20, జనవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1299 (ఘనమృగతృష్ణలోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఘనమృగతృష్ణలోన నుదకంబులు ద్రాగుట సాధ్యమేసుమా!

31 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపనున్నవి !

    శ్రీరాముని అండ ఉంటే ,కానిదేముంది ?

    01)
    ________________________________________

    ఘనతర శోభ గల్గు భువి - కన్యక జేరగ రాజులెందరో
    ఘన భుజ వీరవర్యులు, ని - కారము జెందిన;బాలుడయ్యు , నా
    ఘనమగు శక్తిగల్గు శివ - కార్ముక భంజను నండయుండినన్
    ఘన మృగతృష్ణ లోన నుద - కంబులు ద్రాగుట సాధ్యమేసుమా !
    ________________________________________
    నికారము = పరాభవము

    రిప్లయితొలగించండి
  2. పాండవులకు సహకారమునిచ్చిన శ్రీకృష్ణుడు తోడుంటే ,సాధ్యమే గదా :

    02)
    ________________________________________

    ఘనులగు భీష్మ , ద్రోణులను - కర్ణుని, శల్యుని ,గెల్వజాలుటన్
    ఘనమగు యుద్ధమందు - సహ - కారము నిచ్చిన వాడు యెవ్వడో
    ఘనతర మూర్తియైన ,సిరి - కాప్తుడు, తోడుగ కూడి యుండినన్
    ఘన మృగతృష్ణ లోన నుద - కంబులు ద్రాగుట సాధ్యమేసుమా !
    ________________________________________

    రిప్లయితొలగించండి
  3. రావణుణ్ణి చెండాడిన వాని యండతో ,సాధ్యమే గదా !

    03)
    ________________________________________

    తృణముగ రాజ్య సంపదల - త్రేచుట , తేజము హెచ్చరిల్లగన్ ;
    వనమున నున్న జానకిని - వంచన నెత్తుక పోవ , రావణున్
    తన బల ,శౌర్య సంపదను - దందడి గూల్చిన వాని యండచే
    ఘన మృగతృష్ణ లోన నుద - కంబులు ద్రాగుట సాధ్యమేసుమా !
    ________________________________________
    త్రేచు = త్యజించు

    రిప్లయితొలగించండి
  4. కేసియార్ తక్కువలో తక్కువగా,
    కూరగాయలు పండించి,సంవత్సరానికి
    ఎకరానికి కోటి సంపాదిస్తున్నాడంట !

    ఒక ఎకరానికి కోటి రూపాయల సంపాదనంటే ,
    మృగతృష్ణ లోంచేం కర్మ,
    శూన్యంలోంచే ఉదకాన్ని సృష్టించొచ్చు !

    కాకపోతే అది కేసియార్ కే సాధ్యం :

    04)
    ________________________________________

    తినదగు పచ్చి కూరలను - దేశములో నొక వ్యక్తి వింతగన్
    తనదగు నేలలోన నతి - తక్కువ,సాలున కొక్క యేకరాన్
    వినినను నమ్మలేని విధి - బెంచుచు పొందగ కోటి రూప్యముల్
    ఘన మృగతృష్ణ లోన నుద - కంబులు ద్రాగుట సాధ్యమేసుమా !
    ________________________________________
    సాలు = సంవత్సరము
    ఏకరా = ఎకరము

    రిప్లయితొలగించండి
  5. పనీ పాటూ లేని ఒకానొక రాజకీయనాయకుడు
    అధికారలాలసతో
    మితిమీరిన స్వార్థంతో
    దుర్బుద్ధితో
    దుష్టవర్తనతో
    అమాయకుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపించి
    ఇతరుల పర్యటనలకు అడ్డుగా నిలచి
    బలవంతంగా వత్తాసు పలికేలా చేసి
    ఏవో కొన్ని అల్లర్లు చేసి
    మరికొన్ని అలజడులు రేపినంత
    మాత్రం చేత
    నిష్ప్రయోజనమైన
    ప్రత్యేక రాష్ట్రమే సిద్ధించేస్తే ;

    యెండమావుల్లో ఉదకం ఉప్పొంగదూ :

    05)
    ________________________________________

    తనదగు స్వార్థ కాంక్ష, నతి - దారుణ రీతి, నధర్మ వర్తనన్
    మనుషుల వేరు చేసి, యవ - మాన మొనర్చి,విషాగ్ని నింపుచున్
    మనముల రెచ్చగొట్టుచు, న - మాయక జీవుల ప్రాణ మార్పగాన్
    దిన దిన మగ్ని గుండ మవ ; - దిక్కును తెన్నును లేని లే జనుల్
    విని విని నమ్మి వాని యతి - పిండ్రపు బూటక మాటలన్ సదా
    యనలము దూకు పుర్వు వలె - నార్తిని యగ్నిని కౌగలించుటన్ ;
    జనపద మంత తల్లడిలి - సాయము జేసిన ; రాష్ట్ర మొందినన్ ,
    ఘన మృగతృష్ణ లోన నుద - కంబులు ద్రాగుట సాధ్యమేసుమా !
    ________________________________________
    లే = లేత
    లేజనులు = అమాయక జనులు

    రిప్లయితొలగించండి
  6. మనమున గట్టిపట్టుదల, మాటలలోన తదేకదీక్షతో
    ననయము కార్యసాధనకు యత్నము చేసినవారి కిమ్మహిన్
    ధనము, సుఖంబులబ్బుటది తథ్యము, సద్యశ మందవచ్చు నా
    ఘనమృగతృష్ణలోన నుదకంబులు ద్రాగుట సాధ్యమే సుమా!

    రిప్లయితొలగించండి
  7. ధనము క్షణంబులోన మన దక్షిణ హస్తమునందు రాలుటన్ -
    జననుత చిత్రనాయిక రసస్రవ చుంబనమందు కుల్కుటన్ -
    వనమున సింహమెక్కి కరవాలము ద్రిప్పుట - స్వప్నమందునన్,
    ఘనమృగతృష్ణలోన నుదకంబులు ద్రాగుట సాధ్యమేసుమా!

    రిప్లయితొలగించండి
  8. వసంత కిశోరు గారు, నాలుగు ఐదు పద్యాలలో పచ్చని తోటలో చిచ్చు పెట్టే వారిని గురించి బాగా చెప్పినారు.

    మనమను భావనమ్ము,కడు మాలిమి తోడ మెలంగు నెయ్యముల్
    దినసరి జీవనమ్మునను తృప్తి నొసంగెడు రీతి కార్యముల్
    జనసముదాయముల్ తనియ; సల్పగ - నిక్కము రాష్ట్రమందునన్
    ఘనమృగతృష్ణలోన నుదకంబులు ద్రాగుట సాధ్యమేసుమా!

    రిప్లయితొలగించండి
  9. కిశోర మహోదయా అద్భుతంగా ఉన్నాయి మీ పూరణలు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మనమున నా పరాత్పరుడు మాపతి నెప్పుడు చిత్త శుద్ధితో
    ననుపమ భక్తి భావమున నర్చన జేసిన మానవాళికిన్
    ఘన మృగతృష్ణ లోన నుదకంబులు ద్రాగుట సాధ్యమేసుమా
    యనియు పురాణ కావ్యములయందు వచించిరి సత్యమే కదా.

    రిప్లయితొలగించండి
  11. జనులకుచిత్తశాంతినిడు సాహస కృత్యము చేయకుండినన్
    యనలము రేగుచున్నగని ఆరని శోకము తీర్చకుండినన్
    వనమున క్రూరజంతువులవాలము పట్ట్టుచు త్రిప్పకుండినన్
    ఘనమృగతృష్ణ లోననుదకంబులుద్రాగుట సాధ్యమేసుమా!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    కనియె మరీచికంబొకటి కాననమందు చరించి పాంధు,డా
    వనినొక ముస్తె గాంచె, నణువైన జలంబును పొందునాశచే
    పనిగొని పీల్చె నా తృణము భాగ్యమదేమొ గ్రహించె తేమనున్
    ఘనమృగతృష్ణలోన నుదకంబులు ద్రాగుట సాధ్యమేసుమా!

    మరీచికము = ఎండమావులు, మృగతృష్ణ
    ఘనము = తుంగ ముస్తె
    ముస్తె = తుంగ
    తుంగను పీల్చగా తేమను పొందవచ్చును కదా!

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారూ,
    మీ అయిదు పూరణలూ బాగున్నవి. ముఖ్యంగా నాల్గవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    కొన్ని సవరణలు... 2వ పూ. వాడు యెవ్వడో - వాడెవండొ యా, 5వ పూ. ఆర్తిని యగ్నిని - ఆర్తిని నగ్నిని.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ స్వప్నవృత్తాంతాల పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని భావనతో మంచి పూరణ చెప్పినారు. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    ‘పరాత్పరుడు + మాపతి/ ఉమాపతి’ అంటూ శివకేశవాద్వైతంగా చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదం ప్రారంభంలో యడాగమం దోషం. అక్కడ ‘చేయకున్నచో/ ననలము...’ అనండి.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మరీచిక’ ఆకారాంత స్త్రీలింగ పదం. దానికి ముప్రత్యయం రాదు. అక్కడ ‘కనియె మరీచికన్ జటిలకాననమందు...’ అందామా?

    రిప్లయితొలగించండి
  14. దినకరుడెంతొ వేడినిడి తిప్పలు పెట్టుచు నుండ నుష్ణమున్
    గనుచు హితంబు జేయ నిల కాగుచు నుండిన మానవాళికిన్
    వనమున నుండు జీవులకు వర్షము నివ్వగ మేటి మేఘముల్
    ఘనమృగతృష్ణలోన నుదకంబులు ద్రాగుట సాధ్యమేసుమా !

    రిప్లయితొలగించండి
  15. అనె నొక యైంద్రజాలకుడు హాయిగ జూడుడు నాదు విద్యలన్
    గనుడవె యభ్రమార్గమున గన్నుల విందుగ రత్న సౌధముల్
    వినుడివె మూగ గాత్రమున విందుగ పాటలు నద్భుతమ్ముగా
    ఘన మృగతృష్ణలోన నుదకంబుల ద్రాగుట సాద్యమే సుమా

    రిప్లయితొలగించండి
  16. బొడ్డు శంకరయ్య గారూ,
    వర్షం కురిస్తే ఎడారిలో నీళ్ళు తాగవచ్చునన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఇంద్రజాలికుని వ్యాజంతో మీరు చేసిన పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కనక శిపుండు శ్రీ హరిని గావు మటంచును వేడుటన్ సుయో
    ధనుడటు కుంతి పుత్రులకు ధర్మ యుతమ్ముగ రాజ్యమిచ్చుటన్
    పెనగుచు నేతి బీరలను పిండగ నేతి ని దీయయవచ్చుచో
    ఘన మృగ తృష్ణ లోన నుదకంబులు ద్రాగుట సాధ్యమే సుమా

    రిప్లయితొలగించండి
  18. శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. కనక కశిపుడు అను శబ్దమునకు బదులుగా మీరు కనక శిపుండు అన్నారు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా!
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ప్రశస్తమైన విఱుపు. చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. వినయము నేర్పు విద్యలను, విజ్ఞత పెంచెడు గొప్ప సూక్తులన్,
    మును మన పెద్దలాడిన యమూల్య హితోక్తుల నుగ్గడించుచున్
    మనమున నాటునట్లనిన మాటికి మూర్ఖుల తీరు మారదే?
    ఘనమృగతృష్ణలోన నుదకంబులు ద్రాగుట సాధ్యమేసుమా!

    ************************************

    కని విదురుండు వృద్ధుడగు కౌరవ భూపతినిట్లు వాకొనెన్
    విను భవదీయ పుత్రు డవివేక మతిన్ మన పాండుపుత్రులన్
    వనముల కంప, పెద్దవయి, వాని హితోక్తుల మార్చ జాలవే?
    ఘనమృగతృష్ణలోన నుదకంబులు ద్రాగుట సాధ్యమేసుమా!

    రిప్లయితొలగించండి
  21. రవీందర్ గారి పూరణ అద్భుతంగా ఉంది సందేహం లేదు.


    సుమాస్త్రునకు పురారి డెందమును సూనశరాన చలింప సాధ్యమే ? అన్న చోట అన్వయం కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లు కనుపిస్తోంది. చలింప జేయుట అని ఉండాలేమో.

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. వననిధినంతయున్ నడచి వారధిలేకయె దాటువానికిన్
    కనుగొనఁగాంచి ఆకసముఁ గ్రక్కున చుక్కల నెంచువానికిన్
    అణువుయె గానినాతి మది నారసి చూపెదెనన్నవానికిన్
    ఘన మృగ తృష్ణ లోన నుదకంబులు ద్రాగుట సాధ్యమే సుమా!

    రిప్లయితొలగించండి
  24. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కనకపుకంటి శ్రీ హరిని గావు మటంచును వేడుటన్ సుయో
    ధనుడటు కుంతిపుత్రులకు ధర్మ యుతమ్ముగ రాజ్యమిచ్చుటన్
    పెనగుచు నేతి బీరలను పిండగ నేతిని దీయవచ్చుచో
    ఘన మృగతృష్ణ లోన నుదకంబులు ద్రాగుట సాధ్యమే సుమా

    మీరు సూచించిన రీతిగ పద్యములో మార్పులు చేసితిని. సూచనలకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  25. రామకృష్ణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అణువుయె’ అన్న ప్రయోగమే పానకంలో పుడకలా ఉంది.
    ‘అణువు + ఎ = అణువె’ ఇక్కడ యడాగమం రాదు కదా! ‘అణువది గాని/ అణువగు గాని..’ అనవచ్చునా?
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. లక్ష్మీదేవిగారూ
    మిస్సన్న మహాశయా
    శంకరార్యా
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  27. తినుచును మేటి లంచములు తియ్యగ కమ్మగ రెండు చేతులన్
    వినుచును వేయి స్తోత్రములు వీనుల విందుగ బంట్లు పాడగన్
    కనుచును తీపి స్వప్నములు కాంగ్రెసు నేతలు హాయిహాయిగా
    ఘనమృగతృష్ణలోన నుదకంబులు ద్రాగుట సాధ్యమేసుమా!

    రిప్లయితొలగించండి