13, జనవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1292 (రోగములఁ దెచ్చు పండుగై)

కవిమిత్రులారా,
భోగి పండుగ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రోగములఁ దెచ్చు పండుగై భోగి వచ్చె.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

33 కామెంట్‌లు:

 1. రాగ పూర్ణాంతరంగ సారసము లలరె
  పాడి పంటల వృద్ధితో వసుధ తనరె
  పెక్కు రంగుల ముగ్గుల హంగు లెసగె
  యోగములు భోగములు గూర్చు భోగి వచ్చె

  రిప్లయితొలగించండి
 2. శ్రీ శంకరయ్య గారికి శుభాశీస్సులు.
  ముచ్చటగా 2014లో తొలి పెద్ద పండువులు వచ్చుట ముదావహము. మన బ్లాగు మిత్రులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.
  ఈ నాటి సమస్యను నేను నాకు తోచిన విధముగా మార్చి పూరించేను. మీరు ఇచ్చిన సమస్యను ఉచ్చరించుటకు కూడా నాకు ఇష్టము లేదు. గ్రహించ గలరు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. రోగముల దెచ్చు పండగై భోగి వచ్చె
  ననుచు పలుకుట సరికాదు మనుజుల కిల
  మోదమందించు పర్వమై యాదరమున
  చేర్చు తనవారి నొకచోట కూర్చు సుఖము.

  రిప్లయితొలగించండి
 4. శీతఋతువు చలికి సూక్ష్మజీవులెన్నొ
  రోగములఁ దెచ్చు;; పండుగై భోగి వచ్చె
  మంటవేయు సమయమును వెంట దెచ్చె
  చేరు మొకచోట ఊరి జనులార వాటిఁ
  జంపి సంక్రాంతి పండుగ జరుపు కొనుడు!

  రిప్లయితొలగించండి
 5. బ్లాగు మిత్రులకు సంక్రాంతి శుభా కాంక్షలు

  కందుల వారిని గోరుదు
  నందముగానీయు డార్య !యందరి సుఖముల్
  విందుగ గోరుచు మదినిన్
  వందనములు సేతు మీ కు వందల కొలదిన్

  రిప్లయితొలగించండి
 6. క్షంతవ్యుడను

  రోగముల దెచ్చు పండుగై భోగి వచ్చె
  ననుచు నార్యులు బలుకుట యనుచితంబు
  సుఖము లీయును మఱియును శుభము గలుగు
  పండుగ వలన గద మఱి పండి తార్య !

  రిప్లయితొలగించండి
 7. మాస్టరు గారికి, కవిమిత్రులకూ, బ్లాగు వీక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

  రోగముల దెచ్చు పండగై భోగి వచ్చె
  ననుచు మనమున దలపకు వినుము, చెత్త
  నంతయును గాల్చి మంచివే చెంత నిలుప
  రోగముల గూల్చు పండుగై భోగి వచ్చు.  మనసులోన భోగి మంటలనే వేసి
  కలత జ్ఞాపకముల గాల్చివేయ
  యోగములొనగూరు రోగమ్ములే బోవు
  రేగుపండు వోలె రేగు సొగసు.

  రిప్లయితొలగించండి
 8. గురుదేవులకు,బ్లాగు కవిమిత్రులకు మరియు వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
  విభజన ముసాయిదా బిల్లు సభకు రాగ
  తగును తగదను చర్చల తన్ను లాట!
  నడుమ మనల నాందోళనా
  సుడుల ముంచి!
  రోగములఁ దెచ్చు పండుగై భోగి వచ్చె!

  రిప్లయితొలగించండి
 9. దక్షిణాయన కాలము తరలి పోయి
  యుత్తరాయణ పుణ్య కా లోత్తరమున
  కాంతి కిరణాలు వెదజల్లి కౌతుకము ని
  రోగముల దెచ్చు పండగై భోగి వచ్చె.

  రిప్లయితొలగించండి

 10. గురుదేవులకు,బ్లాగు కవి మిత్రులకు మరియు విక్షకులకు శ్రీ విజయ నామ సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
  గురుదేవులు కవిమిత్రులు పండుగ రోజు మంచి సంస్యను ఇవ్వనందులకు మన్నించమని ప్రార్థిస్తూ,
  =============*==============
  శీతల సిరులు జనులకు వాతపిత్త
  రోగములఁ దెచ్చు, పండుగై భోగి వచ్చె
  పట్నవాసుల కెల్లను పరుగు తోడ
  పల్లె నీడకు పొమ్మనె పరవశమున !

  రిప్లయితొలగించండి
 11. శ్రీ కంది శకరయ్య గారికి నమస్సులు

  బొగ్గు పులుసు వాయువుపెంచు పొగనుగుప్పి
  కఫము గలిగించు జలుబును గలుగజేయు
  రేగు పండ్లును, నిశలను త్రాగుడులును
  రోగములఁ దెచ్చు పండుగై భోగి వచ్చె.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ పండిత నేమాని గురుదేవులకు, శ్రీ హరి గారికి, శ్రీ మనతెలుగు వారికి, శ్రీ సుబ్బారావు గారికి , శ్రీ నాగ రాజు రవీందర్గారికి " రోగము కు మంచి అర్థము (రో = ధనము ; గములు = కుప్పలు) నిచ్చినారు, శ్రీ హనుమచ్చాస్ర్తి గారికి, శ్రీ సహాదేవుడు గారికి, శ్రీ లక్ష్మినారాయణ గారికి " ని రోగము " జేసి, శ్రీ కృష్ణారావు గారికి మంచి పూరణలు పంపిన అందరికి ధన్యవాదములు .

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్యగారికి నమస్సులు

  రంగవల్లులు తెలుగింట రక్తి గొలుప
  జనులు సంక్రాంతి లక్ష్మికి స్వాగతమన
  భోగ భాగ్యాల నిచ్చెడు భోగి రాగ
  రోగముల దెచ్చు పండుగై భోగి వచ్చె
  ననగ కలుగును దుఃఖ మనంతముగను
  సర్వ భాగ్యము లీయదే శాంతి నిలిపి

  రిప్లయితొలగించండి
 15. నా పద్యము 3వ పాదములో రంగు రంగుల ముగ్గులు అని ప్రారంభించు నటులుగా చదువుకొనండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  4వ పాదములో గణభంగము చోటు చేసుకొనినది.
  "వాటి" అనుట వ్యాకరణ శుద్ధము కాదు. "వాని" (వానిని) అనుట మంచిది.

  శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  "ఆందోళనా సుడులు" అనుట సరికాదు.

  శ్రీ వరప్రసాద్ గారు: శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  శీతల సిరులు అనుట సరికాదు.
  పట్నవాసులు అనునది వ్యావహారికము. పత్తనము (సంస్కృతము) పట్టణము (తెలుగు).

  శ్రీ మూర్తి గారు: (పి.ఎస్.ఆర్.)
  శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  1వ పాదములో గణభంగము చోటు చేసుకొనినది.
  3 4 పాదములలో యతి మైత్రి లేదు.

  రిప్లయితొలగించండి
 17. కవి మిత్రులందరకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
  నేటి వార్తాపత్రికలో కోడి పందెముల వార్తకు స్పందించి వ్రాసిన పద్యం.

  కోడి పందెము లాడుచు నోడి పోయి
  ధనము ధాన్యమ్ము గోల్పోయి దైన్యపడుచు
  మత్తు కలవాటు పడునట్టి మానవులకు
  రోగముల నిచ్చు పండుగై భోగి వచ్చె.

  రిప్లయితొలగించండి

 18. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  మెడను బంగారు నగలతో మెరయుచుండి
  కాళ్ళ గజ్జెలు మొల మువ్వ ఘల్లుమనగ
  చిన్ని పాపల జూడంగ కన్ను కుట్టు
  రోగముల దెచ్చు . పండుగ భోగి వచ్చె
  నింక భోగి పళ్ళను బోసి దృష్టి తీసి
  దానమొనరింప రండు ముత్తైదువలకు

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులందరికీ శ్రీ విజయ నామ సంవత్సర మకర సంక్రాంతి శుభాకాంక్షలు
  http://andhraamrutham.blogspot.in/2014/01/blog-post_13.html#.UtOwwdIW2i4

  రిప్లయితొలగించండి
 20. శ్రీ పండిత నేమాని గురుదేవులకు,శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నాగ రాజు రవీంధర్ గారికి ధన్యవాదములు,
  ============*==============
  పరమాత్మను గొలువ నేడు పాశురముల తోడ జనులు
  పరవశమ్మున నిచ్చె పాడి పంటలు బాగ,రైతుల ని
  కర 'రో' గముల దెచ్చు పండుగై భోగి వచ్చె ,పుడమికి
  పరివారమును బిల్చి మీరు బలుకరే స్వాగత మనుచు !
  రో = ధనము, సిరులు, గములు =గుంపు

  రిప్లయితొలగించండి
 21. (అహము, ఉద్రేక భాషణము, అనర్ధ +అగడు = అనర్ధనగడు (అగడు అనగా నింద, తిట్టు), రోషము, ఆవేశములు రోగములు దెచ్చును అని భావన)

  అహమునుద్రేకభాషణమనర్ధనగడు
  రోషమావేశములును రోగములు దెచ్చు ;
  పండుగై భోగి వచ్చెను ప్రఖరులార !
  కలసి మరునాడు వచ్చె సంక్రాంతి గూడ !

  కనుక, వైషమ్యములను పోకార్చు రీతి,
  భోగి మంటలు వేయుచు పూర్తి గాను,
  పిండి వంటలు తినుచును ప్రీతి గాను,
  పాత వాసన పోయి వినూత్నమగుచు,

  ఐకమత్యమె బలమంచు యందరికిని
  తెలియజెప్పెడి లక్ష్యంబు తల ధరించి
  ప్రియ వసంతపు ఋతువును పిలువ బూని
  పూజలను జేయ రండిక పుణ్యులార !

  (అన్వయలోపం అనే భయం ఉన్నప్పటికీ, గురువు గారి దగ్గర విద్య ప్రదర్శిస్తేనే గదా తప్పులు దిద్దుకునే అవకాశం లభించేది !)

  రిప్లయితొలగించండి
 22. శీతలము జేయ జనులకు వాతపిత్త
  రోగములఁ దెచ్చు, పండుగై భోగి వచ్చె
  కష్ట జీవులకెల్లను కరుణ జూపి
  పల్లె నీడకు పొమ్మనె పరవశమున!

  రిప్లయితొలగించండి
 23. మా శ్రీ తిమ్మాజీ రావు గారి పూరణ మహాద్భుతంగా ఉన్నది. తర్కంతో తత్వం నేర్ప గల వారి జ్ఞాన సముద్రంలో నిన్ననే నేను మూడు గంటల పాటు ఓలలాడి వచ్చాను. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 24. శ్రీ మారెళ్ళ వామన కుమార్ గారు: శుభాశీస్సులు.
  మీ 3 పద్యములును బాగుగ నున్నవి. అభినందనలు. కొన్ని సూచనలు:
  అనర్థ + నగడు అని సమాసము చేయకూడదు.
  1వ పద్యము 1వ పాదములో గణభంగము కలదు.
  1వ పద్యము 2వ పాదములో మరియు 2వ పద్యము 4వ పాదములో యతి మైత్రి లేదు.

  రిప్లయితొలగించండి
 25. పండుగెటుల మనకశాంతి నిండుశోక
  రోగములఁ దెచ్చు? పండుగై భోగి వచ్చె
  భోగిమంట, గొబ్బెమ్మలు, రంగవల్లి
  వలన వర్ధిల్లు శాంతిసౌఖ్యాలు గాక

  రిప్లయితొలగించండి
 26. Sree P.S.R.Murty gaaru:
  శుభాశీస్సులు.
  మీ 2వ పద్యమును చూచితిని. 3, 4 పాదములలో మీరు ప్రాస యతిని వేద్దామని అనుకొనినారు. కానీ ప్రాస యతి నియమముల అవగాహవన మీకు లేదు.
  భోగి - రంగ లకు ప్రాస యతి చెల్లదు. రంగలో అనుస్వారముతో కూడిన గ గలదు. భోగిలో అనుస్వారము లేదు కదా.
  అటులనే వలన - ఖ్యాల లకు ప్రాస యతి చెల్లదు. వలనలో లకు ముందున్న అక్షరము హ్రస్వము; ఖ్యాల లో లకు ముందున్న అక్షరము దీర్ఘము కదా.
  ప్రాస యతి నియమములను మీరు చక్కగా అధ్యయనము చేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 27. శ్రీ పండిత నేమాని గురుదేవులకు ధన్యవాదములు,
  సవరించిన పద్యాన్ని పరిశీలించ ప్రార్థన:


  విభజన ముసాయిదా బిల్లు సభకు రాగ
  తగును తగదను చర్చల తన్ను లాట!
  నడుమ నేమవు నోనను జడుపు తోటి
  రోగములఁ దెచ్చు పండుగై భోగి వచ్చె!

  రిప్లయితొలగించండి
 28. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈనాటి సమస్య కొందరికి మనస్తాపాన్ని కలిగించినందుకు బాధపడుతున్నాను. నిజానికి వరప్రసాద్ గారు పంపిన సమస్య ‘రోగులకొఱకు పండుగై భోగి వచ్చు." నేనే దానిని కొద్దిగా మార్చి ఇచ్చాను. నా అవివేకాన్ని మన్నించండి.
  రోజంతా నెట్‍కు అందుబాటులో లేకపోవడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను.
  ఈనాడు మంచి పూరణలు పంపిన మిత్రులు...
  పండిత నేమాని వారికి,
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
  చంద్రశేఖర్ గారికి,
  సుబ్బారావు గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  సహదేవుడు గారికి,
  గండూరి లక్ష్మీనారాయణ గారికి,
  వరప్రసాద్ గారికి,
  భాగవతుల కృష్ణారావు గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  మారెళ్ళ వామన్ కుమార్ గారికి,
  పియెస్సార్. మూర్తి గారికి,
  చిత్రంగా ఈరోజు (పండుగ పనుల్లో వ్యస్తులై) ఒక్కరు కూడా పూరణలు చేయని సోదరీమణులకు
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 29. పండిత శ్రీ నేమాని గారికి నమస్సులు.
  అనర్ధ + అగడు = అనర్ధనగడు అని వ్రాసాను. తప్పు దిద్దుకుంటాను. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 30. శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
  మీరు సవరించిన పద్యము చూచితిని. బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి