23, జనవరి 2014, గురువారం

సమస్యాపూరణం - 1302 (కోట్లు దినుట నేర్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కోట్లు దినుట నేర్చె కుక్కుటములు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్  గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఈ పార్టీ-ఆ పార్టీ అని లేదు !
    అందరూ దొంగలే !
    కాకపోతే కొందరు చిరుదొంగలు
    మరి కొందరు - గజదొంగలు !
    ఎవరిని ఎన్నుకోవాలి ?
    ఈ నాడు ప్రతీ భారత పౌరుణ్ణీ వేధిస్తున్న సమస్య !
    అందరూ వెధవలే అయినప్పుడు - ఏ వెధవను ఎన్నుకోవడం ?????
    ఈ ప్రశ్నకు బదులేది ?

    ఈ రాజకీయ నాయకు లెవ్వరూ
    *****
    "కారే రాజులు ? రాజ్యముల్ గలుగవే ?- గర్వోన్నతిం బొందరే ?
    వారేరీ ? సిరిమూట గట్టుకొని పో - వం జాలిరే ? భూమిపై
    బేరైనన్ గలదే ? శిబిప్రముఖులున్ - బ్రీతిన్ యశఃకాములై
    యీరే కోర్కులు ! వారలన్ మఱచిరే ? - యిక్కాలమున్ భార్గవా ! "
    *****
    అని పోతన్నగారు చెప్పిన ఈ పద్యం గాని, లేక
    *****
    "తల్లి గర్భము నుండి - ధనము తేడెవ్వడు
    వెళ్లిపోయెడి నాడు - వెంట రాదు !

    లక్షాధికారైన - లవణమన్నమె కాని
    మెరుగు బంగారంబు - మింగ బోడు !

    విత్తమార్జన చేసి - విఱ్ఱవీగుటె కాని
    కూడ బెట్టిన సొమ్ము - కుడువబోడు !

    పొందుగా మరుగైన - భూమి లోపల బెట్టి
    దానధర్మము లేక - దాచి దాచి

    తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ ?
    తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు !
    భూషణ వికాస శ్రీ ధర్మ - పుర నివాస
    దుష్ట సంహార నరసింహ - దురిత దూర ! "
    *****
    అన్న నరసింహ శతక కారుని పద్యం గాని ఎన్నడూ చదువుకో లేదా ?
    చదివినా అర్థం చేసుకోరా ?
    అర్థం చేసుకున్నా ఆచరించరా ?
    అందరూ శ్రీ వైష్ణవులే కాని బుట్టలో రొయ్యలు మాయమయినట్టు
    ప్రజల కందవలసిన లక్షలాది కోట్లాది రూపాయలు
    దోచుకొని దాచుకుంటున్నారే ?

    ఏం చేసుకుంటారు ?
    చిన్న ప్రమాదం జరిగితే పోతారే
    కొద్దిగా జ్వరమొచ్చినా పోవచ్చు
    ఒక్క నిమిషం ఊపిరి తీసుకోలేకపోతే పోతుందీ వెధవ ప్రాణం
    మరెందుకీ లాలస ?

    ఓట్లకొసం - నోట్లు
    మంత్రిసీట్ల(పదవి)కోసం- పాట్లు
    కోట్లాది జనులకు - కాట్లు
    దేశ,విదేశీ బాంకుల్లో - కోట్లాది - కోట్లు
    ఇదేగా ఈ నీతి లేని కుక్కుటాల(కుక్కల) రాజకీయం !కుక్కలతోనూ,కుక్కుటాలతోనూ,గాడిదలతోనూ
    పోల్చడనికి కూడా సిగ్గవుతోంది !
    అవి వీరికన్నా ఎన్నో విధాల మేలైనవి !
    వాటినన్నింటినీ మన్నించమని కోరుతూ :

    01)
    _________________________

    ఓట్ల కొరకు కొన్ని - నోట్లను వెదజల్లి
    పాట్లు పడుచు మంత్రి - సీట్లు బొంది
    కాట్లు వేసి మిగుల - కోట్లాది జనులను
    కోట్లు దినుట నేర్చె - కుక్కుటములు !
    _________________________
    కుక్కుటములు = రాజకీయ పందెం పుంజులు(నాయకులు)

    రిప్లయితొలగించండి
  2. పాట్లు బడుట మాని కోట్లుదినుట నేర్చె
    కుక్కుటములవోలె కూత కూసి
    నక్క వోలె మారి తిక్క చేష్టలఁబడి
    మిక్కుటముగ డబ్బు బొక్కనేర్చె!

    రిప్లయితొలగించండి
  3. భూతదయను వీడి ఖ్యాతిగా భావించి
    కోట్లు దినుట నేర్చె, కుక్కుటములు
    హయములాది ప్రాణు లాటవస్తువులట్లు
    తలచుచుండి జనుడు ధరణిలోన.

    రిప్లయితొలగించండి
  4. కోళ్ళ బెంచు వాని కొడుకు దినుచు ' నోట్సు ' (oats)
    వాటికిచ్చు కొన్ని వైనముగను
    రోజు రోజున కవి రుచి మరిగి వదల
    ' కోట్లు ' దినుట నేర్చె కుక్కుటములు

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    పాట్లు పడుట ప్రజల ప్రారబ్ధమని బల్కి
    ఒట్ల కొరకు నేడు నోట్లు పంచి
    దేశ భక్తునిపుడు దేశ భొక్తగ జేయ
    కోట్లు దినుట నేర్చె కుక్కుటములు.

    రిప్లయితొలగించండి
  6. పదవి దక్కగానె ప్రజలమాటమరచి
    వెధవ బ్రతుకు కొరకు వెతుకులాడి
    నిధులు మ్రింగ దలచి నేర్పుగా తిరుగాడి
    కోట్లు దినుట నేర్చె కుక్కుటములు


    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    ఎంతో ఆవేదనతో వివరణాత్మకమైన నేపథ్యాన్ని తెలిపి మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘వదలక ఓట్లు’ తినిపించిన మీ పూరణ అలరించింది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    వైవిధ్యమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    ‘ఫోకస్’ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    ‘ఫోకస్’ అంటే మీరేనా? బాగుంది!

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కోట్లు దినుట నేర్చె కుక్కుటములు నేడు
    కుక్కుటముల మెక్కె నక్కలన్ని
    నక్కలన్ని గూడి నాయకు లైనచో
    బడుగు జీవి బ్రతుకు వల్లకాడు :

    రిప్లయితొలగించండి
  10. క్రొత్త యధికారి వచ్చిక కోట్లు దినుట
    నేర్చె , కుక్కుటములు మఱి నేల బడిన
    గింజ లనునేఱి తినుచుండె గుంజు కొనుచు
    సహజ మేగద యియ్యది సర్వు లకును

    రిప్లయితొలగించండి
  11. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    ‘వచ్చి + ఇక’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘వచ్చియు’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. పరులపాట్లు నెపుడు పట్టించుకొనబోరు
    దొరలు కారు జనుల దోచు వారు,
    కుక్కకైననుండు కొంచెమైననుభక్తి
    కోట్లు దినుట నేర్చె కుక్కుటములు

    రిప్లయితొలగించండి
  13. మాంస మన్న ప్రజకు మమకారము బెరిగి
    కోళ్ళ ఫారములవి కొల్లలాయె
    తీర్చి దిద్ద వాటి తిండి గింజలకగు
    కోట్లు!, దినుట నేర్చె కుక్కుటములు

    రిప్లయితొలగించండి
  14. పియెస్సార్ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పాట్లు నెపుడు’ను ‘పాట్ల నెపుడు’ అంటే బాగుంటుందేమో!
    *
    సహదేవుడు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మరియొక పూరణ:
    కుక్కుటములు మేము కొలదిగా పురుగుల
    కొరికి మీకు రుచుల కూర నీయ
    కోట్లు దినుట నేర్చె కుక్కుటములనుట
    మానవులకె జెల్లు మహిని జూడ

    రిప్లయితొలగించండి
  17. పశువులు దిను గడ్డి పాలకులు దినిరి
    భూమిలోని గనులు భూపులకయ్యె
    నక్క, కుక్క, పులి బినామీల పేరున
    కోట్లు దినుట నేర్చె కుక్కుటములు.

    రిప్లయితొలగించండి
  18. బ్యాంకు లోను దెచ్చి పౌల్ట్రి ఫారము బెట్ట
    మాయదారి జబ్బు మహిమ వలన
    కోళ్ళ బరువు తగ్గె గ్రుడ్లును లేవాయె
    కోట్లు దినుట నేర్చె కుక్కుటములు.

    రిప్లయితొలగించండి