1, జనవరి 2014, బుధవారం

శుభాకాంక్షలు.

నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు .....

జేజే నూతన వత్సరమ్మ! భువన శ్రేయోనుసంధాయినీ!
జేజే మంగళ యోగ పర్వకలితా! జేజే వినోదాత్మికా!
జేజే సంతత ధర్మ మార్గనిరతా! జేజే వివేకోజ్జ్వలా!
జేజే యంచివె గూర్తు స్వాగత నతుల్ స్నిగ్ధాంతరంగమ్మునన్.


మూడు పంటలు కేదారముల జెలంగు
శాంతి సౌభాగ్యములు వికాసమ్మునొందు
వ్యాధులెల్ల నశించు స్వాస్థ్యంబు దనరు
ప్రజలు సుఖమొందెదరు నూత్న వత్సరమున 


గోలి హనుమచ్ఛాస్త్రి.....

పదమూడు వెడలి పోయెను
పదునాలుగు రెండు వేల పైనను వచ్చెన్
పదిలముగా సుఖశాంతులు
వదలక మీకందవలయు వత్సరమందున్. 


గండూరి లక్ష్మినారాయణ.....

మీ తలచు కార్య సిద్ధిని,
ఖ్యాతిని పెంపొంద జేసి యాద్యాంతంబున్
నూతన సంవత్సర శ్రీ
మాతా శీస్సులనిడి కుసుమంబుల జల్లున్. 


సహదేవుడు....

నూతన వత్సర మియ్యిది
యాతనల ముగింపు పాడి యైశ్వరమిడున్
చైతన్య స్రవంతి! సుధా
గీతిక వలె రాగ భావ కీర్తుల నొసగున్ 
  


హరి వేంకట సత్యనారాయణ మూర్తి ....

భారతావనిలోన భాగ్యరేఖలు పండి
..........ప్రజలెల్ల సుఖములన్ బడయవలయు,
సోదరత్వపుగంధ మీ దివ్యభువిలోన
..........వ్యాప్తమై హర్షంబు లందవలయు,
ధర్మమార్గమునందు ధరవారలెల్లరు
..........చరియించి సుఖముల నరయవలయు,
సంకల్పశుద్ధితో జనసమూహములన్ని
..........సత్కార్యమగ్నులై సాగవలయు,
ఇనుమడించు యశము లీవత్సరంబంత
ప్రజల కందవలయు బహుళగతుల,
నఖిలభారతాన నారోగ్యభాగ్యంబు
లందుచుండవలయు ననవరతము.


విద్యార్థిలోకాన వినయదీప్తులు కల్గి
..........విజ్ఞానపవనాలు వీచవలయు,
ఛాత్రు లీధరలోన శ్రద్ధపూనుచునుండి
..........నవ్యమార్గంబూని నడువవలయు,
నిత్యంబులైనట్టి నికషలన్నింటిలో
..........ఘనమైన విజయముల్ గలుగవలయు,
విద్యార్జనంబందు విజ్ఞతన్ జూపించి
..........యన్నింట మెప్పుల నందవలయు,
నిట్టు లెల్లగతుల నీవత్సరంబంత
విద్యనేర్చువారి యుద్యమమున
సానుకూలమౌచు సంతసంబందించు
చుండుగాత, భారతోర్విలోన.


పాలకాగ్రణులందు మేలైన భావాల
..........జన్మంబు లీనేల జరుగవలయు,
భరతభూభాగాన పరమతసహనంబు
..........నిరతసౌఖ్యదమౌచు పెరుగవలయు,
బహుకష్టములనుండు భాగ్యహీనుల జూచి
..........కఠినుల హృదయముల్ గరుగవలయు,
సస్యవర్ధకమైన సద్వృష్టి కలుగంగ
..........ధరలవృద్ధి యొకింత తరుగవలయు,
రమ్య మైనట్టి యీవత్సరంబునందు
దేవుడిలలోన దయతోడ తిరుగవలయు,
స్వార్థభావైకకారణ జన్యమైన
నరుల మనముల కుటిలంబు విరుగవలయు.


భాగవతుల కృష్ణారావు.....

శ్రీయున్ సౌఖ్యము శాంతి సంపద యశశ్రీ వైభవోపేతమై
పీయూషంబు సృజించి మానవులలో పెంపారు సౌశీల్యతన్
శ్రేయోభావము పెంచి విశ్వజన సంక్షేమమ్ము వర్ధిల్లగా
జేయున్ గావుత నూత్న వత్సరము రంజిల్లంగ నల్దిక్కులన్. 


సుబ్బారావు....

ఇరువది, యొకటి యు, నాలుగు
నరయంగా మంచి సంఖ్య యన్నిటి కంటెన్
తిరముగ వత్సర మంతయు
సిరి రాసుల నిచ్చి మనకు శ్రీ పతి జేయున్.


కెంబాయి తిమ్మాజీ రావు....

శ్రేయోదాయక విభవ
శ్రీయుతమై విశ్వ జనులు ప్రీతిని జెందన్
బాయక ధర్మ పథమున స
హాయపడగ హితవు నూత్న హాయన మొసగెన్  


బొడ్డు శంకరయ్య.....

ప్రీతిగ స్వాగత మిడెదము
జాతికి మేల్గూర్చు క్రొత్త సాలుకు నేడే
ఖ్యాతిని గలిగించు మనకు
నూతన సంవత్సరంబు న్యూనత మాన్పున్.
 


కందుల వరప్రసాద్....

నూతన వత్సరమా! యీ
భూతల మందున జనులకు పొంకమలరగన్
ఖ్యాతి నిడి, మమ్ము గురువుల
ప్రీతికి దాసులను జేసి పేరిమి నిమ్మా!  


మిస్సన్న...

హ్యాపీ న్యూ యియరా మా
కాపదలను కల్గనీకుమా మా కెపుడున్
చూపుచు చక్కని బాటను
దీపింపగ జేయుమమ్మ స్థిరముగ భావిన్. 

2 కామెంట్‌లు:

 1. సోదర సోదరీ మణులకు నూతన సంవత్సర శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 2. గురువులకు, పెద్దలకు, కవిమిత్రులకు నూతన వత్సర శుభాకాంక్షలు.


  హ్యాపీ న్యూ యియరా మా
  కాపదలను కల్గనీకుమా మా కెపుడున్
  చూపుచు చక్కని బాటను
  దీపింపగ జేయుమమ్మ స్థిరముగ భావిన్.

  రిప్లయితొలగించండి