12, డిసెంబర్ 2016, సోమవారం

సమస్య - 2223 (తండ్రి మరణమ్ము...)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము"
లేదా...
"జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ"
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

67 కామెంట్‌లు:

  1. ఆస్తి పొందగ వేగమె నాశ బడుచు
    షరతు లన్నియు దాటగ సంత సమున
    స్వేచ్చ దొరకును కోర్కెల యిచ్చ కొలది
    తండ్రి మరణమ్ము సంతోష దాయ కము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేగమె యాశపడుచు' అనండి.

      తొలగించండి
  2. కన్న బిడ్డల పైలేక కనికరమ్ము
    స్వార్థ బుద్ధి తోడ మిగుల వ్యర్థమైన
    బ్రదుకు నీడ్చుచు నున్నట్టి బండ వంటి
    "తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము"

    రిప్లయితొలగించండి
  3. తనయుల కెద్ది యీ జగతి తప్పక గుండెల జీల్చు బాధయౌ?
    ధనమది తండ్రి యార్జనయె దక్కునదెవ్వరి కెన్నడైననున్?
    తనసుతు డెన్నడేని మరి తండ్రిని మించిన వాడె యైనచో
    "జనకుని చావు ;పుత్రునకు ;సంతసముం గలిగించు సత్యమౌ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ముఖ్యంగా క్రమాలంకారంలో రెండవ పూరణ చక్కగా ఉంది.

      తొలగించండి
  4. వినయము జూపుచున్ సుతుడు వేడుక జేయుచు మభ్య బెట్టుచున్
    అనయము చెంత నుండి పరిచర్యలు జేయుచు భక్తి శ్రధలన్
    ధనమది యెంత యుండెనని దాకొని వేచియు నక్కి యుండగన్
    జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ

    రిప్లయితొలగించండి
  5. రసపు పద్యాలు జిలికించు రాగ మిదియె,
    సరిగమపదని సరిజేయు తాన మిదియె ,
    పరమ సత్యము పలికించు పల్ల విదియె,
    "శంకరాభరణము" సమస్యలకు నెలవు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  6. పదును దేలిన మందుల వరుస గాగ,
    మందు మందుకు అప్పుల మదుపు గాగ ,
    బ్రతుకు దెరువుయు తనపాలి బరువు గాగ
    తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము
    కొరుప్రోలు రాధాకృష్ణా రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొరుప్రోలు రాధాకృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'బ్రతుకు దెరువును...' అనండి. 'తెరువుయు' అనరాదు.

      తొలగించండి
  7. డా.పిట్టా
    తండ్రితాతలు బహుకాలదర్శులౌట
    వంశమునకగు వన్నెయే వారి మాడ్కి
    నిండు నూరేళ్ళు బడ నొక పండు వోలె
    తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము!
    మొనకొని యెంత పాపమును మోయగ జేతువు పృచ్ఛకా!యిలన్
    జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ
    నుచును;దుష్టులౌ పితల నౌనను నెవ్వడు?వారిపంపునన్
    మని చనలేని పుత్రులకు మాన్యమె?చావన దప్పు కార్యమే?!

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    పొరపాటు:3వ పాదం మొదటి అక్షరం"న" ను చేర్చ ప్రార్థన.మొదట"హరి హరీ" యనదగిన సమస్య నిచ్చినారు.మీ పట్టుదలకు జోహార్లు,జేజేలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  9. పుత్రాసో యత్ర పితరో భవంతి !


    జీవితమున పట్టు సడలు చింత జేర్చు
    తండ్రి మరణమ్ము, సంతోషదాయకమ్ము
    నతడు తనకొమరునిగాను నడచి రాగ,
    పితరునినతడు పెంచుచు ,పెద్ద గయ్యె !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. చివరి గడియలు లెక్కించు చింతనిండ
    మోము గనలేక సుతుడేమొ పొగలియేడ్వ
    అపర ధన్వంతరిీ యౌషధాదు లాప
    తండ్రి మరణమ్ము,సంతోసదాయకమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. హరిని నుతించు వారల హద్దుగీచి
    కొడుకు ప్రహ్లాదు భక్తిని కోప గించి
    నట్టి నాహిర ణ్యాక్షుడు నంత మొంద
    తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'నుతియించు' అనండి. అలాగే 'కోపగించి।నట్టి యా హిరణ్యాక్షు..' అనండి.

      తొలగించండి
  12. తీర నట్టిది యాలోటు నేరి కైన
    తండ్రి మరణమ్ము, సంతోష దాయకమ్ము
    మరణ మొందిన కొమరుడు మరల బ్రదుక
    జరుగ వచ్చును నిట్లుగ నరుదు గాను
    కొంత మందికి మాత్రమే కువల యమున

    రిప్లయితొలగించండి
  13. ....................................
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    ధనము గడి౦చె , నె౦తయు వదాన్యు

    ............. డటన్న యశమ్ము గా౦చె | చ

    క్క నగు తనూ ధృఢత్వమున గ్రాలుచు తా

    ............... శత వత్సరమ్ములున్

    మని , గతియి౦చె మొన్న మన " మాధవరా "

    .............. వటువ౦టి శ్రేష్ఠు డౌ

    జనకుని చావు పుత్రునకు స౦తసము౦

    .......... గలిగి౦చు , సత్యమౌ ! !

    { మని = జీవి౦చి }

    రిప్లయితొలగించండి
  14. మరణ మందుటకెన్నియో మడతపేచి
    వరమునడిగిన వాడిచే భయమునంద
    హరియె జంప సురలకు ప్రహ్లాద బుడుత
    తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము.

    రిప్లయితొలగించండి
  15. తిండి బట్టయు సంతాన మండ దండ
    బంధుజనములు ప్రేమయు భవ్య యశము
    ధనము లేకుండ సర్వేశ! మనుట కంటె
    తండ్రి! మరణమ్ము సంతోషదాయకమ్ము.

    బహుళ దారిద్ర్యమున జిక్కి యహరహమ్ము
    పరితపించుచు జీవచ్చవంబు వోలె
    బ్రతికి యుండుట కంటె నీక్షితిని దేవ!
    తండ్రి! మరణమ్ము సంతోషదాయకమ్ము.

    తన ప్రభవంపు కారకుడు, ధర్మపథంబును జూపునట్టి యే
    జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు? సత్యమౌ
    ననయము మార్గదర్శనము నందగ జేయుచు రక్షకుండు గా
    మనుటయె హర్షదాయకము మానవకోటికి నెందు జూచినన్.
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'తండ్రి'ని సంబోధనగా మార్చడం ప్రశంసింపదగినది.

      తొలగించండి
  16. మనమున కోపమూనినను మాయని దుఃఖము గూర్చెడున్సదా
    జనకుని చావు పుత్రునకు-సంతసముంగలిగించు సత్యమౌ
    తనయెదుటన్మనోజ్ఞతను ధార్మికజీవన తత్పరుండుగా
    మనుచును నింటనందరకు మానితభావము పంచుచుండగా.

    తులువయైనను దుఃఖంబు తోచు కన్న
    తండ్రి మరణమ్ము-సంతోషదాయకమ్ము
    తనను గుండెకు హత్తుక తన్మయముగ
    వంశవర్థనుడంచును బలుకుచుండ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  17. వడ్డిఁ గట్టఁ జాలునె పంట నడ్డి యింక
    జితికి నడువ లేకుండగ బ్రతికి యుంటె
    తంట కంట నీరారునె దాని కంటెఁ
    దండ్రి! మరణమ్ము సంతోషదాయకమ్ము


    అనితర సాధ్య భక్తి మహిమాన్విత భాగవ తోత్తముం డటం
    గనక పరిచ్ఛదాత్మజుడు కైటభ దైత్య విరోధిఁ బిల్వ వే
    యనిమిష లోక మేగ నసురారి నృసింహ నఖాసి ఘాతయై
    జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  18. జనకునిచావుపుత్రునకుసంతసముంగలిగించుసత్యమౌ
    జనకునిచావుపుత్రునకుసంతసముంగలిగించదెప్పుడున్
    గనుమురదుఃఖమున్
    గలిగికానగరానియవస్ధలెన్నియో
    యనయముగల్గుచుండునుగదార్య!మరెందులకిట్లుపల్కిరే?

    రిప్లయితొలగించండి
  19. డా.పిట్టా
    పొరపాటు:3వ పాదం మొదటి అక్షరం"న" ను చేర్చ ప్రార్థన.మొదట"హరి హరీ" యనదగిన సమస్య నిచ్చినారు.మీ పట్టుదలకు జోహార్లు,జేజేలు!

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టా
    తండ్రితాతలు బహుకాలదర్శులౌట
    వంశమునకగు వన్నెయే వారి మాడ్కి
    నిండు నూరేళ్ళు బడ నొక పండు వోలె
    తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము!
    మొనకొని యెంత పాపమును మోయగ జేతువు పృచ్ఛకా!యిలన్
    జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ
    నుచును;దుష్టులౌ పితల నౌనను నెవ్వడు?వారిపంపునన్
    మని చనలేని పుత్రులకు మాన్యమె?చావన దప్పు కార్యమే?!

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వీక జూపిన వైద్యుల వెజ్జఱికమె
    ససి నమర్చి నేడిట సడల జేసె
    తండ్రి మరణమ్ము; సంతోషదాయకమ్ము
    మాకు మాదండ్రి దక్కుట మహిమ గూడి.

    శౌరి భజనల నొల్లక సంతతమ్ము
    ననువు గూడక బాధించి నఱుచు చుండు
    తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము
    గా దలంచె ప్రహ్లాదుడు కనులెదుటను
    కంబుపాణిని గాంచిన కౌతుకమున.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  22. తనకుటుంబమును గురించి తలచకుండ
    ఆ లుబిడ్డల కసితోడ మూలకొ త్తి
    కష్ట ములలోన నెట్టు ని కృష్ట కన్న
    తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నికృష్ణ కన్నతండ్రి...' అని సమాసం చేయరాదు కదా! 'నికృష్టుడైన తండి...' అనండి.

      తొలగించండి
  23. తోడబుట్టినవాడు అధోగతిచెందాడు
    ఆడబడుచేమో శపియింప వచ్చేను
    ఆప్తబంధువులేమొ జాలిచూపించేరు

    తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అచ్యుత్ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం. కొద్దిగా ఛందస్సు నేర్చుకుంటే మీరు చక్కని పద్యాలు వ్రాయగలరు. మీ పద్యానికి నా సవరణ....

      తోడబుట్టినవార లధోగతి గన
      నాడపడుచేమొ శపియింప నాత్రపడగ
      నాప్తబంధువుల్ జాలితో ననునయింప
      తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము.

      తొలగించండి
  24. దుష్ట సహవాసమున జేరి దుర్మతి యయి
    వ్యసనముల బారి బడియుండి భ్రష్టు డగుచు
    దిరుగు వానికి గుపితుడై తిట్టునట్టి
    తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము.

    అనయము దుర్మదాంధులకు నాప్తుడుగా వెలుగొందుచుండి త
    జ్జనములతోడ దుర్వ్యసనజంబగు విస్తృతవిత్తకాంక్షచే
    తనపర భేదముల్ మరచి తండ్రిధనంబును మ్రింగగోర న
    జ్జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ
    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. తల్లిని గనిన భరతుడు దారుణమనె
    తండ్రి మరణమ్ము! సంతోష దాయకమ్ము
    కానె కాదు రామునడవి కంపి వైచి
    రాజ్యమేల నీ భరతు రా రమ్మనంగ!
    గురువు గారికి నమస్కారములు. నిన్నటి పద్యాన్ని చూడ గోరుతాను.
    ధన్యవాదములు.

    పద్య కవితా రసము గ్రోలి పరవశమున
    పండిత, కవివరుల తోడ పంచుకొనగ,
    తిరుగు లేని మధురిమల తేట తెలుగు
    మెదడుకు పదను పెట్టగ, మేలు సేయు
    శంకరాభరణము సమస్యలకు నెలవు!

    రిప్లయితొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువు గారూ! నమస్కారములు. అనారోగ్య కారణముగా గత రెండు రోజులుగా సమస్యా పూరణలు పంపలేక పోయాను. ఇప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించ గలరు.

    10-12-2016:

    చలుపని నేరము తనపై
    నిలుపుచు దండించు వేళ నెద నాబాధ
    న్గలుగ తలవంచు ఘనునకు
    బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్.

    కలవర బెట్టుచు యజమున
    చెలరేగిన యగ్ని శిఖలు చిన్నవి బఱచగన్
    జలమును హెచ్చుగ డుల్చిన
    బలవంతపు చావు వచ్చె భాస్కరున కటన్.

    11-12-2016:

    ఆశు కవితా ప్రతిభ పెంచి నన్వయమగు
    యక్షరాల పొంకను గల్గు నందమైన
    పద్యపూరణల కవన పళ్ళియ మగు
    శంకరాభరణము సమస్యలకు నెలవు.

    శంకరాభరణము సమస్యలకు నెలవు
    ననియెడి నుడు లబద్ధము నార్యులార!
    గల్గిన సమస్యలకు దీర్పు గల్గ జేయు
    తిన్నె యనగ జెల్లుచు నుండు దీర్పు జెప్ప.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  27.  నల్లధనకుబేరుండ్రకైననిలలోన
    తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము
    కాదని జననీ జనకుల కన్న మిన్న
    యాప్తులెవరునుండగబో రి
    హమున నెఱుగు


    వినయము విజ్ఞతన్ మరచి విశ్వములో సకలార్థ సిద్ధికిన్
    ధనముయె శాశ్వతమ్మనుచు దల్లిని దండ్రినిలెక్కజేయకన్
    దనుజుని బోలుమానవుడు ధర్మము దప్పిచరించు వాడకిన్
    జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. విరించి గారు నమస్కారములు. మీ వృత్త పూరణలో చిన్న చిన్న సవరణలు, మీకు తెలియనివి కావు, చేస్తే బాగుంటుంది.
      "ధనము-ఎ" అన్నప్పుడు యడాగమము సరి కాదు కద.
      జేయక దృతాంతము కాదు కద.
      చరించు వాడకిన్? వానికిన్ అని మీ యభిప్రాయ మనుకుంటాను.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు. మీకు తెలుసుకదా! రోజంతా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ రాత్రి పూట ఏదో మ్రొక్కుబడిగా సమీక్షిస్తున్నాను. అందువల్ల దోషాలపై ఎక్కువగా దృష్టికి నిల్పలేకపోతున్నాను.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. అందుకే నా దృష్టికి వచ్చినవి తెలియ జేసితిని.

      తొలగించండి
  28. హరిని ద్వేషించు రక్కసు డంత మొంద
    కర్ణ పేయము హరికధాగాన మనుచు
    కష్టములు తీరె ప్రహ్లాదు కనిరి, యతని
    తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము

    నిన్నటి సమస్య కు నా పూరణ

    పిన్న వయసున జరిగిన పెండ్లి వలన
    పొత్తు కుదరక మనమధ్య కత్తు లెగిరె,
    మనుగడకు వద్దు తృణమైన, ''మత్తునకు వ
    శంకరా ! భరణము సమస్యలకు నెలవు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాగవతుల కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  29. అనయము నీ కుమారునకు నా హరి గాధలె నచ్చు శ్రద్ధతో
    విను పలుమార్లు చెప్పుమని వీడక వెంటబడంగ చెప్పుచుం
    టిని నరసింహ గాధను తృటిన్ హరి చంపు నటంచు నెంచు దు
    ర్జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ.

    రిప్లయితొలగించండి
  30. కొమరుని మనసు నెంతయో క్రుంగదీసె

    తండ్రి మరణమ్ము ; సంతోష దాయకమ్ము

    నయ్యె తనకు పుట్టిన బిడ్డనతడు గాంచి

    తలచె, ప్రభవించె మరల నా తండ్రి యనుచు.

    రిప్లయితొలగించండి
  31. తనయు డంచును నెంచక ధరణి యందు
    కూరిమిని విడనాడి తా క్రూరుడగుచు
    పలువిధమ్ముల గానట బాధలిడిన
    తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము.

    త్రాగి తందనాలాడుచు తల్లి నెపుడు
    కొట్టి తిట్టుచు తిరిగెడు కూళుడైన
    తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము
    ననుచు దలచెనొక్క తనయు డవని యందు.

    క్రూరుడై నసురవరుడు కువలయాన
    బాల ప్రహ్లాదునకు పలు బాధలిడగ
    కంబమందుండి నేతెంచి కడతేర్చ
    తండ్రి మరణమ్ము సంతోష దాయకమ్ము.

    పరమ దుఃఖకారణమయ్యె వసుధ యందు
    తండ్రి మరణమ్ము;సంతోష దాయకమ్ము
    నాజనకుడె మరి తనకు నవనియందు
    కొడుకుగా పుట్టంగ పెరిగె కూర్మి చాల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  32. గురువు గారికి కామేశ్వరరావు గారికి ధన్యవాదముులు నేను ఒక పెంండ్లిలో ఉంండడంం దాంంట్లో పూర్తిగా అంంకితమైైపోవడంంతో సరిగా చూడకపోవడంంచే పొరపాటు జరిగింంది క్షంంతవ్యున్ని


     నల్లధనకుబేరుండ్రకైననిలలోన
    తండ్రి మరణమ్ము సంతోషదాయకమ్ము
    కాదని జననీ జనకుల కన్న మిన్న
    యాప్తులెవరునుండగబో రి
    హమున నెఱుగు


    వినయము విజ్ఞతన్ మరచి విశ్వములో సకలార్థ సిద్ధికిన్
    ధనమదె శాశ్వతమ్మనుచు దల్లిని దండ్రినిలెక్కజేయకన్
    దనుజుని బోలుమానవుడు ధర్మము దప్పిచరించు వానికిన్
    జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ


    ఇది నేను సరిచేసిన పద్యాలు

    రిప్లయితొలగించండి
  33. బాగుందండి."జేయకన్" కూడా సరి చేయండి. చాలామంది యీ తప్పు చేస్తుంటారు.

    రిప్లయితొలగించండి
  34. అనయముఁ ద్రావి మైకమున నారడి పెట్టుచునాలు బిడ్డలన్
    వినయవిధేయతల్ విడిచి విజ్ఞులతిట్టుచుదారులందునన్
    ధనమును ఖర్చుచేయుచును దర్పముతోడ చరించు దుష్టుడౌ
    జనకుని చావు పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ

    రిప్లయితొలగించండి
  35. గురువర్యులకు నమస్సులు. నిన్నటి పద్యంకూడా పరిశీలించ ప్రార్థన.
    మరువగలేము ప్రీతిఁ గడు మాన్యగురుండె యొసంగు విద్యలన్
    కరమగుతుష్టి బ్లాగులను కైతల వ్రాయగ సాటి మిత్రులే
    ధరణి వెలుంగు సుమ్మ సతతమ్మును మెండగు పద్యవిద్యతో
    నరయఁగ శంకరాభరణమందు సమస్యల వెల్లువే కదా

    రిప్లయితొలగించండి
  36. వినగనె తండ్రి పోయెనను విడ్డుర వార్తను విస్తుపోవుచున్
    చనగను సత్వరమ్మునను చప్పున తల్లిని నూరడించుటన్;...
    కనుగొన నిల్లు జేరగనె కల్ల పుకారిది వార్తయంచు నా
    జనకుని చావు;...పుత్రునకు సంతసముం గలిగించు సత్యమౌ!

    రిప్లయితొలగించండి