19, జనవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1298 (కవి నాశనమయ్యె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కవి నాశనమయ్యె మేటి కావ్యముచేతన్.
ఈ సమస్యను పంపిన గూడ రఘురామ్ గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    అఙ్ఞానాన్ని పోగొట్టగలిగేది కావ్య పఠనమే గదా !

    01)
    _____________________________

    నవయుగ వైతాళికులగు
    కవివర్యులు వ్రాసినట్టి - కావ్యాల్జదువ
    న్నవివేకమను తిమిరము లి
    క, వినాశనమయ్యె మేటి - కావ్యము చేతన్ !
    _____________________________

    రిప్లయితొలగించండి
  2. కవి వ్రాసె పారిజాత క
    థ విన నృపు మనస్సు మారె దారను మెచ్చెన్
    సువిధిన్ సతి చింతా శో
    క వినాశన మయ్యె మేటి కావ్యము చేతన్

    (నంది తిమ్మన పారిజాతాపహరణ కథ వ్రాయుటచే, కృష్ణదేవరాయలు మనస్సులోని అవివేకము తొలగెను - రాణిపై ఎప్పటియట్ల ప్రేమతో మెలగెను. రాణి దురవస్థ తొలగెను.)

    రిప్లయితొలగించండి
  3. వివిధములౌ ధర్మములకు
    నవరసములు చేర్చి కవులు నవ్యత గూర్చన్
    భువిపయి సందేహాస్తో
    క వినాశన మయ్యె మేటి కావ్యము చేతన్

    రిప్లయితొలగించండి
  4. వేడుక గొలిపిరిదె మేటి విఱుపుల తోడన్.

    కువకువలాడెడు పిచ్చుక
    భువి రాలగనే చలించె; పున్నెపు ప్రోగౌ
    కవనముఁ జెప్పగ నా శో
    క వినాశనమయ్యె మేటి కావ్యముచేతన్.

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మీ తిమిరవినాశన పూరణ అలరించింది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    పారిజాతాపహరణ కావ్య నేపథ్యాన్ని చక్కగా పూరణలో పొందుపరచి ఆనందింపజేశారు. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    అనల్పమైన వినాశనాన్ని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    వాల్మీకి ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. రవి గాంచని పలు చోటులు
    కవి గాంచుచు గొప్పనైన కావ్యము వ్రాసెన్
    భవితవ్యము గలుగక నా
    కవి నాశనమయ్యె మేటి కావ్యము చేతన్

    రిప్లయితొలగించండి
  7. నిన్నటి పూరణ.

    ఎక్కువ భక్తిని గలిగిన
    చిక్కిన భక్తులను గనుచు చిలిపితనముతో
    నిక్కుచు నాస్తికు లందురు
    ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్

    రిప్లయితొలగించండి
  8. అందరికీ నమస్సులు. "నాశమయ్యె" అని ఉండాలి కదా అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  9. చెవియొగ్గి వింటి రాముని
    భువిపుత్రిక మేటి కథను పూజ్యుల నోటన్
    వివిధములగు వెతలును నా
    కవి, నాశనమయ్యె మేటి కావ్యము చేతన్

    రిప్లయితొలగించండి
  10. నాశనమగు, నాశము చేయు - కావున నాశనమయ్యె అనటంలో తప్పులేదనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  11. అవకత వకరచ యిత రవి
    కవినాశన మయ్యె, మేటి కావ్యము చేతన్
    కవియగు రాయలు మఱి యీ
    భువినిం బే ర్వందె యాంధ్ర భోజుం డ నగన్

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సుబ్బా రావు గారు! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    పేరు + అందె = పేరందె అగును. పేర్వందె అని యణాదేశ సంధి అగుటకు వీలు లేదు.
    పేరు + ఒందె = పేరొందె అనుట చాలా బాగుగ నుండును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. నవరసభావములొలుకగ
    భువిజనులకుదారిజూపు పూజ్యుని రచనల్
    అవివేకులవశమయినా
    కవి నాశనమయ్యె మేటి కావ్యము చేతన్

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

    నవరసములు విరజిల్లెడి
    కవనముతో నిండియున్న కావ్యము జదువన్
    భువి జనులు తరించిరి శో
    క వినాశనమయ్యె మేటి కావ్యము చేతన్

    రిప్లయితొలగించండి
  16. నవరసముల నొలికించెడి
    కవనమ్మును వ్రాసి పుస్తకము ప్రచురించన్
    ద్రవిణముడిగె లాభము లే
    క వినాశన మయ్యె మేటి కావ్యము చేతన్

    రిప్లయితొలగించండి
  17. ధవులడిగిన నీయక మా
    ధవునక నంకితము జేసి ధనహీనుండై
    భువిలో బమ్మెర పోతన
    కవి నాశనమయ్యె మేటి కావ్యము చేతన్.

    రిప్లయితొలగించండి
  18. అవయోగమొ శివయోగమొ
    కవి నన్నయ భారతమను కావ్య రచనలో
    దివికేగె గదా తలపగ
    కవి నాశనమయ్యె మేటి కావ్యము చేతన్

    రిప్లయితొలగించండి

  19. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కవి భీముడు శపియిoచగ
    అవనిపతి కళింగ గంగు యార్తు oడయ్యన్
    కవి మరలను దీవించగ
    కవి నాశన మయ్యె మేటి కావ్యము చేతన్

    రిప్లయితొలగించండి
  20. లక్ష్మీనారాయణ గారి పద్య భావంలో ఔచిత్యం కనుపించడం లేదు.

    రిప్లయితొలగించండి
  21. కవనంబున సుఖసంతతి,
    కవనంబున ధనము, శుభము, ఘనయశములిలన్
    కవులందియున్నవా రే
    కవి నాశనమయ్యె మేటి కావ్యముచేతన్?

    రిప్లయితొలగించండి
  22. సవరణతో..

    నవరసముల నొలికించెడి
    కవనమ్మును వ్రాసి గొప్ప కవి ప్రచురించన్
    ద్రవిణముడిగె లాభము లే
    క వినాశన మయ్యె మేటి కావ్యము చేతన్

    రిప్లయితొలగించండి
  23. శ్రీ మిస్సన్నగారికి నమస్కారములు
    బమ్మెర పోతన తన కావ్యమును రాజులకు అంకితమివ్వక
    మాధవునకు (విష్ణు=రాముడు) అంకితం మిచ్చినాడు అనే భావముతో వ్రాశాను.
    భాగవతము రామునికే అంకిత మిచినాడు కదా. మీ శంకను వివరించ మనవి .

    రిప్లయితొలగించండి
  24. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు (నిన్నటి సమస్యకు కూడ) బాగున్నవి. అభినందనలు.
    *
    ‘అష్టావధాని’ రాంభట్ల వారూ,
    నాశము, నాశనము; వినాశము, వినాశనము పర్యాయపద నిఘంటువులో ఉన్నాయి. అయినా అది ఎప్పుడో ఆకాశవాణి వారిచ్చిన సమస్య. రఘురామ్ (తాత) గారి సేకరణ.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సూచనను గమనించారు కదా!
    *
    శైలజ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘వశమయినన్ (లేదా) వశమయి యా’ అని ఉండాలనుకుంటాను.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    పూరణ వరకు మీ పద్యం బాగుంది. అయినా పోతన ఇబ్బందులు పడ్డాడేమో కాని నాశనం కాలేదు కదా!
    ‘ధవులు’ శబ్దం అన్వయానికి కుదరక మిస్సన్న గారు వ్యాఖ్యానించారనుకుంటాను. అక్కడ ‘అవనీశుల కీయక మా/ధవునకు నంకితము...’ అంటే సరిపోతుంది.
    *
    పండిత నేమాని వారూ,
    నన్నయ్య అరణ్యపర్వం వ్రాస్తూ మరణించాడని కొందరు, పిచ్చిపట్టినది కొందరు చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    భీమకవి ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదాన్ని ‘కవి దీవించగనే శో/క వినాశనమయ్యె..’ అంటే బాగుంటుందేమో!
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    హరి వేంకత సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యా ! ధన్యవాదములు !

    భాగవతాన్ని మాధవున కంకితమిచ్చిమహాకవి పోతన
    పేరు,కీర్తి, ముక్తి,మోక్షం,పొందాడే గాని
    నాశనమవ్వలేదు గదాయని మిస్సన్న మహాశయుల శంక !
    ఔనా స్వామీ ?

    రాజులకివ్వకుండా రామునకిచ్చి పోతన నాశనమయ్యాడంటే
    ఔచిత్య భంగం కాక మరేమిటి ????????

    రిప్లయితొలగించండి
  26. వసంత మహోదయా నా మనోభావాన్ని తేటతెల్లం చేశారు. ధన్యవాదాలు.

    లక్ష్మీనారాయణ గారూ అదే నా శంక.

    గురువుగారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. చవిగొని విషవృక్షమనుచు
    కవిసామ్రాటులను దూఱి కవ్వించిననా
    నవభారత నిర్మాణ కు
    కవి నాశనమయ్యె మేటి కావ్యముచేతన్

    రిప్లయితొలగించండి


  28. భువిలో ధనమ్ము లేకన్
    కవి నాశనమయ్యె , మేటి కావ్యముచేతన్
    రవిగాంచని వాటిని గని
    న విదురుడు నిరాశతో తన బతుకు నీడ్చెన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. అవమానము జేసి కుజను
    నవిరళముగ రాముఁ దిట్టి యారోపణలన్
    పవమాను సుతును మొట్టగ
    కవి నాశనమయ్యె మేటి కావ్యముచేతన్

    రిప్లయితొలగించండి