27, జనవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1306 (శివుని నైన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శివుని నైన గాసిచేయఁగలరు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

  1. శివుని నైన గాసి చేయవచును గాని
    దాని ఫలము తెలియదా కవీంద్ర?
    భస్మ మయ్యె మున్ను భస్మాసురుడు కదా!
    శివుని యందు భక్తి చేర్చు ముక్తి

    రిప్లయితొలగించండి
  2. సురలు మెచ్చియిడిన వరగర్వమునుపొంది
    ఘోర పాత కముల ఘోష బెట్టు
    యసుర తతు లనంగ యాగముల్ చెడగొట్టి
    శివుని నైన గాసి చేయ గలరు

    రిప్లయితొలగించండి
  3. మనిషి మనిషి లోన మరుగున పడియుండు
    నివురు గప్పి నట్టి నిప్పు వోలె
    యసురు లనగ వారు దాసోహ మనకుండ
    శివుని నైన గాసి చేయ గలరు

    రిప్లయితొలగించండి
  4. సందేహం -"శివుడ నైన..." అని గానీ "శివునైన..." అనిగానీ అనుట సమంజసమేమో, "శివుని నైన..." అనుట ఒప్పేనా?

    రిప్లయితొలగించండి
  5. భయము గొల్పె నాడు భస్మాసురాఖ్యుండు,
    త్రోసె కుక్షిలో గజాసురుండు
    దుష్టు లసురజాతి దుర్మార్గచరులౌచు
    శివునినైన గాసి చేయగలరు.

    రిప్లయితొలగించండి
  6. సహదేవుడు గారి పూరణ....

    మ్రొక్కు లెన్నొ మ్రొక్కి మోదముఁ గలిగించి
    వరము లంద గానె పరము మఱచి
    పాప కర్మ జేసి వరగర్వ బలిమితో
    శివుని నైన గాసి చేయ గలరు

    రిప్లయితొలగించండి
  7. లోకమందు నిట్టు లోకులు దలుతురు
    దుష్ట జనులు జేయు దురితములను
    గుడినెగాదు మ్రింగి గుడిలోని లింగమ్ము
    శివుని నైన గాసి చేయ గలరు.

    రిప్లయితొలగించండి
  8. వరముఁ బొంది మున్ను భస్మాసురుండు నీ
    శ్వరుని సంహరింప సాహసించె
    శివునినైన గాసి చేయఁగలరుగాని
    తుదకు సమసిపోరె తుచ్చులగుచు

    రిప్లయితొలగించండి
  9. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈ నాటి అందరి పూరణలును అలరించు చున్నవి. అందరికి అభినందనలు.

    శ్రీమతి రాజేశ్వరి గారు:
    మీ 2 పద్యములును బాగుగ నున్నవి.
    1వ పద్యములో ఘోషపెట్టు + అసుర = నుగాగమము వలన ఘోషపెట్టు నసుర అగును.
    2వ పద్యములో: అసురులు - దాసోహము అను పదములకు ప్రాస యతి చెల్లదు.
    అందుచేత అసుర అను పదమునకు బదులుగా దనుజ అను పదమును వాడవచ్చును.

    శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు:
    భస్మాసురుని గజాసురుని గురించి మీరు చెప్పిన పద్యము బాగుగ నున్నది.

    శ్రీ సహదేవుడు గారు:
    వరగర్వము గలవారిని ఉట్టంకించుచు మీరు చెప్పిన పద్యము బాగుగ నున్నది.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్రి గారు:
    గుడిని లింగమును కూడా మ్రింగేవారి గురించి మీ ప్రస్తావన బాగుగ నున్నది.

    ఆరీ సుబ్బా రావు గారు:
    మీ పద్యము బాగుగ నున్నది. 2, 3 పాదములలో యతిని మీరు వేయలేదు.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
    భస్మాసురు వృత్తాంతముతో మీ పద్యము బాగుగ నున్నది.

    స్వస్తి.


    రిప్లయితొలగించండి
  10. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పేరులో టైపు తప్పు దొరలినది.

    శ్రీ సుబ్బా రావు గారి పేరులో టైపు తప్పు దొరలినది. (శ్రీకి బదులుగా ఆరీ అని పడినది)
    దిద్దుకొని చదువుకొనమని మనవి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. గుడిని శివుని మ్రింగు గ్రూరులు హీనులు
    శివుని నైన కాసి చేయగలరు
    చేటు చేరు వరకు చెడుగుదే విజయము
    చీమలేమెరుంగు శివుని మహిమ

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    =============*================
    వరము లొంది రిపులు పరమ దయాళుడు
    శివుని నైన గాసి చేయ గలరు
    వాసి కెక్కితి మని వరగర్వులై,ఫలి
    తమ్ము ననుభవించు నవని యందు!

    రిప్లయితొలగించండి
  13. ఆది దేవుడన్న యాతడే తెలియుము
    చూడనెంచి బ్రహ్మ యోడెనంద్రు
    కలనుఁగూడ పలుక వలదు! యెవ్వరెచట
    శివుని నైన గాసిచేయఁగలరు?

    రిప్లయితొలగించండి
  14. శ్రీ వరప్రసాద్ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము వర బల గర్వ మత్తుల గురించి బాగుగ నున్నది. అభినందనలు.
    1వ పాదములో: దయాళువౌ - అందాము.
    4వ పాదములో: అనుభవమగు - అందాము.

    శ్రీమతి శైలజ గారు :
    మీ పద్యము బాగుగ నున్నది. గుడిని గుడిలో లింగమును మ్రింగే వారిని గూర్చి భావము బాగుగ నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీమతి లక్ష్మీ దేవి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము ప్రశ్నార్థకముతో శివుని మహిమను బొగడుచు బాగుగ నున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. ఈ రోజు సమస్యకు మూలమైన పద్యము శ్రీ రామ దాసు చరిత్రము లోనిది, కానీ పద్యములో తప్పులున్నవని నా సందేహము, గురుదేవులు సవరించి అర్థమును(భావమును)దెలుప ప్రార్థన !

    సీ : శ్రీకరమై బుధ సేవ్యమై సుజన సాలోక్యమై, కుజన విలోచితమగు
    శివుని నైనను గాసి జేసి వాసి కెక్కు రాసింగముల చేత భావమగుచు
    స్వ కులో చితక్రియాదము చే జెలు వొందు శూద్ర సమాను భద్ర మగుచు
    ధనదుని కైనను తగ నీ వినొగగా వైశ్యులకును రత్న వనధి యగుచు
    కలిత కాసాల వన వాటి కాయుదంబు
    పతిత సారంగ జంభీర పనస వకుళ
    నారి కేళాది తరువి తా నామృతంబు
    నగుచు ధర నొప్ప గోల్గొండ నగర మెలమి!

    రిప్లయితొలగించండి
  17. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
    సవరణలతో.....
    =============*================
    వరము లొంది రిపులు పరమ దయాళువౌ
    శివుని నైన గాసి చేయ గలరు
    వాసి కెక్కితి మని వరగర్వులై,ఫలి
    తమ్ము ననుభవమగు నవని యందు!

    రిప్లయితొలగించండి
  18. శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.

    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. ధరను భస్మ యనెడ సురుడు శివుని గోరె
    చేయి వెట్ట శిరము చిద్ర మయ్యి
    భస్మమగునని మఱి , భవునిపై కరమిడ
    శివుని నైన గాసి చేయ గలరు

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

    కనబడు నని బలికె కంబంబు ననొకండు
    రాగమొంది బిలిచె రామునొకడు
    కొలను నొకడు జిక్కి గొంతెత్తె ; భక్తులు
    శివుని నైన గాసి చేయఁగలరు.
    _______________________________
    గాసి = శ్రమము, ఆధారము - శబ్దరత్నాకరము
    _______________________________

    మరొక పూరణ

    భవుని జంపనోపు భస్మాసు రుండంచు
    దలచి యుంటిరేమొ దనుజులపుడు
    అని గజాసురు గని యనిరట దనుజులు
    శివుని నైన గాసి చేయఁగలరు.
    ________________________________
    గాసిచేయ = నాశము చేయ , ఆధారము - శబ్దరత్నాకరము

    రిప్లయితొలగించండి
  21. కరము తలను బెట్టి కాల్చ నెంచె నొకండు
    కడుపు లోన నొకడు కట్టి వైచె
    మూఢ భక్తి తోడ మురిపించి మెల్లగా
    శివుని నైన గాసిచేయఁగలరు

    రిప్లయితొలగించండి
  22. శ్రీ భాగవతుల కృష్ణా రావు గారూ! నమస్కారములు.
    మీ 2 పూరణలు బాగుగ నున్నవి. అభినందనలు.

    శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనముల

    ధనము మదము పొగరు దర్పాంధు లొక్కరే
    శివుని నైన గాసి చేయ గలరు
    శిష్టులార వినుడు శివ నింద జేసిన
    దక్షుడొకడు మృత్యు దష్టు డవడె?

    రిప్లయితొలగించండి
  24. పరమ శివుడు భక్త వరదుడు గావున
    తపము సలిపి భక్త తతులు వింత
    వింత వరము లడిగి వివశుని జేయుచు
    శివుని నైన గాసి చేయగలరు.

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులకు నమస్కృతులు.
    వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసికొని ఇంతకుముందే తిరిగి వచ్చాను.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన మిత్రులు...
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    సహదేవుడు గారికి, (వీరు పూరణను నా మెయిల్‍కు పంపితే, మా మేనకోడలు కాపీ & పేస్ట్ చేసింది)
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    వరప్రసాద్ గారికి,
    లక్ష్మీదేవి గారికి
    నాగరాజు రవీందర్ గారికి,
    సుబ్బారావు గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    మిస్సన్న గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    మిత్రుల పూరణల గుణదోషాలను విచారించి, తగిన సూచన లిచ్చిన పండిత నేమాని గురువర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు.
    *
    రేపటి సమస్య నాకు, మీకు ఒక పరీక్ష. ఎన్నాళ్ళనుండియో ఇవ్వనా, వద్దా అని వెనుకముందులాడి ఇప్పుడు ఇస్తున్నాను. పూరించే ప్రయత్నం చేయండి. పూరణ చేయకున్నా మీ అభిప్రాయాలను తెలపండి.

    రిప్లయితొలగించండి