26, జనవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1305 (భారతదేశ మొక్కటిగ)

కవిమిత్రులారా,
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భారతదేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

35 కామెంట్‌లు:

 1. భారత పౌరు లెల్లరు ప్రపంచపు శ్రేయము గోరు వారలే
  వారికి నెందు జూచినను స్వార్థ మొకించుక యేని లేదు పెం
  పారుత విశ్వమెల్లయను వారి తలంపుల జూడ నక్కటా!
  భారత దేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 2. నేరము లెన్నిజేసినను నీతుల నెంచక దైవసన్నిధిన్
  భారము నీదటంచు మది భారము దింపగ కోట్ల కానుకల్
  కోరిక దీర్చుచున్ నురిసి కొండల రాయడు పెంపు మీరగా
  భారత దేశ మొక్కటిగ వర్ద్ధిలు మాట యసత్య మే కదా

  రిప్లయితొలగించండి
 3. ధారుణియందుమాదు చరితంబె మహోజ్వలమంచుబల్కుచున్
  సారవిహీనభావముల(శాంతిని వీడినమానసంబుతో
  ఘోర అయోమయంబరయు గొర్రెలమందలు పౌరులవ్వగా
  భారతదేశమొక్కటిగ వర్ధిలుమాటయసత్యమేగదా !

  రిప్లయితొలగించండి
 4. భారత దేశమే పరుల పాలయె నేమనియందు ఘోరమౌ
  నేరచరిత్ర వారలకు నేస్తము చెప్పగ సిగ్గుసిగ్గురా
  చోరులు మందబుద్ధులగు సోనియ గొర్రెల పెంపకంబులో
  భారతదేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 5. నేరపరాయణుల్ ఘనులు నేతలుగా వెలుగొందుచుండగా
  పౌరులనెల్ల గొర్రెలుగ భావన సేయుచు నేలుచుండగా
  ఘోరముగా ప్రజాధనము కోట్లకు కోట్లుగ దోచుచుండగా
  భారత దేశమొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి !

  మిత్రులందరికీ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు !

  కొడుకును ప్రధానిని చేద్దా మనుకున్న వారి కోరికా తీరదు
  వారసత్వంగా ప్రధాని నౌదా మనుకున్న వారి కోరికా తీరదు
  ముఖ్యమంత్రుల మౌదా మనుకున్న వారి కోరికా తీరదు(79/80)
  లక్షల ఉద్యోగాలు వచ్చేస్తా యనుకున్న వారి కోరికా తీరదు
  ఎకరానికి కోటి కొల్లగొట్టేద్దా మనుకున్న వారి కోరికా తీరదు
  కలిసుండి అందరం బాగుందా మనుకున్న వారి కోరికా తీరదు
  విడిపోయి బాగుపడి పోదా మనుకున్న వారి కోరికా తీరదు
  ఇంతెందుకు ?
  అసలెవ్వరి కోరికా తీరదు


  అసంబద్ద,అసంగత , అసమర్థ , అర్థంపర్థం లేని
  ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల !

  ఏ ప్రయోజనమూ నెరవేరని నిష్ప్రయోజన విభజన యిది !

  మరెందుకీ విభజన ?

  ఈ దేశంలో యింకా ఉద్యమాలు చెలరేగడానికీ
  విభజన వాదుల వికృత నాట్యాలకూ
  ఈ దేశం యింకా యింకా ముక్కలు కావడానికీ
  తద్వారా ఈ దేశ ఐక్యత దెబ్బతినడానికీ
  ఈ దేశం బలహీనమవడానికీ
  విదేశీ శక్తులు పన్నిన కుట్ర యిది !

  అలా కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
  జై హింద్ !

  01)
  _____________________________________

  తీరునె కోరికల్ , తెలుగు - దేశము ముక్కలు చెక్క లైనచో ?
  ఆరని చిచ్చు రేగ, మన - యాంధ్రుల రెండుగ వేరు జేసినన్ ?
  వేరుల జేయుటే మొదలు - పెట్టిన నాగునె , యొక్క చోటునన్ ?
  వారల గూడ జీల్చమని - వందల దుష్టులు దేశమంతటన్
  వారము లోపె కోరుదురు - బందుల జేయుచు చిందు లేయుచున్ !
  వారల నాప నెవ్వరట - వాదము జేసిన , నాంధ్ర రాష్ట్రపున్
  తీరును జూపి, పిచ్చిగను - దేశము ముక్కలు చేయ బూనుచో
  మారిగ మారినట్టి మన - మంచిని గోరని మూర్ఖ నాయకుల్
  బోరున నేడ్చుచూ జనులు - మొత్తిన , హత్తిన , చీదరించినన్
  వేరులు జేయ దేశమును; - వింత యదేలనొ ? సత్వరంబునన్
  భారతదేశ మొక్కటిగ - వర్ధిలు మాట యసత్యమే కదా !
  _____________________________________
  తీరునె = తీరునా (తీరవు)
  తెలుగు దేశము = ఆంధ్రప్రదేశ్

  రిప్లయితొలగించండి
 7. చోరకళాప్రవీణులును, సోదరభావము లేనివారలున్
  కోరికమీర నిత్యమును కోట్లు గడించుట యేకలక్ష్యమై
  నేరపరాయణత్వమున నిష్ఠనుబూనెడు నేతలుండగా
  భారతదేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. మారము మేమటంచు పలుమారులు చెప్పిన మానమింక మే
  మూరక నుండబోమనుచు నున్మద చిత్తము బూని దేశమున్
  కోరికదీర ముక్కలుగ కోసెడి వారలు నిండియుండగా
  భారత దేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 10. కారణజన్ము లాఘనులు గాంధి రచించిన మార్గమందుచున్
  పోరిరి ధన్యులైరిగద! పూర్వమటంచును పర్వవేళలో
  చేరి యుపన్యసించెదరు, చేయరొకింతయు దేశసేవయున్
  భారతదేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 11. వేరుగ నున్న సంస్కృతులు, భిన్న మతంబులు, భిన్న భాషలన్
  తీరుగ గల్గినట్టి మన దేశ సమైక్యతఁ దెబ్బ దీయుచున్
  ఘోరముగా నమాయకుల గొంతులు గోసెడు నేతలుండగా
  భారత దేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 12. వీరులు స్వేచ్ఛకోసమని భేదములెన్నక పోరుసల్పుచున్
  వారధిగాను నిల్చి మన భారత ప్రాంతము లన్నిచోటులన్
  ధీరతతో స్వరాజ్యమును దెచ్చిరి, వీడుచు బంగ్ల పాకులన్
  భారత దేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  భారతకాలమందుననె భ్రాతలు చీల్చదలంచ దెశమున్
  కోర స్వతంత్రమాంగ్లునను కుచ్ఛిత బుద్ధిని చీల్చి బంపి రీ
  దారుణ రుగ్మతల్ పెరిగి తామరతంపరలయ్యె నేడిటన్
  భారతదేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 16. గురువర్యులు శ్రీకంది శంకరయ్య గారికి, శ్రీనేమాని గురువర్యులకు మరియునితర కవిమిత్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  కోరికలెన్నొ హెచ్చి తమకున్ తమవారికి దోచిపెట్టి యీ
  తీరుగ దేశసంపద వితీర్ణతఁ భంగముజేసి జాతిపై
  భారము మోపగన్ ధనిక వర్గము, పేదల యంతరంబుతోన్
  భారతదేశమొక్కటిగ వర్ధిలు మాట యసత్యమేగదా!

  రిప్లయితొలగించండి
 17. మారును కాలమున్ మతపు మౌఢ్యము మాయును సోదరాళిలో
  వేరుపు వాదముల్ సమసి విశ్వ కుటుంబపు భావ మేర్పడున్
  భారతదేశ మొక్కటిగ వర్ధిలు, మాట, యసత్యమే కదా
  చోరులు హంతకుల్ కలిని సోకుల రీతి చరించు టిద్ధరన్.

  రిప్లయితొలగించండి
 18. మిత్రులందరికి శుభాశీస్సులు.
  ఈనాటి పూరణలు అన్నియు అలరించు చున్నవి.
  అందరికి అభినందనలు.

  శ్రీమతి రాజేశ్వరి గారు:
  నేతలు నేరములు చేయుచు, దేవునికి ముడుపులు చెల్లించుచూ, కోరికలు పెంచుకొనుట గూర్చి చక్కగా చెప్పేరు. పద్యము బాగుగ నున్నది.

  శ్రీ గూడ రఘురాం గారు:
  గొర్రెల మందల వంటి ప్రజల గురించి ప్రస్తావించేరు. పద్యము బాగుగ నున్నది. ఘోర + అయోమయము = అనుచోట సంధి యగును. పౌరులవ్వగా అను ప్రయోగము సాధువు కాదు. పౌరులౌటచే అనుట బాగుండును.

  శ్రీ చంద్రశేఖర్ గారు:
  మన దేశమునకు పరపాలనా దౌర్భాగ్యము తప్పుట లేదని వాపోయేరు. పద్యము బాగుగ నున్నది.

  శ్రీ వసంత కిశోర్ గారు:
  ఉత్పలమాలికలో ఎన్నో అక్రమములను ప్రస్తావించేరు. మంచిని గోరని నాయకుల పాలనను ఉట్టంకించేరు. పద్యము బాగుగ నున్నది.

  శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు:
  3 పద్యములలో వివిధములగు నేటి పోకడలను తేటతెల్లము చేసేరు. పద్యములు బాగుగ నున్నవి.

  శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
  2 చక్కని పద్యములు వ్రాసేరు. 1. అమాయక ప్రజల గొంతులు కోసే నాయకులు; 2. స్వాతంత్ర్య యోధులను బొగడుచు.
  బంగ్లపాకులన్ - అంటే అర్థము కాలేదు.

  శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
  చక్కని పద్యము వ్రాసేరు. భారత కాలము నాటినుంచి మరియు ఆంగ్ల పాలనను గూర్చి కూడా బాగుగా సెలవిచ్చేరు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 19. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
  శుభాశీస్సులు. ధనిక వర్గాల అత్యాశలు, దోపిడులు, ధనిక - పేద అంతరములను చక్కగా ప్రస్తావించేరు. పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  శ్రె మిస్సన్న గారు: శుభాశీస్సులు.
  మంచి పద్యము వ్రాసేరు - భవిష్యత్తు బాగుండుననే ఆశాభావము వ్యక్తము చేయుచూ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. శ్రీ రమణీయ ధర్మ గుణ శీలురు పౌరులు పెంపునొంద దీ
  క్షారతి దేశ పాలకులు సంతత సౌఖ్యము సంఘటింప నీ
  ధారుణి సర్వతోముఖ హిత ప్రతిపాదకమౌటఁ దథ్యమౌ
  భారత దేశమొక్కటిగ వర్థిలు మాటయ - సత్యమే కదా !

  రిప్లయితొలగించండి
 21. చాలా రోజులకు డా. విష్ణునందనుల రమణీయ పూరణ కనువిందు చేసింది చక్కని విరుపుతో.

  రిప్లయితొలగించండి
 22. డా. విష్ణునందన్ గారూ! అభినందనలు.
  మీ పద్య రామణీయకమును గూర్చి శ్రీ మిస్సన్న గారు చక్కగా చెప్పేరు. వారి ప్రశంస సముచితమే. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 23. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు


  భారత దేశ మైక్యముగ పాలన జేయగ సంవిధానమున్
  గూరిచి నొక్కకేతనము,కూరిమి,ధర్మవివక్షత లేమి,పౌరులన్
  ధీరత దేశభక్తులుగతీరిచిదిద్దగ మార్గమేర్పడన్
  భారత దేశ మొక్కటిగవర్ధిలుమాటయ సత్యమే గదా

  రిప్లయితొలగించండి
 24. పండిత నేమాని గురుదేవులకు నమస్కారములు,
  (బంగ్ల పాకులన్) బంగ్ల, ను బంగ్లాదేశ్ గా, పాక్ ను పాకిస్తాన్ గా గమనించవలసినదిగా గురుదేవులకు మనవి.

  రిప్లయితొలగించండి
 25. వీరులు స్వేచ్ఛకోసమని భేదములెన్నక పోరుసల్పుచున్
  వారధిగాను నిల్చి మన భారత ప్రాంతము లన్నిచోటులన్
  ధీరతతో స్వరాజ్యమును దెచ్చిరి వీడుచు బంగ్ల పాకులన్
  భారత దేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి
 26. శ్రీ తిమ్మాజీ రావు గారికి శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అబినందనలు.
  2వ పాదములో చివరలో అక్షరములు ఎక్కువగా నున్నవి.
  గూరిచి + ఒక్క = గూరిచి యొక్క అని యడాగమము అగును. నుగాగమము రాదు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 27. పండిత నేమానిను గారికి మీ సూచన మేరకు పద్యమును
  సవరించితిని ధన్యవాదములు

  భారత దేశ మైక్యముగ పాలన జేయగ సంవిధానమిం
  పారగ నొక్కకేతనము, ధర్మ వివక్షత లేమి,పౌరులన్
  ధీరత దేశ భక్తులుగ తీరిచి దిద్దగమార్గమేర్పడ న్
  భారత దేశ మొక్కటిగవర్ధిలుమాటయ సత్యమే గదా

  రిప్లయితొలగించండి
 28. ధారగ క్షీరముల్ కురియ ద్రావరె గానపు సోమధారలన్?
  స్వారసమొప్పగా కవులు సాహితి పండ- క్షుధార్తిఁ దీర్పరే?
  పేరిమి కూర్పవే వివిధ పేరుల నృత్యపు రీతులిద్ధరన్?
  శారద తల్లియై జనుల చల్లగ చూడగ వేల చేతులన్-
  భారతదేశ మొక్కటిగ వర్ధిలు! మాట యసత్యమే కదా,
  నేరముఁ జేయువారిగని నీరసమెక్కుడు పెంచఁబల్కినన్.

  రిప్లయితొలగించండి
 29. మెచ్చుకోలు కురిసిన శ్రీ మిస్సన్న గారికి , అనుమోదించిన శ్రీ పండిత నేమాని గారికి బహుధా ధన్యవాదాలు .

  రిప్లయితొలగించండి
 30. శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.
  మీరు పద్యమును సవరించుట బాగుగనే యున్నది. కాని సవరణ వలన యతి భంగము ఏర్పడినది. స్వస్తి.

  శ్రీమతి లక్ష్మీదేవి గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  3వ పాదములో వివిధ పేరులు అను సమాసము బాగుగ లేదు. సవరించండి.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 31. అయ్యా,
  ధన్యవాదాలు.
  సవరించినాను.

  ధారగ క్షీరముల్ కురియ ద్రావరె గానపు సోమధారలన్?
  స్వారసమొప్పగా కవులు సాహితి పండ- క్షుధార్తిఁ దీర్పరే?
  పేరిమిఁ గూర్పవేమి కనువిందగు నృత్యపు రీతులిద్ధరన్?
  శారద తల్లియై జనుల చల్లగ చూడగ వేల చేతులన్-
  భారతదేశ మొక్కటిగ వర్ధిలు! మాట యసత్యమే కదా,
  నేరముఁ జేయువారిగని నీరసమెక్కుడు పెంచఁబల్కినన్.

  రిప్లయితొలగించండి
 32. కవిమిత్రులకు నమస్కృతులు.
  వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసికొని తిరిగి వచ్చాను.
  గణత్రంత్ర దినోత్సవాన్ని పురస్కరించి నేనిచ్చిన సమస్యకు చక్కని పూరణలు వ్రాసిన మిత్రులు...
  పండిత నేమాని వారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  గూడ రఘురామ్ గారికి,
  చంద్రశేఖర్ గారికి,
  వసంత కిశోర్ గారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  భాగవతుల కృష్ణారావు గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  మిస్సన్న గారికి,
  డా. విష్ణునందన్ గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  లక్ష్మీదేవి గారికి
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  మిత్రుల పూరణల గుణదోషాలను విచారించి, తగిన సూచన లిచ్చిన పండిత నేమాని గురువర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 33. వీరులు సంఘటించినది పుణ్యపు క్షేత్రము నేలుచున్ భళా
  తీరిక మీర నేతలిట తిప్పలు పెట్టుచు మాటిమాటికిన్
  జారులు చోరులన్ కలిసి జాగ్రత లేకయె వీడదీయగా
  భారతదేశ మొక్కటిగ వర్ధిలు మాట యసత్యమే కదా!

  రిప్లయితొలగించండి