28, జనవరి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1307 (శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.
(కవిమిత్రులు మన్నించాలి. ఇందులో సమస్య కేవలం దుష్కరప్రాస. ఇది ఎప్పుడో విన్న సమస్య. 
వందలకొద్ది అవధానాలను విజయవంతంగా చేసిన ఒక అవధాని (ఎవరో గుర్తులేదు) 
ఈ సమస్యను పూరించడంలో విఫలమయ్యారట! 
సరదాగా ఇచ్చాను. చూద్దాం... స్పందన ఎలా ఉంటుందో?)

46 కామెంట్‌లు:

  1. శార్జ్గ్యంఘ్రులు పావనములు
    శార్జ్గ్యంఘ్రుల సేవ లక్ష్మి సతత మొనర్చున్
    శార్జ్గ్యంఘ్రుల నే కొలిచెద
    శార్జ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్

    (ఒక ప్రసిద్ధుడైన అవధానికి - వాత్స్యాయన - అనే పదముతో ఆరంభించి సమస్యనీయగా ఆ యవధాని 4 పాదములలోను ఆ పదమునే వాడి పూరించెను -నేనును అటులనే చేసితిని. స్వస్తి).

    రిప్లయితొలగించండి
  2. శతావధానులు శ్రీ పిశుపాటి చిదంబరశాస్త్రి , శ్రీ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి వంటి దిగ్దంతి విద్వత్కవులాసీనులైన గద్వాల సంస్థానంలో చెన్నారెడ్డి అనే ఆస్థాన పండితుడు తాను ముందుగానే తయారు చేసుకున్న ఈ సమస్యనే రాజుగారితో ఇప్పించి మహామహా కవులు ఇంకా దీనికి పూరణ లేదని , క్లిష్ట ప్రాసమని పలుకుతూండగనే ' భార్ఙ్యాభకచలకైనను ' అని మొదలు పెట్టి పద్యము పూర్తి చేశాడు .
    అంతటితో ఆగకుండా , అప్పటిదాకా తనకు కొరుకుడు పడకుండా ఉన్న గాడేపల్లి వారిని పరాజితునొనర్చినాననే ఉత్సాహంలో ఉద్వేగానికి లోనై " శ్రీ గద్వాల పురాగతాఖిల కవిశ్రేష్ఠాళి జుట్లెల్ల నే నూగంజేసితిఁ బట్టి యూచితి నొహోహో " అంటూ ఆశూక్తంగా పద్యాలు చెప్పడం మొదలు పెట్టినాడు.

    ఇంతలో దీర్ఘాలోచనలో మునిగిన గాడేపల్లి వీర రాఘవ శాస్త్రి గారు ఏదీ మొదటి పాదం మళ్లీ చదువుమంటూ ప్రాస పోయింది గమనించుకోమని హెచ్చరించడమూ , గతుక్కుమన్న చెన్నారెడ్డి గారు వెక్కసం పట్టలేక " అతి చాతుర్యము వైదిక "ద్విజులకే" అబ్జాసనుండిచ్చెగా " అంటూ ద్విజ శబ్దాన్ని శ్లేషతో వాడడంతో , కోపం పట్టలేక శాస్త్రిగారు ద్విజ శబ్దార్థము పక్షులైనపుడు నీ దృగ్వ్యర్థ వాచాలతల్ నిజమౌ నంటూ , ఈ ద్విజులాలాటిరు గారు శాస్త్ర కలనా తేజోనిధులంటూ పద్యమాలిక నప్పగించడమూ , పిశుపాటి చిదంబర శాస్త్రి మున్నగు వారు గద్వాల పండితుల జుట్లు పట్టుకుని ఊపావా , ఎందులో దీటుకొందువో రమ్మని సవాలు చేయడమూ , ఆ వెనుక సభ మొత్తము అట్టుడికిపోగా , గద్వాల రాజు గారు స్వయంగా కల్పించుకుని చెన్నారెడ్డి గారి ని హెచ్చరించిన మీదట మన్నింపులతో కథ సుఖాంతమైనదట . 1940 ప్రాంతాలలో రాజాస్థానాలలో కవి పండిత స్పర్థలిలా ఉండేవి !
    ఇదీ ఈ సమస్య పుట్టుపూర్వోత్తరాలు ... ( నంద్యాల కవివతంసులు కవితా సామ్రాజ్య నిర్మాత కీ శే శ్రీ మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కవితా విలాసంలో ఈ వృత్తాంతమంతా సవివరంగా గ్రంధస్థం చేయబడినది )

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరింప నున్నవి !
    *****
    శార్ఙ్గధరుఁడు =శార్ఙ్గధ్వనుడు= శార్ఙ్గపాణి =విష్ణువు

    *****
    శార్ఙ్గము సం.విణ.(అ.ఈ.అ.)

    కొమ్ముతోఁ జేయబడినది
    విల్లుధరించినది

    శార్ఙ్గము వి.అ.పుం.న.

    విల్లు
    విష్ణుని విల్లు

    శార్ఙ్గము న.

    అల్లము
    కం. అతఁడు సద్యోయౌవనుఁడైన తోడన యొక స్వభావుఁడను సిద్ధునిచే, నూతనమొక మణియు సము,ద్ద్యోతిత శార్ఙ్గము మెఱుంగుఁదూపులుఁ బడసెన్. కళా. 5.23
    శా. ... అందఱన్, జేష్టల్ దక్కఁగ శార్ఙ్గముక్తవిశిఖశ్రేణి న్వెసం జేసినన్. చిత్రభా. 7.123
    *****

    శంకరార్యా !
    తెలుగు నిఘంటువు నందు పై అర్థము లీయబడినవి !
    అందెక్కడా "య" వత్తు కాన రాకున్నది !

    రిప్లయితొలగించండి
  4. విష్ణునందనా ! సుందరా ! మీ వివరణకు ధన్యవాదములు !

    మంచి పూరణ నిచ్చిన నేమాని వారికి అభినందనలు !
    -శార్ఙ్గ్యంఘ్రి- ని
    నేమాని వారు విష్ణు పాదములు అనే అర్థములో పూరించి నటు లున్నది !

    రిప్లయితొలగించండి
  5. శార్ఙ్గము+అంఘ్రి = శార్ఙ్గ్యంఘ్రి

    అగునా ?
    అయిన సంధి, సంధికార్యము ఏమి? వివరించగలరు !

    శార్ఙ్గ్యంఘ్రి అనగానేమి?

    వింటి కొన లేదా విష్ణువు యొక్క వింటికొన
    అని అనుకొన వచ్చునా ?

    రిప్లయితొలగించండి
  6. మీర్జ్యాంఘ్రి పురము భక్తులు
    ధూర్జ్యటి పద్యములు వినుచు ధూర్తుల నణచన్
    ఆర్జ్యంబుల పాద్యంబులనిడి
    శార్జ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గల్గున్

    రిప్లయితొలగించండి

  7. నాకు తెలిసి నంతవరకూ
    అంతము+అతి = అంతమతి
    అగునే గాని
    అంత్యతి
    కాజాలదు గదా ?
    నా అఙ్ఞానాన్ని తొలగించగలరు

    రిప్లయితొలగించండి
  8. యణాదేశ సంధి యగునా ? కాదే !
    యణాదేశ సంధి: ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా య - వ - ర లు ఆదేశమగును

    ఉదా: అతి+అంతము=అత్యంతము.

    రిప్లయితొలగించండి
  9. శంకరార్యా !
    మరి యెట్లు
    శార్ఙ్గము+అంఘ్రి = శార్ఙ్గ్యంఘ్రి
    అగుచున్నదో వివరించి
    నాకు సందేహ నివృత్తి జేయగలరు !
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  10. శ్రీ వసంత కిశోర్ గారికి శుభాశీస్సులు.
    శార్జ్గము అనగా విష్ణువు యొక్క విల్లు.
    శార్జ్గము కలవాడు శార్జ్గి. శార్జ్గి + అంఘ్రులు = యణాదేశ సంధి ప్రకారము శార్జ్యంఘ్రులు అగును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. నా చింత దీర్చిన నేమాని వారికి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  12. పరమాత్మ పాదస్మరణ సద్గతి నిచ్చుగదా :

    01)
    _______________________________

    శార్ఙ్గ్యంఘ్రుల గంగ వెలయు !
    శార్ఙ్గ్యంఘ్రుల బ్రహ్మ పూజ - సలుపును సతతమ్ !
    శార్ఙ్గ్యంఘ్రుల లక్ష్మి కొలుచు
    శార్ఙ్గ్యంఘ్రి స్మరణ వలన - సద్గతి గల్గున్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  13. శార్జ్గ్యర్పితమానసమున
    శార్జ్గ్యారాధనము కూల్చు సకలాఘములన్
    శార్జ్గ్యైశ్వర్యప్రదుడిక
    శార్జ్గ్యంఘ్రిస్మరణవలన సద్గతి గలుగున్

    రిప్లయితొలగించండి
  14. అన్నగారికి గురువు గారికి నమస్సులు. డా. విష్ణునందనుల వారి వివరణ చాలా బాగుంది.మిత్రుల పూరణ లద్భుతము ! అన్నగారి బాటలోనే ,

    శార్ఙ్గ్యంఘ్రి ధరణిఁ దనిపెను
    శార్ఙ్గ్యంఘ్రిని గడిగి తనిసె శారద విభుడున్
    శార్ఙ్గ్యంఘ్రి బలిని సాకెను
    శార్ఙ్గ్యంఘ్రి స్మరణ వలన - సద్గతి గల్గున్ !

    సాకు = కాపాడు

    రిప్లయితొలగించండి
  15. శార్జ్ఞ్యానుసారి లోకము
    శార్జ్ఞ్యాంఘ్రియుగము జగములఁ జల్లగఁ గాచున్,
    శార్జ్ఞ్యాశ్రయము వలన మరి
    శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

    రిప్లయితొలగించండి
  16. శార్ఙ్గ్యాహ్వయుండు విష్ణువు,
    శార్ఙ్గ్యారాధనము పాపసంచయహరముల్,
    శార్ఙ్గ్యర్చన శుభకరమగు.
    శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

    రిప్లయితొలగించండి
  17. పండిత నేమాని వారూ,
    చక్కని పూరణతో శుభారంభం చేసి, మాకు శుభోదయాన్ని ప్రసాదించారు. ధన్యవాదాలు.
    *
    డా. విష్ణునందన్ గారూ,
    ఈ సమ్యస్యయొక్క నేపథ్య వృత్తాంతాన్ని వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ‘కవితావిలాసం’ పుస్తకం (ముద్రితగ్రంథంగా కాని, సాఫ్ట్ కాపీగా నెట్‍లో కాని) దొరికే అవకాశాలుంటే తెలియజేయవలసిందిగా మనవి.
    *
    వసంత కిశోర్ గారూ,
    సందేహం తీర్చుకొని చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    ‘సలుపును సతతమ్’ అన్నదానిని ‘పూజ బ్రహ్మ సతత మొనర్చున్’ అనండి.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కానీ ప్రాసను గమనించినట్టు లేదు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    నేను రాత్రి వ్రాసి పెట్టుకున్న పూరణ మీ పూరణకు కార్బన్ కాపీలా ఉన్నది.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘శార్ఙ్గ్యనుసారి’ అనవలసి ఉంటుంది. అప్పుడు గణభంగ మవుతుంది. ఆ పాదాన్ని ‘శార్ఙ్గ్యనుసారి ప్రపంచము’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  18. శార్ఙ్గ్యంఘ్రి యనగ నేమిటి ?
    శార్ఙ్గ్యంఘ్రి స్మరణ మేది సమకూర్చునయా ?
    శార్ఙ్గ్యంఘ్రి ' విష్ణు పదములు '
    శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశ్నోత్తర మాలికగా వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    ‘అంఘ్రి’ ఏకవచనము, ‘పదములు’ బహువచనము. ఆ పాదాన్ని ‘శార్ఙ్గ్యంఘ్రి విష్ణుపాదము’ అందాం.

    రిప్లయితొలగించండి
  20. పూజ్యులు నేమానివారికి, మిత్రులు శంకరయ్యగారికి, సాహితీ మిత్రులందరికిని నమోవాకములు.

    శార్ఙ్గ్యర్పిత మానసమున
    శార్ఙ్గ్యారాధనముఁ జేయ శాంతియె కల్గున్!
    శార్ఙ్గ్యర్చన మత్ప్రాణము!
    శార్ఙ్గ్యంఘ్రిస్మరణవలన సద్గతి గల్గున్!!

    రిప్లయితొలగించండి
  21. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. మాస్టరుగారూ ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణ తో...


    శార్ఙ్గ్యంఘ్రి యనగ నేమిటి ?
    శార్ఙ్గ్యంఘ్రి స్మరణ మేది సమకూర్చునయా ?
    శార్ఙ్గ్యంఘ్రి ' విష్ణు పాదము '
    శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

    రిప్లయితొలగించండి
  23. చిన్నప్రయత్నము, రెండవ పాదంలో మొదటి పదంలో సంధి చేసిన రీతి సరియేనా?
    శార్ఙ్గ్యంబనెడీ శబ్దము
    శార్ఙ్గ్యంబులపొది విడచిన చాపముఁ బోలెన్
    శార్జ్గ్యానుగ్రహమే గతి (సృతి),
    శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్!

    రిప్లయితొలగించండి
  24. గురువుగారు,
    ధన్యవాదాలు. అసలు ఆ పదప్రయోగము సమ్మతమవునో కాదో సందేహిస్తూ పూరణ చేసినాను.
    అంతకుముందే హరిగారి పూరణ ఈ విధంగా ఉన్నదని ఇప్పుడే గమనిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  25. చంద్రశేఖర్ గారూ,
    మీ ప్రయత్నం అభినందనీయం.
    మొదటి పాదంలో ‘శార్ఙ్గ్యము’ శబ్దప్రయోగంలో దోషం లేదు. శార్ఙ్గికి సంబంధించినది శార్ఙ్గ్యము అని అనవచ్చుననుకుంటాను. రెండవ పాదంలోని సంధి ఆక్షేపణీయమే. సంస్కృత పదంతో తెలుగు పదాన్ని సంధి చేశారు. మూడవ పాదంలో ‘శార్ఙ్గి + అనుగ్రహము = శార్ఙ్గ్యనుగ్రహము’ అవుతుంది.

    రిప్లయితొలగించండి
  26. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదం అన్వయంలో సందేహం. అక్కడ ‘శార్ఙ్గ్యంఘ్రి గంగ పుట్టువు/ భక్త వరదము’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  27. శార్జ్గ్యం ఘ్రి యనగ దెలుపుదు
    శార్జ్గ్యం ఘ్రి ని ననగ నండ్రు శార్జ్గ్యు ని పదముల్
    శార్జ్గ్యం ఘ్రిని సేవించియు
    శార్జ్గ్యం ఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్

    రిప్లయితొలగించండి
  28. శార్జ్గ్యినిగొలిచినసిరియు
    శార్జ్గ్యంఘ్రినిసేవచేయ సౌఖ్యము గల్గున్
    శార్జ్గ్యియె సర్వము గాదా
    శార్ఝ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్

    రిప్లయితొలగించండి
  29. శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    2వ పాదము చివరలో సంచయ హరముల్ అని బహువచనము వాడేరు. ఏకవచనము అయితేనే అన్వయము బాగుండునేమో పరిశీలించం~డి.
    ఆరాధన మరియు అర్చన పదములు సుమారు సమానార్థకములుగా కన్పట్టును.
    స్వస్తి.

    మిత్రులందరి పూరణలు బాగుగ నున్నవి. మన ఛందస్సులో ప్రాస నియమములో కొన్ని వెసులుబాటులు కూడా కలవు. ప్రాస అక్షరములో 2 కంటే ఎక్కువ హల్లులు సంయుక్తముగా నున్నచో మొదటి 2 హల్లులతో గల సంయుక్త అక్షరముతో ప్రాస వేయ వచ్చును అనుకొంటాను.

    రిప్లయితొలగించండి
  30. నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండవ పూరణలో ప్రాసను పాటించలేదు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పద్యానికి నా సవరణ...
    శార్జ్గ్యంఘ్రు లనగ దెలుపుదు
    శార్జ్గ్యంఘ్రు లనంగ నొప్పు శార్జ్గి పదమ్ముల్
    శార్జ్గ్యంఘ్రిని సేవించియు
    శార్జ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్
    *
    శైలజ గారూ,
    మీ ప్రయత్నం అభినందనీయం.
    మీ పద్యానికి నా సవరణ....
    శార్ఙ్గ్యర్చన సిరి నొసఁగును
    శార్జ్గ్యంఘ్రినిసేవచేయ సౌఖ్యము గల్గున్
    శార్జ్గ్యమలకరుణఁ గోరుచు
    శార్ఝ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్.

    రిప్లయితొలగించండి
  31. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు. సవరించిన నా పూరణ....
    శార్ఙ్గ్యాహ్వయుండు విష్ణువు,
    శార్ఙ్గ్యారాధనము పాపసంచయహరమౌ,
    శార్ఙ్గ్యాసక్తుఁడు పుణ్యుఁడు,
    శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

    రిప్లయితొలగించండి
  32. మిత్రులారా! శుభాశీస్సులు.
    ప్రాస గురించి ఒక వెసులుబాటును ప్రస్తావించేను కదా. శ్రీ నాగరాజు రవీందర్ గారి పద్యమునకు ఆ వెసులుబాటును వర్తింప జేయవచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  33. శార్జ్గ్యా ధరుండు విష్ణుని
    శార్జ్గ్యంఘ్రినిబ్రీతితోడ సతతము గొలువన్
    శార్జ్గ్యా రాధన వీడక
    శార్జ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్

    రిప్లయితొలగించండి
  34. శార్జ్గ్యారాధకు లెప్పుడు
    శార్జ్గ్యంఘ్రుల పైన బడుచు శాశ్వత భక్తిన్
    శార్జ్గ్యాలాపన సలిపిన
    శార్ఙ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గల్గున్ !

    రిప్లయితొలగించండి
  35. విష్ణు నందనులవారు ఆసక్తికరమైన కథనాన్ని చెప్పేరు.
    అయితే " శ్రీ గద్వాల పురాగతాఖిల కవిశ్రేష్ఠాళి జుట్లెల్ల నే నూగంజేసితిఁ బట్టి యూచితి నొహోహో "
    అన్న పాదాల్లో ప్రాస లేదా? నా చిన్ని బుర్రకు అర్థం కాలేదు.
    నేమాని పండితులు పూరణకు మార్గాన్ని సూచిoచి నారు.

    ఈ ర్ఙ్గ్య ప్రాసను వేయగ
    శార్జ్గ్యంఘ్రుల కన్న లేవు చక్కని పదముల్
    శార్జ్గ్యంఘ్రులనే వాడెద
    శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

    రిప్లయితొలగించండి
  36. శ్రీ మిస్సన్న గారికి శుభాశీస్సులు.
    మీరు జాగ్రత్తగా పరిశీలించలేదు గాని మీ బుర్ర చిన బుర్ర కాదు. ఆ నాడు గద్వాల సభలో నిచ్చినది ఈనాటి శంకరాభరణములో బ్లాగులోనిది ఒకటే సమస్యే. చెన్నారెడ్డి గారు ఆనాడు ఆ సమస్యనే ఇచ్చేరు. వారు పూరించిన విధానము -- మొదటి పాదము:
    భార్జ్యాభ కచల కైనను ....
    ఆ పాదములో ప్రాస దోషమని పండితులు ఆక్షేపించేరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  37. శైలజ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘శార్ఙ్గ్యధరుడు’ అర్థం కాలేదు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘తప్పించుకుని వెక్కిరించినట్లున్నది’ మీ పూరణ.
    ‘ఉండ్రా యోరి దురాత్మక!
    యిండ్రాప్రాసమ్ము కవుల కియ్యఁదగున కో
    దండ్రాము పదము సోకిన
    గుండ్రాతికి కాళ్లు వచ్చి గునగున నడిచెన్’ అన్న పద్యాన్ని గుర్తుకు తెచ్చారు.
    బాగుంది. అభినందనలు.
    "శ్రీ గద్వాల పురాగతాఖిల కవిశ్రేష్ఠాళి జుట్లెల్ల నే
    నూగంజేసితిఁ బట్టి యూచితి నొహోహో... " ఈ శార్దూలంలో ప్రాస ఉన్నది కదా!

    రిప్లయితొలగించండి
  38. సహదేవుడు గారి పూరణ....
    మనసా వాచా కర్మన ఆ మహావిష్ణువు పాదములను స్మరియించిన సద్గతి కలుగుతుందన్న భావంతో :-

    శార్జ్గ్యంఘ్రి యుగముఁ దలనిడి
    శార్జ్గ్యంఘ్రుల మది దలంచి శౌశీల్యముతో
    శార్జ్గ్యంఘ్రల కీర్తించుచు
    శార్జ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్.

    రిప్లయితొలగించండి
  39. నాగరాజు రవీందర్ గారూ,
    పెద్దలు, లాక్షణికులు కల్పించిన వెసులుబాటును వినియోగించుకొనడంలో దోషం లేదు. ఆ లెక్కన మీ పద్యం నిర్దోషమే.
    *
    సహదేవుడు గారూ,
    మీరు పొరపాటున రెండుసార్లు పోస్ట్ చేశారనుకుని మొదటిది తొలగించాను. ఇంతలో మీరు రెండవదాన్ని తొలగించారు. మళ్ళీ మొదటిదాన్ని కాపీ, పేస్ట్ చేయవలసివచ్చింది. మన్నించండి.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    టైపాటు వలన ‘సౌశీల్యము’ - ‘శౌశీల్యము’ అయినట్టుంది.

    రిప్లయితొలగించండి
  40. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు
    శార్జ్గ్యా యుధుని నిషాదుని
    శార్జ్గ్యా యుధుపరమశివుని సంధ్యల గొల్వన్
    శార్జ్గ్యా ఖ్యుడు నాబరగిన
    శార్ఙ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గల్గున్

    రిప్లయితొలగించండి
  41. శార్జ్గ్యద్భుత లీలలతో
    శార్జ్గ్యాదిగ పద్య కవిత సద్భావముతో
    శార్జ్గ్యంకిత మొనరించెద
    శార్జ్యంఘ్రి స్మరణ వలన సద్గతి కలుగున్

    (పై పద్యమును ఒక సంస్కృత పండితుడగు మిత్రునికి చెప్పి వాని ఆమోదమును పొందితిని).
    స్వస్తి

    రిప్లయితొలగించండి
  42. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    శార్ఙ్గ్యంఘ్రి మహిమ నెరుగక
    శార్ఙ్గ్యంఘ్రిని గూల్చ పోరు సలిపిరి దనుజుల్
    శార్ఙ్గ్యంఘ్రియె రక్షకుడన
    శార్ఙ్గ్యంఘ్రిస్మరణ వలన సద్గతి గల్గున్.

    రిప్లయితొలగించండి
  43. కవిమిత్రులకు నమస్సులు.
    ఈరోజు సాయంత్రం స్కూటర్ స్కిడ్ అయి క్రిందపడ్డాను. కనపడని దెబ్బలే ఎక్కువ. రేపటికి ఎలా ఉంటుందో నా పరిస్థితి. రేపటి సమస్యనైతే షెడ్యూల్ చేయగలిగాను.

    రిప్లయితొలగించండి
  44. నేమాని పండితార్యా! కడుంగడు ధన్యవాదములు. నా తెలివితక్కువ సందేహాన్ని నివృత్తి చేసినందుకు.

    గురువుగారూ ధన్యవాదాలు. మంచి పద్యాన్ని గుర్తు చేశారు.

    రిప్లయితొలగించండి
  45. శార్ఙ్గ్యారాధన జేయుము
    శార్జ్గ్యంఘ్రి యుగమ్ము నందు సదమల భక్తిన్
    శార్ఙ్గ్యభయమొంద గలవిక
    శార్జ్గ్యంఘ్రి స్మరణ వలన సద్గతి గలుగున్.

    రిప్లయితొలగించండి
  46. మిత్రులారా! శుభాశీస్సులు.

    అందరి పూరణలు అలరించుచున్నవి. అందరికి అభినందనలు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి