11, జనవరి 2014, శనివారం

సమస్యాపూరణం - 1290 (మామ ముగ్గుఁ బెట్ట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
మామ ముగ్గుఁ బెట్ట మగువ మురిసె.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

  1. మామ ముగ్గు బెట్ట మగువ మురిసె నటంచు
    చెప్పెదేల? నిజము కప్పెదేల?
    మామ ముద్దు బెట్ట మగువ మురిసె గదా
    సరస వచన చతుర శంకరార్య!

    రిప్లయితొలగించండి
  2. ఇద్ద రింతు లెచట ముద్దుగ నుందురో
    కలసి మెలసి, యచట కలదు సుఖము
    అత్త నేర్పు తోడ యందమలరు చంద
    మామ ముగ్గుఁ బెట్ట మగువ మురిసె.

    మా రాజేశ్వరక్కయ్య గారే మంటారో చూద్దాం.

    రిప్లయితొలగించండి

  3. సోదరుల అభిమానానికి ధన్య వాదములు కానీ ఈమధ్య చాలా తప్పులు వస్తున్నాయి ప్చ్ ! ఎందుకో తెలియదు ఐనా సరదాగా


    ఇంతు లెంద రున్న యింపైన తీరుగా
    చక్క బఱచు నత్త నిక్క ముగను
    చంద మామ వంటి చక్కనైన మేన
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె
    ========================


    అమ్మ తమ్ము డనగ యందాల చంద్రుడు
    పెండ్లి యాడ నెంచె ప్రీతి గాను
    సంత సమున యతడు సంక్రాంతి దినమున
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్య గారు , సమస్య భలే ఉందండీ . సమస్య చదవగానే మా మాష్టారు గుర్తుకొచ్చారు. ఆయన కి ముగ్గులు పెట్టడం భలే సరదా ! డ్రాయింగ్ బాగా వచ్చు వారికి . ఇంటి ముందు వాళ్ళ భార్య తో పొటీ పది ముగ్గు పెట్టే వారు .. రంగులద్దడం లో వారికి వారే సాటి .చివరికి ఆయనే గెల్చే వారు .. మేము విజేత లని నిర్ణయించే వాళ్ళం ఎంతో సరదాగా ఉండేది ( వారు వాళ్ళ అక్కయ్య కూతురునే పెళ్లి చేసుకున్నారు)

    ఇంతటి చక్కటి సమస్య ఇచ్చినందుకు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  5. నింగి వాకి లంచు నెరజాణ తలపోయ
    పండు వెన్న లంతపిండియయ్యె
    చుక్కలన్ని కలసి చక్కనౌ నొక చంద
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె !!

    రిప్లయితొలగించండి
  6. కవిమిత్రుల ముగ్గు పూరణలు ముద్దుగానున్నవి..అందరికీ అభినందనలు.
    నేనూ చందమామనే పట్టుకున్నాను.

    పట్నవాసి, భోగి పండుగకే వచ్చి
    మనుమరాలు పల్లెదనము మెచ్చె
    మామ్మగారు నేర్ప మాపటికే చంద
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    ముగ్గును ముద్దు చేసిన మీ పూరణ చమత్కారజనకంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    చందమామ ముగ్గుతో మీ పూరణ అందంగా ఉంది. అభినందనలు.
    ‘తోడ నందమలరు..’ అనండి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. ‘చక్కనయిన మేన..’ అంటే సరి!
    కొన్ని యడాగమాలు తప్పుగా ప్రయోగించారు. ‘ఉన్న నింపైన, అనగ నందాల, సంతసమున నతడు’ అనండి.
    *
    పరుచూరి వంశీకృష్ణ గారూ,
    ధన్యవాదాలు.
    మీ ధన్యవాదాలు సమస్య నిచ్చిన వరప్రసాద్ గారికి చెందాలి.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణలో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు. చాలా బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ముగ్గులోకి దించిన మేనమామ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ చందమామ ముగ్గు ముచ్చటగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అనుభవజ్ఞురాలు నైన యత్త గనుక
    నాకలికి మనుమఁ డఱచి యేడ్వ
    నడిగె కోడ లన్న మదియె ఘనపదార్థ
    మామ ముగ్గుఁ బెట్ట మగువ మురిసె.
    (పదార్థము + ఆమము + ఉగ్గు)
    ఆమము = పక్వము కానిది, అఱుగనిది.

    రిప్లయితొలగించండి
  9. వయసు మనసు కలిసి వరుస కుదిరి పెండ్లి
    యైనరేయి వీపు పైన జేరి
    గోట నల్ల నల్ల గొలుసులు త్రిప్పుచూ
    మామ ముగ్గుఁ బెట్ట మగువ మురిసె.

    రిప్లయితొలగించండి
  10. సరసమాడ వచ్చె సంక్రాంతి పండుగకు
    పట్టణమును వదలి పల్లె టూరు
    ముగ్గులోన దించ ముచ్చట పడి మేన
    మామ ముగ్గుఁ బెట్ట, మగువ మురిసె.

    రిప్లయితొలగించండి
  11. మామ ముగ్గు బెట్ట మగువ మురిసె నట
    సహజ మ యది తనదు సహచరుండు
    తనకు సాయ మొంద దన్వి సంతస మొంద
    యమ్మ సోద రుండె యతడు మఱి ని

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...

    ముందుగా అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

    శ్రీ పరుచూరి వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు.
    కానీ ఈ సమస్య ఒక నా విద్యార్థిని మామను జూచి యిచ్చినది
    =============*================
    చదువు "కొన్న "తరుణి సరిగమలను బల్కి
    యింటి పనులు వీడి యింద్ర భోగ
    ములను పొందె, యింటి ముంగట యుదయమ్ము
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె !

    రిప్లయితొలగించండి
  13. సోనియా మన్మోహన్ ల పై
    ============*=================
    అడుగడుగున మంచి యవినీతి కంపు ద
    శ దిశల జన నేడు చక్కగాను
    పొక్కు చుండ పొడులు,బుద్ధి బలము తోడ
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె !
    (పొడులు=సమస్యలు)

    రిప్లయితొలగించండి
  14. రక్షక భటులు తుపాకి గుళ్ళను ముగ్గు వలె బెట్టు, అటుల లాలు ప్రసాదు
    ============*==================
    గడ్డి దినుచు వేగ ఖరము వలెను బాగ
    సిరులు కూడ బెట్టి, సిగ్గు వీడి
    తన తనయుల బిలచి దాచిన సోమ్ముతో
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె !

    రిప్లయితొలగించండి
  15. తెల్లవారకుండ తెల్లని ముగ్గులు
    పెట్టదలచు వేళ వెన్నెలలల
    ముంగిలందగించ ముద్దు గురియు చంద
    మామ ముగ్గుఁ బెట్ట మగువ మురిసె.

    రిప్లయితొలగించండి
  16. ఆదిత్య గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘త్రిప్పుచూ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘త్రిప్పుచున్’ అనండి.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పండుగకు’ అన్నప్పుడు గణదోషం. ‘పండుగన్’ అంటే సరి.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘మఱిని’ అన్నచోట ‘సుమ్ము/ గాదె’ అంటే బాగుంటుంది.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వెన్నెలలల’లో ఒక లకారం ఎక్కువయింది. అక్కడ ‘వెన్నెలలను’ అంటే బాగుంటుందేమో.

    రిప్లయితొలగించండి
  17. నమస్కారము.
    నేను చిన్నప్పుడు మా ఊరి దేవాలయము నుండి ఒక హనుమాను రామాయణం కు సంబదించిన పాట వినేవాడిని.
    నాకు సరిగా గుర్తు లేదు.
    శ్రీ హనుమన్ నాచే పలికే అని ఇలా ఉంటుంధి.
    దయచేసి మీకు తెలిస్తే ఆ భక్తి గీతము వివరాలు తెలుపగలరు.
    డౌన్లోడ్ లింక్ ఇస్తే చాల సంతొషము.
    కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ, ధన్యవాదాలు. వెన్నెలలు+అల అని అనాలనుకున్నాను.
    మాధవరెడ్డిగారూ, మీరు చాలాచోట్ల ఈ వ్యాఖ్య పెట్టడం గమనించినాను.
    హనుమాన్ చాలీసాకు తెలుగు అనువాదము యెమ్మెస్ రామారావు గారు పాడినది మీరు అడుగుతున్నారని భావిస్తున్నాను. పూర్తి పాఠం నా బ్లాగులో ఈ లంకె నొక్కి చూడండి. డౌన్లోడ్ లంకె గూగుల్ లో వెదుకగలరు.

    http://mandaakini.blogspot.in/2012/03/blog-post.html

    రిప్లయితొలగించండి
  19. వైమానిక దళంలో పనిచెసే మామను పెల్లాడిన మగువ,తన మామ రిపుబ్లిక్ డే నాడు చేసే విన్యాసాల్లో విమాన పొగలతో ఆకాస తలంలో గీసిన ముగ్గులనుచూసి మురిసిందన్న భావంతో:

    ఆకాసాని కెగసి యంత్ర విహంగాన
    ధూమ సోయగాన వ్యోమ తలము
    కనుల విందు జేసి గణ తంత్ర దివసాన
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె

    రిప్లయితొలగించండి
  20. వైమానిక దళంలో పనిచెసే మామను పెల్లాడిన మగువ,తన మామ రిపుబ్లిక్ డే నాడు చేసే విన్యాసాల్లో విమాన పొగలతో ఆకాస తలంలో గీసిన ముగ్గులనుచూసి మురిసిందన్న భావంతో:

    ఆకాసాని కెగసి యంత్ర విహంగాన
    ధూమ సోయగాన వ్యోమ తలము
    కనుల విందు జేసి గణ తంత్ర దివసాన
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె

    రిప్లయితొలగించండి
  21. శ్రీ శంకరయ్య గురువరులకు నమస్కారము సవరణకు ధన్యవాదములు
    ఈ 2వ, పద్యము చూడండి

    సమ్ము దమున వచ్చి సంక్రాంతి వేడ్కకు
    పట్టణమును వీడి పల్లెటూరు
    దించ ముగ్గులోకి తిన్నగా తన మేన
    మామ ముగ్గు పెట్టె, మగువ మురిసె .

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

    జరుపుకొనగ దలచి సంక్రాంతి మగనితో
    మామ యింటికేగె మగువ యొకతె
    అలిగెనత్త రాత్రి; నది గని వేకువన్
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె

    రిప్లయితొలగించండి
  23. రకరకములుగా ' మామ ముగ్గులు ' చూపిన మిత్రులందరికీ అబినందనలు.
    మాస్టరుగారూ ! ధన్యవాదములు..
    ' ఆమ + ముగ్గు ' లో అంత కథ ఉన్నదన్నమాట .. మీ ఉగ్గు బాగుంది

    రిప్లయితొలగించండి
  24. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మమత ప్రేమ లనెడి మల్లెపూలను జేర్చి
    ముగ్గుదీర్చి తిoటి ముందు మగువ
    చరణ స్పర్శ జేసి కరుణిoచు మనుచును
    మామముగ్గు బెట్టె మగువ మురిసె

    రిప్లయితొలగించండి
  25. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మమత ప్రేమ లనెడి మల్లెపూలను జేర్చి
    ముగ్గుదీర్చి తిoటి ముందు మగువ
    చరణ స్పర్శ జేసి కరుణిoచు మనుచును
    మామముగ్గు బెట్టె మగువ మురిసె

    రిప్లయితొలగించండి
  26. మాధవ రెడ్డి గారూ,
    మీరు విన్నది యం.యస్. రామారావు గారి రామాయణం. వారు బాల, అయోధ్య, సుందరకాండలను, తెలుగు హనుమాన్ చాలీసాలను గానం చేసారు. ఇవి MP3 లుగా నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రయత్నించండి.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ బ్లాగులో మీరిచ్చింది హనుమాన్ చాలీసా. రెడ్డి గారు రామాయణం గురించి అడిగారు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండవ, మూడవ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. కలికి యెడద బయట వలపు కళ్లాపిని
    జల్లి కౌగిలింత చదును జేసి
    మధుర చుంబనాల నధర ద్వయంబుపై
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె.

    రిప్లయితొలగించండి
  28. మిస్సన్న గారూ,
    శృంగారరస భరితంగా చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. వన్నె వన్నె పూల వర్ణాలతోముగ్గు
    కన్ను చెదరి నట్లు కలికి వేయ
    చిట్టి చెల్లె లొచ్చి చక్కనౌ నొకచంద
    మామ ముగ్గు బెట్ట మగువ మురిసె


    రిప్లయితొలగించండి
  30. శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఒచ్చి’ అని గ్రామ్యాన్ని వాడారు. అక్కడ ‘చిట్టిచెల్లి వచ్చి’ అనండి.

    రిప్లయితొలగించండి
  31. మిస్సన్న గారూ ! ముగ్గు లోకి దించటమంటే అదేనేమో...మీరు కళ్ళాపి జల్లి, చదునుజేసి పెట్టిన ము(ద్దు)గ్గు బలే...బలే...

    రిప్లయితొలగించండి
  32. గురువుగారూ ధన్యవాదాలు.

    నేమాని పండితుల వారి పూరణ చమత్కార భరితంగా అలరిస్తోంది.

    హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు. మీ చందమామ ముగ్గు, శైలజ గారి చందమామ ముగ్గు వెన్నెల విరిసినట్లు ఉన్నాయి.

    రిప్లయితొలగించండి