10, జనవరి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1289 (భవతారక మగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భవతారక మగును మాంసభక్షణ మెపుడున్.

32 కామెంట్‌లు:

 1. అవరోధము లేదనగను
  భవ తారక మగును మాంస బక్షణ మెపుడున్
  శివ నామము జపియిం చుచు
  భవ బంధములు మరచి భాగ్య మటంచున్

  రిప్లయితొలగించండి
 2. శివనామస్మరణం బది
  భవతారకమగును, మాంసభక్షణ మెపుడున్
  నవరుగ్మతలకు మూలం
  బవనిం దెలియంగవలయు నఘమందించున్.

  రిప్లయితొలగించండి
 3. వివిధములౌ జాడ్యములీ
  యవనిన్ జంతువులలోన నలమిన వేళన్
  చవిగొన దలచిన నిజముగ
  భవతారకమగును మాంసభక్షణ మెపుడున్.

  రిప్లయితొలగించండి
 4. శివశివ వినలేనియ్యది
  కవివర మీరాడుమాట, కలలోనైనన్
  చెవులన్ బడనీయకుడిది
  'భవతారకమగును మాంసభక్షణ మెపుడున్'

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  శివ నామము జపియి౦పగ
  భవ తారక మగును . మాoసభక్షణ మెపుడున్
  భవ బంధములను బాపు క
  సవు మేసెడి సాధు జoతు జాలము కెల్లన్

  రిప్లయితొలగించండి
 6. శ్రీ శంకరయ్య గురువు గారికి , పండిత శ్రీ నేమాని వారికి నమస్సులు.

  శివనామము జపియించుట
  భవతారకమగును; మాంస భక్షణమెపుడున్
  జవజీవములను జంపును
  కువలయ ప్రియధారి జపము గూర్పగ రారే !

  చవితిన విఘ్నేశ పూజ
  భవతారకమగును; మాంస భక్షణమెపుడున్
  నవనాడుల పీడించును
  భవితవ్యము కోరి ఘనుని భజియింప గదే !

  అనిజపతి పూజించుట
  భవతారకమగును; మాంసభక్షణమెపుడున్
  భువిజుల క్లేశము బెంచును
  తవణించిన హరిని గొల్చి తరియింపగదే !
  (తవణించు = విలసిల్లు, అవనిజ = సీత)

  రిప్లయితొలగించండి
 7. నవనవలాడువపువు మా
  నవులకు ప్రాప్తించుఁదినగఁనవశాకములన్
  సవురులుడుగును తనుఃప్రా
  భవతారకమగును మాంసభక్షణమెపుడున్ |

  రిప్లయితొలగించండి
 8. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణలో భావం సందిగ్ధంగా ఉంది. నాల్గవ పాదంలో గణదోషం.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మారెళ్ళ వామన్ కుమార్ గారూ,
  మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం (శపూజ - జగణం బేసిస్థానంలో). ఆ పాదాన్ని ‘చవితిన్ విఘ్నేశుఁ గొలువ’ అందాం.
  మూడవ పూరణలో అవనిజలో ‘వ’ టైపు కాలేదు.
  *
  గూడ రఘురామ్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. నాగరాజు రవీందర్ గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. స్తవనీయమగునె మనుజుల
  కవనిన్ పలుజీవతతుల నంతమొనర్పన్
  భువిలోన చూడఁగ పరా
  భవతారకమగును మాంసభక్షణమెపుడున్.

  రిప్లయితొలగించండి
 11. శివనామ జపము చేతను
  భవతారకమగును,మాంస భక్షణ మెపుడున్
  చవి నెరుగక జేసినచో
  భవు డతి సమ్ముదము నొందు బాపును వెతలన్

  రిప్లయితొలగించండి
 12. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
  ===========*============
  స్తవనీయ రామ నామము
  భవతారకమగును,మాంసభక్షణమెపుడున్.
  నవనాడులను జెరచునట,
  భువిజనులార తెలియుడని పొలతియు దెలిపెన్!

  రిప్లయితొలగించండి
 13. శివశివ శివ యనినంతనె
  భవతారక మగును , మాంసభక్షణ మెపుడున్
  అవసరముగాదు జనులకు
  భువిలో జీవాలుజంప భుజియించుటకున్

  రిప్లయితొలగించండి
 14. చవటా! వినలేము కదా
  భవ తారక మగును మాంస భక్షణ మెపుడున్
  భువిపై నని యాపుము నీ
  యవహేళన పాప ముడుగ ప్రార్థింప దగున్

  రిప్లయితొలగించండి
 15. కువలయమునహరినామము
  భవతారకమగును, మాంసబక్షణ మెపుడున్
  అవగడముతెచ్చుచుండును
  భువిజనులకుమేలుగాదు భుజియింపంగన్

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

  వివిధ భ్రాంతుల చేత శ
  తవిధములగు గ్రామ దేవతామూర్తులకు
  న్నవిరత జంతు బలుల నిడ
  భవతారక మగును మాంసభక్షణ మెపుడున్

  రిప్లయితొలగించండి
 17. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  కానీ మాంసభక్షణం పరాభవంనుండి ఎలా తరింపజేస్తుంది?
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘అవకార్యం’...?
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ఇంతకీ మాంసభక్షణను భవుడు ఆమోదిస్తాడంటాడు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  గ్రామదేవతలను కొలిచే కొందరు బలులు, మాంసభక్షణమే భవతారకంగా భావించడం చూస్తున్నాము కదా!

  రిప్లయితొలగించండి
 19. శివనామ జపము చేతను
  భవతారకమగును,మాంస భక్షణ మెపుడున్
  భువి జేయక నుతి జేసిన
  భవు డతి సమ్ముదము నొందు బాపును వెతలన్

  రిప్లయితొలగించండి
 20. యువకులగు నాటగాళ్ళకు
  జవసత్త్వములుడుగకుండ శక్తిని బొందన్
  వివరింత్రు శిక్షకులిటుల
  భవతారకమగును మాంస భక్షణమెపుడున్.

  రిప్లయితొలగించండి
 21. శివరాత్రి వేళ మాంసము
  చవి జూచుట మానలేవె సఖుడా యన్నన్
  రవి యిట్లనియెన్ నవ్వుచు
  భవతారక మగును మాంసభక్షణ మెపుడున్.

  రిప్లయితొలగించండి
 22. గండూరి లక్ష్మినారాయణ గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  ధన్యవాదాలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 23. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మరి యొక పూరణ:శివ!పరమేశ్వర!గుణసం
  భవ!తారక మగును. మాంస భక్షణ మెపుడున్
  ఛవి చూడుము నైవేద్యము
  భవ!యని యర్పించె నొక్కవ్యాధుడుప్రీతిన్

  రిప్లయితొలగించండి
 24. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  భవ శబ్దాన్ని సంబోధనగా చేసిన మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
  కానీ శివుణ్ణి ‘భవుడు’ అనవచ్చు కాని ‘గుణసంభవుడు’ అన్న పర్యాయపదం ఉన్నట్టు వినలేదు. నా సవరణ...
  శివ! పరమేశ్వర! శంకర!
  భవ! తారక మగును...

  రిప్లయితొలగించండి
 25. j
  శంకరయ్య గారికి వందనములు
  శివాయ ,పరమేశ్వరాయ శశిశేఖరాయ నమః ఓం
  భవాయ ,గుణ సంభవాయ నమః ఓం అని భజన కీర్తన
  ఉన్నది ‘ఆయినా మీ సవరణ కు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 26. రవికుల తిలకుని నామము
  భవతారకమగును; మాంస భక్షణ మెపుడున్
  కువలయమునసహజపుక్రియ
  యెవరికి నెయ్యెది యుచితమొ యెవ్వడె రుంగున్ ?

  రిప్లయితొలగించండి
 27. తిమ్మాజీ రావు గారూ,
  నన్ను మన్నించండి. నేను కేవలం పర్యాయపద నిఘంటువు చూచి ఆ అభిప్రాయానికి వచ్చాను. మీ ప్రయోగం సరియైనదే.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. అవిరళముగ నరులందరు
  చవిగొని బిరియాని ఖీమ సతతము మెక్కన్
  భువిలో జింకల మేకల
  భవతారక మగును మాంసభక్షణ మెపుడున్

  రిప్లయితొలగించండి
 29. మాయా బజారులో లంబూ జంబూ:

  అవురా వంకలు పెట్టిరి
  చవిగొను వంటలను చూసి చంపుకు తినుచున్
  చవటలు వీరికి బహుశా
  భవతారక మగును మాంసభక్షణ మెపుడున్

  రిప్లయితొలగించండి


 30. మవహిద్ భక్తులు గా మా
  ర్చు విదురునిగ వచ్చెనతడు రూఢిగ అల్లా
  అవతారముగ నరబ్బున
  భవతారక మగును మాంసభక్షణ మెపుడున్


  జిలేబి

  రిప్లయితొలగించండి