముందున్న అక్షరములు గురువులు !
  మిగిలినవి లఘువులు !
  గురు లఘువుల గుర్తులు :
  I --- లఘువు
  U --- గురువు
  గణము :అక్షర సముదాయము గణ మనబడును !
  A)ఏకాక్షర గణములు : ఇవి - 2
  01) I --- ల - గణము
  02) U --- గ - గణము
  B) రెండక్షరముల గణములు : ఇవి - 4
  01) II--- లలము
  02) UU--- గగము
  03) UI--- హ -గణము
  04) IU--- వ -గణము
  C) మూడక్షరముల గణములు : ఇవి - 8
  01) UUU--- మ - గణము
  02) UII--- భ - గణము
  03) IUI--- జ - గణము
  04) IIU--- స - గణము
  05) III--- న - గణము
  06) IUU--- య - గణము
  07) UIU--- ర - గణము
  08) UUI--- త - గణము
  Page-5
  ఈ 8 గణములు 2 కందాల్లో :
  01)
  గురువులు మూడిడ , మ గణము
  పరగంగా, నాది గురువు - భ గణంబయ్యెన్ !
  ధర మధ్య గురువు , జ గణము
  సరసగుణా ! యంత్య గురువు-స గణం బయ్యెన్ !
  02)
  న గణంబు మూడు లఘువులు
  య గణంబున కాది గురువు-యమతనయ నిభా !
  ర గణంబు మధ్య లఘువగు
  త గణంబున కంత్య లఘువు-దాక్షిణ్య నిధీ !
  ఉప గణములు :
  సూర్య,ఇంద్ర,చంద్రగణములు ఉపగణములనబడును !
  నల, నగ , సల, భ , ర , త , లునా
  నెలమిని నీ యాఱు గణము - లింద్ర గణంబుల్ !
  గల, నగణము లీ రెండును
  జలజాప్త గణంబు లయ్యె - జగదాధారా !
  వివరణ :
  ఇంద్ర గణములు : ఇవి - 6
  నల, నగ, సల, భ , ర, త
  సూర్య గణములు : ఇవి - 2
  హ , న
  చంద్ర గణములు : ఇవి 14
  వీని కుపయోగము తక్కువ గాన అవసరము లేదు !
  Page-6
  కందము యొక్క లక్షణములు :
  సాధారణముగా పద్యమునకు నాలుగు పాదము లుండును ! కందమున
  01) బేసి (1,3) పాదములకు 3 గణములు
  సరి(2,4) పాదములకు 5 గణములు ఉండును !
  02)ఇందు - గా - భ - జ - స - నల - అను 5 గణములు మాత్రమే ఉపయోగించవలెను !
  ఈ 5 గణములూ 4 మాత్రలను మాత్రమే కలిగి యుండును గావున మాత్రాగణము లందురు !
  03)1,2, పాదములలో (3+5) 8 గణములూ
  3,4,పాదములలో(3+5) 8గణములూ ఉండును !
  ఇందు 6 వ గణము "నల"ము గాని "జ" గణము మాత్రమే గాని యుండవలయును !
  04)8వగణముచివర తప్పక గురువేయుండవలెను !
  అనగా 8 వ గణము " స "గణము గాని "గగము" గాని యుండవలయును !
  05)బేసి (1,3,5,7) గణములందు " జ "గణము ఉండరాదు !
  06)బేసిపాదములు చిన్నవిగావున అచట యతి లేదు
  07)2 వ , 4 వ పాదములందు ఆ పాదాద్యక్షరములకు,4 వ గణము మొదటి అక్షరమునకు యతి మైత్రి గూర్చ వలెను !
  08) ప్రాస నియమము గలదు !
  వామన్ కుమార్ గారూ !
  ఇదంతా ఛందస్సు నందు ప్రాథమిక పరిఙ్ఞానము మాత్రమే !
  మిగిలిన విషయములు మీరు పుస్తకముల ద్వారా తెలుసుకొన గలరు !
  ఇప్పుడు మీ పద్యములో తప్పొప్పులు మీరే తెలుసుకొన వచ్చును !
  శ్రీ వసంత మహోదయా! అమోఘం, ఒక సంవత్సర కాలం పట్టే పాఠం నాలుగు పోస్టింగులలో వేసి నేర్పించారు.
  పాఠకలోకంతరఫునుంచి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 28. Page-7
  (2) యతి స్థానములో ప్రాసను వేయుట ప్రాసయతి అంటారు. ఇలా ప్రాస యతిని తేటగీతి, ఆటవెలది, సీసము మొదలైన పద్యములలో వాడుతారు. ప్రాసనియమము లేని పద్యములలో మాత్రమే ప్రాసయతిని సాధారణముగా వాడవచ్చును.
  తేటగీతి, ఆటవెలది, సీసము మొదలైన తెలుగు ఛందస్సునకు సంబంధించిన జాతి పద్యములలోనే ప్రాస యతిని వేయవచ్చును. వృత్తములలో ప్రాసయతి పనికిరాదు. ప్రాస నియమములేని పద్యములలో మాత్రమే ప్రాసయతిని వాడుకొనవచ్చును.
  శ్రీ వసంత కిశోర్ గారు అడిగిన యతుల గూర్చి ఈ క్రింది వివరించుచున్నాను:
  6. పంచమీ విభక్తి యతి:
  పంచమీ విభక్తిలో పదముల చివర అన్నన్, అంటెన్ అనునవి చేరునపుడు వీటి ఆద్యచ్చుకే కాక ఆ అచ్చుతో కూడిన హల్లుకు కూడ యతి చెల్లును.
  ఉదా: నిన్ను జెరగొన్న హైహయు
  కన్నన్ దోర్వీర్య మెక్కుడగు భార్గవులీ
  లన్నిర్జించిన రాముని
  కన్నన్ శూరుడు ముజ్జగంబుల గలడే
  (2వ పాదములో అచ్చునకు, 4వ పాదములో హల్లునకు యతి చెల్లినది).
  7. ఫ్లుత యుగ మిశ్రమము:
  కాకుస్వర (శోక భయాదులవలన కలిగిన ధ్వని) ఫ్లుత (దూరాహ్వానము, రోదనము, గానము, సంశయము స్ఫురించునప్పుడు వచ్చు దీర్ఘ స్వరము) యతులకు చెందిన పదాంతాచ్చులు పరస్పరము యతి చెల్లినను, అచ్చులతో కూడిన హల్లులు పరస్పరము యతి చెల్లినను ఫ్లుగయుగ యతి యగును.
  ఉదా: మాయ రవియేల గ్రుంకడొ
  కో యను నిట్లేల దడసెనో యను గ్రుంకం
  8, విశేష యతి:
  జ్ఞకారమునకు క, ఖ, గ, ఘ లు యతి చెల్లవచ్చుననియు ఇట్లు చెల్లుట విశేషయతి యగునని అప్పకవి యొక్కడే చెప్పినాడు.
  ఉదా: జ్ఞానికి కేవల కృప న
  జ్ఞానికి నుపదేశ విధి బ్రకాశము సేయం

  రిప్లయితొలగించండి
 29. నారి కేళ జలమ్ము ప్రాణమ్ము దీయు
  సైనికులకు రణమునందుశక్తినిడును,
  పిల్లలకు, వృద్దులకు, రోగులెల్లరకును
  నీరసమ్మును బోగొట్టు నిశ్చయముగ !!!

  రిప్లయితొలగించండి
 30. చివరిలో పోస్ట్ చేసిన యతుల గురించిన వివరాలు పండిత శ్రీ నేమాని వారు పోస్ట్ చేసినవి. వీటన్నింటినీ నేను పదిలంగా భద్రపరచుకున్నాను. మరలా ఈ రోజు పునరావృత్తం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 31. మత్తు కలవాటు పడినట్టి మానవాళి
  మద్యమొక్కటె ప్రాణమ్ము మాక నంచు
  నందు రట్టి వారలకు నీ యౌషధమగు
  నారికేళ జలమ్ము ప్రాణమ్ము దీయు.

  రిప్లయితొలగించండి
 32. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  ధన్యవాదాలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. "నారి, కేళి, జలమ్ము ప్రాణమ్ము దీయ
  గలవు జాగ్రత మండలకాల" మనెడు
  గురువు మాట వేగరి చేర్చె కుపతి కిటుల:
  "నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు"

  రిప్లయితొలగించండి
 34. రామకృష్ణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 35. గురువులకు ధన్య వాదములు
  నూతన సంవత్సరం శుభా కాంక్షలు హమ్మయ్య సంతోష కరమైన వార్త జెప్పారు చాలా ఆనందంగా ఉంది హాయిగా మరదలితో పిల్లలతో మనవలతో సుఖంగా ఉండా లని కోరుతూ దీవించి అక్క

  రిప్లయితొలగించండి
 36. శంకరార్యా ! ధన్యవాదములు !
  మీ అరణ్యవాసం , అఙ్ఞాతవాసం దిగ్విజయంగా
  ముగిసినందులకు ఆనందముగా నున్నది !
  ఇక పట్టాభిషేకమే !!!

  వామన కుమార్ గారూ ! ధన్యవాదములు !
  పాత విషయాలు బాగా గుర్తు చేసారు !

  ఇక యడాగమ, నుగాగముల గురించి గురువుగారే చెప్పాలి !
  నేను చాలాకాలం నుండి గురువు గారిని ప్రార్థిస్తున్నాను !
  కాని వారికి దయ కలగడం లేదు !

  రిప్లయితొలగించండి
 37. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  దోషములను సవరించ మనవి...

  అధిక లాభమ్ము నాశించి అక్రమముగ
  వర్తకమ్మును జేయు వ్యాపారి యొకడు
  మందు కలుపుచు కాయల మక్కబెట్టి
  అమ్ముచున్నట్ల వానిని నమ్మి కొనిన
  నారికేళ జలమ్ము ప్రాణమ్ము దీయు.

  రిప్లయితొలగించండి